శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

స్తంభించిన నగర పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు సిటీ, డిసెంబర్ 19: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వర్లు బదిలీపై వెళ్లినప్పటి నుంచి కార్పొరేషన్‌లో పరిపాలన స్తంభించింది. ఎక్కడ ఫైళ్లు అక్కడే నిలిచిపోవడంతో అటు ఉద్యోగులు, ఇటు ప్రజలు అల్లాడుతున్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్‌గా హరీష్‌ను నియమించినా ఇక్కడ పరిస్థితులను చూసి వచ్చేందుకు ఆయన ఇష్టపడటం లేదు. దీంతో గత కొద్ది రోజులుగా కార్పొరేషన్‌కు కమిషనర్ లేకపోవడంతో ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. కార్పొరేషన్‌లో ప్రతి నిత్యం సామాన్యుడి దగ్గర నుంచి కోటేశ్వరుడు వరకు ఏదో ఒక పని ఉంటుంది. అయితే ఏ ఫైల్ అయినా ముందుకు పోవాలన్నా కమిషనర్ సంతకం లేకపోతే కదిలే పరిస్థితి లేదు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్‌గా హరీష్‌ను నియమించి సుమారు నెల కావస్తున్న ఆయన బాధ్యతలు చేపట్టకపోవడంతో తాత్కాలికంగా ఇన్‌చార్జ్ కమిషనర్‌గా జాయింట్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టారు. అయితే జాయింట్ కలెక్టర్ నామమాత్రంగా ఇన్‌చార్జ్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. కమిషనర్‌గా నెల్లూరుకు బదిలీ అయిన హరీష్ నెల రోజులు కావస్తున్నా బాధ్యతలు చేపట్టకపోవడంతో జాయింట్ కలెక్టర్‌కు ఇన్‌చార్జ్ కమిషనర్‌గా పూర్తి బాధ్యతలు ఇచ్చారు. అయితే ఇన్‌చార్జ్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన జాయింట్ కలెక్టర్ ఇప్పటివరకు కార్పొరేషన్‌లో అడుగు పెట్టిన పాపన పోలేదు. ఈ రొచ్చు కార్పొరేషన్‌లో అడుగు పెట్టేందుకు ఆయన సుముఖత చూపడం లేదని తెలుస్తోంది. ఈనేపథ్యంలో కార్పొరేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన ఫైళ్లను మాత్రమే కలెక్టర్ కార్యాలయానికి తెప్పించుకుని చూస్తున్నారు. అయితే పరిపాలనకు సంబంధించిన ఈ ఫైళ్ల మీద కూడా జాయింట్ కలెక్టర్ సంతకం పెట్టేందుకు సుముఖత చూపడం లేదన్నారు. ఉద్యోగులకు సంబంధించిన జీతాల పైళ్ల మీద ఇన్‌చార్జ్ కమిషనర్ సంతకాలు పెట్టకుండా వెనక్కి తిరిగి పంపడంతో కొంతమంది ఉద్యోగులు మేయర్ ముందు గోడు వినిపించుకున్నారు. దీంతో మేయర్ స్పందించి జాయింట్ కలెక్టర్‌తో మాట్లాడి త్వరలోనే అన్ని ఉద్యోగుల జీతాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

నగదు కరవు.. నీటి కరవు.. ఖర్చులు దరువు
* సంక్షోభంలో వ్యవసాయ రంగం
కావలి, డిసెంబర్ 19: పంటల సాగుకు వర్షాలు లేక తలెత్తిన కరవు పరిస్థితులు, అరకొరగా పడిన వర్షాలు, సోమశిల జలాల ద్వారా సాగు చేద్దామన్నా నగదు కరవు, దీనికి తోడు రెట్టింపైన పెట్టుబడులు వెరసి వ్యవసాయ రంగం సంక్షోభంలో పడింది. వర్షాలు పడటం అన్నది మానవుని చేతిలో లేకపోయినప్పటికీ మిగిలిన రెండు విషయాలు అధికార యంత్రాంగం నియంత్రణలో ఉండగా, ఆ రూపంలోనూ సహాయ సహకారాలు లభించక రైతు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత పాలకులు నగదు రహిత జపంలో ఉండి గ్రామీణ నేపధ్యాన్ని విస్మరించడం, వాస్తవ స్థితికి తగ్గట్లు వ్యవసాయ దారులకు కనీస స్థాయిలో అయినా నగదు అందుబాటులో ఉంచలేక పోవడం, ఇటీవలి వార్ధా తుపాను దేవుడి రూపంలో కరుణించినా పూజారి పాత్రలో ఉన్న యంత్రాంగం నిర్లక్ష్యం రైతును ఇక్కట్ల పాల్జేసింది. వాతావరణ అననుకూల పరిస్థితుల్లో ఒక్క ఎకరా అయినా వరి నాటుకుని గ్రాసానికైనా పండించుకుందామనుకున్నా ఎరువులు కొనేందుకు, దుక్కి చేసుకునేందుకు, కూలీల చెల్లింపులకు చేతిలో చిల్లిగవ్వలేక, బ్యాంకుల రిక్త హస్తాల నడుమ సకాలంలో సాగు చేయలేని స్థితిలో రైతాంగం కొట్టుమిట్టాడుతోంది. కౌలు రైతులు ప్రధానంగా పెట్టుబడులకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తుండటం పరిపాటి కాగా పెద్ద నోట్ల రద్దు తర్వాత వారికి కూడా నగదు లభ్యత లేక, ఉన్నా ప్రభుత్వ విధానాలతో అసలేం జరుగుతుందో తెలియక ఒట్టి చేతులే చూపుతుండటం నిద్రలేకుండా చేస్తోంది. నాలుగైదు శాతం పరపతి గల రైతాంగం, అదే స్థాయిలో కౌలు రైతులు మినహా మిగిలిన వారి పరిస్థితి మండు వేసవిలో విశాల ఎడారి నడుమ దప్పిక దాహంతో ఉన్న స్థితిని కళ్లకు కడుతోంది. నగదు చేతిలో లేకపోవడం, బ్యాంక్‌ల్లో నుంచి తీసుకోలేక పోవడం ఒక వైపు, తరుముకొస్తున్న కుటుంబ సాధారణ ఖర్చులు మరోవైపు, శిఖరాగ్రానికి చేరుతున్న పెట్టుబడి ఖర్చులు మరోవైపు వ్యవసాయ రంగాన్ని, సాధారణ రైతు కుటుంబాలను శక్తిహీనం చేస్తున్నాయి. కావలి డివిజన్‌లోని కావలి, బోగోలు, జలదంకి మండలాల్లో స్వల్పస్థాయిల్లోను, అల్లూరు, దగదర్తి మండలాల్లో 70శాతం వరి పంట సాగు చేస్తుండగా ఇటీవల కురిసిన వర్షాలతో మిగిలిన కలిగిరి, కొండాపురం, దుత్తలూరు, వరికుంటపాడు మండలాల్లో బోర్లకింద వరి, అపరాల సాగును రైతులు ప్రారంభించారు. అన్ని మండలాల్లో దాదాపు వరి, మెట్ట పంటలు 2.5 లక్షల ఎకరాల్లో పంటల సాగు ప్రారంభమైంది. వీటికి ప్రారంభంలో ప్రాథమికంగా ఎకరాకు ఎంతలేదన్నా 10 నుంచి 15 వేల రూపాయలు కావాల్సి ఉండగా, మొత్తంగా 375 కోట్ల రూపాయల వరకు అవసరమవుతాయి. అది ఒక్క కావలి డివిజన్ వ్యవసాయ పంటల సాగు ప్రారంభానికి మాత్రమే కాగా జిల్లా మెత్తంగా లెక్కలేసుకుంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది.
తడిసి మోపెడవుతున్న పెట్టుబడులు
వరి పంట సాగులో నాట్లు పూర్తియ్యేసరికే దాదాపు 15వేల రూపాయల వరకు ఖర్చు అవుతోంది. ప్రస్తుతం వరి నార్లు పోసి ఉండగా దుక్కులు చేసుకొనేందుకు 4వేల రూపాయలు, నాటుకు మరో నాలుగు వేల రూపాయలు, అలాగే ఆఖరి దుక్కిలో రసాయనిక ఎరువులు వేసేందుకు 2వేల రూపాయలు ఖర్చు అవుతోంది. దీనికి తోడు కాలువలు, గెనాల నిర్వహణకు, ఇతర కూలీల రూపంలో మరో 2వేలు మొత్తం తొలిదశలో 12వేలు రైతుకు చేతిలో కచ్చితంగా నగదు ఉండాల్సిన పరిస్థితి ఉంది. అపరాల విషయంలో కూడా దుక్కులు, విత్తన కొనుగోళ్లు, ఎరువులు, కూలీలు అన్ని ఏక మొత్తంగా ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉండగా దానికి కూడా 12వేల రూపాయల వరకు ఖర్చు అవుతోంది. 2 ఎకరాలు సాగు చేసే సామాన్య సన్నకారు రైతు, అలాగే కౌలు రైతుకు సాగు ప్రారంభించిన వారం రోజుల లోపలే 25నుంచి 30వేల రూపాయలు ఖర్చు అవుతోంది. వారి సమస్యను పరిష్కరించలేని స్థితిలో ప్రస్తుత స్థితి ఉండగా అనుక్షణం దేవుడిని పాలకులను తలుచుకొంటూ గడుపుతున్న స్థితి ఉంది. బ్యాంక్‌లు వ్యవసాయ రుణాలు మంజూరు చేసినప్పటికీ వాటిని చేతుల్లోకి తీసుకొనే పరిస్థితి లేకపోవడంతో రైతుల పరిస్థితి షుగర్ పేషంట్ ముందు స్వీట్లరాసులు పోసినట్లుగా ఉండగా ప్రభుత్వాల మీద తీవ్ర అసంతృప్తితో రైతాంగం ఉంది. ఈ పరిస్థితి ఒక్క కావలి డివిజన్‌కే కాక జిల్లా అంతా ఏ ప్రాంతానికి వెళ్లినా అలాగే కనిపిస్తోంది. ప్రభుత్వాలు ఇబ్బందులును దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

దోపిడీ దొంగల అరెస్ట్
* రూ.24 లక్షల సొత్తు స్వాధీనం

నెల్లూరు, డిసెంబర్ 19: దారికాచి దోపిడీకి పాల్పడుతున్న దొంగల ముఠాను నెల్లూరు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని సోమవారం ఉమేష్‌చంద్ర సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు.. నగరంలోని బాలాజీనగర్ ప్రాంతానికి చెందిన పావులూరి పార్ధసారథి స్థానిక శ్రీచైతన్య కళాశాలలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. తోటపల్లిగూడూరు మండలం కోడూరు గ్రామంలో రొయ్యల కొనుగోలు నిమిత్తం తన స్నేహితులతో కలిసి పార్ధసారథి ఈనెల 18న తెల్లవారుజామున అక్కడకు వెళ్లారు. రైతుల కోసం వాకబు చేసే సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వారిపై దాడి చేసి అతని వద్ద నుంచి 24 లక్షల 25 వేల రూపాయలు దోచుకుపోయారు. దీనిపై టిపి గూడూరు పోలీస్‌స్టేషన్‌లో పార్ధసారథి ఫిర్యాదు చేయడంతో ఎస్సై శివరామకృష్ణారెడ్డి నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలో మండలంలోని అనంతవరం, ఈదూరు గ్రామాల సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 11 మందిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకొని విచారించగా దోపిడీకి తామే పాల్పడినట్లు వారు విచారణలో వెల్లడించారు. అరెస్టయిన వారిలో వెల్లసిరి నాగేంద్ర (ఈదూరు), మద్దు హరీష్ (అనంతవరం), తోటకూర మల్లికార్జున అలియాస్ చిన్న (పాత కోడూరు), నేర్నూరు నరేంద్ర (కోడూరు), కుల్లూరు మస్తానయ్య (పాత కోడూరు), దగ్గు మురళి (కోడూరు), పెనుమల్లి సునీల్ (మాచర్లవారిపాలెం), తోటకూర సుబ్రహ్మణ్యం (పాత కోడూరు), తలారి చంద్రశేఖర్ (పాత కోడూరు), తోటకూర వెంకటరమణయ్య (పాత కోడూరు), తల్లూరు వెంకటరాయులు (మూలాపేట, నెల్లూరు)లు ఉన్నారు. వీరి వద్ద నుంచి రూ.23 లక్షల 92 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన కృష్ణపట్నం సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ఘట్టమనేని శ్రీనివాసరావు, ముత్తుకూరు, కృష్ణపట్నం, టిపి గూడూరు ఎస్సైలను ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ బి.శరత్‌బాబు, రూరల్ డిఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి, కృష్ణపట్నం సిఐ ఘట్టమనేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
నోట్ల మార్పిడే కారణమనే అనుమానాలు?
తోటపల్లిగూడూరులో జరిగిన దోపిడీ ఘటన వెనుక నోట్ల మార్పిడి వ్యవహారం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రద్దయిన నోట్లను తీసుకొని కొత్త నోట్లను ఇచ్చేందుకే బాధితుడు కోడూరు గ్రామానికి వెళ్లారని, అయితే బాధితుడ్ని ప్లాన్ ప్రకారం అక్కడకు రప్పించిన దుండగులు దాడి చేసి నగదును దోచుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. వేకువజామున పార్ధసారథి సంఘటనా స్థలానికి ఎందుకు వెళ్లారు? కళాశాలలో మేనేజర్‌గా పనిచేసే వ్యక్తికి కొత్త నోట్లు అంత భారీస్థాయిలో ఎలా వచ్చాయి అనే విషయాలకు సమాధానం లేదు.

పరిశోధన ఫలాలు సమాజాభివృద్ధికి దోహదపడాలి
విఎస్‌యు వైస్ చాన్స్‌లర్ వీరయ్య స్పష్టం
నెల్లూరు కలెక్టరేట్, డిసెంబర్ 19: పరిశోధన ఫలాలు సమాజాభివృద్ధికి తోడ్పడాలని విఎస్‌యు వైస్ ఛాన్స్‌లర్ వీరయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని విఆర్‌సి ప్రాంగణంలో ఉన్న వర్శిటీ సెమినార్ హాల్లో సోమవారం సాంఘికశాస్త్ర పరిశోధన పద్ధతులపై కార్యశాల (వర్క్‌షాష్)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశోధన అనేది డిగ్రీలాంటిది కాదని విషయ అవగాహన మూడేళ్లు పడుతుందని, ఇక పరిశోదన పద్ధతులు తెలియకపోతే మరింత జాప్యవౌతుందన్నారు. పరిశోధన అంటే అందరూ చూసిన విషయాన్ని చూడటంతో పాటు ఎవ్వరూ ఆలోచించని రీతిలో ఆలోచన చేయటమన్నారు. సాంఘిక శాస్త్రాలలో పరిశోధన పెద్ద సవాలన్నారు. ఈ శాస్త్రాలలో ఉన్న పరిశోధన పద్ధతులపై ఎస్‌సి, ఎస్‌టిలకు తర్ఫీదునివ్వటం ఇదే ప్రథమమన్నారు. ప్రాజెక్ట్‌లు, పరిశోధక సంస్థల నుండి వచ్చే ఆర్థిక సహాయం చాలా స్వల్పమని అయినా పట్టుదలతో సవాళ్లు అధిగమించాలన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ హైదరాబాద్ సహాయంతో నిర్వహిస్తున్న ఈ వర్క్‌షాప్ ఆరు రోజులపాలు నిర్వహిస్తామన్నారు. ప్రధాన వక్త తిరుపతి ఎస్‌వి యూనివర్శిటీ ఆచార్య కెవిఎన్ శర్మ మాట్లాడుతూ విద్యాభ్యాసంలో వివిధ దేశాలలో ఉన్న వర్శిటీలు మన ప్రమేయం లేకుండానే కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయని వాటికి అనుగుణంగా దేశీయ విద్య కూడా అభివృద్ధి చెందాలన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య పి శివశంకర్, వర్శిటీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య వెంకటరావు, డాక్టర్ కుసుమ, టి విజేత తదితరులు పాల్గొన్నారు.

ప్రతిఒక్కరికి సాంకేతిక పరిజ్ఞానం అవసరం
* వృత్తి నైపుణ్యత కోర్సులతో ఉద్యోగావకాశాలు
* జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ స్పష్టం
వెంకటాచలం, డిసెంబర్ 19: ప్రస్తుత సమాజంలో ప్రతిఒక్కరు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అన్నారు. మండలంలోని గొలగమూడి వెంకయ్యస్వామి ఆశ్రమ పాఠశాలలో సోమవారం గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన మానవ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నాలుగు జిల్లాలకు చెందిన ఉద్యోగులకు ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ వర్క్‌షాప్ నిర్వహించారు. మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ వర్క్‌షాప్‌ను జెసి ఇంతియాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్‌నెట్‌పై ప్రతిఒక్కరు అవగాహన పెంచుకుని దానికి జీవితంలో, వృత్తిలో ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలన్నారు. ఇలాంటి శిక్షణలతో వృత్తి నైపుణ్యత పెరగటంతోపాటు పనులు కూడా సులభంగా పూర్తి చేసుకోవచ్చాన్నారు. వృత్తి నైపుణ్యత కోర్సుల ద్వారా యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా ఉన్నాయన్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా శిక్షణ ఇస్తున్న విధానాన్ని ఆయన పరిశిలించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఆర్‌డిఏ డిజి చక్రపాణి, డిటిసి మేనేజర్ గౌస్‌బాషా, వెంకయ్యస్వామి ఆశ్రమ ఇవో బాలసుబ్రహ్మణ్యం, వెంకటాచలం తహశీల్దార్ సుధాకర్, చిత్తూరు, ఒంగోలు, కడప, నెల్లూరు జిల్లాలకు చెందిన పలువురు అధికారులు, ఉద్యోగులు, నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

తడ కండ్రిగలో ఆక్రమణల తొలగింపు
తడ, డిసెంబర్ 19: మండల కేంద్రమైన తడ కండ్రిగలో సోమవారం ఆక్రమణలు తొలిగించే కార్యక్రమం చేపట్టారు. ఏళ్లతరబడి తడ కండ్రిగ బజారులో జాతీయ రహదారికి ఇరువైపులా ఆక్రమణలకు గురైన ప్రాంతాలను పోలీసులు, నేషనల్ హైవే అథారిటీ, రెవెన్యూ అధికారుల సహకారంతో తొలగించారు. బజారులో ఆక్రమించిన ప్రదేశాలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలంటూ పోలీసు బలగాలతో కలిసి అధికారులు కోరారు. పది గంటల నుండి జెసిబి, క్రేన్ల సాయంతో ఆక్రమణలను తొలగించారు. ఎన్‌హెచ్ వారు మార్కింగ్ చేసిన ప్రాంతాలను తొలిగించారు. ఎక్కువ శాతం చిరువ్యాపారులు, కూరగాయలు, పండ్ల వ్యాపారస్తులు ఉన్నట్టుండి ఈ తొలగింపు చేపట్టడంతో రోడ్డున పడ్డారు. తమకు ప్రత్యామ్నాయ ప్రదేశాలను పంచాయతీ వారు చూపలేదని ఆవేదన చెందారు. వాస్తవానికి ఎన్‌హెచ్ వారు వారం నుండే స్వచ్ఛందంగా ఆక్రమణలను తొలగించుకోవాలని ఆదేశాలు ఇచ్చినా వారు తొలగించక పోవడంతో సోమవారం ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం చుట్టారు. మంగళవారం కూడా ఈ ఆక్రమణల తొలగింపు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట సిఐ విజయకృష్ణ, ఎస్సై సురేష్‌బాబు, తహశీల్దార్ ఏడుకొండలు, రెవెన్యూ అధికారులు, ఎన్‌హెచ్ సిబ్బంది పాల్గొన్నారు.

అధిక లోడుతో వెళుతున్న లారీ పట్టివేత
తడ, డిసెంబర్ 19: ప్రకాశం జిల్లా పామూరు నుండి చెన్నైకి అధిక లోడుతో వెళుతున్న వాహనాన్ని సోమవారం రవాణా శాఖ అధికారులు పట్టుకున్నారు. తడ బివి పాలెం చెక్‌పోస్టు మీదుగా పామూరు నుండి చెన్నైకి తెల్లరాయి తరలించే వాహనాన్ని అధికారులు ఆపేందుకు వెళ్లగా ఆ వాహనం ఆపకుండా వెళ్లిపోవడంతో రవాణా శాఖాధికారులు వెంటాడి దానిని పట్టుకొని తనిఖీ కేంద్రానికి తీసుకొచ్చారు. డ్రైవర్ పరార్ కావడంతో వాహనం టైర్లకు గాలి తీసి తనిఖీ కేంద్రం వద్ద ఉంచారు.

ఎడతెగని క్యూలైన్‌లు

కావలి, డిసెంబర్ 19: ప్రభుత్వం, అధికార యంత్రాంగం నగదు రహిత లావాదేవీలపై చెబుతున్న మాటలు, బ్యాంక్‌లు, ఏటిఎంల ముందు నగదు కోసం ఎడతెగని క్యూలైన్‌లు వేటికవే సమాంతరంగా కొనసాగుతున్నాయి. పక్షం రోజులుగా మున్సిపల్, మండల స్థాయి అధికారులు, వివిధ కంపెనీల సాంకేతిక సిబ్బంది మొబైల్ ద్వారానే నగదు బట్వాడా చేసి వస్తువులు కొనుక్కోవచ్చని, ఇతరుల ఖాతాలకు నగదును డిజిటల్ విధానంలో పంపించవచ్చని చెబుతుండగా అవి గాలిలోనే కలిసి పోతున్నాయి. వాటిపై ఆసక్తి పెంచుకొని ఆ తరహాలో లావాదేవీలు చేసే వారే కనిపించక పోగా నగదు మాత్రమే కావాలన్నట్లుగా పొద్దుపొడుపుకంటే ముందుగానే జనం ఏటిఎంల ముందు వాలిపోతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి రైతులు ఏటిఎంల వద్దకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నగదు రహిత లావాదేవీలు చేయాలని ప్రభుత్వం చెబుతుండగా అది అమలు కాని స్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఇది సమాంతరంగా సాగిపోయే రైలు పట్టాల స్థితిని కళ్లకు కడుతోంది. పెద్ద నోట్లు రద్దు చేసి కొత్తనోట్లు ప్రవేశపెట్టి 42 రోజులు అయినప్పటికీ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. కొన్ని పెట్రోలు బంకులు మినహా మిగిలిన అన్ని రంగాలలో ఏ ఒక్క హోల్‌సేల్ దుకాణాలలోను పిఓఎస్ మిషన్‌లు ఏర్పాటు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఫలితంగా హోల్‌సేల్ దుకాణాల నుంచి రిటైల్ దుకాణాల వరకు అలాగే సందుగొందుల్లో ఉన్న బంకుల వరకు వస్తువుల కొనుగోళ్లలో నగదు లావాదేవీలే ప్రధానంగా కొనసాగుతున్నాయి. నగదు అందుబాటులో లేకపోతే పరిచయాల దృష్ట్యా అప్పు ప్రాతిపదికన ఫల సరుకులు ఇతర సామాగ్రి తీసుకెళుతూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. గ్రామ సీమల్లో రైతాంగం పరిస్థితి అలాగే ఉండగా కూలీలను అరువు ప్రాతిపదికనే పనులకు తెచ్చుకొంటున్న పరిస్థితి ఉంది. ఒక ఎకరా వరి నాటుకు 4వేల రూపాయలు ఖర్చు అవుతుండగా రైతులు సంబంధిత కూలీలకు 2వేల రూపాయల నోట్లు రెండు ఇస్తుండగా, 12మంది కలిసి బృందంగా ఏర్పడి పనులు చేసుకొని ఆరు ఎకరాలు నాటగా వచ్చిన 2వేల రూపాయల నోట్లను సమంగా పంచుకొంటున్న పరిస్థితి ఉంది. ఇలా రైతులు, రైతు కూలీలు అవస్థలు పడుతూ అనుక్షణం ప్రభుత్వ పెద్దలను తలుచుకొంటూ పనులు మందకొడిగా సాగిస్తున్నారు. రైతులకు మొబైల్ టెక్నాలజిపై అవగాహన లేమిని కూడా పరిగణలోనికి తీసుకొని బ్యాంక్‌ల ద్వారా వారికి ప్రత్యేకంగా చిల్లర నోట్లు ఇప్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టాలని రైతులు, రైతు సంఘాల నేతలు కోరుతున్నారు.

పూజల పేరిట మోసగించిన ఇద్దరు యువకుల అరెస్ట్
ఆత్మకూరు, డిసెంబర్ 19: తమ ఆధ్వర్యంలో పూజలు నిర్వహిస్తే మీకున్న చింతలు తీరుతాయని ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్లలో ప్రసారం చేసి మోసగించి సుమారు మూడు లక్షల రూపాయల వరకు నగదు, బంగారం దోచుకున్న ఇద్దరు నిందితులను ఆత్మకూరు పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక జగన్నాధరావుపేట ప్రాంతంలో ఓ వృద్ధురాలి నుంచి నిందితులు నగదు, బంగారం గుంజుకున్నారు. సోమవారంనాడు ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో భాగంగా నిందితుల వివరాలను వెల్లడించడంతో సహా వారి వద్ద నుంచి స్వాధీనపరచుకున్న సొమ్ము కోర్టుకు అప్పగిస్తున్నట్లు సిఐ ఖాజావలి తెలిపారు. విలేఖర్ల సమావేశంలో ఇంకా ఆత్మకూరు ఎస్సై-1 ఎం పూర్ణచంద్రరావు, సిబ్బంది పాల్గొన్నారు.

ఆత్మకూరు మార్కెట్ కమిటీలో 2వేల మెట్రిక్ టన్నుల గోదాము
* చైర్మన్ కుడుముల సుధాకర్‌రెడ్డి వెల్లడి
ఆత్మకూరు, డిసెంబర్ 19: కేంద్ర మంత్రి ముప్పవరపువెంకయ్యనాయుడు చొరవతో స్థానిక యార్డులో రెండువేల మెట్రిక్ టన్నుల గోదాము మంజూరైందని ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుముల సుధాకర్‌రెడ్డి వెల్లడించారు. ఇటీవల కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నియోజకవర్గంలోని చిరమనకు వచ్చిన సందర్భంలో ఈ విషయమై విన్నవించడంతో అప్పటికప్పుడే వ్యవసాయ మంత్రికి సూచించి మంజూరు చేసేలా ప్రత్యేకంగా దృష్టి సారించారని కృతజ్ఞతలు తెలిపారు. తమ పాలకవర్గానికి పదవీకాలం మరో ఆరు మాసాలు పెంపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు చేయడాన్ని ఉద్దేశించి కూడా ధన్యవాదాలు తెలియజేశారు. సోమవారం పాలకవర్గ త్రైమాసిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కుడుముల సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ మార్కెట్ కమిటీ ద్వారా రైతుల ఉపయోగార్థం పంపించిన ప్రతిపాదిత లింకురోడ్లపై చర్చించారు. సదరు పంచాయతీరాజ్ శాఖ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో సంబంధిత జెఇని సమావేశం వద్దకు పిలిపించి సమీక్షించారు. లింకురోడ్లకై మార్కెట్ కమిటీ 20లక్షల రూపాయల వరకు వెచ్చిస్తున్నందున నిర్మాణ క్రమం చూసిన తరువాతే నిధులు మంజూరు చేయడం జరుగుతుందని కుడుముల స్పష్టం చేశారు. పాలకవర్గ పదవీకాలం పెంపుదల పట్ల కుడుముల సుధాకర్‌రెడ్డితోపాటు ఉప చైర్మన్ చండ్రా వెంకట సుబ్బయ్యలను మార్కెట్ కమిటీ కార్యదర్శి కృష్ణప్రసాద్, సిబ్బంది ప్రత్యేకంగా సన్మానించారు. కార్యక్రమంలో ఇంకా డైరెక్టర్లు గడ్డం కిశోర్‌రెడ్డి, చీర్ల వెంకటేశ్వర్లు, మాదాల చంద్రశేఖర్, ఫఠాన్ సాబ్జాన్, చెరుకూరు శ్రీనివాసులు, మేకల బాలకొండయ్య, చంద్రపాటి మంగమ్మ, కపాల లక్ష్మినరసమ్మ, మారెళ్ల యల్లమ్మ, సిబ్బంది ఎడ్వర్డ్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.

అట్టహాసంగా ఫ్లెమింగో రోడ్డుషో
సూళ్లూరుపేట, డిసెంబర్ 19: సూళ్లూరుపేట వేదికగా ఈ నెల 27వ తేదీ నుంచి జరిగే పక్షుల పండుగను పురస్కరించుకుని సోమవారం పట్టణంలో ఫ్లెమింగో రోడ్డుషోను నిర్వహించారు. ఎంఎల్‌సి వాకాటి నారాయణరెడ్డి, మాజీ మంత్రి పరసా వెంకటరత్నం, జడ్పి ఫ్లోర్ లీడర్ వేనాటి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధికార బృందం స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో రోడ్డుషోను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పట్టణ వీధుల్లో విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పొదుపుమహిళలు భారీగా రోడ్డు షోలో పాల్గొన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ మీదుగా పురవీధుల్లో నిర్వహించి హోలిక్రాస్ వరకు జిఎన్‌టి రోడ్డుమీద అట్టహాసంగా రోడ్డుషో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి వాకాటి మాట్లాడుతూ పక్షుల పండుగను అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలసి విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే జిల్లా కేంద్రంతో సహా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఫ్లెమింగో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఫ్లెమింగో ఫెస్టివల్‌ను పురస్కరించుకుని రూపొందించిన పాటల సిడిని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు చంద్రవౌళి, నాగభూషణం, ఆర్డీఓ శీనానాయక్, తహశీల్దార్ రవీంద్రబాబు, ఎస్సై గంగాధర్, టిడిపి నేత ఇసనాక హర్షవర్ధనరెడ్డి, చెంగాళమ్మ ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ వెంకటేశ్వర్లురెడ్డి, జడ్పిటిసి విజేత, మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.