జాతీయ వార్తలు

అద్వానీ, జోషి, ఉమలపై అభియోగాల నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మే 30: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, కేంద్ర మంత్రి ఉమాభారతి సహా మొత్తం 12మందిపై స్థానిక సిబిఐ ప్రత్యేక కోర్టు మంగళవారం అభియోగాలు నమోదు చేసింది. 2001లో వీరిపై ట్రయల్ కోర్టు క్రిమినల్ కుట్ర అభియోగాలను రద్దు చేసి నిర్దోషులుగా విడుదల చేసింది. 2010లో అలహాబాద్ హైకోర్టు ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది. అయితే సుప్రీంకోర్టు గత ఏప్రిల్ 19న వీరిపై కుట్ర అభియోగాలు పునరుద్ధరించాలని ఆదేశించింది. అంతేకాకుండా బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి దాఖలయిన రెండు పిటిషన్లను కలిపి ప్రతి రోజూ విచారణ కొనసాగించి రెండేళ్లలో విచారణను పూర్తి చేయాలని కూడా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈమేరకు మంగళవారం లక్నోలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. ఈ రోజు నిందితులంతా వ్యక్తిగతంగా కోర్టుముందు హాజరు కావాలని అంతకుముందు కోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈమేరకు మంగళవారం కోర్టు ఎదుట అద్వానీ, జోషీ, ఉమాభారతి సహా నిందితులంతా హాజరయ్యారు. అభియోగాలు నమోదు చేసిన వారిలో విహెచ్‌పి సీనియర్ నేత విష్ణు హరి దాల్మియా, బిజెపి ఎంపి వినయ్ కతియార్, సాధ్వి రితాంబర, బిజెపి మాజీ ఎంపి రాంవిలాస్ వేదాంతి, బైకుంఠ్‌లాల్ శర్మ, చంపత్‌రాయ్ బన్సల్, మహంత్ నృత్య గోపాల్ దాస్, ధర్మదాస్, సతీష్ ప్రధాన్‌లున్నారు. అంతకుముందు సిబిఐ ప్రత్యేక జడ్జి ఎస్‌కె యాదవ్ నిందితులందరికీ 50 వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిలు మంజూరు చేశారు. వారికి బెయిలు ఇవ్వరాదంటూ సిబిఐ చేసిన వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. కాగా కోర్టులో దాదాపు మూడు గంటలు గడిపిన నిందితులు తమపై మోపిన క్రిమినల్ కుట్ర అభియోగాన్ని తిరస్కరించాలని కోరగా, జడ్జి ఆ వాదనను తోసిపుచ్చారు. జడ్జి యాదవ్ మొత్తం రెండు ఉత్తర్వులు జారీ చేశారు. వాటిలో ఒకటి బెయిలు మంజూరుకు సంబంధించినది కాగా, రెండోది అభియోగాల నమోదుకు సంబంధించినది. ఇదివరకే వారిపై ఉన్న ఇతర అభియోగాలకు తోడుగా ఈ క్రిమినల్ కుట్ర అభియోగంకింద కూడా విచారణ జరుగుతుంది. కాగా, బుధవారం విచారణ కొనసాగుతుంది.

లఖ్‌నవూ కోర్టుకు హాజరైన మురళీమనోహర్ జోషి, ఉమాభారతి