జాతీయ వార్తలు
పాక్ సరిహద్దుల్లో పెరిగిన చొరబాటు యత్నాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, నవంబర్ 27: పాకిస్తాన్‌వైపునుంచి భారత భూభాగంలోకి చొరబడడానికి ఉగ్రవాదులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారని, ఈ ఏడాది అలాంటి ప్రయత్నాలు గణనీయంగా పెరిగాయని సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) డికె పాఠక్ అన్నారు. బిఎస్‌ఎఫ్ 50వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. పశ్చిమ సరిహద్దుల్లో సరిహద్దు ఆవలి వైపునుంచి కాల్పులు గణనీయంగా పెరిగాయని, దేశంలోకి ఉగ్రవాదులను చొప్పించడమే ఆ కాల్పుల ప్రధాన ఉద్దేశమని పాఠక్ అన్నారు. జమ్మూలోని అఖ్నూర్‌నుంచి గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్ దాకా విస్తరించి ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఈ ఏడాది ఇప్పటివరకు 62 చొరబాటు యత్నాలు జరిగాయని ఆయన చెప్పారు.గత ఏడాది ఈ సంఖ్య 48 మాత్రమేనని ఆయన చెప్పారు. చొరబాటు యత్నాలు విజయవంతమైన సంఘటనలు పెద్దగా లేనప్పటికీ ఉగ్రవాద ముఠాలకు చెందిన ఆత్మాహుతి దళాలు జమ్మూలోని కతువా, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ ప్రాంతాల్లోకి చొరబడి అమాయక పౌరులను, పోలీసులను పొట్టన పెట్టుకోవడం బిఎస్‌ఎఫ్‌కు ఇబ్బందికరమైన విషయాలేనని చెప్పాలి. ఈ ఏడాది మార్చి 20న ఇద్దరు టెర్రరిస్టులు కతువా సరిహద్దుగుండా జమ్మూ ప్రాంతంలోకి చొరబడి ఒక పోలీసు స్టేషన్‌పై దాడి చేసి ఇద్దరు పౌరులను, మరో ఇద్దరు పోలీసులను హతమార్చడం తెలిసిందే.
ఇది జరిగిన మర్నాడే మరో ఇద్దరు సాయుధ మిలిటెంట్లు ఆర్మీ క్యాంప్‌పై దాడి చేయడానికి జరిపిన ప్రయత్నాన్ని భద్రతా దళాలు వమ్ము చేసాయి. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత పంజాబ్‌లో మొట్టమొదటిసారి జూలై 27న ముగ్గురు ఉగ్రవాదులు గురుదాస్‌పూర్ ప్రాంతం గుండా మన భూభాగంలోకి ప్రవేశించి ఒక పోలీసు స్టేషన్‌పై దాడి చేసి పోలీసు సూపరింటెండెంట్ సహా నలుగురు పోలీసులను, ముగ్గురు పౌరులను పొట్టన పెట్టుకున్నారు. కరుడుగట్టిన అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్, కొన్ని ఇతర మిలిటరీ సంస్థల మధ్య సహాయ సహకారాలున్నట్లు మీడియాలో వచ్చిన కథనాలపై పాఠక్ ఆందోళన వ్యక్తం చేస్తూ, అయితే వాటి కుట్రలను భగ్నం చేయడానికి తమ జవాన్లు అన్ని చర్యలు తీసుకుంటున్నారని రెండు లక్షల మంది జవాన్లున్న బిఎస్‌ఎఫ్‌కు నాయకత్వం వహిస్తున్న పాఠక్ చెప్పారు. ప్రాణాలకు తెగించి అయినా భారత్‌లోకి చొరబడాలని ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని, అయితే ఇప్పటివరకు వాళ్ల ప్రయత్నాలు ఫలించ లేదని ఆయన అన్నారు. పశ్చిమ సరిహద్దుల్లో మన పొరుగుదేశం (పాకిస్తాన్) విసురుతున్న అన్ని రకాల సవాళ్లను తాము సమర్థవంతంగా తిప్పి కొడుతున్నామని పాఠక్ చెప్పారు. భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఇటీవల డిజి స్థాయి చర్చలు జరిగిన తర్వాత కూడా మూడు సార్లు సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలు జరిగాయని పాఠక్ చెప్పారు.
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల గురించి మాట్లాడుతూ, ఈ ఏడాది భారత్‌లోకి చొరబడడానికి ప్రయత్నించిన దాదాపు 4 వేల మందిని అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. గత ఏడాది ఈ సంఖ్య 3,200 అని ఆయన చెప్పారు. అయితే ఈ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పశువుల అక్రమ రవాణా 70 వాతం తగ్గిందని ఆయన చెప్పారు. ఎలాంటి పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వీలుగా దళాన్ని సంసిద్ధం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని పాఠక్ చెప్పారు.