జాతీయ వార్తలు

ఆగని నిరసనలు.. సాగని సభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 7: ప్రతిపక్షం, స్వపక్షం కలిసికట్టుగా ఎన్‌డీఏ ప్రభుత్వంపై విరుచుకుపడటంతో మూడోరోజు బుధవారం కూడా పార్లమెంటు ఉభయ సభలు స్తంభించిపోయాయి. లోక్‌సభ రెండు విడతల్లో కేవలం ఏడు నిమిషాలు మాత్రమే కొనసాగి వాయిదా పడితే... రాజ్యసభ కూడా రెండు విడతల్లో కేవలం పది నిమిషాలు మాత్రమే పని చేసిన గురువారానికి వాయిదా పడకతప్పలేదు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తోపాటు తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, స్వపక్షానికి చెందిన అన్నాడీఎంకే, తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీపీ, తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు పోడియంను చుట్టుముట్టి పెద్దఎత్తున నినాదాలు ఇవ్వటంతో ఉభయ సభలు రణరంగంగా మారాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం సూత్రధారి చోటామోదీ ఎక్కడ అని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు నినాదాలు ఇవ్వగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, విభజన చట్టాలను అమలు చేయవలసిందేనని తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీపీ నినాదాలు ఇచ్చింది. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటూ టీఆర్‌ఎస్ సభ్యులు నినాదాలు ఇస్తే, కావేరీ నదీల జలాల బోర్డును ఏర్పాటు చేయాలి, పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్య తీసుకోవాలంటూ అన్నాడీఎంకే సభ్యులు లోక్‌సభ దద్దరిల్లేలా నినాదాలు ఇచ్చారు. మరాఠీని జాతీయ భాషగా గుర్తించాలని శివసేన సభ్యులు పోడియం వద్ద ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలిచ్చారు.
స్పీకర్ సుమిత్రా మహాజన్ బుధవారం ఉదయం పదకొండు గంటలకు లోక్‌సభ సమావేశం కాగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టేందుకు ప్రయత్నించారు. అప్పటితే పోడియంను చుట్టుముట్టిన ప్రతిపక్షం, స్వపక్షం సభ్యులు తమ, తమ డిమాండ్లతో సభ అదిరిపోయేలా నినాదాలిచ్చారు. అన్నాడీఎంకేకు చెందిన 30మంది లోక్‌సభ సభ్యులు పోడియంను చుట్టుముట్టి నినాదాలిచ్చారు. దీనితో సభను మధ్యాహ్నం పనె్నండు గంటల వరకు వాయిదా వేశారు. లోక్‌సభ తిరిగి సమావేశమైనప్పుడు కూడా ప్రతిపక్షం, స్వపక్షం సభ్యులు దాదాపు అరవై మంది నినాదాలతో సభ దద్దరిల్లిపోయింది.
తెలుగుదేశం సభ్యుడు శివప్రసాద్ రెండు మట్టి ముంతలతో సభకు వచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు గంగానది జలాలు, పార్లమెంటు మట్టిని తెచ్చి ఇచ్చారు. రాజధాని నిర్మాణానికి ఆయన ఎంతో చేస్తారని భావించాం.. కానీ ఆయన తమకు మట్టి తప్ప ఏమీ ఇవ్వలేదని శివప్రసాద్ ఆరోపించారు. మాగంటి బాబు మూడు మతాలకు చెందిన పవిత్ర గ్రంథాలు భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లపై తిరుపతి బాలాజీ విగ్రహం పెట్టుకుని సభకు వచ్చారు. బాలాజీ సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. చోటామోదీని స్వదేశానికి ఎప్పుడు తెస్తారని కాంగ్రెస్ ప్రశ్నించింది. సుమిత్రా మహాజన్ ఈ గందరగోళం మధ్యనే కొంతసేపు సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. శివసేన పక్షం నాయకుడు ఆనంద్‌రావ్ అడ్సూల్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఆనంద్‌రావ్ అడ్సూల్ మాట్లాడుతూ మరాఠీని జాతీయ భాషగా గుర్తించాలని డిమాండ్ చేశారు. దీనికి హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ మరాఠీని జాతీయ భాషగా గుర్తించాలనే ప్రతిపాదనను హోం శాఖలోని సంబంధిత శాఖకు పంపిస్తామని హామీ ఇవ్వటంతో శివసేన సభ్యులు తమ నిరసనను ఉపసంహరించుకుని సీట్లలోకి వెళ్లిపోయారు. అయితే మిగతా సభ్యులు మాత్రం పోడియం వద్దనే నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలివ్వటంతో సభ పూర్తిగా స్తంభించిపోయింది. దీనితో సుమిత్రా మహాజన్ సభను గురువారానికి వాయిదా వేయకతప్పలేదు.
రాజ్యసభలో అదే గొడవ
రాజ్యసభ గౌరవ, మర్యాదలను కాలరాస్తున్నారని అధ్యక్షుడు ఎం.వెంకయ్య నాయుడు చీవాట్లు పెట్టినా ప్రతిపక్షం, మిత్రపక్షం సభ్యులు మాత్రం పోడియంను చుట్టుముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిస్తూ సభను స్తంభించపజేశారు. పోడియం వద్ద ప్లకార్డులను ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, తెలుగుదేశం, అన్నాడీఎంకే, డీఎంకే ఇతర పార్టీల సభ్యులు ఏమాత్రం తగ్గకుండా నినాదాల జోరును పెంచి సభను గందరగోళంలో పడవేశారు. రాజ్యసభ బుధవారం ఉదయం పదకొండు గంటలకు సమావేశం కాగానే ప్రతిపక్షం, స్వపక్షం సభ్యులు పోడియం వద్దకు దూసుకువచ్చారు. చోటామోదీ ఎక్కడ? బ్యాంకుల కుంభకోణానికి జవాబు ఎవరు చెబుతారు? అని కాంగ్రెస్, టీఎంసీ సభ్యులు ప్రశ్నిస్తే, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని తెలుగుదేశం సభ్యులు సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్‌రావు, సీతామహాలక్ష్మి, ఏపీ కాంగ్రెస్ సభ్యులు కేవీపీ రామచందర్‌రావు, టీ.సుబ్బిరామిరెడ్డి, ఎంఏ ఖాన్ డిమాండ్ చేశారు. కావేరీ జల బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి, పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నాడీఎంకే, డీఎంకే సభ్యులు డిమాండ్ చేశారు. దీనితో వెంకయ్య నాయుడు సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైనప్పుడు కూడా పోడియం వద్ద నినాదాలిస్తున్న సభ్యులను శాంతింపజేసేందుకు ఉపాధ్యక్షుడు కురియన్ తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. దీనితో సభను గురువారానికి వాయిదా వేశారు.
chitram...

రాజ్యసభలో నినదిస్తున్న సభ్యులను సముదాయంచేందుకు ప్రయత్నిస్తున్న చైర్మన్ వెంకయ్య నాయుడు