శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రైతుల పట్ల వివక్ష తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, అక్టోబర్ 27: ప్రభుత్వం మాగాణి, మెట్ట రైతుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని కలిగిరి, సర్వేపల్లి రిజర్వాయర్‌ల ఆయకట్టు ద్వారా పెన్నా డెల్టా పరిధిలోని రైతులకు మాత్రమే నారుమడులు పోసుకునేందుకు నీటిని విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించటం సరికాదన్నారు. రైతులకు సమన్యాయం చేయాలన్నారు. అందుకోసం సాగునీటి సలహా సంఘం (ఐఎబి) సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈనెలలో రెండు పర్యాయాలు సమావేశం నిర్వహిస్తున్నామని ప్రకటించి ఎవరి ప్రయోజనాల కోసం వాయిదా వేశారని ఆయన నిలదీశారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు మెట్ట, మాగాణి అనే తేడా లేకుండా రైతులందరికీ సాగునీటిని విడుదల చేయాలన్నారు. ప్రత్యేకించి మెట్ట రైతులకు సోమశిల జలాలను విడుదల చేయాలన్నారు. సోమశిల జలాశయంలో 37 టిఎంసిల నీరున్నా ఐఎబి సమావేశం ఎందుకు నిర్వహించలేదని ఆయన ప్రశ్నించారు. నవంబర్ డిసెంబర్ నెలల్లో వర్షాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం తుఫాన్ వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని నారుమడులకు నీటిని విడుదల చేయవచ్చన్నారు. ఇబ్బందికర పరిస్థితుల్లో రైతులందరికీ నీటిని అందజేసేందుకు ఆయకట్టు విస్తీర్ణం తగ్గించవచ్చన్నారు. డెల్టా ప్రాంతాలకు మాత్రమే నీరందిస్తే మెట్ట రైతుల పరిస్థితి మాటేమిటన్నారు. కనీసం రొటేషన్ పద్ధతి ద్వారానైనా సాగునీరందించాలన్నారు. ఆత్మకూరు, వెంకటగిరి, ఉదయగిరి, కావలి ప్రాంతాల రైతుల సేద్యానికి సాగునీరవసరమన్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ అనధికార సమావేశం నిర్వహించి మెట్ట రైతుల గొంతు కోయటం తగదన్నారు. ఇలాంటి విపత్కకర పరిస్థితులు తలెత్తడానికి కేవలం టిడిపి అనాలోచిత నిర్ణయాలేనని ఆరోపించారు. అప్పుడు కావలి సమ్మర్ స్టోరేజీ ట్యాంక్‌లో నీటి లభ్యత కోసం చర్యలు తీసుకోమంటే నిర్లక్ష్యం చేశారని ప్రత్యేకించి నియోజకవర్గంలో తాగునీటికి ప్రజలు అల్లాడుతున్నారన్నారు. ట్యాంకర్‌లతో నీటిని సరఫరా చేస్తూ టిడిపి నాయకులు కొందరు పబ్బం గడుపుతున్నారన్నారని ఆరోపించారు. పరిస్థితులు చక్కబరచాల్సిన జిల్లా మంత్రి సమస్యలను పట్టించుకోకపోగా రాజధాని నిర్మాణం పేరుతో సింగపూర్ గుత్తేదారులతో కలిసి ఖజానాను ఎలా దోచుకుందామా? అనే తాపత్రయం తప్ప నీటి వెతలు పట్టటం లేదన్నారు. ఏడాదిలోపు సంగం బ్యారేజీ పనులు పూర్తిచేస్తామని బీరాలు పలికినా ఇప్పటివరకు బ్యారేజీ పనులు పూర్తిస్థాయిలో చేసింది లేదన్నారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ ఒక ప్రాంతం వారికి నీటిని విడుదల చేసి మరొక ప్రాంతం వారిని విస్మరించటం మంచి పద్ధతి కాదన్నారు. దీంతో ప్రాంతాల మధ్య విభేదాలు పొడచూపుతాయన్నారు. రైతులందరికి సమన్యాయం చేసేందుకు రైతు సంఘాలు, అధికారులతో సమీక్షించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఆయకట్టు పెరుగుతుందని, నీటి వనరులు తగ్గుతుందని అందుకు అనుగుణంగా నీటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలన్నారు. గతంలో 20 టిఎంసిల నీటి లభ్యత ఉన్నపుడు సైతం నీటిని విడుదల చేశారని ఇప్పుడు 37 టిఎంసిలు ఉన్నా సరఫరా చేయకపోవటం దారుణమన్నారు. ఇప్పటికైనా ఐఎబి సమావేశం ఏర్పాటుచేసి రైతు సమస్యలను పరిష్కరించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో ఐఎబి సమావేశాలు తరచూ నిర్వహించేవారని గుర్తు చేశారు. నీటి నిర్వహణ బాధ్యతలను జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులకు అప్పగిస్తే వారు సజావుగా నీటి పంపిణీని సక్రమంగా రైతులకు అందజేస్తారన్నారు. రాజకీయ నాయకుల జోక్యంతో రైతులు నష్టపోతారన్నారు. మెట్ట ప్రాంతాల రైతులకు ఆహారం అవసరమని, కేవలం డెల్టా ప్రాంతాలకే నీటిని కేటాయిస్తే మెట్ట రైతులకు ఆహారం అవసరం లేదా? అని ఆయన షశ్న్రించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఐఎబి సమావేశం నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

దుగరాజపట్నం పోర్టు నిర్మించాల్సిందే
పాదయాత్రలో మాజీ ఎంపి చింతా డిమాండ్
కోట, అక్టోబర్ 27: దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యతిరేకులని తిరుపతి మాజీ పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ ధ్వజమెత్తారు. పోర్టు నిర్మాణంపై ఉద్యమించాలంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ కోట దళితవాడ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాకాడు వరకు గురువారం పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం 25 మంది కేంద్ర మంత్రులతో కలసి దుగరాజపట్నం ఓడరేవుకు ఆమోదముద్ర వేసిందన్నారు. అంతేకాకుండా పోర్టు ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులు జారీ చేయడమే కాకుండా 8 వేల కోట్ల రూపాయలతో 2018 నాటికి ఓడరేవు నిర్మించాలని నిర్ణయించిందన్నారు. అయితే 2014 ఎన్నికల్లో అధికారం చేపట్టిన బిజెపి, టిడిపిలతో పాటు ప్రతిపక్ష పార్టీ అయిన వైకాపా కూడా పోర్టు నిర్మాణానికి అడ్డుపడుతున్నాయన్నారు. ఫోర్టు నిర్మాణం జరిగితే లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని, ఒక్కొరికి నెలసరి వేతనం 50 వేల రూపాయలు వస్తాయని, 2 లక్షల మంది బడుగు వర్గాల వారు ఆర్థికంగా స్థిరపడుతారని తెలిసి కూడా పోర్టు నిర్మాణానికి ఎందుకు అడ్డుపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. బాబు వస్తే జాబు వస్తుందన్న నినాదంతో అధికారం చేపట్టిన చంద్రబాబుకు లక్ష మంది నిరుద్యోగులకు పోర్టు నిర్మాణంతో ఉద్యోగాలు రావడం ఇష్టం లేదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టు తర్వాత దుగరాజపట్నం పోర్టుకు ప్రాధాన్యత ఇచ్చిన విషయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియవా అని ఆయన నిలదీశారు. కృష్ణపట్నం ఓడరేవు యాజమాన్యం వద్ద ముడుపులు తీసుకొని దుగరాజపట్నం ఓడరేవును అడ్డుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. దుగరాజపట్నం పోర్టు విషయం గురించి మాట్లాడే అర్హత జగన్‌కి ఎక్కడుందన్నారు. దుగరాజపట్నం పోర్టును రద్దు చేసి రామాయపట్నం ఓడరేవును నిర్మిస్తామంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. పోర్టు నిర్మాణ పనులను చేపట్టే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ కారణం కాదని, చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలే కారణమన్నారు. చింతా మోహన్ చేపట్టిన పాదయాత్రకు పలువురు మద్దతు పలికారు. కార్యక్రమంలో పుచ్చలపల్లి సర్పంచ్ ఇంద్రసేనయ్య, కాంగ్రెస్ నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ప్యాకేజీలు నాయకుల కోసమే
కేంద్ర మాజీ మంత్రి పనబాక ధ్వజం
కోట, అక్టోబర్ 27: రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న ప్యాకేజీలు నాయకుల కోసమే తప్ప రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం కాదని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి ధ్వజమెత్తారు. గురువారం కోటలో ఆమె స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి పోరాటం చేస్తోందని, దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపడితే 90 శాతం మంది హోదా కావాలని కోరడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హోదా విషయాన్ని పక్కనపెట్టి ప్యాకేజీలతో సరిపెట్టుకోవడం ఏమిటని ఆమె ప్రశ్నిచ్చారు. టిడిపి అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాల కాలమైనా నేటికి ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. హోదా సాధించేవరకు తమ పోరాటం ఆగదన్నారు. అనంతరం మండలంలోని వంజివాకకు చెందిన సెన్సార్‌బోర్డు మాజీ సభ్యుడు గంగపట్నం చంద్రశేఖర్‌రెడ్డి తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయనను పరామర్శించారు. ఆమె వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు డి శ్రీనివాసులురెడ్డి, మీజూరు మల్లికార్జున్‌రావు, తాజుద్దీన్, పాల మల్లికార్జున్, శ్రీ్ధర్‌రెడ్డి, ఉప్పల బాలక్రిష్ణయ్యగౌడ్ తదితరులు ఉన్నారు.

ప్రత్యేక హోదా కోసం అవసరమైతే రాజీనామా చేస్తా
తిరుపతి ఎంపి వరప్రసాద్ స్పష్టం
మనుబోలు, అక్టోబర్ 27: ప్రత్యేక హోదా కోసం తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశిస్తే రాజీనామా చేయడానికి వెనుకాడనని తిరుపతి ఎంపి వరప్రసాద్ స్పష్టం చేశారు. మనుబోలులో గురువారం రాత్రి ఆయన గడప గడపకు వైఎస్‌ఆర్‌సిపి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మండల వైఎస్‌ఆర్‌సిపి కన్వీనర్ పచ్చిపాల జయరామిరెడ్డి నివాసంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా తీసుకురావడంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రత్యేక హోదా వచ్చేవరకు తమ పార్టీ కృషి చేస్తుందన్నారు. అవసరమైతే తమ అధినేత ఆదేశిస్తే రాజీనామా చేస్తానన్నారు. చంద్రబాబు వంటి ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదన్నారు. అసమర్థ, అవినీతి పాలనతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అసమర్ధత వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదన్నారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు వస్తాయని, దీనివల్ల ఉద్యోగాలు వస్తాయన్నారు. దేశంలో ఓ కేంద్ర సంస్థ చేపట్టిన సర్వేలో దేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో కంటే మన రాష్ట్రం అవినీతిలో అగ్రస్థానంలో ఉండడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం మహానేరమన్నారు. నీరు-చెట్టు, జన్మభూమి కార్యక్రమాల పేరుతో తెలుగుతమ్ముళ్లు నిధులు స్వాహా చేస్తున్నారని విమర్శించారు. ఎన్‌ఆర్‌ఐజిఎస్ వంటి పనులను కూడా చేయనివ్వడం లేదన్నారు. ఎన్నికల సమయంలో సుమారు వెయ్యికి పైగా అబద్ధాలు చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. ఆయన వెంట మండల వైఎస్‌ఆర్‌సిపి కన్వీనర్ జయరామిరెడ్డి, నాయకులు చిట్టమూరు అజయ్‌కుమార్‌రెడ్డి, దండు చంద్రశేఖర్‌రెడ్డి, పద్మనాభరెడ్డి, జిల్లా బిసి సెల్ అధ్యక్షుడు దాసరి భాస్కర్‌గౌడు, అంకయ్య గౌడు, ఏలూరు భాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

ఇదీ అసలు రంగు!
* హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల నాణ్యత అంతంతమాత్రమే
* బండికి అందకముందే వెలిసిపోతున్న వైనం
నెల్లూరు, అక్టోబర్ 25: అవి పేరుకే హైసెక్యూరిటీ నెంబరు ప్లేట్లు.. వాటి నాణ్యత చూస్తే మాత్రం అత్యంత తీసికట్టు. ఇదీ రవాణా శాఖలో ప్రస్తుత పరిస్థితి. సుమారు ఏడాది కిందట ప్రభుత్వం హైసెక్యూరిటీ నెంబరు ప్లేట్ల విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానంలో నెంబరు ప్లేట్లు మార్చడానికి వీలులేకుండా ఉంటుంది. సదరు వాహనం కారణంగా ఏదైనా ప్రమాదం జరిగినా, చోరీకి గురైనా నెంబరు ప్లేట్లు మార్చే అవకాశం లేకపోవడంతో త్వరగా గుర్తించవచ్చని చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా ఈ కాంట్రాక్టును ఆర్టీసీ ఆధ్వర్యంలో ఓ ప్రైవేటు ఏజన్సీ నిర్వహిస్తోంది. జిల్లాస్థాయిలో ఆర్టీఓ, అర్టీసీ అధికారులు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. సుమారు ఏడాది నుండి కొత్తగా రిజిస్ట్రేషన్ అవుతున్న వాహనాలకు ఈ నెంబరు ప్లేట్లు అమర్చుతున్నారు. పేరుకు హైసెక్యూరిటీ నెంబరు ప్లేట్లు అయినా నాణ్యత మాత్రం అంతంతమాత్రంగానే ఉంటోంది.
రూపురేఖలు మాయం
హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు అమర్చడానికి ద్విచక్రవాహనమైతే రూ.250, కార్లు, జీపులకు రూ.450, బస్సులు, లారీలకు రూ.600 వరకు రుసుము వసూలు చేస్తున్నారు. ఆ మొత్తాన్ని సైతం రిజిస్ట్రేషన్ సమయంలో కార్యాలయంలో వసూలు చేస్తున్నారు. ఆ తరువాత వారం రోజుల్లో సంబంధిత ఏజన్సీకి ప్లేట్లు వస్తాయని అందుబాటులోకి రాగానే చరవాణికి సంక్షిప్త సందేశం ద్వారా సమాచారం ఇస్తున్నారు. విషయం తెలుసుకొని వాహనదారుడు అక్కడకి వెళ్లేసరికే నెంబరు ప్లేట్ల రూపురేఖలు మారిపోతున్నాయి. ఏజన్సీ వద్ద నెల రోజుల వరకు పెండింగ్‌లో ఉన్న ప్లేట్లపై నెంబరుకు వేసిన రంగు వెలసిపోతోంది. దాంతో వినియోగదారుల నుండి అసంతృప్తి వ్యక్తమవుతోంది. పాత పద్ధతిలో రూ.100 ఖర్చు చేస్తే స్టిక్కరింగ్‌తో నెంబరు వేసుకుంటే కొనే్నళ్లపాటు చెక్కు చెదరకుండా ఉండేదని, హైసెక్యూరిటీ అని చెప్పి రూ.వందలు వసూలు చేస్తున్నా ప్లేట్లు నెల రోజుల్లోపే రంగు వెలసిపోతున్నాయని వాహనచోదకులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్లేట్ల నాణ్యతను పెంచాలని కోరుతున్నారు.
గాలికి వదిలిన నిబంధనలు
హైసెక్యూరిటీ నెంబరు ప్లేట్లను ఏజన్సీ నిర్వాహకులే అమర్చాలన్నది నిబంధన. అయితే నిర్వాహకులను ఈ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. వాహనాలు చోరీకి గురికాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ హైసెక్యూరిటీ ప్రక్రియ కాస్త గాలిలో కలిసిపోతోంది. ప్రధానంగా వాహనదారులు నెంబరు ప్లేటుకు దరఖాస్తు చేసుకున్న తరువాత ఆ నెంబరు ప్లేటును ఆ వాహనానికి వారే అమర్చాలి. అయితే ఏజన్సీ నిర్వాహకులు వాహనదారులకే ఇచ్చి వేస్తున్నారు. నెంబరు ప్లేటుకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన ధర వసూలు చేయడంతోపాటు అదనంగా రూ.20 చొప్పున వసూలు చేస్తున్నట్లు వాహనదారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఏ ఉద్దేశ్యంతో ఈ ప్రక్రియను ప్రవేశపెట్టిందో ఆ ప్రక్రియ కాస్త పక్కదారి పడుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి హైసెక్యూరిటీ నెంబరు ప్లేట్ల విషయంలో నాణ్యత పెంచి వాహనాలకు వారే స్వయంగా అమర్చేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

బిజెపి వర్సెస్ టిడిపి
పోరులో పొత్తు కుదిరేనా ?
పట్ట్భద్ర ఎంఎల్‌సికై నువ్వా-నేనా?
ఆత్మకూరు, అక్టోబర్ 27: శాసన మండలి రాయలసీమ తూర్పు నియోజకవర్గ పట్ట్భద్ర నియోజకవర్గం నుంచి పోటీ చేసే వ్యవహారంలో మిత్రపక్షాలుగా సాగుతున్న బిజెపి, తెలుగుదేశం నడుమ ఏకాభిప్రాయం ఎండమావిలా మారనుంది. రెండు పార్టీలు పోటీలోనే ఉంటామనే ప్రకటనలతో పొత్తు తీసి గట్టుమీద పెట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశానికి చెందిన నెల్లూరు నేతలు మాత్రం ఈదఫా ఎలాగైనా తూర్పు రాయలసీమ నుంచి పట్ట్భద్ర స్థానంలో గెలుపొందాలని ఉవ్విళ్లూరుతున్నారు. చిత్తూరు కేంద్రంగా నెల్లూరుతోపాటు ప్రకాశం జిల్లాలు మూడూ ఈ పట్ట్భద్ర స్థానంలో అంతర్భాగంగా ఉన్నాయి. గత రెండు పర్యాయాలుగా తూర్పురాయలసీమ నుంచి తెలుగుదేశంపార్టీ అభ్యర్థి పోటీ చేయడంతో సహా మంచి పోటీనే ఇస్తూ వచ్చింది. ఇదే ఊపుతో ప్రస్తుతం ఓటర్ల నమోదు ప్రక్రియలో కూడా నేతలంతా తమ అనుచరవర్గాలతో ప్రత్యేక కార్యాచరణలో నిమగ్నమయ్యారు. అయితే ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు తమకే సహజ హక్కు ఉందని, అందువల్ల తప్పక బరిలో దిగుతామంటూ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి ఇటీవల ఆత్మకూరు వేదికగా ప్రకటించారు. తాను తమ పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధి హోదాలో ఈ ప్రకటన చేస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. 1960వ దశకం నుంచి 85లో మండలి రద్దు అయ్యే వరకు కూడా తూర్పు రాయలసీమ పట్ట్భద్ర స్థానంలో తామే కొనసాగుతూ వచ్చామనే సంగతి సింహావలోకనం చేసుకుంటున్నారు. నాడు ఎన్టీఆర్ మండలి రద్దు చేసేనాటికి తూర్పు రాయలసీమలో టీచర్ల స్థానం నుంచి సిపిఎంకి చెందిన దాచూరు రామిరెడ్డి, పట్ట్భద్రుల నుంచి బిజెపి తరపున వైసి లింగారెడ్డిలు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. మండలి పునరుద్దరించాక ఇప్పటికే తూర్పురాయల సీమలో రెండు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఆ రెండు ఎన్నికల్లోనూ తెలుగుదేశం, బిజెపి నడుమ సఖ్యత లేదు. అంతేగాక బిజెపిలో బహునాయకత్వ పోరు వాటిల్లింది. కాగా, మండలి రద్దైనాటి వరకు ఉన్న పరిస్థితులే పునరావృతమవుతాయనే గంపెడాశ గుంపుగా బరిలో నిలిచిన భారతీయ జనతాపార్టీ నేతలకు బెడిసి కొట్టింది. 2007లో జరిగిన ఈ ఎన్నికల్లో పార్టీ తరపున అధికారికంగా దువ్వూరు రాధాకృష్ణారెడ్డి బరిలో నిలిచారు. అయితే ఈ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఆచార్య ఆదిత్య, ఆమంచర్ల శంకరనారాయణ కూడా రెబల్స్‌గా పోటీ చేశారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంతో పునరుద్దరణ తరువాత రెండు పర్యాయాలుగా టీచర్లతోపాటు పట్ట్భద్రుల స్థానం సైతం కమ్యూనిష్టులకే కలిసొచ్చే పరిణామాలు ఏర్పడ్డాయి. అలా రెబల్స్‌గా బరిలో నిలచిన నేతల్ని బిజెపి సస్పెండ్ చేసింది. మరలా తాజా వాతావరణంలో వారిని పంచన చేర్చుకుంటున్న వైనం గమనార్హం. ఇప్పటికే ఆమంచర్ల తిరిగి పార్టీలో కొనసాగుతున్నట్లు సదరు నేత కర్నాటి ప్రకటించారు. అలాగే ఆచార్య ఆదిత్యను కూడా పార్టీలోకి తీసుకొస్తామని కూడా వివరించారు. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో తాము గెలవడమే ధ్యేయమని, కమ్యూనిజపుఛాయలు వైదొలిగేలా చూస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇంతకీ తెలుగుదేశం, బిజెపి నడుమ ఈ ఎన్నికల్లో పొత్తు కొనసాగుతుందా లేదా అనేది ఆసక్తికరం. ఈ ఎన్నికలు వేదికగా భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఉంటాయని కూడా విశే్లషకులు అంచనా వేస్తున్నారు.

నెల్లూరులో నవ్యాంధ్ర పుస్తక సంబరాలు
* నవంబర్ 5 నుండి 13వ తేది వరకు
* వందకు పైగా పుస్తక స్టాళ్ల ఏర్పాటు
నెల్లూరు, అక్టోబర్ 27: పుస్తక పఠనం పట్ల ప్రోత్సాహం కలిగించడంలో భాగంగా నవంబర్ 5 నుంచి 13వ తేది వరకు నగరంలోని విఆర్ కళాశాల మైదానంలో నవ్యాంధ్ర పుస్తక సంబరాల పేరిట భారీ పుస్తక ప్రదర్శన, పుస్తక ఆవిష్కరణలు, విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రముఖ ప్రచురణ సంస్థ ఎమెస్కో అధినేత విజయకుమార్, ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. గురువారం నగరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో విజయకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర భాషాభివృద్ధి, సాంస్కృతిక శాఖ, ఎన్‌టిఆర్ ట్రస్ట్, విజయవాడ బుక్ ఫెస్టివల్ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఈ భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియచేశారు. 9 రోజులపాటు జరిగే ఈ పుస్తక సంబరాల్లో భాగంగా 8వ తేదిన నగరంలోని ఏబిఎం కాంపౌండ్ నుంచి సంబరాలు జరిగే విఆర్ కళాశాల మైదానం వరకు పుస్తకప్రియుల పాదయాత్ర పేరుతో నడక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు విద్యార్థులకు వివిధ స్థాయిల్లో వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఎన్‌టిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు. గెలుపొందిన వారికి కార్యక్రమ ముగింపురోజు బహుమతులు అందజేస్తామన్నారు. పుస్తక ప్రాముఖ్యత గురించి విస్తృతంగా ప్రచారం చేయడంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వ సహకారంతో శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. జిల్లాకు చెందిన రచయితలకు ఇక్కడ ప్రాధాన్యత ఇస్తామని, వారి రచనలను ప్రదర్శనలో ఉంచడం కోసం ప్రత్యేకంగా రెండు దుకాణాలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఇక్కడ జరిగిన అమ్మకాలను సదరు రచయితలకు అందజేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ విఠపు మాట్లాడుతూ గత ఏడాది తుఫాన్ ప్రభావంతో ఇక్కడ నిర్వహించాల్సిన పుస్తక సంబరాలను వాయిదా వేశామన్నారు. జిల్లా సాంస్కృతిక వారసత్వ అంశాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు వీలుగా జిల్లాలోని సాహితీ, సాంస్కృతిక ప్రియులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని 13వేల మంది ఉపాధ్యాయులు ఈ పుస్తక సంబరాల్లో భాగం కావాలని, తల్లిదండ్రులు తమ పిల్లలతో ఈ సంబరాలకు విచ్చేసి పుస్తక పఠనం పట్ల వారిలో ఆసక్తి పెంపొందించాలని కోరారు. ప్రముఖ రచయిత పెరుగు రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాకు చెందిన ప్రముఖ కవులను స్మరించుకునేందుకు ఈ సంబరాలు చక్కటి వేదిక కానున్నాయని అన్నారు. ప్రతిరోజు సాయంత్రం జిల్లాకు చెందిన ఒక ప్రముఖ కవి గురించి ఉపన్యాసం ఉంటుందని తెలిపారు. ఎన్‌టిఆర్ ట్రస్ట్ తరపున ఉచిత వైద్య, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ట్రస్ట్ ప్రతినిధి రామకృష్ణ తెలిపారు. అంతక్రితం పుస్తక సంబరాల గోడపత్రిక, బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ బుక్ ఫెస్టివల్ ప్రతినిధి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పన్ను పెంపుదల చట్ట పరిధిలోనే ఉండాలి
అదనపు డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి
ఆత్మకూరు, అక్టోబర్ 27: పన్ను పెంపుదల చట్టపరిధిలోనే కొనసాగాలని రాష్ట్ర మున్సిపల్ అదనపు డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆత్మకూరు మున్సిపాలిటీలో నిర్వహించిన పౌర సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడుతూ చట్టవిరుద్ధంగా పన్ను పెంపుదల జరిగిన అంశాలకు సంబంధించిన వివరాలను, స్థానికులు ఇచ్చిన వినతులను తమ శాఖ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అంతకుముందు ఆయనతో సిటిజన్స్ ఫోరమ్, వైఎస్‌ఆర్‌సి, సిపిఎం, సిపిఐ, వాణిజ్య సంస్థల ప్రతినిధులు చర్చించారు. స్థానిక ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి కూడా ఆయనను ప్రత్యేకంగా సంప్రదించి ప్రజల విజ్ఞప్తి వివరించారు. ఇందుకు సదరు ఏడి స్పందిస్తూ 2013లోనే పన్నుల పెంపుదల జరగాల్సి ఉందన్నారు. అప్పటి ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు వెళ్లదలచి పన్ను పెంపుదల వాయిదా వేసిందన్నారు. ఇక్కడ 2015 సంవత్సరంలో మధ్య నుంచి మాత్రమే పన్ను పెరిగిందన్నారు. ఏదేమైనా ఇక్కడి అంశాలన్నీ డైరెక్టర్‌కు తెలియజేస్తామన్నారు.

ఎత్తులు.. పైఎత్తులు!
నేడే కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం
నెల్లూరుసిటీ, అక్టోబర్ 27: చాలాకాలం తర్వాత ఎట్టకేలకు శుక్రవారం నెల్లూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈనేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందించుకున్నాయి. నగరపాలక సంస్థ సాధారణ సమావేశం అక్రమ స్థలాలను చట్టబద్ధత చేయడం కోసం తప్ప అజెండాలో ప్రజా సమస్యల ఊసే లేకపోవడంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఏడాది తరువాత నిర్వహిస్తున్న కౌన్సిల్ అజెండాలో ఏ ఒక్క అంశం కూడా పేదలకు సంబంధించినది లేకపోవడం గమనార్హం. కార్పొరేషన్‌కు సంబంధించిన రిజర్వు స్థలాలను పార్కులు తప్ప ఏ ఇతర కార్యక్రమాలను నిర్వహించకూడదని సుప్రీంకోర్టు ఉత్తర్వురులు ఉన్నా మేయర్ మాత్రం నిబంధనలను ఉల్లంఘించి రిత్విక్ ఎన్‌క్లేవ్‌లో కార్పొరేషన్‌కు సంబంధించిన కోట్లాది రూపాయలు విలువ చేసే రిజర్వు స్థలాన్ని ఓ కుంటిసాకు చెప్పి స్వర్ణ్భారత్ ట్రస్ట్‌కు కట్టబెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆశీస్సుల కోసం ఆయన కోట్లాది రూపాయల విలువ చేసే స్థలాన్ని అప్పగించడంతో దీనిపై ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో మేయర్ కొత్తగా ఒక పదం తెరపైకి తీసుకువచ్చారు. కార్పొరేషన్‌కు స్వర్ణ్భారత్ ట్రస్ట్ 60 లక్షల రూపాయలు చేసే భవానాన్ని నిర్మించి దానిని కార్పొరేషన్‌కు గిఫ్ట్ కింద ఇస్తుందని చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారు. ప్రజోపయోగ పనులు చేసే స్వర్ణ్భారత్ ట్రస్ట్‌కు స్థలం ఇస్తే తప్పేమిటని చెప్పడంతో దీనిపై ప్రతిపక్షాలు కౌన్సిల్‌లో నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా లక్ష్మీపురంలో కార్పొరేషన్‌కు సంబంధించిన 400 అంకణాల స్థలాన్ని బయట వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుంటిసాకులు చూపించి చట్టబద్ధత చేసి వారికి అప్పగించేందుకు చర్యలు తీసుకోబోతున్నారు. ఇదిలావుంటే గత కొన్ని సంవత్సరాల క్రితం విజయమహల్ బాక్స్‌టైపు బ్రిడ్జి నిర్మాణంలో ఒక వ్యక్తి స్థలం పోయిందని దానికి ప్రత్యామ్నాయం కార్పొరేషన్ స్థలాన్ని కేటాయించాలని ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ ఏ ప్రైవేటు వ్యక్తికి సంబంధించిన స్థలం లేకపోయినా రాజకీయ పలుకుబడి ఉండటంవల్ల ఈ అంశం తెరపైకి గత కొన్ని సంవత్సరాల నుంచి రాలేదు. అయితే మేయర్ తిరిగి ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి బాక్స్‌టైపు బ్రిడ్జి నిర్మాణంలో స్థలం కోల్పోయిన వ్యక్తికి ప్రత్యామ్నాయంగా టెక్కెమిట్టలో గల కోట్లాది రూపాయల విలువ చేసే స్థలాన్ని అప్పగించేందుకు మేయర్ అజెండాలో అంశాన్ని చేర్చడంతో దీనిపై ప్రతిపక్షాలు మేయర్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఏడాది తరువాత జరిగే సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చించేందుకు అవకాశం వచ్చిందని కార్పొరేటర్లు ఆశపడితే అజెండాలో ప్రజా సమస్యలపై ఒక్క అంశం కూడా లేకుండా కేవలం ఆర్థికపరమైన లావాదేవీలు అంశాలు ఉండటంతో కార్పొరేటర్లు లబోదిబోమంటున్నారు. ఈనేపథ్యంలో కౌన్సిల్ సమావేశం అధికార, ప్రతిపక్ష పార్టీల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది.