జాతీయ వార్తలు

పాక్‌కు ఎందుకు వెళ్లినట్టు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రజాభిప్రాయానికి విలువివ్వకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఇష్టానుసారం పాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దుమ్మెత్తిపోశారు. దేశంపైకి పాక్ ఉగ్రవాదులను పంపుతుంటే, చెప్పాపెట్టకుండా నరేంద్ర మోదీ లాహోర్ వెళ్లి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో తేనీటి విందు చేసుకోవడాన్ని తప్పుపట్టారు. రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం లోక్‌సభలో రాహుల్ మాట్లాడుతూ జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు కాంగ్రెస్ చేసిన కృషిని ప్రధాని మోదీ సర్వనాశనం చేశారన్నారు. అకస్మాత్తుగా లాహోర్ వెళ్లి నవాజ్ షరీఫ్‌తో తేనీటి సేవనం చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నిస్తూ, ఈ చర్యతో దేశాన్ని మోదీ అవమానించారన్నారు. నాగాలాండ్ ఉగ్రవాదులతో ఒప్పందం చేసుకోవటంలోనూ ఇలాగే చేశారన్నారు. వ్యూహాత్మకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం పంజరంలో బంధిస్తే, మోదీ ఒక్కదెబ్బతో దానికి విముక్తి కలిగించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ ఉగ్రవాదులను ముంబయిపైకి ఎగదోసి 200మందిని పొట్టనపెట్టుకుంటే, మోదీ లాహోర్ వెళ్లి నవాజ్‌తో టీ తాగి రావడాన్ని ఏమని ప్రశ్నించాలన్నారు. భారత్‌తో సమాన హోదాను పాక్‌కు మోదీ బహుమతిగా ఇచ్చారని ఆగ్రహించారు. ‘మన ప్రభుత్వంలో నిపుణులు, మంత్రులు, దౌత్యవేత్తలతో మాట్లాడకుండానే పాక్‌లో ఆగి నవాజ్‌తో టీ తాగటం ద్వారా మోదీ మన జాతీయపతాకాన్ని అవమానించారు. ముంబయి, పఠాన్‌కోట్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారిని అవమానించారు. దౌత్యవేత్తలను అవమానించారు. భారతదేశం ప్రజల సామర్థ్యాన్ని అవమానించారు’ అని రాహుల్ ఆగ్రహంతో ఊగిపోయారు. ‘తమ గురించి గొప్పగా భావించేవారు చరిత్రలో చాలా మంది ఉన్నారు. యుగొస్లావియా అధ్యక్షుడు మిలచవిచ్ రోజూ ఉదయం జాతీయ పతాకానికి శాల్యూట్ చేయటం ద్వారా జాతీయ భావాన్ని చాటుకునేవారు. దేశభక్తి గురించి రోజంతా మాట్లాడేవాడు. అయితే సర్బ్‌లు, క్రోయాట్ల మధ్య సంబంధాలను తుంచి దేశాన్ని సర్వనాశనం చేశారు. మన పక్కనున్న యాహ్యాఖాన్ పాకిస్తాన్ జాతీయ పతాకాన్ని రక్షించేందుకు వచ్చాడు. సైనికుడిగా ప్రతిరోజూ తమ జాతీయ పతాకానికి శాల్యూట్ చేస్తూ దేశాన్ని రక్షిస్తున్నానని భావించాడు. దేశ భక్తుడినని అనుకునేవాడు. దేశ ప్రజల అభిప్రాయాలను వినేవాడు కాదు. పంజాబీలు, బెంగాలీల మధ్య సంబంధాలను తెంచివేసి దేశాన్ని రెండు ముక్కలు చేశారని చెబుతూ పరోక్షంగా నరేంద్ర మోదీ కూడా ఇదేవిధంగా వ్యవహరిస్తున్నారని రాహుల్ తీవ్రంగా ఆరోపించారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ ముందు ఇంకా రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, ఆయన దేశ ప్రజల అభిప్రాయాలు, మనోభావాలను తెలుసుకోవాలి. దేశం సున్నితంగా ఆయనకు ఒక సందేశాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రధాన మంత్రి ఈ సందేశాన్ని వింటే చాలని రాహుల్‌గాంధీ సూచించారు. మీ చుట్టుపక్కల ఉన్నవారు చెప్పేదీ వినండి. రాజ్‌నాథ్‌సింగ్ చెప్పేదీ వినండి. అద్వానీ, సుష్మాస్వరాజ్ చెప్పేదీ వినండి. మీ ఎంపీలు చెప్పేది కూడా వినండి. ప్రతిపక్షం చెప్పేదీ వినండి. మేమేమీ మీ శత్రువులం కాదు’ అని రాహుల్ గాంధీ తీవ్ర ఆవేదనతో విజ్ఞప్తి చేశారు. మేము మిమ్మల్ని ద్వేషించటం లేదు. దేశ ప్రజల వాణిని వినండని ఆయన నరేంద్ర మోదీకి హితవు పలికారు. రైతులు, కార్మికులు చెప్పేది వినండి. ముఖ్యంగా యువతరం చెప్పేది వినండని రాహుల్ గాంధీ ప్రధానికి సూచించారు. యువతే ఈ దేశ భవిష్యత్. వారు చెప్పే దాన్ని గౌరవించాలని మోదీకి రాహుల్ విజ్ఞప్తి చేశారు.
నల్లధనాన్ని వెల్లడించేందుకు ప్రభుత్వం బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనను రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. నల్లధనాన్ని తెల్ల ధనంగా మార్చేందుకు మోదీ ‘ఫెయిర్ అండ్ లలీ’ పథకాన్ని ప్రకటించారని ఎద్దేవా చేశారు. యువతకు ఉపాధి కల్పిస్తామంటూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఏమైందని తీవ్రంగా ప్రశ్నించారు. గుజరాత్ సిఎంగా ఉన్నప్పుడు జాతీయ ఉపాథి కల్పన హామీ పథకాన్ని విమర్శించిన నరేంద్ర మోదీ, ప్రధాని పదవి చేపట్టిన తరువాత అదే పథకానికి నిధులు కేటాయించటం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. జాతీయ ఉపాథి కల్పనా హామీ పథకానికి నిధుల కేటాయింపు వింటుంటే చిదంబరం బడ్జెట్ ప్రతిపాదించినట్టే ఉందని రాహుల్ వ్యాఖ్యానించారు. ఉపాధి పథకం ఎంతో మంచిదని అరుణ్ జైట్లీ తనను కలిసినప్పుడు చెప్పారంటూ, ఈ విషయాన్ని మోదీకి చెప్పాలని తాను ఆయనకు సూచించానని రాహుల్ వెల్లడించారు. జెఎన్‌యు విద్యార్థి సంఘ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ ప్రసంగంలో ఎక్కడా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. ఉపాధ్యాయులను కొట్టాలని ఏ మత గ్రంథం చెబుతోందని మోదీని రాహుల్ ప్రశ్నించారు. మీరు విశ్వసించేదే నిజమనే ఆరెస్సెస్ విధానం మంచిదికాదని హితవు పలికారు. అందరి అభిప్రాయాలను గౌరవించాలని ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ సూచించారు.