జాతీయ వార్తలు

చర్చల ప్రక్రియ ఆపొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 8: పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిపై ప్రపంచ దేశాలు వ్యక్తం చేస్తున్న ఆగ్రహం కొనసాగుతూనే ఉంది. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన దేశాల జాబితాలో శుక్రవారం జర్మనీ, ఆస్ట్రేలియా, ఇండోనేసియా చేరాయి. అమెరికా, చైనా, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌తో పాటు తమ నావికులపై హత్య కేసు విషయంలో భారత్‌తో పోరాడుతున్న ఇటలీ కూడా ఈ ఉగ్రవాద దాడిని ఇదివరకే ఖండించాయి. భారత వాయుసేన వైమానిక స్థావరంపై క్రూరమైన ఉగ్రవాద దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పాకిస్తాన్‌కు సన్నిహిత మిత్రదేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) పేర్కొంది. ఉగ్రవాదంపై పోరులో తాను భారత్‌కు మద్దతుగా నిలుస్తానని స్పష్టం చేసింది. పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరంపై, అఫ్గానిస్తాన్‌లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంపై ఉగ్రవాదులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు జర్మనీ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడులకు ఒడిగట్టిన వారిని గుర్తించి, బాధ్యులను చేయాలని పేర్కొంది. భారత్, పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న చర్చలపై స్పందిస్తూ, ఇరు దేశాలు పరస్పరం చర్చలు జరుపుకోవాలని నిర్ణయించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు జర్మనీ తెలిపింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్‌లోని లాహోర్‌కు వెళ్లడం, ఉగ్రవాద దాడి తరువాత పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేయడం మంచి పరిణామాలని, రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటంలో ముఖ్యమైన చర్యలని జర్మనీ అభిప్రాయపడింది. ఉగ్రవాద దాడులతో పాటు ఏ అంశం వల్ల కూడా ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియ ఆగిపోకూడదని సూచించింది.
చర్చల ప్రక్రియను దెబ్బతీసే ఎలాంటి ప్రయత్నాన్ని విజయవంతం కానీయొద్దని పేర్కొంది. పఠాన్‌కోట్ దాడిని ఆస్ట్రేలియా తీవ్రంగా ఖండిస్తోందని, తమ దేశం ఉగ్రవాద బాధితులకు సంఘీభావంగా నిలుస్తుందని ఆ దేశ విదేశాంగ మంత్రి జూలీ బిషప్ ఈమేరకు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు. అన్ని ఉగ్రవాద చర్యలను ఖండిస్తున్నట్లు ఇండోనేసియా తన సందేశంలో పేర్కొంది.
జపాన్, ఫ్రాన్స్, శ్రీలంక, బంగ్లాదేశ్ తదితర దేశాలు కూడా పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై, అఫ్గానిస్తాన్‌లోని భౌరత దౌత్య కార్యాలయంపై ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించాయి.