జాతీయ వార్తలు

ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 6: ఉగ్రవాదుల నుండి రక్షణ కల్పించటంలో విఫలమైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే బుధవారం ఏఐసిసి కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బాంబు పేలుళ్ళు, తూటాల శబ్దాల మధ్య పాకిస్తాన్‌తో చర్చలు జరపటం సాధ్యం కాదంటూ 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో చేసిన ప్రకటన ఏమైందని నరేంద్ర మోదీని నిలదీశారు. పాకిస్తాన్‌కు ప్రేమ లేఖలు రాయటం మానివేయండి, పాకిస్తాన్ అర్థం చేసుకునే పద్ధతిలో జవాబు ఇవ్వాలని ప్రతిపాదించిన నరేంద్ర మోదీ ఇప్పుడు పాకిస్తాన్‌తో ఏ భాషలో మాట్లాడుతున్నారని షిండే ఎద్దేవా చేశారు. ముంబయి పేలుళ్ల అనంతరం నరేంద్ర మోదీ అక్కడికి వెళ్లినప్పుడు విలేఖరుల మాట్లాడుతూ ఈ వ్యాఖ్య చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ఏం చేస్తున్నారని షిండే నిలదీశారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత గత 19 నెలల కాలంలో తొమ్మిది వందల సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించటం వలన 19 మంది జవాన్లు వీరమరణం పొందారు, 34 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆయన చెప్పారు. గత సంవత్సర కాలంలో చొరబాట్లు 35శాతం పెరిగాయని సరిహద్దు రక్షణ దళం అంగీకరించిందని షిండే తెలిపారు. ఆరు నెలల్లో పాకిస్తాన్ వైపునుంచి మూడు పెద్ద ఉగ్రవాద దాడులు జరిగాయి. రెండు దాడులు పంజాబ్‌లో జరిగితే, ఒకటి జమ్ముకాశ్మీర్‌లో జరిగిందని వివరించారు. లష్కరేతోయిబాకు చెందిన ముగ్గురు ఇస్లామిక్ ఉగ్రవాదులు పంజాబ్‌లోని దీనానగర్, గురుదాస్‌పూర్‌లో జరిపిన దాడిలో ఒక ఎస్‌పితోపాటు మొత్తం ఏడుగురు జవాన్లు వీరమరణం పొందారు. ఉద్దంపూర్‌లో బిఎస్‌ఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు జవాన్లు మరణించారని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం జనవరి ఒకటో తేదీ జైషే మహమ్మద్ ఉగ్రవాదులు పఠాన్‌కోట్‌పై జరిపిన దాడిలో ఎంతమంది మరణించారనేది అందరికి తెలిసిందేనని షిండే అన్నారు. నరేంద్ర మోదీ అకస్మాత్తుగా లాహోర్‌లో పర్యటించి వచ్చిన ఏడోరోజే ఉగ్రవాదులు పఠాన్‌కోట్‌పై దాడి జరపటం ద్వారా మన భద్రతా వ్యవస్థను అపహాస్యం చేశారని షిండే చెప్పారు. పఠాన్‌కోట్ దాడి భారతదేశం గౌరవం, ప్రతిష్ఠ, సార్వభౌమాధికారంపై జరిగిన దాడిగా భావించాలని అన్నారు. నరేంద్ర మోదీ వైఫల్యం మూలంగానే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. దేశానికి సరైన నాయకత్వాన్ని అందజేయటంలో మోదీ ఘోరంగా విఫలమయ్యారని అభిప్రాయపడ్డారు. పఠాన్‌కోట్‌లో భద్రతా దళాలు ఉగ్రవాదులతో పోరాడుతుంటే నరేంద్ర మోదీ కర్నాటకలో యోగా గురించి పాఠాలు చెబుతూ కూర్చోవటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ పఠాన్‌కోట్‌లో విలేఖరులతో ప్రాణ నష్టం గురించి బాధ్యతా రహిత ప్రకటన చేశారని షిండే ఆరోపించారు. ఉగ్రవాదులతో జరుగుతున్న పోరాటంలో మన సైనికులు దురదృష్టం కొద్దీ మరణించారని పారికర్ చెప్పటం సిగ్గు చేటని విమర్శించారు. ఏయిర్‌బేస్‌పై దాడి చేసినవారు పాకిస్తాన్ ఉగ్రవాదులను ఎన్‌డిఏ ప్రభుత్వం ఎందుకు చెప్పలేకపోతోందని షిండే ప్రశ్నించారు. ఉగ్రవాదులపై జరుగుతున్న పోరాటానికి మోదీ, పారికర్ లేదా రాజ్‌నాథ్ సింగ్ ఎందుకు మార్గదర్శనం చేయలేకపోయారని షిండే నిలదీశారు. ఉగ్రదాడిని సమీక్షించేందుకు కేంద్ర మంత్రివర్గం భద్రతా వ్యవహారాల ఉపసంఘం సమావేశం ఎందుకు జరపలేదని ఆయన నిలదీశారు. ఉగ్రవాదులు ఎస్‌పి కారును అపహరించిన విషయం తెలిసిన తరువాత దాదాపు ఇరవై నాలుగు గంటలపాటు ఎలాంటి చర్య తీసుకోకపోటానికి బాధ్యులెవరు? అని షిండే ప్రశ్నించారు. ఉగ్రవాదులు మాదక ద్రవ్యాల వ్యాపారస్థుల సహాయం తీసుకున్నారా? ఇదే జరిగితే దీనికి బాధ్యులెవరనేది గుర్తించారా? అంటూ షిండే ప్రశ్నల వర్షం కురిపించారు.