జాతీయ వార్తలు

శాంతిప్రక్రియకు పాక్ సైన్యం గండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 13: గతంలో అనేకసార్లు శాంతిప్రక్రియ ముందుకు సాగకుండా పోవడానికి పాకిస్తాన్ సైన్యమే కారణమని సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ బుధవారం ఆరోపించారు. భారత్‌తో చర్చల విషయంలో పాకిస్తాన్ సైన్యం ప్రధాని నవాజ్ షరీఫ్‌తో విభేదిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో సుహాగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘పాక్ సైన్యం ఈ పని చాలాసార్లు చేసింది.. పఠాన్‌కోట్ విషయంలో నేను ఆ మాట చెప్పడం లేదు..’ అని సుహాగ్ అన్నారు. శాంతిప్రక్రియను దెబ్బతీయడానికి పాక్ సైన్యం, గూఢచార సంస్థ ఐఎస్‌ఐ ప్రయత్నిస్తున్నాయా అని విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఈ విషయం చెప్పారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడికి కుట్ర పన్నిన వారిపై నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటే తప్ప చర్చలు జరగబోవని భారత ప్రభుత్వం స్పష్టం చేసినందున ఈ వారం చివర్లో జరగాల్సిన ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు వాయిదా పడవచ్చన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్న విషయం తెలిసిందే.
తనకు అప్పగించిన ఏ బాధ్యతనైనా నెరవేర్చడానికి భారత సైన్యానికి సామర్థ్యం ఉందని, దేశ భద్రతకు ఎదురయ్యే ఏ ముప్పునైనా ఎదుర్కోవడానికి పూర్తి సన్నద్ధమై ఉందని ఆర్మీ డే సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆర్మీ చీఫ్ చెప్పారు. భారత్‌ను గాయపరిచిన వ్యక్తులు, సంస్థలకు అదే తీరులో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చెప్పిన రెండు రోజులకు సుహాగ్ ఈ విషయం చెప్పడం విశేషం. పంజాబ్‌లోని భారత్-పాక్ సరిహద్దుల్లో చొరబాట్ల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ వీటిని అరికట్టాల్సిన బాధ్యత సరిహద్దులను కాపలా కాస్తున్న బిఎస్‌ఎఫ్‌పై ఉందన్నారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి చేసిన ఆరుగురు పాకిస్తానీ టెర్రరిస్టులు అంతకుముందే ఎయిర్‌బేస్‌లో దాగి ఉండవచ్చని, ఎందుకంటే ఎయిర్‌బేస్ చుట్టూ ఉన్న 24 కిలోమీటర్ల ప్రహరీ గోడ వెంబడి సైన్యాన్ని మోహరించిన తర్వాత ఎవరూ రాలేదని స్పష్టం చేసారు. కాగా, సైన్యం, వివిధ భద్రతా ఏజన్సీల మధ్య సమన్వయం లేదన్న ఆరోపణలను సుహాగ్ తోసిపుచ్చుతూ, పూర్తి సమన్వయం ఉందని స్పష్టం చేసారు. ఈ వారం విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు జరుగుతాయా లేదా అనే దానిపై వ్యాఖ్యానించమని విలేఖరులు కోరగా, అది దౌత్యపరంగా, రాజకీయపరంగా తీసుకోవలసిన నిర్ణయమన్నారు. దాడిలో పాకిస్తాన్ పాత్ర గురించి అడగ్గా, ఉగ్రవాదులనుంచి స్వాధీనం చేసుకున్న కొన్ని పరికరాలతో పాటుగా వాళ్లు తెచ్చుకున్న మందులను బట్టి వాళ్లు పాకిస్తాన్‌నుంచే వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోందని సుహాగ్ చెప్పారు.