జాతీయ వార్తలు

స్టార్టప్‌ల జాప్యానికి బాధ్యత నాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: స్టార్టప్‌ల విషయంలో భారత్ ఆలస్యంగా నిద్ర లేచిందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. అయితే గతంలో తాను ఆర్థిక మంత్రిగా పని చేసినందున ఈ ఆలస్యానికి తానే బాధ్యత వహిస్తానని చెప్పారు. చిన్న పారిశ్రామికవేత్తలకు అనువైన వాతావరణాన్ని కల్పించడం గురించి రాష్టప్రతి మాట్లాడుతూ, ‘ఈ జాప్యానికి బాధ్యతను నేను ఎవరిమీదకో నెట్టలేను. నేనే ఈ బాధ్యతను తీసుకుంటాను ఎందుకంటే నేను దీర్ఘకాలం ప్రభుత్వంలో ఉన్నాను’ అని అన్నారు. ప్రణబ్ ముఖర్జీ గత యుపిఏ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే.
పేదరికం, వైద్య సేవలులాంటి సమస్యలను పరిష్కరించడానికి భారత్ రాబోయే 10-15 ఏళ్ల పాటు ఏటా 10 శాతం చొప్పున వృద్ధి రేటును సాధించాల్సిన అవసరం ఉందని సిలికాన్ వ్యాలీకి చెందిన కొందరు సిఈఓలతో ముచ్చటిస్తూ ప్రణబ్ అన్నారు. ‘నూతన పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు ప్రారంభించడానికి తగిన విశ్వాసాన్ని కల్పించాలని మీలో కొందరు సరిగానే గుర్తు చేసారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించాల్సిన పని ప్రభుత్వానిదే. ఈ విషయంలో మేము చాలా ఆలస్యం చేసాం. ఏమయినా ఇప్పటికైనా మేము ఆ విషయంలో నిర్ణయం తీసుకున్నాం. మేము నిద్రలేచాం’ అని అట్టడుగుస్థాయిలో పారిశ్రామికవేత్తలను ప్రోత్ససించడం కోసం చేపట్టిన స్టార్టప్ ఇండియా ప్రచారాన్ని ప్రస్తావిస్తూ రాష్టప్రతి అన్నారు. ఈ విషయంలో చొరవ తీసుకున్నందుకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారు కూడా.

చిత్రం.... ఢిల్లీలో శనివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న రాష్టప్రతి ప్రణబ్

అభివృద్ధికి
దూరంగా అమేథీ
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
అమేథీ, జనవరి 16: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ పార్లమెంటరీ నియోజకవర్గం అభివృద్ధికి ఆమడదూరంలో ఉందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విమర్శించారు. జరిగిన కొద్ది అభివృద్ధి వల్ల కొంతమందికి మాత్రమే ప్రయోజనం చేకూరిందని ఆరోపించారు. ఇక రైతుల పరిస్థితి దుర్భరంగా వుందని, వారిని ఆదుకునేందుకే అమేథీకి వచ్చానని వెల్లడించారు. తిలోయిలోని ఎస్‌పిఎన్ ఇంటర్ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులను ఆదుకునేందుకు ప్రధాన మంత్రి కిసాన్ భీమా యోజన పథకాన్ని తీసుకురావడం జరిగిందని, అలాగే అమేథీ ప్రజలకోసం కిసాన్ విహాన్ కేంద్రాన్ని మంజూరు చేశామని, రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు స్థలం కేటాయిస్తే దీనికి సంబంధిన పనులు మొదలవుతాయని తెలిపారు. జిల్లాలో ఒక అంబులెన్సు సర్వీసును కూడా ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.

అమేథీ నియోజకవర్గంతోపాటు కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ దత్తత తీసుకున్న బరౌలియా గ్రామాన్ని కూడా అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రైతులకు చెల్లించాల్సిన బకాయిల విషయమై వెంటనే జిల్లా మేజిస్ట్రేట్‌తో మాట్లాడతానని అన్నారు. అమేథీలో రెండు రోజుల పర్యటన నిమిత్తం స్మృతి ఇరానీ ఆదివారం అమేథీ చేరుకున్నారు.

బుర్కినా ఫాసో హోటల్‌పై ఉగ్రదాడి

23 మందిని కాల్చిచంపిన మిలిటెంట్లు 126 మందిని విడిపించిన భద్రతా దళాలు నలుగురు జిహాదీల కాల్చివేత

ఔగాడౌగౌ, జనవరి 16: ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసో రాజధానిలో అల్‌ఖైదాకు అనుబంధంగా ఉన్న ఓ ఉగ్రవాద ముఠాకు చెందిన సాయుధులు ఓ హోటల్, దగ్గర్లోనే ఉన్న మరో రెస్టారెంట్‌లోకి చొరబడి, హోటల్‌లోని వారిని బందీలుగా పట్టుకున్న ఘటనలో కనీసం 23 మంది మృతి చెందారు. అనంతరం భద్రతా దళాలు నలుగురు జిహాదీలను కాల్చి చంపి ఇద్దరు భారతీయులు సహా 126 మందిని విడిపించాయి. చనిపోయిన జిహాదీల్లో ఇద్దరు మహిళలున్నారు. బుర్కినాబే రాజధాని ఔగాడౌగౌలో ఐరాస సిబ్బంది, పాశ్చాత్యులు పెద్ద సంఖ్యలో సందర్శించే నాలుగు నక్షత్రాల హోటల్ అయిన స్ల్పెండిడ్ హోటల్, దానికి దగ్గర్లోనే ఉన్న కాపుక్కినో రెస్టారెంట్‌పై జిహాదీలు జరిపిన దాడుల్లో కనీసం 23 మంది మృతి చెందినట్లు భద్రతా దళ అధికారి ఒకరు చెప్పారు. శనివారం తెల్లవారుజామున భద్రతా దళాలు హోటల్‌ను, రెస్టారెంట్‌ను తిరిగి తమ అధీనంలోకి తీసుకున్నారని హోం మంత్రి సైమన్ కాంపావోర్ ఎఎఫ్‌పి వార్తాసంస్థకు చెప్పారు. శనివారం మధ్యాహ్నానికల్లా జిహాదీల దాడిని పూర్తిగా అణచివేసినట్లు భద్రతా దళ వర్గాలు తెలిపాయి. ఎదురు దాడిలో ఇద్దరు మహిళలతోపాటుగా నలుగురు జిహాదీలు హతమైనారని వారు తెలిపారు. కాగా, ఈ దాడి తామే జరిపినట్లు అల్ ఖైదా ఇన్‌ది ఇస్లామిక్ మఘ్రెబ్ (ఎక్యుఐఎం) ప్రకటించుకోవడమే కాక ఫ్రాన్స్‌కు, పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా జరిపిన ప్రతీకార దాడి ఇది అని పేర్కొంది. అమెరికాలోని ‘సైట్’ అనే మానిటరింగ్ గ్రూపు ఆ ప్రకటనను విడుదల చేసింది. దాడి చేసిన వారు మాలిలో మొఖ్తర్ బెల్‌మోఖ్తర్ నాయకత్వంలోని అల్ మురబితౌన్ గ్రూపునకు చెందిన వారని కూడా సైట్ తెలిపింది. జిహాదీల దాడుల్లో 18 దేశాలకు చెందిన కనీసం 23 మంది మృతి చెందినట్లు భద్రతా దళ వర్గాలు తెలిపాయి. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని ఆ వర్గాలు తెలిపారు. చనిపోయిన నలుగురు జిహాదీలు కాకుండా అయిదో వ్యక్తి దగ్గర్లో ఉన్న బార్‌లోకి పరుగెత్తడం తాము చూసామని తప్పించుకున్న బందీల్లో ఒకరు చెప్పారు. రెస్టారెంట్ టెర్రేస్‌పైన 10 మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది చూసారని అంతకుముందు కాంపావోర్ ఎఎఫ్‌పికి చెప్పారు. 33 మంది క్షతగాత్రులుసహా మొత్తం 126 మందిని జిహాదీల చెరనుంచి విడిపించినట్లు ఆయన చెప్పారు. ఒక అరబ్, ఇద్దరు నల్లజాతీయులుసహా ముగ్గురు జిహాదీలను కాల్చి చంపినట్లు కూడా ఆయన చెప్పారు. నెలరోజుల క్రితమే అధ్యక్ష పదవి చేపట్టిన రోచ్ మార్క్ క్రిస్టియన్ కాబోర్ శనివారం దాడి జరిగిన హోటల్‌ను సందర్శించారు కానీ ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు.
ఫ్రెంచ్ ప్రత్యేక దళాల మద్దతుతో బుర్కినాబే సైన్యాలు ఎదురుదాడిని కొనసాగించినట్లు కమ్యూనికేషన్ల మంత్రి రెమిస్ దండ్జినోవు చెప్పారు. సురక్షితంగా తప్పించుకున్న వారిలో కార్మిక మంత్రి క్లెమెంట్ సవడోగో కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు. కాగా, శనివారం తెల్లవారుజామున హోటల్ ప్రధాన ద్వారం వద్ద పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా, లోపలినుంచి జనం ఆర్తనాదాలు వినిపించాయి. హోటల్ ఉన్న వీధికి అటువైపు పది వాహనాలు మంటల్లో తగలబడుతూ కనిపించాయి. ‘అది భయానక దృశ్యం. జనం అంతా గాఢనిద్రలో ఉన్నారు. ఎక్కడ చూసినా రక్తం మడుగులే. దాడి చేసిన సాయుధులు జనంపైకి అతి దగ్గరనుంచి కాల్పులు జరిపారు’ అని తప్పించుకుని సురక్షితంగా బైటపడ్డ యానిక్ సవడోగో అనే వ్యక్తి చెప్పాడు.
పొరుగుదేశమైన మాలి రాజధాని బమకోలో రాడిసన్ బ్లూ లగ్జరీ హోటల్‌లో జనాన్ని ఓ జిహాదీ బందీగా పట్టుకుని 14 మంది విదేశీయులు సహా 20 మందిని కాల్చి చంపిన ఘటన జరిగి రెండు నెలలు తిరక్కముందే ఈ దాడి జరగడం గమనార్హం. శనివారం దాడికి బాధ్యులుగా ప్రకటించుకున్న సంస్థే అప్పుడు కూడా దాడి చేసినట్లు ప్రకటించుకుంది. కాగా, బుర్కినా ఫాసోలో జరిగిన దాడిని ఫ్రెంచ్ అధ్యక్షుడు ప్రాంకోయిస్ హోలాండె తీవ్రంగా ఖండించారు. దాడి కారణంగా రాజధానిలోని విమానాశ్రయాన్ని మూసివేయడంతో పారిస్‌నుంచి ఔగాడౌగౌకు వస్తున్న ఎయిర్‌ఫ్రాన్స్ విమానాన్ని పొరుగున ఉన్న నైగర్‌కు దారి మళ్లించారు.

స్టార్టప్‌ల ప్రోత్సాహానికి
నిబంధనలు సడలిస్తాం

బడ్జెట్‌లో క్యాపిటల్ గెయిన్స్ టాక్స్‌ను తగ్గిస్తాం
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ

న్యూఢిల్లీ, జనవరి 16: స్టార్టప్ వ్యాపారాలు ప్రారంభించడానికి వీలుగా నిబంధనలను సడలిస్తామని, వచ్చే ఆర్థిక సంవత్సపు బడ్జెట్‌లో కొత్త పరిశ్రమలకు దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ టాక్స్‌ను తగ్గిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు. ముఖ్యంగా మధ్యవర్తిగా ప్రభుత్వం పాత్రను పరిమితం చేయడానికి గత కొనే్నళ్లుగా కృషి జరిగిందని, ఈ విషయంలో అడ్డంకులు తొలగించి పన్నుల విధానాన్ని పారిశ్రామికవేత్తలకు మరింత అనుకూలమైనదిగా చేయడం ఇప్పుడు ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. ‘ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉండే పన్నుల విధానంకోసం మేము ఇప్పటికే కృషి చేసాం. నోటిఫికేషన్ల ద్వారా తీసుకునే చర్యలు కొన్ని ఉన్నాయి. వాటిని వెంటనే తీసుకుంటాం. మిగతా వాటికి చట్టపరమైన నిబంధనలు అవసరం. బడ్జెట్ సమర్పించినప్పుడు ఫైనాన్స్ బిల్లులో భాగంగా వాటిని తీసుకువస్తాం’ అని జైట్లీ తెలిపారు. శనివారం ఇక్కడ స్టార్టప్ బిజినెస్‌పై జరిగిన ఓ సమావేశంలో జైట్లీ మాట్లాడుతూ కొత్తగా పరిశ్రమలు పెట్టే వారికి అవసరమైన వనరులు లభించేలా ప్రభుత్వం, బ్యాకింగ్ వ్యవస్థ కృషి చేస్తాయని ఆయన చెప్పారు. బ్యాంకులు మరింత పరిపుష్టితో మరింత ఎక్కువ మొత్తాల్లో రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ కలిసికట్టుగా కృషి చేస్తాయని ఆయన చెప్పారు. లిస్టెడ్ కంపెనీల స్టాక్స్‌లో పెట్టుబడులకు ఇప్పుడు ఎలాంటి పన్నూ విధించడం లేదని, అదే లిస్టింగ్ కాని కంపెనీల షేర్లలో పెట్టుబడులపై 20 శాతం క్యాపిటల్ గెయన్ పన్ను విధిస్తున్నారని రెవిన్యూ కార్యదర్శి హస్‌ముఖ్ అదియా అన్నారు. వచ్చే బడ్జెట్‌లో ఈ వ్యత్యాసాన్ని సరిచేయడం జరుగుతుందని చెప్పారు. స్టార్టప్ అనుకూల వాతావరణాన్ని ప్రోత్సహించడానికి సర్వీస్ టాక్స్ నిబంధనలను హేతుబద్ధం చేయడం లాంటి పన్ను రాయితీలకు సంబంధించిన మరికొన్ని చర్యలను కూడా ఫిబ్రవరి 29న ప్రతిపాదించే వార్షిక బడ్జెట్‌లో ప్రకటించడం జరుగుతుందని ఆయన చెప్పారు.
ఫేమా చట్టం కింద ఆన్‌లైన్ రిటర్న్‌లను దాఖలు చేయడం గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖ రిజర్వ్ బ్యాంక్‌తో వివరంగా చర్చించిందని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ చెప్పారు. 24 గంటల్లో కొత్త పరిశ్రమల రిజిస్ట్రేషన్ సాధ్యమయ్యేలా చూసేందుకు తమ డిపార్ట్‌మెంట్ రానున్న రెండు నెలల్లో ఒక సాఫ్ట్‌లేర్‌ను తీసుకు రావడానికి కృషి చేస్తుందని కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి తపన్ రాయ్ చెప్పారు. సాఫ్ట్ బ్యాంక్ అధినేత మసయోషి సోన్, ఉబెర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అటావిస్ కలనిక్ కూడా ఈ కార్యక్రమానికి హజరయ్యారు.

‘జిఎస్‌టి’కి కాంగ్రెస్ అడ్డుకాదు

మా షరతులు అంగీకరిస్తే 15 నిమిషాల్లో బిల్లు ఆమోదం రాహుల్ గాంధీ స్పష్టీకరణ

ముంబయి, జనవరి 16: వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ షరతులకు మోదీ ప్రభుత్వం ఆమోదిస్తే 15 నిమిషాల్లో జిఎస్‌టి బిల్లుకు చట్టబద్ధత లభిస్తుందని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తమ ప్రతిపాదనలకు ఎన్‌డిఏ సర్కార్ ఆమోదం తెలిపితే జిఎస్‌టి బిల్లుకు పార్లమెంటులో మద్దతు కూడగట్టడం పెద్దపనికాదని శనివారం ఇక్కడ వ్యాఖ్యానించారు. కేంద్రం ‘స్టార్టప్’ మిషన్ అంటూనే అసహనాన్ని ముందుకు తీసుకెళ్తోందని రాహుల్ ధ్వజమెత్తారు. ఆర్‌ఎస్‌ఎస్ అదుపాజ్ఞలలో మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. మేనేజ్‌మెంట్ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. జిఎస్‌టి బిల్లుకు కాంగ్రెస్ అడ్డు తగులుతోందన్న కేంద్రం ఆరోపణలు సత్యదూరమని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పట్టుదలకు పోకుండా సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. వస్తు సేవా పన్నుకు సంబంధించి తమ పార్టీ కొన్ని ప్రతిపాదనలు చేసిందని, ప్రభుత్వం వాటికి ఆమోదం తెలిపితే బిల్లుకు ఆమోదం పెద్దకష్టం కాదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చెప్పారు. గరిష్ట పన్నుకు పరిమితులు ఉండాలని తమ పార్టీ ప్రతిపాదిస్తోందని రాహుల్ చెప్పారు. తాము చెబుతున్న దానిలో వాస్తవం ఉందని ఆయన సమర్థించుకున్నారు. ‘కాంగ్రెస్ పార్టీ జిఎస్‌టి బిల్లును తీసుకొస్తే అప్పట్లో అంటే ఏడేళ్ల క్రితం పార్లమెంటులో బిజెపి అడ్డుపడింది. అరుణ్ జైట్లీకి బిల్లు ఆమోదం ఇష్టం లేదు. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ కూడా జిఎస్‌టిని వ్యతిరేకించారు’ అని రాహుల్ గాంధీ విమర్శించారు.
రాహుల్ ముఖాముఖి కార్యక్రమానికి మిశ్రమ స్పందన కనిపించింది. రాహుల్ ప్రసంగంలో రాజకీయాలే ఎక్కువ ప్రస్తావించారన్న అభిప్రాయం విద్యార్థులు వ్యక్తం చేశారు. ‘రాహుల్ ఉపన్యాసంలో కొన్ని మంచి అంశాలను ప్రస్తావించినా మితిమీరిన రాజకీయాలు కనిపించాయి’ అని ఓ ఎంబిఏ విద్యార్థి అన్నారు. ‘జిఎస్‌టి బిల్లుపై కూడా కాంగ్రెస్ నేత వివరణ అస్పష్టంగా ఉంది. కాంగ్రెస్ బిల్లు తెస్తే బిజెపి అడ్డుకుందని రాహుల్ అన్నారు. అంతేతప్ప సమగ్రంగా చెప్పలేకపోయారు’ అని వారు వ్యాఖ్యానించారు. భారత్‌లో టిట్ ఫర్ టాట్ బ్రాండ్ రాజకీయాలకే పెద్దపీట వేస్తారని, తమకు ఇలాంటివాటిపై ఆసక్తిలేదని పలువురు అన్నారు.

‘రాహుల్ ప్రసంగంలో నిజాయితీ కనిపించింది. ఉపాధి హామీ పథకం అమలు వివరించారు. అయితే ఆయన విజన్ ఏమిటో స్పష్టం చేసి ఉంటే బావుండేది’ అని ఓ విద్యార్థిని పేర్కొన్నారు.

టిఎంసిని గద్దె దించడానికి
మాతో చేతులు కలపండి

కాంగ్రెస్‌కు బెంగాల్ మాజీ సిఎం బుద్ధదేవ్ భట్టాచార్య పిలుపు

సింగూర్ (పశ్చిమ బెంగాల్), జనవరి 16: పశ్చిమ బెంగాల్‌లో పారిశ్రామిక వాతావరణాన్ని ధ్వంసం చేయడంతోపాటు అరాచక పాలన సాగిస్తున్న తృణమూల్ కాంగ్రెస్‌ను గద్దె దించడానికి లెఫ్ట్ ఫ్రంట్‌తో చేతులు కలపాల్సిందిగా కాంగ్రెస్ పార్టీకి, ఇతర వామపక్షాలకు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బుద్ధదేవ్ భట్టాచార్య సంకేతాలు పంపించారు. సింగూర్‌లో టాటా గ్రూప్ చిన్న (నానో) కార్ల తయారీ పరిశ్రమను పెట్టడానికి పూనుకొని, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) అడ్డుకోవడంతో దాన్ని గుజరాత్‌కు తరలించిన విషయం తెలిసిందే. బెంగాల్‌లోని సల్బోనిలో జెఎస్‌డబ్ల్యు గ్రూప్ రూ. 35వేల కోట్లతో ఉక్కు ప్లాంటును నెలకొల్పుతానని అప్పట్లో హామీ ఇచ్చింది. ఎనిమిదేళ్ల తరువాత శనివారం సింగూరును సందర్శించిన భట్టాచార్య సింగూరు నుంచి సల్బోని వరకు సిపిఎం నేతృత్వంలో వారం రోజుల పాటు సాగే ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగూరులో నానో కార్ల పరిశ్రమ స్థాపితమై ఉంటే ఈ ప్రాంత రూపురేఖలే మారిపోయి ఉండేవని అన్నారు. టిఎంసి పాలనలో రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా కొత్తగా ప్రారంభం కాలేదని, ఉన్న పరిశ్రమలు కూడా మూతపడుతున్నాయని ఆయన విమర్శించారు.
‘ఈ పరిస్థితిని మేమే మారుస్తాం. మేమే మార్చగలం. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టం చేయాలని కోరుతున్నాం. టిఎంసిని గద్దె దించడానికి మాతో చేతులు కలపాల్సిందిగా కాంగ్రెస్‌ను, ఇతర వామపక్షాలను కోరుతున్నాం’ అని బుద్ధదేవ్ భట్టాచార్య అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సూర్యకాంత్ మిశ్రా, పొలిట్ బ్యూరో సభ్యుడు ఎండి.సలీం ఇటీవల ఇలాంటి ప్రకటనలే చేసిన నేపథ్యంలో శనివారం నాటి బుద్దదేవ్ ప్రకటనకు ప్రాధాన్యత చేకూరింది. ఈ ఏడాది చివరలో జరుగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పారిశ్రామికీకరణ ప్రధాన ప్రచారాంశం కాబోతోందని ఈ పరిణామాలు వెల్లడిస్తున్నాయి.

రాష్ట్ర అభివృద్ధికి వ్యవసాయం, పరిశ్రమలు రెండూ కావాలని భట్టాచార్య అన్నారు. వేలాది మంది చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలంటే పారిశ్రామికాభివృద్ధి తప్పనిసరి ఆయన పేర్కొన్నారు.

విమాన ప్రమాదం కారణంగానే నేతాజీ మృతి

ప్రత్యక్ష సాక్షుల తాజా కథనాలను బయటపెట్టిన బ్రిటన్ వెబ్‌సైట్

లండన్, జనవరి 16: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతికి సంబంధించి ఇన్నాళ్లుగా కొనసాగుతున్న మిస్టరీ దాదాపుగా వీడిపోయింది. నేతాజీ తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో కన్ను మూసినట్లు ఆ సమయంలో ఆయన వద్దే ఉన్న ప్రత్యక్ష సాక్షులు ధ్రువీకరించినట్లు బ్రిటన్‌కు చెందిన ఓ వెబ్‌సైట్ తెలియజేసింది. ఆస్పత్రిలోని ఓ నర్సు కూడా నేతాజీ మృతిని ధ్రువీకరించింది. 1945 ఆగస్టు 18న తైవాన్‌లోని ఓ ఎయిర్‌ఫీల్డ్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మృతి చెందినట్లు అయిదుగురు ప్రత్యక్ష సాక్షులు తెలియజేసారని, వీరిలో నేతాజీ సన్నిహితుడు, జపాన్‌కు చెందిన ఇద్దరు డాక్టర్లు, ఓ ఇంగ్లీషు అనువాదకుడు, తైవాన్‌కు చెందిన ఓ నర్సు ఉన్నారని ‘తీతీతీ.ఇ్యఒళచిజళ.జశచ్యి’ అనే వెబ్‌సైట్ తెలిపింది. ‘1945 ఆగస్టు 18వ తేదీ రాత్రి నేతాజీ మరణానికి సంబంధించి ఈ అయిదుగురు ప్రత్యక్ష సాక్షుల మధ్య రెండో అభిప్రాయమే లేదు’ అని ఆ వెబ్‌సైట్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘చనిపోవడానికి ముందు నేతాజీ తనను పిలిచి తన చావు దగ్గర పడిందని తనవైపునుంచి ఓ సందేశాన్ని దేశ ప్రజలకు తెలియజేయాలని కోరాడని విమాన ప్రమాదం జరిగిన రోజు నేతాజీతోపాటుగా ఉండిన ఆయన సన్నిహితుడు కల్నల్ హబీబుర్ రెహమాన్ ఖాన్ ప్రమాదం జరిగిన ఆరు రోజుల తర్వాత ఒక లిఖితపూర్వక ప్రకటనలో తెలియజేసాడు. తనకొక ఇంగ్లీషు అనువాదకుడు కావాలని నేతాజీ అడిగినట్లు ఆయన చెప్పాడు. దేశ స్వాతంత్య్రం కోసం తాను చివరి దాకా పోరాడానని, ఆజాద్ హింద్ పోరాటాన్ని కొనసాగించాలని ఆయన కోరినట్లు ఖాన్ ఆ ప్రకటనలో తెలియజేసారు.
1945 సెప్టెంబర్‌లో నేతాజీ మృతిపై దర్యాప్తు జరపడం కోసం పోలీసు అధికారులు ఫిన్నీ, డేవిస్ నేతృత్వంలో హెచ్‌కె రాయ్, కెపి డేలు సహాయకులుగా రెండు ఇంటెలిజన్స్ బృందాలు భారత్‌నుంచి బ్యాంకాక్, సైగాన్, తైపేలకు వెళ్లాయి. విమాన ప్రమాదం కారణంగా నేతాజీ మృతి చెందినట్లు ఆ బృందాలు నిర్ధారణకు వచ్చాయి. ఈ మేరకు జపాన్ దక్షిణ ప్రాంత సైనిక దళాల ప్రధానాధికారి జపాన్ ప్రభుత్వానికి, స్వతంత్ర భారత్ కోసం నేతాజీ ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వానికి మధ్య సంధానకర్తగా వ్యవహరించిన ‘హితకారి కికాన్’కు పంపిన ఓ టెలిగ్రామ్ కాపీని కూడా ఆ బృందాలు సంపాదించాయి. టోక్యోకు వస్తుండగా 1945 ఆగస్టు 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ‘తాయ్‌హోకు’ (తైవాన్‌కు జపాన్ పేరు) వద్ద జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ తీవ్రంగా గాయపడ్డారని, అదే రోజు అర్ధరాత్రి మృతి చెందారని ఆగస్టు 20 తేదీనాటి ఆ కేబుల్ పేర్కొంది. కాగా, 1946 మే, జూన్ నెలల మధ్య కాలంలో బ్రిటీష్ ఆర్మీకి చెందిన లెఫ్టెనెంట్ కల్నల్ జెజి ఫిగ్గీస్ ఈ ప్రమాదానికి సంబంధించి టోక్యోలో ఆరుగురు జపాన్ అధికారులను ప్రశ్నించారు. వారిలో నేతాజీని చికిత్సకోసం చేర్పించిన నాన్‌మోన్ మిలిటరీ ఆస్పత్రిలో పని చేస్తున్న జపాన్ డాక్టర్ టోయోషి ట్సురుటా కూడా ఉన్నారు. ‘రాత్రంతా నా దగ్గరే మీరు కూర్చుని ఉండగలరా’ అని నేతాజీ తనను అడిగారని, అయితే రాత్రి 7 గంటల తర్వాత ఆయన కోమాలోకి జారుకున్నారని, ఆ తర్వాత కొద్దిసేపటికే చనిపోయారని డాక్టర్ టౌరుటా ఫిగ్గీస్‌కు చెప్పారు. అదే ఆస్పత్రిలో పని చేస్తున్న సాన్ పి షా అనే నర్సు కూడా నేతాజీ తమ ఆస్పత్రిలోనే చనిపోయినట్లు చెప్పారు.
కాగా, తనతో మాట్లాడుతున్న వ్యక్తి నేతాజీ అనే విషయంలో ఎలాంటి అనుమానం లేదని నకమురా అనే అనువాదకుడు కూడా చెప్పాడని, ఆస్పత్రిలో చేర్పించిన నాలుగు గంటల తర్వాత నేతాజీ కోమాలోకి జారుకోవడం ప్రారంభమైందని, రాత్రి 11 గంటల సమయంలో ఆయన చివరి శ్వాస విడిచారని ఆస్పత్రి ఇన్‌చార్జి మెడికల్ ఆఫీసర్ కెప్టెన్ తనెయోషి యోషిమి కూడా చెప్పారు. నేతాజీ మృతిపై దర్యాప్తుకోసం 1956లో ఏర్పాటు చేసిన మేజర్ జనరల్ షా నవాజ్ నేతృత్వంలో కమిటీ ముందు, ఆ తర్వాత జస్టిస్ జిడి ఖోస్లా కమిషన్ ముందు కూడా ఆయన హాజరయి వాంగ్మూలం ఇచ్చారు. 1995లో బోస్ ఫైల్స్.ఇన్ఫో రూపకర్త ఆశిష్ రాయ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన ఇదే విషయాన్ని చెప్పారు.

రాజస్థాన్‌లో
ఆయుధ ఉత్పత్తి కేంద్రం

రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వెల్లడి

జైపూర్, జనవరి 16: రక్షణ శాఖ ఆయుధ ఉత్పత్తి కేంద్రం రాజస్థాన్‌లో నెలకొల్పనున్నట్టు కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వెల్లడించారు. ఢిల్లీ, జైపూర్ మధ్యలో ఏర్పాటు చేసే యోచన ఉన్నట్టు శనివారం ఇక్కడ స్పష్టం చేశారు. ‘రక్షణ శాఖ పరికరాలు ఉత్పత్తికి సంబంధించి యూనిట్ రాజస్థాన్‌లో ఒక్కటీ లేదు. అలాంటిదాన్ని ఒక్కటైనా ఏర్పాటు చేసి రాజస్థాన్‌కు చోటుకల్పించాలని నిర్ణయించాం. యుద్ధవిమానాలు లేదా సైనిక హెలికాప్టర్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది’ అని జైపూర్‌లో మీడియాకు తెలిపారు. పాకిస్తాన్‌కు సరిహద్దునే రాజస్థాన్ ఉన్నందున ఇక్కడ రక్షణ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడం, దీన్లో రాజస్థాన్‌కు భాగస్వామ్యం కల్పించినట్టు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం దీన్ని ఖరారు చేసిందని పారికర్ చెప్పారు. అయితే ఢిల్లీ-జైపూర్ మధ్య యూనిట్ నెలకొల్పుతామన్న రక్షణ మంత్రి స్థల ఎంపిక మాత్రం జరగలేదని స్పష్టం చేశారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి నేపథ్యంలో నిపుణుల సూచనలు, సలహాలను పరిశీలించి మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నారు. చెక్‌పాయింట్లు మూసివేయడం లేదా కొత్తగా ఏ నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపై దృష్టి సారించినట్టు పారికర్ తెలిపారు. ఒన్ ర్యాంక్ ఒన్ పెన్షన్ పథకంపై మంత్రి మాట్లాడుతూ ‘ప్రస్తుతం ట్యాబులేషన్ (పట్టిక విధానం) కొనసాగుతోంది. ఈ నెలాఖరులోగా అది పూర్తవుతుంది’ అని మంత్రి వెల్లడించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించిన రక్షణ మంత్రి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. ముందురోజు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని పారికర్ ప్రారంభించారు.
గూఢచర్యంపై ప్రత్యేక నిఘా
రక్షణ శాఖ సిబ్బంది గూఢచర్యంపై మంత్రి మనోహర్ పారికర్ స్పందించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఐఏఎఫ్ ఉద్యోగి కెకె రంజిత్ దేశ రహస్యాలు చేరవేస్తున్నాడన్న అభియోగంపై ఇటీవల ఉద్యోగం నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. రక్షణశాఖలో ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడూ చోటుచేసుకుంటన్నాయి. తాజా ఉదంతంపై రక్షణ మంత్రి మాట్లాడుతూ ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ‘గూఢచర్యానికి పాల్పడుతున్నది పైస్థాయి అధికారులు కాదు. అక్కడక్కడ బయటపడుతున్న ఘటనలు కింది స్థాయిలోనే జరుగుతున్నాయి’ అని పారికర్ స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. రిక్రూట్‌మెంట్, శిక్షణ దగ్గర నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు పారికర్ చెప్పారు.

ఆదివారం జైపూర్ వచ్చిన రక్షణ మంత్రి పారికర్‌కు స్వాగతం పలుకుతున్న స్థానిక బిజెపి నేతలు. చిత్రంలో సమాచార, ప్రసార శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్