జాతీయ వార్తలు

కన్హయ్యను కాల్చిచంపితే రూ.11 లక్షల రివార్డు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశద్రోహ అభియోగాలను ఎదుర్కొంటున్న జెఎన్‌యు విద్యార్థి సంఘ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ను కాల్చి చంపిన వారికి 11 లక్షల రూపాయల రివార్డు అందజేస్తామని ప్రకటిస్తూ సెంట్రల్ ఢిల్లీలో పోస్టర్లు వెలిశాయి. ఈ కేసులో కన్నయ్య కుమార్ బెయిలుపై జైలునుంచి విడుదలై రెండు రోజులు కూడా గడవకముందే ఈ పోస్టర్లు వెలవడం సంచలనం సృష్టిస్తోంది. పూర్వాంచల్ సేన, దాని అధ్యక్షుడు ఆదర్శ్ శర్మ పేరుతో ఉన్న ఈ చిన్న చిన్న పోస్టర్లు న్యూఢిల్లీ జిల్లాలోని వివిధ బస్టాపులు, మెట్రో స్టేషన్లలో దర్శనమిస్తున్నాయి. బిహార్‌లో కన్హయ్య కుమార్ స్వగ్రామమైన బెగుసరాయ్‌కి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే తాను నివసిస్తున్నానని, కన్నయ్యను కాల్చిచంపిన వారికి 11 లక్షల రూపాయల రివార్డు అందజేస్తామని పేర్కొంటూ దాదాపు 1,500 పోస్టర్లను స్వయంగా తానే అంటించానని ఆదర్శ్ శర్మ తెలిపాడు. ‘జెఎన్‌యుఎస్‌యు అధ్యక్షుడు, దేశద్రోహి కన్హయ్య కుమార్‌ను కాల్చిచంపిన వారికి పూర్వాంచల్ సేన రూ.11 లక్షల రివార్డు అందజేస్తుంది’ అని ఈ పోస్టర్‌పై హిందీ భాషలో రాసి ఉంది. దీనిపై పూర్వాంచల్ బిడ్డ, పూర్వాంచల్ సేన అధ్యక్షుడు అంటూ ఆదర్శ్ శర్మ సంతకం, ఆయన మొబైల్ ఫోన్ నెంబరు ఉన్నాయి.

యువమోర్చా నేత
వర్షిణిపై బిజెపి వేటు
కన్హయ్య నాలుక కోసేయమన్నందుకు ఫలితం
బదౌన్ (ఉత్తరప్రదేశ్), మార్చి 5: దేశద్రోహ కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) విద్యార్థి సంఘ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ నాలుకను కోసేసిన వారికి 5 లక్షల రూపాయల రివార్డు అందజేస్తామని ప్రకటించిన బిజెపి యువమోర్చా నాయకుడు కుల్దీప్ వర్షిణిపై భారతీయ జనతా పార్టీ కొరడా ఝళిపించి పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించింది. బిజెపి బదౌన్ జిల్లా శాఖ అధ్యక్షుడు హరీష్ షక్యా శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. జిల్లా యువమోర్చా అధ్యక్షుడు కుల్దీప్ వర్షిణీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో బిజెపికి ఎటువంటి సంబంధం లేదని హరీష్ షక్యా స్పష్టం చేశారు. ‘వర్షిణీ చేసిన ప్రకటన ఆయన వ్యక్తిగతమైనది. ఆ ప్రకటనతో బిజెపికి ఎటువంటి సంబంధం లేదు. పార్టీ ఆఫీస్ బేరర్ల అనుమతి లేకుండా ఈ వివాదాస్పద ప్రకటన చేసినందుకు వర్షిణీని బిజెపి ప్రాథమిక సభ్యతం నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించాం’ అని హరీష్ షక్యా విలేఖర్లకు వివరించారు. జిల్లా యువమోర్చా అధ్యక్ష పదవి నుంచి వర్షిణీని తొలగించేందుకు ఆరు నెలల క్రితమే ఆయనకు నోటీసు జారీ చేయడంతో పాటు ఆయన స్థానంలో అంకిత్ వౌర్యను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించామని హరీష్ షక్యా తెలిపారు.

కన్హయ్య కదలికలపై
ఢిల్లీ పోలీసుల నజర్
ఎప్పటికప్పుడు తెలియజేయాలి
జెఎన్‌యు అధికారులకు ఆదేశం
న్యూఢిల్లీ, మార్చి 5: దేశద్రోహ కేసులో బెయిలుపై జైలు నుంచి విడుదలైన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌కు పటిష్టమైన భద్రత కల్పించేందుకు ఢిల్లీ పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ చర్యల్లో భాగంగా క్యాంపస్ వెలుపల కన్నయ్య కుమార్ కదలికలను, పర్యటనల స్వభావాన్ని జెఎన్‌యు అధికారులు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఢిల్లీ పోలీసులు ఆదేశించారు. జెఎన్‌యు అధికారులకు రాసిన లేఖలో ఢిల్లీ దక్షిణ మండల డిసిపి ప్రేమ్‌నాథ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ క్యాంపస్ వసంత్ కుంజ్ (ఉత్తర) పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్నందున కన్నయ్య కుమార్ కదలికలు, క్యాంపస్ వెలుపల అతను జరిపే పర్యటనలతో పాటు ఆ పర్యటనల స్వభావాన్ని జెఎన్‌యు అధికారులు ఎప్పటికప్పుడు ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ)కు తెలియజేయాలని, తద్వారా తాము కన్నయ్యకు తగిన భద్రత కల్పించి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిరోధించేందుకు వీలవుతుందని ప్రేమ్‌నాథ్ ఆ లేఖలో పేర్కొన్నారు. కన్నయ్య కుమార్‌పై గత నెల 17వ తేదీన పటియాలా హౌస్ కోర్టు కాంప్లెక్స్ వద్ద దాడి జరిగిన అనంతరం న్యాయస్థానం జారీచేసిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

నన్నూ వేధిస్తున్నారు
అలహాబాద్ వర్శిటీ విద్యార్థి సంఘం
అధ్యక్షురాలు రిచాసింగ్
అహ్మదాబాద్, మార్చి 5: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, ఐఐఎంసి, జెఎన్‌యుల తరువాత ఇప్పుడు అలహాబాద్ విశ్వవిద్యాలయం వివాదంలో చిక్కుకుంది. అలహాబాద్ యూనివర్శిటీ విద్యార్థి సంఘానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయిన రిచాసింగ్ తనను వర్శిటీ పాలనా యంత్రాంగం వేధిస్తోందని ఆరోపించారు. రీసెర్చ్ స్కాలర్ అయిన రిచాసింగ్ వర్శిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎబివిపి అభ్యర్థిపై ఘనవిజయం సాధించారు. మిగతా నాలుగు పదవులను మాత్రం ఎబివిపి కైవసం చేసుకుంది. అయితే వర్శిటీ క్యాంపస్‌లో కరడుగట్టిన హిందూత్వవాది, బిజెపి ఎంపి యోగి ఆదిత్యనాథ్ కార్యక్రమంసహా ఎబివిపి తీసుకున్న పలు నిర్ణయాలను తాను వ్యతిరేకించానని, అప్పటినుంచి వర్శిటీ పాలనా యంత్రాంగం, ఇతరులు తనను వేధిస్తున్నారని రిచాసింగ్ పేర్కొన్నారు. విశ్వవిద్యాలయంలో తన ప్రవేశాన్ని రద్దు చేసి, బయటకు పంపించడానికి వర్శిటీ ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. వర్శిటీలో రిజర్వుడ్ సీట్‌లో రిచాసింగ్ ప్రవేశం పొందినట్లు వచ్చిన ఆరోపణలపై అధికారులు విచారణకు ఆదేశించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇదిలాఉండగా, వర్శిటీ పాలనా యంత్రాంగం ఈ అంశంపై తాజాగా విచారణకు ఆదేశించింది. ఈ విచారణ నివేదిక రావలసి ఉంది. అయితే ఈ అంశంపై వర్శిటీ వైస్ చాన్సలర్ అభిప్రాయం తెలుసుకోవడానికి ఫోన్ చేయగా, ఆయన ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు.