శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

కరెన్సీ కష్టాలు ఎన్నాళ్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, డిసెంబర్ 1: కరెన్సీ కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పెద్దనోట్ల రద్దు ప్రభావం వృద్ధులు వికలాంగుల పింఛన్లపై పడింది. ప్రతినెల ఇంటి వద్దకు వచ్చి పింఛన్లు అందించే విధానానికి స్వస్తి చెప్పి నవంబర్ నెల పింఛన్లు బ్యాంకు ఖాతాలోనే వేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వృద్ధులు, వికలాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు ఖాతాలు లేనివారు ఎటిఎంలలో రూపేకార్డులు ఉపయోగించడం తెలియనివారు పింఛన్లకోసం ఎటిఎంలు, బ్యాంకుల వద్ద గంటల తరబడి నిలబడలేక అసహనంతో వెనుతిరుగుతున్నారు. పెద్దనోట్ల రద్దు కొత్తనోట్లు అందుబాటులోకి రాక ఇంకా నగదు కష్టాలు కొనసాగుతున్నాయి. 23 రోజులు గడిచినా చిల్లర కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో బ్యాంకులు, తపాలా కార్యాలయాలు, ఎటిఎంల వద్ద జనం రద్దీ కొనసాగుతోంది. గురువారం మధ్యాహ్నం నుంచి నెల్లూరు నగరంలో వర్షం పడుతున్నప్పటికీ తడుస్తూ ఎటిఎంల వద్ద ప్రజలు బారులు తీరారు. ఎటిఎంలలో నగదు ఉందని తెలిస్తేచాలు ఎండా, వానా, మంచు ఇంకెలాంటి బాధలనైనా పడేందుకు సిద్ధపడి ప్రజలు బారులు తీరుతున్నారు. పలు బ్యాంకుల వద్ద ఖాతాదారులకు, బ్యాంకు సిబ్బందికి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంటున్నాయి. దీంతో పలుచోట్ల బ్యాంకుల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. చిల్లర కొరతతో చిన్న వ్యాపారాలు మందకొడిగా సాగుతున్నాయి. జిల్లాలోని వివిధ బ్యాంకుల్లో అవసరాల మేరకు నగదు నిల్వలు లేకపోవడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు ఎటిఎంలలో ఉంచిన నగదు పలుచోట్ల మధ్యాహ్నానానికే అయిపోయాయి. నగదు రహిత లావాదేవీల్లో రూపే కార్డు ప్రధాన పాత్ర పోషించనుంది. జిల్లాలో ఈ కార్డులు సగానికి పైగా వినియోగంలో లేకపోగా మరిన్ని వివిధ బ్యాంకుల్లో మగ్గుతున్నాయి. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు సుమారు లక్ష మంది ఉన్నారు, పదివేల మందికి పైగా పింఛన్‌దార్లు ఉన్నారు. ప్రతినెలా ఉద్యోగులకు 140 కోట్ల రూపాయలు, పెన్షన్‌దారులకు 12 కోట్లు ప్రభుత్వాలు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నాయి. ఉద్యోగులకు పదివేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈనేపథ్యంలో బ్యాంకులు, ఏటిఎంల వద్ద వేతనజీవులు అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకుల వద్ద గురువారం ప్రజలు క్యూకట్టారు. డిపాజిట్లకు సంబంధించి సొమ్ము తీసుకోవడానికి కొందరైతే, ఉద్యోగస్తులు పదివేల రూపాయలు తీసుకోవడానికి ఎగబడుతున్నారు. ఏదిఏమైనా ఈ కరెన్సీ కష్టాలు ఇంకెన్నాళ్లని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వాటర్ ప్లాంట్లపై డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల దాడులు
కోవూరు, డిసెంబర్ 1: కోవూరు పట్టణంలో ఐఎస్‌ఐ మార్క్, లైసెన్సులు, సరైన పత్రాలు లేని వాటర్‌ప్లాంట్లపై డ్రగ్ ఇన్‌స్పెక్టర్ బి ఆనందరావు సిబ్బందితో కలసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. గురువారం కోవూరు బజారు ప్రాంతంలోని డాక్టర్ వాటర్‌ప్లాంట్, కొత్తూరు శాంతీనగర్ ప్రాంతంలోని పోలో వాటర్‌ప్లాంట్‌పై దాడిచేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం అక్కడ వాటర్ క్యాన్లలో నింపుతున్న రక్షిత నీటి శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు. కోవూరు తహశీల్దార్ ముత్యం నరసింహులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కఠినంగా ఉంటామన్నారు. నీటి పరిశుభ్రత అంశం ప్రజా ఆరోగ్యంలో చాలా ముఖ్యమైనదని తెలిపారు. వాటర్‌ప్లాంట్ నిర్వాహకులు అన్ని పత్రాలతోపాటు తగిన టెక్నికల్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వాటర్ ప్లాంట్లపై డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల దాడి విషయం తెలియగానే పట్టణంలో మిగిలిన వాటర్ ప్లాంట్ నిర్వాహకులు తమ ప్లాంట్లను మూసివేశారు.

హెచ్‌ఐవి నిర్మూలనకు ప్రతిఒక్కరు కృషి చేయాలి
ఎజెసి రాజ్‌కుమార్ పిలుపు
నెల్లూరుసిటీ, డిసెంబర్ 1: హెచ్‌ఐవి నిర్మూలన కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్-2 రాజ్‌కుమార్ తెలిపారు. గురువారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గాంధీబొమ్మ సెంటర్ నుంచి విఆర్సీ సెంటర్‌కు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిధిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎయిడ్స్ వ్యాప్తి జరగకుండా ముందస్తు జాగ్రతలు తీసుకోవాలన్నారు. యువత తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదని చెప్పారు. 2030 సంవత్సరానికి ఎయిడ్స్ రహిత జిల్లాగా ఉండాలని ఎయిడ్స్ రహిత సమాజ స్థాపన అందరి బాధ్యత అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వరసుందరం మాట్లాడుతూ ఎయిడ్స్ అవగాహన ఎంతో అవసరం అన్నారు. ఈ వ్యాధి అంటువ్యాధి కాదన్నారు. వ్యాధి సోకిన వారిపట్ల మానవతా దృక్పథంతో ఉండాలన్నారు. అంతేకాకుండా వారి పట్ల చిన్నచూపు చూడకుండా ఉండాలన్నారు. అనంతరం టౌన్‌హాల్లో జరిగిన సమావేశంలో హెచ్‌ఐవి, ఎయిడ్స్ శాఖలో పనిచేస్తున్న స్వచ్చంద సేవా సంస్థల వారికి, నర్సింగ్ స్కూల్ విద్యార్థులకు కలెక్టర్ చేతులమీదుగా అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ రమాదేవి, డిటిసిఓ సురేష్‌కుమార్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ భారతి, డిఇఓ జయసింహ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు భూములు ఇప్పించి న్యాయం చేయండి
* కలెక్టర్‌కు కాకాణి వినతి
వేదాయపాళెం, డిసెంబర్ 1: రియలయన్స్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం కృష్ణపట్నం, తోటపల్లిగూడూరు మండలాల రైతుల నుంచి తీసుకున్న భూములను తిరిగి వారికి ఇప్పించి న్యాయం చేయాలని సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి గురువారం జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజును కలిపి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ గత 9 సంవత్సరాల క్రితం రైతుల సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం తీసుకుందని, రైతులకు ఉపాధి కల్పించడంతోపాటు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. దాంతో రైతులు ప్రభుత్వానికి తమ భూములను ఇచ్చారని తెలిపారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణం చేపట్టకపోవడంతో రైతులు అటు భూములు కోల్పోవడంతోపాటు జీవనోపాధి జరగక నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. ఇటీవల కృష్ణపట్నం పోర్టుకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ ప్రాంతంలో రిలయన్స్ థర్మల్ పవర్‌ప్లాంట్ నిర్మాణం నిలిచిపోయిందని ప్రకటించారన్నారు. భూములు కోల్పోయిన రైతులకు తిరిగి వారి భూములను వారికే ఇచ్చేలా చూడాలన్నారు. పశ్చిమబెంగాల్ సింధూర గ్రామంలో కూడా ఓ ఫ్యాక్టరీ కోసం భూములు తీసుకుని నిర్మాణం నిలిచిపోవడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ భూములను తిరిగి ఇచ్చిన నష్టపరిహారం తీసుకోకుండా ఆ రైతులకు ఇచ్చేలా తీర్పు ఇచ్చిందన్నారు. ప్రస్తుతం కృష్ణపట్నం పోర్టు ప్రాంతంలో రైతుల నుంచి సేకరించిన భూములను రైతులకు ఇప్పించేలా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ ముత్యాలరాజు ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదికను పంపి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. ఈకార్యక్రమంలో వైసిపి నాయకులు విష్ణువర్థన్‌రెడ్డి, ఆనంద్, వెంకటేశ్వర్లు, మండపం సర్పంచు సుబ్బారావు, రైతులు పాల్గొన్నారు.

నూతన సాంకేతికతో పరీక్షల నిర్వహణ మరింత పారదర్శకం
* వర్శిటీలో ప్రారంభమైన జాతీయ స్థాయి వర్క్‌షాప్
వేదాయపాళెం, డిసెంబర్ 1: నూతన సాంకేతికతో పరీక్షల నిర్వహణ మరింత పారదర్శకంగా నిర్వహించవచ్చని ఎస్‌వి యూనివర్శిటి మాజి ఉపకులపతి ఆచార్య పి.మురళి పేర్కొన్నారు. విక్రమ సింహపురి యూనివర్శిటి కళాశాల సెమినార్‌హాలులో రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షాభియాన్, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి సహకారంతో జాతీయస్థాయి వర్క్‌షాపు గురువారం ప్రారంభమైంది. పరీక్షా సంస్కరణలు, తీరుతెన్నులు, ప్రణాళికలు అనే అంశంపై వర్క్‌షాపును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య పి.మురళి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో నైనా పరీక్షా విభాగం, భోధనా సిబ్బంది ప్రధాన భూమిక పోషిస్తారన్నారు. రెండు విభాగాలకు విద్యార్థులకు ప్రత్యక్ష సంబంధం ఉంటుందన్నారు. వర్శిటి పరిపాలన భారం తగ్గాలంటే స్వయంప్రతిపత్తి కళాశాలలు రావాలన్నారు. ఆచార్య కిరణ్‌కాంత్ మాట్లాడుతూ ఒక విద్యార్థి నైపుణ్యాన్ని సరైన రీతిలో అంచనా వేయడమే పరీక్షా అని మన పూర్వీకులు కూడా ఇలాంటి పరీక్షలు నిర్వహించేవారన్నారు. పర్వతనేని బ్రహ్మయ్య సిద్దార్థ కళాశాల పరీక్షల కంట్రోలర్ బి.విఠల్‌రావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం గ్రాండ్స్ కమిషన్ 1970లో పరీక్షల నిర్వహణకు కొన్ని వౌలిక మార్పులు, సంస్కరణలు సూచిందన్నారు. దానికి ఫలితంగానే నేడు సిబి ఎస్‌సి అమలులోకి వచ్చిందని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో విఎస్‌యు కళాశాల ప్రిన్సిపాల్ అందె ప్రసాద్, వర్క్‌షాపు కన్వీనర్ డాక్టర్ జవహర్‌బాబు, వర్శిటి కంట్రోలర్ డాక్టర్ మురళీమోహన్, డిప్యూటి రిజిస్ట్రార్ డాక్టర్ సాయిప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో పలువురు ఎస్సైల బదిలీ
నెల్లూరు, డిసెంబర్ 1: జిల్లాలో వివిధ స్టేషన్లలో పనిచేస్తున్న పలువురు ఎస్సైలను బదిలీచేస్తూ ఎస్పీ విశాల్‌గున్ని గురువారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. వింజమూరు పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న కె వీరప్రతాప్‌ను ఎఎస్ పేటకు, అక్కడ పనిచేస్తున్న ఎస్ భాస్కర్‌బాబును వింజమూరు పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. విఆర్‌లో ఉన్న ఎన్ రామ్మూర్తిని నెల్లూరు రూరల్-2 స్టేషన్‌కు అక్కడ ఎస్సైగా ఉన్న సుబ్బారావును విఆర్‌కు బదిలీ చేశారు. విఆర్‌లో ఉన్న వి జగన్మోన్‌రావును సూళ్లూరుపేట పోలీస్‌స్టేషన్‌కు, అక్కడ ఎస్సైగా విధుల్లో ఉన్న జి గంగాధర్‌రావును విఆర్‌కు బదిలీ చేశారు. విఆర్‌లో ఉన్న ఎస్ వెంకటేశ్వర్లును నెల్లూరు మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు, అక్కడ ఎస్సైగా ఉన్న వి రామకృష్ణను విఆర్‌కు బదిలీ చేశారు. విఆర్‌లో ఉన్న షేక్ జిలానీని కావలి రెండవ పోలీస్‌స్టేషన్‌కు విఆర్‌లో ఉన్న మరో ఎస్సై వి నాగభూషణంను నెల్లూరు ఐదవ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు.

డయిల్ యువర్ ఎస్పీకి బాధితుల ఫిర్యాదులు
నెల్లూరు, డిసెంబర్ 1: ప్రతి గురువారం జరిగే డయిల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా యథావిధిగా నగర డిఎస్పీ జివి రాముడు బాధితుల నుంచి ఫోన్‌కాల్ ద్వారా ఫిర్యాదులు అందుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఏడు ఫిర్యాదులు అందాయి. నెల్లూరు నగరంలో రోజురోజుకు జఠిలమవుతున్న ట్రాఫిక్ సమస్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ బాధితుడు ఫిర్యాదు చేశాడు. గృహహింస, దొంగతనం రికవరీలకు సంబంధించి బాధితుల నుంచి అందిన ఫిర్యాదులు డిఎస్పీ సావధానంగా విని నమోదుచేసుకుని ఫిర్యాదులు పరిష్కరిస్తానని బాధితులకు హామీ ఇచ్చారు.

ఈ-పాస్ విధానంతో ఎరువులు
పొందాలి:కలెక్టర్

నెల్లూరు, డిసెంబర్ 1: రైతులు ఈ-పాస్ విధానం ద్వారా ఎరువులు, పురుగు మందులను డీలర్ల నుంచి పొందే విధంగా చర్యలు వేగవంతంగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు ఆదేశించారు. గురువారం కలెక్టర్ చాంబర్‌లో వ్యవసాయాధికారులు, బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈసమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 27 మండలాలను కరవు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందని, వెంటనే సదరు రైతుల రుణాలను ఖాతాలలో వేయాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న 640 ఎరువులు, పురుగు మందుల దుకాణదారులకు వెంటనే ఈ-పాస్ మిషన్లను అందజేయాలని కలెక్టర్ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్‌ను ఆదేశించారు. డీలర్లవద్ద నుంచి ఈ-పాస్ మిషన్ల కోసం దరఖాస్తులను వ్యవసాయాధికారులు సేకరిస్తారని, ముందస్తు చర్యగా ఈపాస్ మిషన్లను సంబంధిత సంస్థ నుంచి తెప్పించాలని కలెక్టర్ ఆదేశించారు. డెబిట్‌కార్డులను రైతులందరికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు వారికి డెబిట్‌కార్డుల వాడకంలో శిక్షణ ఇవ్వాలని సూచించారు. కరవు ప్రకటించని మండలాల్లో కూడా వ్యవసాయ రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వ్యవసాయాధికారులు మండలాలు, గ్రామాల వారీగా రీ-షెడ్యూల్ చేయవలసిన రైతుల జాబితాను త్వరితగతిన అందజేయాలని వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్‌ను ఆదేశించారు. ఈసమావేశంలో ఆంధ్రాప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ బివి శివయ్య, వ్యవసాయ జాయింట్ డైరెక్టర్ ఎం హేమామహేశ్వరరావు, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ సీతారామరాజు, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీ్ధర్‌కుమార్, సెరీకల్చర్ అధికారులు పాల్గొన్నారు.

తీరంలో అలల ఉద్ధృతి
తోటపల్లిగూడూరు, డిసెంబర్ 1: చెన్నై వద్ద తుఫాన్ కేంద్రీకరించడంతో కోడూరు తీరం వద్ద గురువారం అలల ఉద్ధృతి కనిపించింది. చలిగాలులు వీస్తు మేఘాలు దట్టంగా కమ్ముకుని వర్షం కురుస్తోంది. ఇటీవల వర్షాలు లేకపోవడంతో తుఫాన్ కారణంగా వర్షం వచ్చి చెరువులు నిండి పంట పొలాలకు నీటి సరఫరా జరుగుతుందని రైతులు ఆసక్తిగా ఉన్నా గాలులు ఎక్కువైతే ప్రమాదాలు జరుగుతాయోమోనన్న భయంతో తీర ప్రాంత వాసులున్నారు.

మత్స్య కళాశాలలో అంతర్ కళాశాలల క్రీడా పోటీలు
ముత్తుకూరు, డిసెంబర్ 1: మండల కేంద్రంలోని మత్స్య కళాశాలలో 8వ అంతర్ కళాశాలల క్రీడాపోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. ఐదు రోజులపాటు జరిగే ఈ పోటీలను శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం డీన్ రమణ ప్రారంభించారు. క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. రాష్ట్రంలోని తిరుపతి, ప్రొద్దుటూరు, గన్నవరం, ముత్తుకూరుకు చెందిన పశువైద్య విశ్వవిద్యాలయాలు, డెయిరీ టెక్నాలజీకి చెందిన సుమారు 450 మంది విద్యార్థులు ఆక్వా, ప్రోవెలెక్ క్రీడలకు హాజరయ్యారు. ఈసందర్భంగా వాలీబాల్, షటిల్, బాల్‌బాడ్మింటన్, ఫుట్‌బాల్, పరుగుపందెం వంటి పలు క్రీడలు మొదలయ్యాయి. అనంతరం యూనివర్శిటీ డీన్ మాట్లాడుతూ రాష్టస్థ్రాయి క్రీడా పోటీలు మత్స్య కళాశాలలో జరగడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. విద్యార్థులు స్నేహపూర్వకంగా కలసిమెలసి ఉండాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ కృష్ణప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

రేషన్‌షాపుల్లో 5 రకాల వస్తువులు పంపిణీ
వేదాయపాళెం, డిసెంబర్ 1: నగదు రహిత లావాదేవీల్లో భాగంగా డిసెంబర్ నెలలో రేషన్‌షాపుల్లో కార్డుదారులందరికి బియ్యం, కిరోసిన్, చక్కెరతోపాటు 5 రకాల వస్తువులను పంపిణీ చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పౌరసరఫరాల కమిషనర్ ఆదేశాల మేరకు తగినంత చిన్ననోట్లు లేని కారణంగా జిల్లాలో ఉన్న అన్ని చౌకదుకాణాల్లో డిసెంబరు నెల కోటాతోపాటుగా కందిపప్పు, పామాయిల్, ఉప్పు, ఎర్రగడ్డలు, ఉల్లగడ్డలను కూడా నగదు చెల్లించకుండా అరువు పద్ధతిలో పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. డిసెంబరు నెలలో రేషన్‌షాపుల్లో కార్డుదారులు తీసుకున్న నిత్యావసర వస్తువులకు సంబంధించి 2017 జనవరి నెలలో కార్డుదారుడి ఖాతా నుంచి డీలరు ఖాతాకు సొమ్మును బ్యాంకు నుంచి జమ చేస్తారన్నారు. జిల్లాలోని రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దారులు, చౌకదుకాణ డీలర్లు గమనించి కార్డుదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రేషన్ ఇవ్వాలని జేసి ఇంతియాజ్ అధికారులకు సూచించారు.

నగదు పంపిణీపై జిల్లా కలెక్టర్లతో సిఎం సమీక్ష
వేదాయపాళెం, డిసెంబర్ 1: జిల్లాలో నగదు పంపిణీ, నగదు రహిత లావాదేవీలపై గురువారం జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో సిఎం కలెక్టర్లకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. నగదు పంపిణీలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, జేసి ఇంతియాజ్, ఎల్‌డి ఎం వెంకట్రావ్, సి పి ఓ పి.బి.కె.మూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.