జాతీయ వార్తలు

విశ్వాసాన్ని పాదుకొల్పితేనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, ఫిబ్రవరి 2: జమ్మూ-కాశ్మీరులో రాజకీయ అనిశ్చితి మరికొంత కాలం పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై తమ వైఖరిని వివరించేందుకు గవర్నర్ ఎన్‌ఎన్.వోరాతో మంగళవారం విడివిడిగా సమావేశమైన పిడిపి, బిజెపి నేతలు ఈ విషయంలో పరస్పరం వేలెత్తి చూపుకుంటుండటమే ఇందుకు కారణం. రాష్ట్రంలో నెల రోజులనుంచి కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెర దించేందుకు ప్రయత్నిస్తున్న గవర్నర్ వోరా మంగళవారం పిడిపి చీఫ్ మెహబూబా ముఫ్తీతో పాటు ఆ పార్టీ సీనియర్ నాయకుడు ముజఫర్ బేగ్‌తో సంప్రదింపులు జరిపారు. అనంతరం ఆయన ప్రభుత్వ ఏర్పాటుపై బిజెపి వైఖరి తెలుసుకునేందుకు మాజీ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ సహా ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులతో భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశంలో వోరాకు తాను ఏమి చెప్పిందీ మెహబూబా వెల్లడించలేదు. కాగా, పిడిపి తమ శాసనసభాపక్ష నేతను ఎన్నుకుని, ఆ విషయాన్ని గవర్నర్‌కు తెలియజేసిన తర్వాతే తాము ఏ నిర్ణయమైనా తీసుకుంటామని నిర్మల్ సింగ్ చెప్పారు. గవర్నర్‌తో భేటీ ముగిసిన అనంతరం మెహబూబా ముఫ్తీ విలేఖర్లతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై మిత్రపక్షమైన బిజెపికి కొన్ని షరతులు విధించారు. జమ్మూ-కాశ్మీరులో అభివృద్ధితోపాటు శాంతి స్థాపనకు కేంద్ర ప్రభుత్వం విశ్వాసాన్ని పాదుకొల్పే చర్యలు చేపట్టాలన్నది ఈ షరతుల్లో ప్రధానమైనది. బిజెపితో తమకు ఎటువంటి విభేదాలు లేవని మెహబూబా స్పష్టం చేశారు. అయితే దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే జమ్మూ-కాశ్మీరు ఎంతో భిన్నమైనదని, కనుక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ‘మంచి వాతావరణం’, కేంద్రం నుంచి ఊతం ఎంతో అవసరమని ఆమె అన్నారు. పిడిపితో పొత్తును కొనసాగించాలని బిజెపి కోరుకుంటోందని నిర్మల్ సింగ్ స్పష్టం చేశారు. అయితే పిడిపి ఇప్పటివరకూ తమ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోకపోవడంతో రాజ్యాంగ సమస్య తలెత్తుతోందని ఆయన అన్నారు. పిడిపి శాసనసభాపక్ష నేతను ఎన్నుకుని ఆ విషయాన్ని గవర్నర్‌కు తెలియజే వరకు ప్రభుత్వ ఏర్పాటుపై బిజెపి నిర్ణయం తీసుకోలేదని నిర్మల్ సింగ్ తేల్చిచెప్పారు.
పిడిపి మొండి వైఖరే కారణం
రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితికి పిడిపి మొండి వైఖరే కారణమని జమ్మూ-కాశ్మీరు బిజెపి ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) అశోక్ కౌల్ నిందించారు. గతంలో పిడిపి-బిజెపి సంకీర్ణ ప్రభుత్వం నిర్ధేశించుకున్న కనీస ఉమ్మడి కార్యక్రమానికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన మంగళవారం పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. ‘సంకీర్ణ అజెండాకు మేము కట్టుబడి ఉన్నాం. కానీ పిడిపి మాత్రం మొండి వైఖరి అవలంబిస్తోంది’ అని ఆయన అన్నారు. ‘మా వైపు నుంచి ఎటువంటి అనిశ్చితి లేదు. అంతా సానుకూలంగానే ఉంది. పిడిపి వైపు నుంచి కూడా ఇదేవిధమైన పరిస్థితి ఉండాలని బిజెపి ఆశిస్తోంది’ అని చెప్పారు. పిడిపి, బిజెపి నాయకులు మంగళవారం రాష్ట్ర గవర్నర్ ఎన్‌ఎన్.వోరాతో భేటీ కావడానికి కొద్ది గంటల ముందు అశోక్ కౌల్ ఈ వ్యాఖ్యలు చేశారు.