జాతీయ వార్తలు

జల్లికట్టుపై ‘సుప్రీం’ స్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ చెన్నై, జనవరి 12: తమిళనాడులో పొంగల్ (సంక్రాంతి) పండుగ సందర్భంగా నిర్వహించే జల్లికట్టు (ఎడ్ల పందేల) క్రీడపై నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం నిలిపివేసింది. దీనికి సంబంధించి ఈ నెల 8న కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్లపై స్పందించిన సుప్రీంకోర్టు ఈ ఏడాది తమిళనాడులో జల్లి కట్టును నిర్వహించరాదని స్పష్టం చేసింది. ఈ రోజు ఉదయం జస్టిస్ బానుమతి ఈ కేసు విచారణనుంచి తప్పుకోవడంతో జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఇంతకు ముందు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకుర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనంలో భాగంగా బానుమతి ఉన్నారు. సుప్రీంకోర్టు కేంద్రానికి, తమిళనాడుకు, అలాగే జల్లి కట్టు క్రీడ జరిగే ఇతర రాష్ట్రాలకు నోటీసులు కూడా జారీ చేసింది.
జల్లికట్టులో జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తారని పేర్కొంటూ జంతు సంక్షేమ బోర్డు ‘పేటా’, అలాంటి మరో 11 సంస్థలు జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంలో సవాలు చేశాయి.
కాగా, సుప్రీంకోర్టు నిర్ణయంపై తమిళనాడులో మంగళవారం అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. 2004లో సుప్రీంకోర్టు జల్లికట్టును నిషేధించే దాకా ప్రతి ఏటా ఈ క్రీడలను నిర్వహించే మదురై జిల్లాలోని అలంగనల్లూరు, పలమేడు, అవనియాపురం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జనం రోడ్లపైకి వచ్చి రాస్తారోకోలకు దిగారు. జల్లికట్టును అనుమతించాలని డిమాండ్ చేస్తూ వారు నినాదాలు చేసారు. దీంతో అవసరమైన ప్రాంతాలకు అదనపు బలగాలను పంపించినట్లు పోలీసులు తెలిపారు. ఆలయ సంప్రదాయాల్లో భాగమైన జల్లికట్టును అనుమతించని పక్షంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తామని కొన్ని గ్రామాల ప్రజలు హెచ్చరించారు.
జల్లికట్టు నిర్వహణపై సుప్రీంకోర్టు స్టే విధించడంపట్ల తమిళనాడులోని రాజకీయ పార్టీలు సైతం తీవ్రంగా స్పందించాయి. రాష్ట్రంలో జల్లి కట్టును అనుమతించడానికి కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిఎంకె నాయకుడు ఎంకె స్టాలిన్ డిమాండ్ చేసారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని ఎండిఎంకె ప్రధాన కార్యదర్శి, పీపుల్స్ వెల్ఫేర్ ప్రంట్ నాయకుడు వైకో డిమాండ్ చేసారు. కాగా, మధ్యంతర స్టేను ఎత్తివేయించడానికి కేంద్రం తక్షణమే సుప్రీంకోర్టుకు వెళ్లాలని పిఎంకె లోక్‌సభ సభ్యుడు అన్బుమణి రాందాస్ డిమాండ్ చేసారు. ముఖ్యమంత్రి జయలలిత తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు అఖిల పక్ష బృందాన్ని తీసుకెళ్లాలని కూడా ఆయన కోరారు. ఇదిలా ఉండగా, కేంద్రం దీనిపై తగిన చర్య తీసుకుంటుందని కేంద్ర మంత్రి పోన్ రాధాకృష్ణన్ హామీ ఇచ్చారు.