జాతీయ వార్తలు

ఎవరి అజెండా వారిదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 6: బీజేపీ మిత్రపక్షాలు తెలుగుదేశం, శివసేన, అన్నా డీఎంకేతోపాటు తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు పోడియంను చుట్టుముట్టి ఎన్‌డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ గొడవ చేయటంతో మంగళవారం కూడా పార్లమెంటు ఉభయ సభలు పూర్తిగా అదుపు తప్పాయి. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభ అధ్యక్షుడు ఎం. వెంకయ్య నాయుడు ఇద్దరూ కూడా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయారు. పోడియం వద్ద నిలబడిన సభ్యులు సుమిత్రా మహాజన్, వెంకయ్య నాయుడుకు ప్లకార్డుల అడ్డంపెట్టి వారు మాట్లాడేది టీవీల్లో రాకుండా అడ్డుపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ తెలుగుదేశం, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని టీఆర్‌ఎస్, కావేరీ జల బోర్డును ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే, మరాఠీ భాషను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ శివసేన, బ్యాంకులను కొల్లగొట్టిన చోటా మోదీ- నీరవ్ మోదీ ఎక్కడ అంటూ కాంగ్రెస్, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు పెద్దఎత్తున నినాదాలిస్తూ ఉభయ సభల్లోనూ గొడవ చేశారు. లోక్‌సభ మంగళవారం కేవలం పదిహను నిమిషాలు సాగితే.. రాజ్యసభ ఇరవై నిమిషాల కంటే ఎక్కువసేపు కొనసాగలేకపోయింది. పార్లమెంటు ప్రతిష్ఠను దిగజారుస్తున్నారంటూ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభ అధ్యక్షుడు ఎం.వెంకయ్య నాయుడు, ఉపాధ్యక్షుడు పీజే కురియన్ పలుమార్లు హెచ్చరించినా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో గొడవ చేస్తున్న సభ్యుల వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. తెలుగుదేశం సభ్యుడు ఎన్.శివప్రపాద్ ఎన్‌టీఆర్ వేషధారణలో సభకు వచ్చి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. మాగంటి బాబు నిన్నటి మాదిరిగానే మూడు మతాల పవిత్ర గ్రంథాలపై శ్రీ వేంకటేశ్వరస్వామి చిన్న విగ్రహం పెట్టుకుని సభకు వచ్చారు.
లోక్‌సభ మంగళవారం ఉదయం పదకొండు గంటలకు సమావేశం కాగానే ప్రతిపక్షాలతోపాటు టీడీపీ, టీఆర్‌ఎస్, శివసేన, అన్నాడీఎంకే తదితర పార్టీల సభ్యులు పోడియం వద్దకు దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలివ్వడం ప్రారంభించారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీనితో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైనప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతం అయింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ జోక్యం చేసుకుని విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీపై చర్చ జరిపేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. చర్చకు డిమాండ్ చేసిన కాంగ్రెస్ ఇప్పుడెందుకు పారిపోతోందని ప్రశ్నించారు. ప్రతిపక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే బదులిస్తూ తాము కూడా చర్చకు సిద్ధమేనని ప్రకటించారు. అయితే పోడియంను చుట్టుముట్టిన సభ్యుల నినాదాల మూలంగా పరిస్థితి పూర్తిగా అదుపు తప్పటంతో సభను బుధవారం నాటికి వాయిదా వేశారు.
రాజ్యసభలోనూ అదే సీన్..
రాజ్యసభలోనూ అదే సీన్ కొనసాగింది. సభ సమావేశం కాగానే తెలుగుదేశం, అన్నాడీఎంకే, డీఎంకే, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు పోడియంను చుట్టుముట్టి నినాదాలివ్వడం ప్రారంభించారు. నీరవ్ మోదీ ఎక్కడున్నాడు? చోటా మోదీని స్వదేశాని తీసుకురావాలంటూ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు నినాదాలిచ్చారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని తెలుగుదేశం సభ్యులు సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్‌రావు, తోట సీతారామలక్ష్మి, కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచందర్‌రావు నినాదాలిచ్చారు. కావేరీ జల బోర్డును ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే, డీఎంకే సభ్యులు డిమాండ్ చేశారు. వీరి నినాదాల మూలంగా సభ స్తంభించిపోయింది. సభ్యులను శాంతింపజేసేందుకు వెంకయ్య నాయుడు తీవ్రంగా ప్రయత్నించారు. సభ్యులిలా వ్యవహరించటం మంచిది కాదు.. మీరు రాజ్యసభ పరువు, ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మనం వ్యవహరిస్తున్న తీరును దేశం మొత్తం చూస్తోందనేది విస్మరించరాదని హెచ్చరించారు.
అయినా ఫలితం లేకపోవడంతో సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత సమావేశమైనప్పుడు ఉపాధ్యక్షుడు కురియన్ సభను అదుపులోకి తెచ్చేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. సభ్యుల గొడవ మూలంగా సభ పూర్తిగా అదుపు తప్పడంతో చేసేదిలేక కురియన్ బుధవారానికి వాయిదా వేయకతప్పలేదు.
chitram...
మంగళవారం లోక్‌సభలో పోడియంను చుట్టుముట్టి గొడవ చేస్తున్న సభ్యులు