జాతీయ వార్తలు

కదలిక లేని ‘కాశ్మీర్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జనవరి 13: జమ్ముకాశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటు రోజురోజుకూ సంక్లిష్టంగా మారుతోంది. సంకీర్ణ భాగస్వామ్య పక్షాలైన పిడిపి, బిజెపిల మధ్య నెలకొన్న అస్పష్టతే ఇందుకు కారణమవుతోంది. ఇందుకు సంబంధించి తొలి అడుగు వేయాల్సింది పిడిపినేనని బిజెపి స్పష్టం చేయడం.. ఆ పార్టీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ ఇప్పటివరకూ నోరు మెదపకపోవడంతో అసలు ఏమి జరుగుతోందో.. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో అంతుబట్టకుండా ఉంది. ముఫ్తీ మొహమద్‌కు ప్రకటించిన ఏడు రోజుల సంతాప కార్యక్రమం బుధవారం పూర్తయింది. కనీసం గురువారం నుంచైనా ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ముమ్మరం కావాలని బిజెపి చెబుతోంది. ఇప్పటికే బిజెపి ప్రతినిధుల బృందం గవర్నర్ ఎన్‌ఎన్ వోరాను కలుసుకుని తాజా రాజకీయ పరిస్థితి గురించి వివరించింది. ప్రభుత్వ ఏర్పాటు గురించి ఏమి చేస్తున్నారని గవర్నర్ తమకు లేఖ రాశారని, ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సింది పిడిపియేనని ఆయనకు స్పష్టం చేశామని బిజెపి సీనియర్ నాయకుడు నిర్మల్ సింగ్ తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వం విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదని ఉద్ఘాటించారు. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్ని బట్టి తదుపరి నిర్ణయం తీసుకోవడానికి పిడిపికి కొంత వ్యవధి ఇవ్వాల్సి ఉంటుందని, అందుకు తామూ సుముఖంగా ఉన్నామని అన్నారు. రానున్న రెండు మూడు రోజుల్లో సానుకూల సంకేతాలే అందవచ్చునన్న ఆశాభావాన్ని నిర్మల్ సింగ్ వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి ప్రక్రియను మొదలు పెట్టలేదని పిడిపి నాయకుడు నిర్మల్ అఖ్తర్ తెలిపారు. సంప్రదింపులు జరిగే తీరును బట్టే తదుపరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అయితే బిజెపితో కలిసే పని చేస్తారా లేక మరో ప్రత్యామ్నాయంపై దృష్టి పెడతారా అన్న అంశంపై ఆయన ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. పిడిపి ధోరణిని బట్టి చూస్తే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సరికొత్త షరతుల్ని విధించే అవకాశం కనిపిస్తోంది. అందుకు బిజెపి ఎంత మేరకు సిద్ధంగా ఉంటుందన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది.