శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, డిసెంబర్ 9: పేదలు అప్పులపాలు కాకుండా కాపాడే అద్భుతమైన అరోగ్యశ్రీ పథకానికి నిధులు తగ్గించి దానిని నీరుగార్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుదేనని జిల్లా వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పథకం అమలవుతున్న తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన ధర్నాలో భాగంగా నెల్లూరు కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతుందని, చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆరోగ్యశ్రీకి పూర్తిస్థాయిలో నిధులు కేటాయించి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పేదల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన ఆరోపించారు. ఏ పేదవాడికైనా ఆరోగ్యం బాగులేకపోతే 108కి ఫోన్‌చేస్తే చాలు, ఆసుపత్రిలో చేర్పించి ఉచితంగా ఆపరేషన్ చేయించి, ఛార్జీలకు డబ్బులు ఇచ్చి, మందులు ఇచ్చి పంపేవారని ఆయన అన్నారు. అలాంటిది ఇప్పుడు ఫోన్‌చేస్తే అంబులెన్స్ ఎక్కడుందో, డీజిల్ అయిపోయిందని కుంటిసాకులు చెపుతూ తప్పించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. జడ్పి చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ, పేదవాడు రెండు కారణాల వలన అప్పుల పాలవుతాడని, ఒకటి అనారోగ్యం, మరొకటి పిల్లల చదువు అని చెప్పారు. దీనిని ఆనాడు గుర్తించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్సుమెంట్ వంటి ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని ఆయన కొనియాడారు. పేదల జీవితాలు బాగుపడాలంటే పేదల సంక్షేమ పథకాలు అమలుచేయాలని ఆయన పేర్కొన్నారు. నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీకి పూర్తిస్థాయిలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పేదల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి 1300 కోట్లు అవసరమైతే ప్రభుత్వం 200 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకుందని విమర్శించారు. కమీషన్ల కోసం పట్టిసీమను ప్రారంభించారని, ఈ ఆరోగ్యశ్రీలో కమీషన్‌లు రావని, దీనికి నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో 942 వ్యాధులను ఆరోగ్యశ్రీ కింద చేరిస్తే, వాటిని ప్రస్తుతం 142 వ్యాధులకు తగ్గించిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. ప్రాణాంతకమైన వ్యాధులు ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం పేద ప్రజలకు ఒక వరంలాంటిదని, అలాంటి పథకాన్ని చంద్రబాబునాయుడు నీరుగార్చుతున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి సిఎం కావడం తథ్యమని ఆయన అన్నారు. ఎన్‌టిఆర్ పేరు చెప్పి పథకాలను నిర్విరామం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్‌టిఆర్, ఇందిరాగాంధీలు ప్రజా సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, అదే బాటలో రాజశేఖర్‌రెడ్డి కూడా ప్రవేశపెట్టారని ఆయన పేర్కొన్నారు. ఎన్‌టి రామారావు పేరు మీద పెట్టిన పథకాలన్నింటికి నీరుగార్చటమే చంద్రబాబునాయుడు ఉద్దేశమని ఆయన ఎద్దేవా చేశారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ పథకం వలన పేద, బడుగు బలహీనవర్గాలతోపాటు ధనికులు ఎంతో మంది లబ్ధి పొందారని పేర్కొన్నారు. కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకొనే వసతి కల్పించిన రాజశేఖర్‌రెడ్డి చిరస్మరణీయుడని ఆయన పేర్కొన్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కె సంజీవయ్య మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం, ఫీజు రీయింబర్సుమెంట్ పథకం, పేదలకు ఇళ్లు కట్టించే పథకం ప్రతి సంక్షేమ పథకం మన రాష్ట్రంలో ప్రస్తుతం కనబడటం లేదన్నారు. కొంత మంది నాయకులు పేదల మీద, బిసిల మీద ప్రేమ చాలా ఉందని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు. ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నీరుగార్చుతుందని విమర్శించారు. ఆరోగ్యశ్రీకి పూర్తిస్థాయి నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ పేదవర్గానికి ఆరోగ్యశ్రీ వరంలాంటిదని, దానికి చంద్రబాబునాయుడు తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ పథకం పేదలకు ఒక సంజీవిని వంటిదని, అలాంటి పథకానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. గూడూరు ఇన్‌ఛార్జి మేరిగ మురళి మాట్లాడుతూ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల మన్ననలు పొందాయని ఆయన తెలిపారు. చిరస్థాయిగా నిలిచిపోయే పథకాల్లో ఆరోగ్యశ్రీ పథకం ఒకటని ఆయన చెప్పారు. వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం వలన నిరుపేదలు కూడా కార్పొరేట్ వైద్యశాలలో వైద్యం చేయించుకునేవారని, ప్రస్తుతం నిధుల కొరత వలన దానిని కోల్పోతున్నారన్నారు. వైఎస్‌ఆర్‌సిపి నేత నేదురుమల్లి పద్మనాభరెడ్డి మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ పథకం చాలా మంచి పథకం అని, దానికి మరిన్ని నిధులు ఇచ్చి పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తనకు జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని ఉందని అన్నారు. ఈకార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి నాయకులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, జడ్పి వైస్‌చైర్మన్ శిరీష, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా వైఎస్‌ఆర్‌సిపి కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్‌కు ఆరోగ్యశ్రీ పథకాన్ని పునరుద్ధరించాలని, నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు.

సముద్రంలో ఎగసి పడుతున్న కెరటాలు
వాకాడు, డిసెంబర్ 9: బంగళాఖాతంలో ఏర్పడిన వార్ధా తుఫాన్ ప్రభావం వలన సముద్రంలో కెరటాలు ఎగసి పడుతున్నాయి. మండలంలోని తూపిలిపాలెం గ్రామానికి బంగళాఖాతం సముద్రం అత్యంత సమీపాన ఉంది. శుక్రవారం ఉదయం నుండి సముద్రలో కెరటాలు ఎగసి పడుతూ భీకరమైన శబ్ధంతో కరకట్టలు కోతకు గురవుతున్నాయి. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు కెరటాల ఉద్ధృతికి భయపడి వేటకు వెళ్లలేదు. సముద్రపు ఒడ్డున ఉన్న వేట సామగ్రి పాక్షికంగా దెబ్బతిన్నట్టు మత్స్యకారులు తెలిపారు. మండలంలో తీరానికి సమీపంలో 14 గ్రామాలున్నాయి. వైట్‌కుప్పం గ్రామం సముద్రపు ఒడ్డున ఉండటం కెరటాల ఉద్ధృతి వలన గ్రామంలోకి సముద్రపునీరు వచ్చినట్టు మత్స్యకారులు తెలిపారు. నెల్లూరు-కాకినాడ తీరం మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్న దృష్ట్యా తీరం వెంబడి ఉన్న ప్రజలను తరలించాల్సిన అవసరం ఉంది. తీరం వెంబడి ఉన్న రక్షిత భవనాలు శిధిలావస్థలో ఉన్నాయి.

అవినీతి రహిత సమాజంతోనే దేశం అభివృద్ధి: కలెక్టర్
నెల్లూరు కలెక్టరేట్, డిసెంబర్ 9: అవినీతి రహిత సమాజంతోనే దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు స్పష్టం చేశారు. జాతీయ అవినీతి నిర్మూలన దినోత్సవం సందర్భంగా శుక్రవారం నగరంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతిరహిత సమాజం కోసం పాటుపడుతామని ప్రతినబూనాలని సూచించి విద్యార్థులు, ఉద్యోగుల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని, జెసి ఇంతియాజ్ అహ్మద్, జెసి-2 సాల్మన్‌రాజ్‌కుమార్, జడ్పి సిఇఒ రామిరెడ్డి, అవినీతి నిరోధక శాఖ డిఎస్‌పి ప్రభాకర్, రెవెన్యూ, పోలీస్, వివిధ శాఖల ఉద్యోగులు, పలు కళాశాలల చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

నగదు కావాలా నాయనా !
* వెయ్యికి వంద... స్వైప్‌తో నైస్‌గా
* అక్రమార్జనలో ఆత్మకూరు వ్యాపారాలు
ఆత్మకూరు, డిసెంబర్ 9:
‘‘నిత్యం బ్యాంకుల్లో నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తుండటం, ఏటిఎంలు మూతపడే ఉండటం అందరికీ విధితమే. దీంతో కరెంట్ ఖాతాలు, స్వైప్ యంత్రాల్ని కలిగిన బడా వ్యాపారులు ‘నగదు కావాలా నాయనా అంటూ’ జనాన్ని ఊరిస్తున్న విన్యాసమిది. తమ వద్ద ప్రత్యేకించి వ్యాపార లావాదేవీ జరపకున్నా సదరు వ్యక్తి నుంచి ఈ వర్తకుని ఖాతాలోకి ఓ వెయ్యి రూపాయలు ఏటిఎం కార్డు ద్వారా స్వైప్ యంత్రం నుంచి జమ అవుతుంది. దీనికి ప్రతిగా తొమ్మిది వందల రూపాయల మొత్తాన్ని మాత్రమే సదరు ఏటిఎం కార్డుదారుడికి ఈ వ్యాపారి ముట్టచెపుతాడు. సదరు నగదు కోరి వచ్చిన వ్యక్తి పరిచయస్తుడై ఉంటే మహా అంటే 950 రూపాయలు అందుకోగలడు.’’
దేశవ్యాప్తంగా రూ.500, వెయ్యి నోట్లను గత నెల 8వ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా రద్దు చేయడంతో ఏర్పడ్డ సంక్షోభం వల్ల పేదలు, మధ్యతరగతి వర్గాల ప్రజానీకం అనుభవిస్తున్న క్షోభ అంతా ఇంతా కాదు. గత మాసం పైబడి ప్రజా బాహుళ్యంలో ఆర్థికంగా పెద్దలైన వారు గద్దల్లా బడుగు జీవుల అవసరాల్ని తమకు ఆదాయ వనరుగా మలచుకోవడం శోచనీయం. ఇలాంటి ఆర్థికపరమైన గందరగోళాన్ని ఆసరాగా మలచుకోవడంలో ప్రత్యేకించి ఆత్మకూరుకు చెందిన పలువురు వ్యాపారులు సిద్ధహస్తులుగా మారారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్వైప్ యంత్రాలకు గిరాకీ పెరగడం తెలిసిందే. సదరు వ్యక్తులు ఈ స్వైప్ యంత్రాలతో ఆయాచితంగా సంపాదించడంపై దృష్టి సారిస్తుండటంతో శవాలపై కాసులు ఏరుకునే చందంగా పరిస్థితులు పరిణమిస్తున్నాయి. రూ.500 నోట్లకు సంబంధించి కొన్ని సర్వీసుల్లో మినహాయింపుకల్పించినా అక్కడ కూడా స్వీకరించడం అంతంత మాత్రమే. కేంద్ర ప్రభుత్వ విభాగాలైన బిఎస్‌ఎన్‌ఎల్ బిల్లులు, ఎల్‌ఐసి ప్రీమియం చెల్లింపులకు పాత నోట్లను తీసుకునేది లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏ ఇద్దరు పరిచయస్తులు తారసపడ్డా తమ కబుర్లలో ప్రస్తుతం నెలకొన్న కరెన్సీ కొరత పరిస్థితులపై చర్చించుకోవడం హాట్ టాపిక్‌గా కొనసాగుతూనే ఉండటం గమనార్హం. ఇదిలాఉంటే ఆర్టీసీ సర్వీసుల్లో కండక్టర్ రూ. 500 కరెన్సీ తీసుకునేందుకు సిద్ధమవుతున్నా, ప్రయాణికుల్లో ఎక్కువ భాగం అవే పెద్ద నోట్లు ఇస్తూ తిరిగి అందరూ చిల్లర కావాలని కోరుతుండటంతో వివాదాలు చోటుచేసుకున్నాయి. చేతిలో చలామణి నగదుగా లేక నిత్య అవసరాల కోసం రోజు గడవాలంటే సందిగ్ధ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అడపాదడపా తెరచుకుంటున్న ఏటిఎంల వద్ద ఒక్కసారిగా జనం అంతా బారులు తీరుతున్నారు. వరుస తమ వద్దకు వచ్చేలోగానే చాలా పర్యాయాలుగా ఏటిఎంలు ఖాళీ అవుతున్నాయి. బ్యాంకుల వద్దకూడా అదే తంతు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఈసడింపులే ఎదురవుతుంటే... బడా వ్యాపారులకు మాత్రం అదే బ్యాంకుల్లో అన్నీ సజావుగానే కార్యకలాపాలు కొనసాగడం గమనార్హం. ఇదిలాఉంటే పన్ను బకాయిల్ని పాత నోట్లతో చెల్లించవచ్చనే మైక్‌లో ప్రచారంతో అనూహ్యంగా పురపాలక రాబడి పెరగడం విశేషం.

టిటిడిలో మన్నారుపోలూరు ఆలయం విలీనం
* ఆలయాన్ని టిటిడి చైర్మన్‌కు స్వాధీనపరచిన దేవాదాయశాఖ అధికారులు
సూళ్లూరుపేట, డిసెంబరు 9: సూళ్లూరుపేట పట్టణంలోని మన్నారుపోలూరులో ఉన్న చోళరాజుల కాలంనాటి పురాతన ప్రసిద్ధిగాంచిన అలఘుమల్లారి కృష్ణస్వామి ఆలయాన్ని శుక్రవారం తిరుమల, తిరుపతి దేవస్థానంలోకి విలీనం చేశారు. దేవదాయ శాఖ సహాయకార్యదర్శి రవీంద్రరెడ్డి, అధికారులు ఆళ్ల శ్రీనివాసుల రెడ్డి, పోరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఆలయాన్ని అధికారింగా టిటిడి బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తికి స్వాధీనపరిచారు. ఇకపై ఆలయంలో జరుగు ప్రతి కార్యక్రమం టిటిడి తరుపున జరగనుంది. ఈ ప్రాంతంలో ఇంత పురాతన చరిత్ర కలిగిన ఆలయం ఉండటం విశేషమని, అందువల్లే టిటిడిలోకి విలీనం చేసుకొన్నామని చైర్మన్ చదలవాడ తెలిపారు. ఈ ప్రాంత వాసిగా ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన ఆలయం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టి వెంటనే టిటిడిలోకి విలీనం చేసేలా కృషి చేశారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో ఉన్న ఆలయాన్నింటిని కూడా టిటిడి తరపున అభివృద్ధి చేయాలని కోరారు. మాజీ మంత్రి పరసా వెంకటరత్నం మాట్లాడుతూ ఈ ఆలయానికి భక్తులు అధికంగా వచ్చేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. జడ్పి ఫ్లోర్ లీడర్ వేనాటి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ ఆలయానికి గొప్ప చరిత్ర ఉందన్నారు. అనంతరం చదలవాడను స్థానిక నేతలు, గ్రామస్తులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటి చైర్‌పర్సన్ నూలేటి విజయలక్ష్మి, పిట్ల సుబ్రమణ్యం, మనస్వామి తదితరులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో తహలీలా ఫాతేహా
* ముగిసిన దొరసానమ్మ గంధోత్సవం
అనుమసముద్రంపేట, డిసెంబర్ 9: ఏఎస్‌పేటలోని శ్రీ హజరత్ బీబీ హబీబా ఖాతూన్ గంధోత్సవాల్లో భాగంగా శుక్రవారం తహలీల్ ఫాతేహాతో గంధోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా మహల్ నుంచి సజ్జదా నషీన్ షాగులామ్ నక్షాబంద్ హఫీజ్‌పాషా గంధాన్ని గలేఫ్ వస్త్రాలు, పూల దుప్పట్లుతో దర్గాకు చేర్చారు. దర్గాకు తూర్పువైపున ఉన్న మసీద్ వద్ద తహలీల్ ఫాతేహాను నిర్వహించారు. ఫకీర్ల విన్యాసాలు, ప్రత్యేకంగా షేక్ సందానీ, నదీమ్‌లు ప్రత్యేక సలామ్‌లు గావించారు. ఈ సందర్భంగా హఫీజ్‌పాషా ఖత్‌మే ఖురాన్ చదివింపులు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం దర్గాలోపల ఉన్న ఖాజానాయబ్ రసూల్, దొరసానమ్మల సమాధులపై గంధం లేపనం చేసి గలేఫ్ వస్త్రాలు, పూల దుప్పట్లను ఉంచి ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో దర్గా ట్రస్టీ సయ్యద్ సైఫూర్ రహమాన్ ఖాద్రి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
నెల్లూరుసిటీ, డిసెంబర్ 9: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ 70వ జన్మదిన వేడుకలను డిసిసి అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సోనియాగాంధీ 18 సంవత్సరాల నుంచి ఎఐసిసి అధ్యక్షురాలుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీని సమర్థవంతంగా బలోపేతం చేసిన ఘనత దక్కించుకున్నారని వివరించారు. ఒక దశాబ్దం పాటు 2004-14 వరకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర, రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర పోషించారని చెప్పారు. సోనియగాంధీ నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారన్నారు. చేవూరు దేవకుమార్‌రెడ్డి, సివి శేషారెడ్డి మాట్లాడుతూ సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీకి ఒక దశ దిశ నిర్దేశించిన ఉత్తమ మహిళగా పేర్కొన్నారు. ప్రధాన మంత్రి పదవినీ సైతం త్యాగం చేసి మన్మోహన్‌సింగ్‌ని ప్రధానమంత్రిగా నియమించిన ఘనత ఆమెకే దిక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

డిఆర్‌ఒగా కృష్ణ్భారతి బాధ్యతలు స్వీకరణ
నెల్లూరు కలెక్టరేట్, డిసెంబర్ 9: జిల్లా రెవెన్యూ అధికారిగా కృష్ణ్భారతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాకుళంలో డిఆర్‌ఒగా పనిచేస్తూ సెలవుపై ఉన్న ఆమెను జిల్లా రెవెన్యూ అధికారిగా ప్రభుత్వం నియమించింది. గ్రూపు2 అధికారిగా ఎన్నికైన కృష్ణ్భారతి తొలుత రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ తదితర ప్రాంతాలలో తహశీల్దారుగా పనిచేశారు. అక్కడ నుండి కడప జిల్లా జెసిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం శ్రీకాకుళం నుండి నెల్లూరు జిల్లాకు డిఆర్‌ఒగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

నెల్లూరు నగరంలో ఐటి దాడులు
నెల్లూరు, డిసెంబర్ 9: నగరంలోని బంగారు ఆభరణాల దుకాణాల్లో శుక్రవారం రాత్రి ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. నగరంలోని కాకర్లవారివీధి, మండపాలవీధిలోని రెండు ప్రముఖ జ్యూయలరీ షాపుల్లో ఈ దాడులు జరిగాయి. నవంబర్ నెల మొదటి వారం నుంచి శుక్రవారం వరకు జరిగిన బంగారు కొనుగోళ్లు, ఆర్డర్లపై అధికారులు దుకాణ యజమానుల నుంచి పూర్తి సమాచారం సేకరించారు. నగరానికి చెందిన కొందరు ప్రముఖులు నగరంలో పేరొందిన ఈ రెండు దుకాణాల నుంచి గత నెలలో పెద్ద మొత్తంలో బంగారు నగలను కొనుగోలు చేశారనే పక్కా సమాచారం మేరకు ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేసినట్టు తెలుస్తోంది. ఆదాయ పన్ను శాఖ అధికారుల దాడుల నేపథ్యంలో ఇతర బంగారు దుకాణ యజమానులు తమ దుకాణాలను మూసివేసి వెళ్లిపోయారు. నిత్యం కొనుగోలుదారులతో రద్దీగా కనిపించే మండపాల వీధి, ఆచారవీధిలోని బంగారు దుకాణాలు మూసివేయడంతో జనసమర్థం పూర్తిగా పలచబడింది.

విద్యార్థి నేత మృతికి సంతాపం
నెల్లూరు, డిసెంబర్ 9: వైఎస్సార్ సిపి విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి నరసింహారెడ్డి తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ జిల్లా వైసిపి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నగరంలోని కరెంట్ ఆఫీస్ సెంటర్‌లోని రాజశేఖర్‌రెడ్డి విగ్రహం వద్ద శుక్రవారం నరసింహారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.జయవర్ధన్ మాట్లాడుతూ నరసింహారెడ్డి నిత్యం విద్యార్థుల సమస్యల కోసం పోరాడుతూ ఉండేవాడని గుర్తు చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. నరసింహారెడ్డి పార్టీకి చేసిన సేవలను ఈ సందర్భంగా అందరూ ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో వైసిపి విద్యార్థి విభాగ నేతలు మదన్‌కుమార్, శేషు, రాఖేష్, పెంచలనాయుడు, వెంకటేశ్, అరుణ్, శ్రీహరి, ఇషాద్, ప్రవీణ్, ఇక్బాల్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ కార్యాలయంలో అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ
నెల్లూరు, డిసెంబర్ 9: అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రతిజ్ఞ నిర్వహించారు. జిల్లా ఎస్పీ విశాల్‌గున్నిఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అవినీతి రహిత పాలనకు ప్రభుత్వం కృషి చేసిందని, తమ శాఖలో అవినీతి రహిత పాలనకు కృషి చేస్తామంటూ కార్యాలయ సిబ్బంది అధికారులు ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి.శరత్‌బాబు, ఏఆర్ అదనపు ఎస్పీ వీరభద్రుడు, జిల్లా స్థాయి, నగరస్థాయి పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

12న తీరం దాటనున్న వార్దా తుఫాన్
* అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు ఆదేశం

నెల్లూరు, డిసెంబర్ 8: నెల్లూరు-కాకినాడల మధ్య ఈనెల 12న వార్దా తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వార్దా తుఫాన్ పట్ల జిల్లాలోని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని తహశీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తుఫాన్ ప్రభావం వలన 11 నుండి 12వ తేదీ మధ్యాహ్నం వరకు వర్షాలు పడతాయని, 12 మధ్యాహ్నం నుండి 13వ తేదీ వరకు భారీ వర్షాలు నమోదవుతాయని, ఆ సమయంలో 60 నుండి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినట్లు తెలిపారు. ముందస్తు చర్యలుగా హ్యాండ్ రేడియోలు సిద్ధం చేసుకోవాలని, తుఫాన్ షెల్టర్లను సిద్ధం చేసుకోవాలని, పౌరసరఫరాల సంస్థ అధికారులు బియ్యం, ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచుకోవాలని ఆయన ఆదేశించారు. నీటి పారుదల శాఖ అదికారులు చెరువులకు గండ్లు పడితే ముందస్తు చర్యగా ఇసుక బస్తాలు సిద్ధం చేసుకోవాలన్నారు. రోడ్లు భవనాల శాఖ, పోలీసు, విద్యుత్ శాఖ, అగ్నిమాపక, గ్రామీణ నీటి సరఫరా, పశుసంవర్థక, పంచాయతీ శాఖలు గ్రామాల్లో తమ సిబ్బందితో సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. సంయుక్త కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థలోని స్టాక్ పాయింట్‌లలో నిత్యావసర వస్తువులు సిద్ధంగా ఉంచి ప్రత్యేక సిబ్బందిని కేటాయించాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు, తహశీల్దార్లు పాల్గొన్నారు.