జాతీయ వార్తలు

వినియోగదారుల రక్షణ బిల్లు మరింత ఆలస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 29: వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి తప్పు చేసిన కంపెనీల ఉత్పత్తులను వాపసు తీసుకోవడం, వాటి లైసెన్సులు రద్దు చేయడం వాటిపై కేసులు పెట్టడం లాంటి అధికారాలు కలిగిన ఒక రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన బిల్లు మరింత ఆలస్యం కానుంది. ఈ బిల్లును పరిశీలిస్తున్న పార్లమెంటరీ కమిటీ గడువును వచ్చే ఏడాది పార్లమెంటు సమావేశాల దాకా పొడిగించడమే దీనికి కారణం. ‘వినియోగదారుల పరిరక్షణ బిల్లు 2015పై తన నివేదికను సమర్పించడానికి ఆహారం, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ గడువును 2016 పార్లమెంటు బడ్జెట్ సమావేశాల మొదటివారం దాకా పొడిగించడమైంది’ అని గురువారం విడుదల చేసిన రాజ్యసభ బులెటిన్ పేర్కొంది.
ఇప్పుడున్న చట్టం ప్రకారం బాధిత వినియోగదారులు తమకు న్యాయం చేయాలని కోరుతూ అధికారులను విడిగా ఆశ్రయించాల్సి ఉంటుంది. అయితే కొత్త చట్టంతో తప్పు చేసిన కంపెనీలపై తక్షణం చర్య తీసుకోవడానికి వీలవుతుంది. ఈ బిల్లును గత ఆగస్టు 25న పార్లమెంటరీ కమిటీకి నివేదించడం జరిగింది. మ్యాగీ ఇన్‌స్టాంట్ నూడుల్స్ వివాదం నేపథ్యంలో వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకోసం ఈ కొత్త చట్టాన్ని తీసుకురావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మ్యాగీ నూడుల్స్‌లో అనుమతించిన స్థాయికి మించి సీసం ఉన్నట్లు కొన్ని లేబరేటరీల పరీక్షలు పేర్కొనడం తెలిసిందే.
పార్లమెంటరీ కమిటీ తన నివేదికను పార్లమెంటుకు సమర్పించిన తర్వాత వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కమిటీ చేసిన సిపార్సులతో తిరిగి కేంద్ర మంత్రివర్గం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కమిటీ సిఫార్సుల ఆధారంగా బిల్లులో ఏవైనా సవరణలు చేర్చి బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభల్లో బిల్లుకు ఆమోదం పొందేలా చూడడం ప్రభుత్వానికి తలకు మించిన భారమే అవుతుంది. ఎందుకంటే సాధారణంగా బడ్జెట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు చాలా ఉంటాయి. ‘వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి బిల్లును మరింత బలోపేతం చేయాలని అనుకుంటున్నాం. అందుకే గడువును పొడిగించాలని కోరాలని కమిటీ నిర్ణయించింది. పూర్తి వివరాలు సంపాదించాలంటే బోలెడంత మందిని కలవాల్సి ఉంటుంది. అలాగే చాలా మంది నిపుణులతో చర్చించాలి. ఇది చాలా ముఖ్యమైన బిల్లు. బిల్లులోని అంశాలను మరింతగా మెరుగుపరిచే విధంగా సిపార్సులు ఉండేలా చూడడానికి మేము ఇంకా ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది’ అని పార్లమెంటరీ కమిటీ చైర్మన్ జెసి దివాకర్ రెడ్డి చెప్పారు.