జాతీయ వార్తలు

పాక్‌తో తీరప్రాంత దళాల చర్చలు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ వ్యవహారం ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు రగిలిస్తున్న నేపథ్యంలో వచ్చేవారం పాకిస్తాన్‌తో జరగనున్న తీర ప్రాంత రక్షణ దళాల చర్చలను భారత్ రద్దు చేసుకుంది. ఈ నెల 16, 19 తేదీల్లో జరిగే చర్చల్లో పాల్గొనేందుకు పాకిస్తాన్ తీరప్రాంత భద్రతా ఏజెన్సీ (ఎంఎస్‌ఏ) సారథ్యంలో ప్రతినిధుల బృందం భారత్‌కు రావాల్సి వుంది. తాజా ఉద్రిక్తతల కారణంగా ఈ చర్చలను భారత్ రద్దుచేసుకోవడంతో ఇరు దేశాల మధ్య పరిస్థితి మొదటికొచ్చినట్లయింది. అసలు పాక్ బృందం పర్యటనకు భారత రక్షణ మంత్రిత్వశాఖ ఆమోదం తెలపలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. గూఢచర్యం, విచ్ఛిన్నకర కార్యకలాపాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై జాదవ్‌కు పాకిస్తాన్ సైనిక కోర్టు మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీన్ని తీవ్రంగా ప్రతిఘటించిన భారత్ ఆయనపై దాఖలైన చార్జిషీట్‌ను అందించాలని డిమాండ్ చేసింది. అందుకు పాక్ తిరస్కరించిన నేపథ్యంలో తీర ప్రాంత నౌకాదళ భద్రతా దళాల చర్చలు రద్దుకావడం గమనార్హం. తాను పాకిస్తాన్‌లో విచ్ఛిన్నకర కార్యకలాపాలకు కుట్ర పన్నిన విషయాన్ని జాదవ్ అంగీకరించినట్లుగా పాకిస్తాన్ ఓ నేరాంగీకార వీడియోను కూడా విడుదల చేసింది. అయితే దాన్ని తిరస్కరించిన భారత్ జాదవ్‌ను పాకిస్తాన్ అధికారులు కిడ్నాప్ చేశారని స్పష్టం చేసింది. అసలు జాదవ్ ఎక్కడున్నాడో, ప్రస్తుతం అతను ఏ స్థితిలో ఉన్నాడో కూడా తెలియజేయడానికి పాకిస్తాన్ నిరాకరిస్తోందని భారత్ తీవ్రంగానే స్పందించింది. ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందాన్ని కూడా పాకిస్తాన్ ఉల్లంఘిస్తోందని జాదవ్‌కు దౌత్యపరమైన సహాయాన్ని అందించేందుకు నిరాకరించిందని తెలిపింది.