జాతీయ వార్తలు

ఢిల్లీలో మళ్లీ సరిబేసి నియమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశ రాజధానిలో కేజ్రీవాల్ ప్రభుత్వం మరోసారి సరి-బేసి విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. రెండోదశ సరి బేసి నియమం శుక్రవారం నుండి ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనుంది. రాజధాని రోడ్లపై వాహనాల రద్దీని తగ్గించాలని, కాలుష్యాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో గతంలో ఈ సరిబేసి విధానాన్ని ఢిల్లీ ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. ఈ నియమంపై ప్రజల్లో పెద్ద చర్చ జరగడంతో పాటు ప్రజల నుండి మద్దతు లభించడంతో మళ్లీ రెండవ విడత శుక్రవారం నుండి ఈ నెల 30 వరకు పదిహేను రోజుల పాటు అమలులోకి తీసుకొచ్చింది. ఈ విధానానికి ప్రజలందరు సహకరించాలని రాజధాని ప్రజలను విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈసారి విజయవంతమైతే ఇక నుండి ప్రతి నెలా 15 రోజుల పాటు ఇదే విధానాన్ని అమలు చెయ్యడంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. విఐపిలు, మహిళా డ్రైవర్లు, మోటారు సైకిళ్లు, అత్యవసర వాహనాలు, సిఎన్‌జి వాహనాలు మినహా అన్నింటికి ఈ నియమం వర్తిస్తుంది. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఢిల్లీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అదనపు బస్సులు నడపడంతో పాటు, ఢిల్లీ మెట్రోరైల్ సంస్థ బోగీలు పెంచి రైలు సర్వీసులను నడుపుతోంది. మెట్రో భద్రత సిబ్బంది సంఖ్యతో పాటు టికెటింగ్ కౌంటర్లు కూడా పెంచారు. మరికొన్ని ప్రైవేటు బస్సులు కూడా ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు సంస్థకు సహకారం అందిస్తున్నాయి. ఈ విధానాన్ని అమలుచేయడం కోసం 5,334 మంది సివిల్ ఢిపెన్సు వలంటీర్లు, 200 మంది ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, ఢిల్లీ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. అదనంగా ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సిసి విద్యార్థులు సహకరిస్తున్నారు. సరి సంఖ్య తేదీలలో సరి సంఖ్య కలిగిన వాహనాలు (నెంబరు ప్లేట్‌లో చివరి అంకె సరి అంకె కలిగిన వాహనాలు), బేసి సంఖ్య తేదీలలో బేసి సంఖ్య కలిగిన వాహనాలు (నెంబరు ప్లేట్‌లో చివరి అంకె బేసి అంకె కలిగిన వాహనాలు) మాత్రమే రోడ్లపై తిరగాల్సి ఉంటుం ది. పార్కింగ్‌కు కూడా సరి బేసి విధానం ప్రకారం అవకాశం కల్పిస్తున్నారు.
బిజెపికి ఓటేసిందని
భార్యకు విడాకులిచ్చేశాడు!
గౌహతి, ఏప్రిల్ 15: వ్యక్తిగత లేదా కుటుంబపరమైన సమస్యలతో భార్యాభర్తలు విడాకులు తీసుకున్న సంఘటనలు విన్నాం గానీ.. రాజకీయ నేపథ్యంలో విడిపోయిన సంఘటన అసోంలో జరిగింది. రాజకీయ కారణం ఓ పచ్చని కుటుంబంలో చిచ్చురేపింది. దీనికి సంబంధించి ఓ వార్తా సంస్థలో వచ్చిన కథనం ప్రకారం- సోనీపూర్ జిల్లా దోనమ్ అడ్డహతి గ్రామంలో అనుద్దీన్, దిల్‌వారా బేగం నివసిస్తున్నారు. వారిద్దరికీ పెళ్లయి పదేళ్లయింది. ఇన్నాళ్లూ వారి కాపురం సజావుగానే సాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామస్తులంతా కాంగ్రెస్‌కే ఓటేయాలని పెద్దలు నిర్ణయించారు. అయితే దిల్‌వారా బేగం బిజెపికి ఓటేసింది. విషయం తెలుసుకున్న భర్త తమ మాట ధిక్కరించిందన్న ఆగ్రహంతో దిల్‌వారా బేగంకు విడాకులు ఇచ్చేశాడు. పెద్దల ఆదేశాలు బేఖాతరు చేసిందంటూ అతడీ దారుణానికి ఒడిగట్టాడు.

సిమ్లా పేరును ‘శ్యామ్‌లా’గా మార్చండి
విహెచ్‌పి నేత మనోజ్ కుమార్ డిమాండ్
సిమ్లా, ఏప్రిల్ 15: ఇటీవల హర్యానా ప్రభుత్వం గుర్‌గావ్, మెవత్ పేర్లను మార్చిన నేపథ్యంలో దేశంలోని మరికొన్ని నగరాల పేర్లను మార్చాలనే డిమాం డ్లు తెరపైకి వచ్చాయి. ఒక ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైన కథనం ప్రకారం.. ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధ సంస్థ అయిన విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని సిమ్లా పేరును ‘శ్యామ్‌లా’గా మార్చాలని డిమాండ్ చేస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని ముఖ్యమైన చారిత్రక ప్రదేశాల పేర్లను మార్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతో, కేంద్రంతో చర్చించాలని రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌ను విహెచ్‌పి ఆర్గనైజింగ్ సెక్రటరి మనోజ్ కుమార్ తాజాగా కోరారు. డాల్‌హౌసీకి నేతాజీ సుభాశ్ చంద్రబోస్ పేరును పెట్టాలని, సిమ్లాలోని చారిత్రక భవనమైన పీటర్‌హోఫ్ పేరును ‘వాల్మీకి సదన్’గా మార్చాలని విహెచ్‌పి రాష్ట్ర శాఖ డిమాండ్ చేసిన మరుసటి రోజే మనోజ్ కుమార్ నగరాల పేర్ల మార్పుపై గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

కేంద్రం-ప్రెస్ కౌన్సిల్ ఢీ
అరోరా సమన్లపై కొత్త మలుపు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి సునీల్ అరోరా సమన్ల వ్యవహారం ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిసిఐ), కేంద్ర ప్రభుత్వం మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలకు దారితీసింది. ముఖ్యంగా ప్రెస్ కౌన్సిల్ అధికార పరిధి ఎంత అన్నదానిపైనే ఈ వివాదం కేంద్రీకృతమైంది. పిసిఐకి అధికారాలు చాలా పరిమితమైనవని, న్యాయవ్యవస్థ మాదిరిగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని కేంద్ర సమచార, ప్రసారాల మంత్రిత్వశాఖ వాదిస్తోంది. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఓ స్వతంత్ర సంస్థ అన్న సంగతి గుర్తుంచుకోవాలని ఆ శాఖ స్పష్టం చేసింది. సునీల్ అరోరాకు సమన్లు జారీ చేయడాన్ని మంత్రిత్వశాఖ తప్పుపట్టింది. అయితే పిసిఐ చైర్మన్, జస్టిస్ సికె ప్రసాద్ మాట్లాడుతూ అధికారికి వారెంట్ జారీ చేసే అధికారం ఉందని సమర్థించుకున్నారు. ఈ విషయంలో మంత్రిత్వశాఖ వాదన వినడానికి కౌన్సిల్ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ఈ నెల 11న చైర్మన్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సునీల్ అరోరా హాజరుకావల్సిందేనని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ నెల 22న పిసిఐ తదుపరి సమావేశం జరుగుతుంది. ఆ రోజు అరోరా హాజరుకావల్సిందేనని సభ్యులు స్పష్టం చేశారు. పిసిఐ అధికారాలు, మీడియా స్వేచ్ఛకు సంబంధించి సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని కౌన్సిల్ సుమోటో విచారణకు ఆదేశించింది. దీనిపై విచారణకు హాజరుకావల్సిందిగా కార్యదర్శి సునీల్ అరోరాకు ప్రెస్ కౌన్సిల్ సమన్లు జారీ చేసింది. ఈ నెల 11న తమ ముందు హాజరుకావాలని జస్టిస్ ప్రసాద్ ఆదేశించారు. ఇలా ఉండగా అరోరా ఈ నెల 30 పదవీ విరమణ చేయనున్నారు.