శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

మాట తప్పిన మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, జనవరి 27: ప్రధాని అభ్యర్థిగా నవ్యాంధ్రలో ప్రచారానికి వచ్చిన సందర్భంలో నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని, తీరా అదే పదవిలో గద్దెనెక్కాక విస్మరిస్తే ఎలాగంటూ నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహనరెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామంటూ సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి పాదపద్మాల సాక్షిగా తిరుపతిలో గత ఎన్నికలకు ముందు జరిగిన ప్రచార సభలో నరేంద్రమోదీ ప్రకటించిన సంగతి ఎంపి మేకపాటి గుర్తు చేశారు. ప్రధానిగా గత రెండున్నర సంవత్సరాల్లో ఈ వాగ్ధానం నెరవేర్చకపోగా, ప్రత్యేక హోదా ఇచ్చేందుకే సాధ్యపడదని ఇప్పుడు మాట మారుస్తుండటం క్షమార్హం కాదన్నారు. హోదా సాధించే దిశగా ప్రయత్నించకపోగా, ప్యాకేజికి అమ్ముడుపోతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహార శైలి అప్రజాస్వామికమని ఆరోపించారు. శుక్రవారం ఆత్మకూరు పట్టణంలో నిర్వహించిన ప్రత్యేక హోదా నిరసన ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపి మేకపాటి మాట్లాడుతూ తమిళనాడులో సాంప్రదాయ జల్లికట్టు క్రీడకు సుప్రీమ్ కోర్టు అడ్డుకట్ట వేసినా అక్కడి యువత ఉప్పెనలా పోరు బాటలో సాగారన్నారు. ఆర్డినెన్స్ కాదుకదా ఏకంగా చట్టబద్ధత కల్పించాలంటూ డిమాండ్ చేస్తూ తమిళ యువతీ యువకులు తిరుగులేని రీతిలో సంఘటితంగా చేసిన ఆందోళనలు ఆదర్శనీయమన్నారు. అదే కోవలో ఆంధ్రా యువత కూడా పోరాడితే తప్పక ప్రత్యేక హోదా సాధించుకోవచ్చన్నారు. ఐదుకోట్ల మందిని నిలువునా ద్రోహం చేస్తున్న పాలకులకు తగిన గుణపాఠం చెప్పినట్లవుతుందన్నారు. ఈ డిమాండ్ సాధనకై శాంతియుత రీతిలో ర్యాలీ వైజాగ్‌లో చేస్తుంటే వైఎస్ జగన్‌ను అడ్డుకున్న చంద్రబాబు సర్కార్ తీరు గర్హనీయమన్నారు. అందరి భవిష్యత్తుకు సంబంధించిన అంశం ప్రత్యేక హోదా అంటూ మేకపాటి ఉద్ఘాటించారు. యువతకు అపారంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. రాష్ట్రం ఆర్థికంగా స్థిరపడాలంటే తప్పక నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆత్మకూరు చిన్న పురపాలక సంఘమే అయినా ఇక్కడ నుంచే ప్రజలకు పిలుపునిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆయన వెంట నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఆత్మకూరు, ఏఎస్‌పేట మండలాల ముఖ్య నేతలు బొమ్మిరెడ్డి రవీంద్రనాథరెడ్డి, విజిఆర్ సుబ్బారెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి, మండల పరిషత్ అధ్యక్షురాలు సిద్ధం సుష్మ, ఉపాధ్యక్షులు తోట కృష్ణ, మున్సిపల్ కౌన్సిల్ పక్ష నేత అల్లారెడ్డి ఆనందరెడ్డి, పార్టీ నేతలు నోటి వినయకుమార్‌రెడ్డి, ఎద్దల శ్రీనివాసులురెడ్డి, జహీర్, విద్యార్థి విభాగ నేత వశీమ్ తదితరులు పాల్గొన్నారు.

జగన్ బెదిరింపులకు పాల్పడటం తగదు
* పోలీసు అధికారుల సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు హితవు
నెల్లూరు, జనవరి 27: పోలీసుల పట్ల ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెదిరింపులకు పాల్పడుతూ మాట్లాడటం తగదని పోలీసు అధికార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం నెల్లూరు జిల్లా పోలీసు అధికారుల సంఘ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పోలీసు వ్యవస్థ అనేది ప్రభుత్వ ఉత్తర్వులను చట్టరీత్యా అమలుపర్చడం కోసం ఉద్దేశించబడిందన్నారు. వైజాగ్‌లో కొవ్వొత్తుల ర్యాలీకి అనుమతులు లేనందున జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొంటే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతో పోలీసులు ఆయనను విశాఖ ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నట్లు తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ‘మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాను, మీ సంగతి చూస్తాను’ అంటూ భయబ్రాంతులకు గురిచేయడం తగదని, దీన్ని తమ సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసు వ్యవస్థపై ఈ తరహా బెదిరింపులకు పాల్పడటం సమంజసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గంగాధర్, జిల్లా అధ్యక్షుడు ఎం ప్రసాదరావు, సంఘ నాయకులు తురకా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
మలవిసర్జన రహిత జిల్లాగా చేయడానికి బ్యాంకర్లు సహకరించాలి
* జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు

నెల్లూరు, జనవరి 27: నెల్లూరు జిల్లాను 31వ తేదీ నాటికి బహిరంగ మలవిసర్జన జిల్లాగా చేయడానికి బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు కోరారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ బంగ్లాలో ఆత్మగౌరవం అమలుపై బ్యాంకర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా మార్చడానికి సుమారు రూ.350 కోట్ల మేర అవసరమని తెలిపారు. ఈ నెలాఖరుకు నెల్లూరు, పొదలకూరు, ఆత్మకూరు, కోవూరు మండలాలను బహిరంగ మలవిసర్జన రహిత మండలాలుగా ప్రకటించడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. బ్యాంకర్లు ముందుకు వచ్చి ఏదైనా గ్రామాలను దత్తత తీసుకోవచ్చని ఆయన కోరారు. బ్యాంకుల్లో అందుబాటులో ఉన్న నిధులు వెచ్చించి, మరుగుదొడ్లు నిర్మిస్తే మరుగుదొడ్లు పూర్తయిన అనంతరం సదరు నిధుల సొమ్మును తిరిగి చెల్లిస్తామన్నారు. ఈ విషయమై అవసరమైతే బ్యాంకు ముఖ్య అధికారులతో చర్చిస్తామని ఆయన తెలిపారు. మనుబోలు మండలాన్ని బహిరంగ మలవిసర్జన రహిత మండలంగా ప్రకటించడంలో కోటి రూపాయలు అడ్వాన్స్‌గా ఇవ్వడం జరిగిందని, సదరు అడ్వాన్స్‌ను ఫిబ్రవరి మాసాంతరం తిరిగి పొందడం జరుగుతుందని, తిరిగి సదరు నగదును వేరొక మండలానికి అడ్వాన్స్‌గా ఇవ్వడం జరుగుతుందన్నారు. తొలుత ఆత్మగౌరవం పిడి సుమ్మితారెడ్డి మరుగుదొడ్లు వాటి నిర్మాణంపై బ్యాంకర్లకు విశదీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్, ఎల్‌డిఎం, ఇతర బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

జిల్లాలో స్వైన్‌ఫ్లూ కలకలం

* చెన్నైలో చికిత్సలు పొందుతున్న బాధితులు
తడ మండలం రామాపురం పిహెచ్‌సి పరిధిలో ముగ్గురు, వెంకటాచలం మండలంలో ఒకరికి స్వైన్ ఫ్లూ సోకినట్లు తెలియడంతో జిల్లాలో కలకలం రేగింది. బాధితులు చెన్నైలో చికిత్సలు పొందుతున్నట్లు తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయ.
తడ, జనవరి 27 : మండల పరిధిలోని రామాపురం పిహెచ్‌సి పరిధిలోని పూడి గ్రామంలో ముగ్గురు చిన్నారులకు స్వైన్‌ఫ్లూ ఉన్నట్టు వైద్యాధికారులు నిర్ధారించారు. దీంతో వీరికి చెన్నైలో వైద్యం అందిస్తున్నారు. పూడి గ్రామంలోని కొళవి కావ్వశ్రీ (3), దర్శినీ, హేమవర్షిణి అనే చిన్నారులు పక్క పక్క ఇళ్లలోని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు. వినోద్, సెల్విల కుమార్తె కావ్యశ్రీ, అరుళ్, గోమతిల కుమార్తె దర్శినీ, వాసు, సల్సాల కుమార్తె హేమవర్షిణీ గత శనివారం నుంచి జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. వీరిని చెన్నైలోని మెహతా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. వీరికి అక్కడ వైద్యాధికారులు చికిత్స అందించినా వ్యాధి తగ్గకపోవడంతో వీరి రక్తాన్ని పరీక్షకు పంపారు. సోమవారం వీరిరువురికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం వైద్యాధికారులు చిన్నారుల తల్లిదండ్రులకు విషయం తెలియచేశారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గ్రామంలో ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ఈ విషయాన్ని బుధవారం రామాపురం వైద్యాధికారి దేదీప్య తెలుసుకొని గ్రామంలో క్లోరినేషన్‌తో పాటు ఉచితంగా మందుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. గురువారం ప్రత్యేక వైద్యశిబిరాన్ని గ్రామంలో ఏర్పాటు చేసి గ్రామస్థులకు ఉచితంగా మందులను అందచేశారు.
వెంకటాచలంలో స్వైన్‌ప్లూ ?
వెంకటాచలం : మండలంలోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తికి స్వైన్‌ప్లూ సోకినట్లు సమాచారం. శుక్రవారం తీవ్ర జ్వరంతో బాధితుడు నెల్లూరులోని ఒక ఆసుపత్రిలో చేరగా అక్కడి వైద్యులు సదరు వ్యక్తిని పరీక్షించి స్వైన్‌ప్లూ లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలిసింది. ఈ విషయంపై వైద్యులు జిల్లా వైద్యశాఖ అధికారులకు కూడా సమాచారం ఇచ్చినట్లు సమాచారం. అయితే వివరాలు బయటపెడితే ప్రజలు ఆందోళన చెందుతారని, వైద్యశాఖ ఉన్నతాధికారులు ఈ విషయాన్ని బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై మండలంలోని ఒక ఆరోగ్య కేంద్రంలోని ఒక అధికారిని ప్రశ్నించగా తనకు విషయం తెలిసిందని, అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియలేదన్నారు.

‘స్వచ్ఛ్భారత్ లక్ష్యాలను అధిగమించాలి’
గూడూరు, జనవరి 27: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి స్వచ్ఛ్భారత్ లక్ష్యాన్ని నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని, ఇందుకు అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజను చైతన్యవంతులను చేయాలని గూడూరుకు నూతనంగా ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన అరుణ్‌కుమార్ కోరారు. శుక్రవారం ఆయన ఆర్డీవో ఛాంబర్‌లో మండలంలోని అన్ని శాఖల అధికారులతో స్వచ్ఛ్భారత్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణానికి, మండలానికి కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేశారా, చేయకుంటే అందుకు గల కారణాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే గృహ నిర్మాణాలకు సంబంధించి మంజూరైన గృహాల నిర్మాణాల్లో పురోగతి గురించి హౌసింగ్ అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు సకాలంలో అమలు చేసే విధంగా ప్రతి అధికారి చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు. అంతకు వివిధ మండలాల నుంచి వచ్చిన పలువురు అధికారులు ఆర్డీవోను కలసి అభినందించారు.
ఓడరేవులో ఇంటర్నేషనల్ కస్టమ్స్‌డే వేడుకలు
ముత్తుకూరు, జనవరి 27: కృష్ణపట్నం ఓడరేవులో ఇంటర్నేషనల్ కస్టమ్స్ హౌస్ ప్రాంగణంలో ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కస్టమ్స్ కమిషనర్ ఎస్‌కె రెహమాన్, పోర్టు మేనేజింగ్ డైరెక్టర్ చింతా శశిధర్, సిఇఓ అనిల్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎండి శశిధర్ టాప్ ఇంపోర్ట్స్, టాప్ ఎక్స్‌పోర్ట్స్ విశిష్ట సేవలు అందించిన కస్టమ్స్ అధికారులను ప్రశంసించారు. విశేష సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాలను బహూకరించారు. ఈ సందర్భంగా కస్టమ్స్ కమిషనర్ ఎస్‌కె రెహమాన్ వ్యాపారవేత్తలకు, పరిశ్రమ యజమానులకు పోర్టులో కస్టమ్స్ సేవలు అందిస్తున్న వాటి గురించి వివరించారు. కస్టమ్స్ జాయింట్ కమిషనర్ రామ్మోహన్‌రావు మాట్లాడుతూ, పోర్టు అభివృద్ధిలో ఎగుమతులు, దిగుమతులు కీలకమని, ఎగుమతులు, దిగుమతులకు త్వరితగతిన అనుమతులు అందేలా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోర్టు సిఇఓ అనిల్‌కుమార్, కస్టమ్స్ అధికారులు, అసిస్టెంట్ కమిషనర్ కె రామారావు, ముఖ్య కస్టమ్స్ సలహాదారుడు వివిఎస్‌ఎన్ మూర్తి పాల్గొన్నారు.
‘సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి’
కావలి టౌన్, జనవరి 27: మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి విద్యార్థి పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని చెన్నైకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ నిర్మల విద్యార్థులను కోరారు. శుక్రవారం పట్టణంలోని డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో ల్యాండ్ కంప్యూటర్స్ అండ్ ఇంటర్నెట్ థింక్స్ అనే అంశంపై నాలుగో ఏడాది సిఎస్‌ఇ, ఇసిఓ విద్యార్థులకు నిర్వహించిన సెమినార్‌లో ముఖ్యఅతిథిగా డాక్టర్ నిర్మల హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని ఆ వైపుగా దృష్టిసారించి నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థ కార్యదర్శి బాలసురేష్, విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంపై పలు సూచనలు, సలహాలు చేశారు. ప్రిన్సిపాల్ పివి రావు, రమేష్‌బాబు, వరప్రసాద్ పాల్గొన్నారు.
చెల్లని చెక్కు కేసులో ఒకరికి ఆరు నెలలు జైలు
నెల్లూరు లీగల్, జనవరి 27: అప్పు జమ కింద చెల్లని చెక్కు ఇచ్చారని దాఖలైన ప్రైవేటు కేసులో నిందితుడు చెరుకూరి సుమన్‌కుమార్‌పై ఆరోపణలు రుజువైనందున ఆయనకు ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ నెల్లూరు మొబైల్ మేజిస్ట్రేట్ శుక్రవారం తీర్పు చెప్పారు. నెల్లూరు మూలాపేటకు చెందిన ఫిర్యాది చొప్పారపు వెంకటసూర్యనారాయణ నుంచి అదే ప్రాంతానికి చెందిన నిందితుడు సుమన్‌కుమార్ 2013 జూన్ 24న రెండు లక్షలు అప్పుగా తీసుకొని అందుకుగాను ఆయనకు ప్రామిసరీ నోటు రాసి ఇచ్చాడు. ఈ బాకీ జమ కింద 2015 జనవరి 19న రెండు లక్షల విలువ చేసే చెక్కును ఫిర్యాదికి ఇచ్చాడు. కలెక్షన్ నిమిత్తం చెక్కును బ్యాంక్‌లో వేయగా అది చెల్లలేదు. దీనిపై ఫిర్యాది వెంకటసూర్యనారాయణ సంబంధిత కోర్టులో నిందితుడు సుమన్‌కుమార్‌పై ప్రైవేటు కేసు దాఖలు చేశారు. కేసు విచారణ అనంతరం న్యాయమూర్తి పైమేర తీర్పు ఇచ్చారు.

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు
* వైకాపా ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ప్రదర్శన
గూడూరు, జనవరి 27: ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, దానిని సాధించుకునే వరకు పోరాటం ఆగదని వైకాపా నాయకులు హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహం నుంచి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులు పట్టుకుని టవర్ క్లాక్ సెంటర్ నుంచి రాజావీధి, గాంధీబొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వైకాపా నియోజకవర్గ కన్వీనర్ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ తిరుపతి బహిరంగ సభలో హాదా ఇస్తానని చెప్పిన మాట గుర్తు లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రత్యేక హోదా సాధించుకునే వరకు విశ్రమించేది లేదని వైకాపా కేంద్ర కమిటీ సభ్యులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం విద్యార్థులు, మేధావులు, రాజకీయ పక్షాలు పోరాడుతుంటే మద్దతు తెలపాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హోదా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయడం బాధాకరమన్నారు. తమ నేత జగన్మోహనరెడ్డి హోదా కోసం ఉద్యమంలో పాల్గొనడానికి విశాఖకు వెళ్లే కనీసం బయటకు వెళ్లనీయకుండా విమాశ్రయంలో పోలీసులు అడ్డుకోవడం పట్ల వైకాపా నేత బత్తిని విజయకుమార్ దుయ్యబట్టారు. అరెస్టులు, బెదిరింపులతో ఉద్యమాన్ని నీరు గార్చలేరని, అణగదొక్కితే ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చి కేంద్రం పీఠాన్ని కదిలిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైకాపా నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు.

పల్స్‌పోలియోను విజయవంతం చేయండి
* డిఎంఅండ్‌హెచ్‌ఓ పిలుపు
నెల్లూరుసిటీ, జనవరి 27: మొదటి విడత పల్స్‌పోలియో కార్యక్రమం ఈ ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వరసుందరం తెలిపారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల డాక్టర్లు, సూపర్‌వైజర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు నూరు శాతం వేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. మూడురోజుల పాటు జరిగే పల్స్‌పోలియో కార్యక్రమానికి ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు. మొబైల్, ట్రాన్సిట్ టీమ్‌లు కట్టుదిట్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైరిస్క్ ఏరియాలలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నూరుశాతం పిల్లలకు పోలియో చుక్కలు వేసేలా ప్రతి వైద్యాధికారి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ఎడివి లక్ష్మి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి జయసింహ, జిల్లా అదనపు వైద్యాధికారి సి రమాదేవి, సుగుణ, సునీత తదితరులు పాల్గొన్నారు.

కావలి రూరల్, జనవరి 27: ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించి తద్వారా బహిరంగ మలవిసర్జన లేని ప్రాంతాలుగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఆత్మగౌరవం కార్యక్రమ లక్ష్యసాధనకు తమ తోడ్పాటును అందించాలని డ్వామా పిడి హరిత అధికారులను కోరారు. శుక్రవారం మండల స్థాయి అధికారులు ఎంపిడివో జ్యోతి, హౌసింగ్ ఎఇ ప్రసాద్, ఇరిగేషన్ ఎఇ సుధీర్, ఎంఇఓ శ్రీ్ధర్, వ్యవసాయ శాఖ ఏవో సురేష్‌బాబు, ఆ శాఖ ఏపిడి వెంకటరావుతో కలిసి ఈ పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్చి మాసాంతం లోపు ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి నిర్మించుకుని రాష్ట్రంలో బహిరంగ మల విసర్జన లేని జిల్లాగా స్థానం సంపాదించాలనేది కలెక్టర్ ఆకాంక్ష అన్నారు. ఈ మేరకు లబ్ధిదారులకు 15వేల రూపాయిలు చెల్లిస్తుందని చెప్పారు. రాత్రి వేళ బసచేసే అధికారులు ఆయా గ్రామాలలో మరుగుదొడ్డి నిర్మాణంపై ప్రజల్లో చైతన్యం నింపి లక్ష్య సాధనకు కృషి చేయాలని కోరింది. బహిరంగ మలవిసర్జన ద్వారా వ్యాధుల బారినపడి వైద్యశాలల చుట్టూ తిరుగుతూ బాధలు పడుతున్నారన్నారు. అలా కాకుండా ఆరోగ్యవంతమైన జీవితం గడిపేందుకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి భారీగా నిధులు కేటాయిస్తూ అవకాశం కల్పించిందన్నారు. బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం లేకుండా పరిరక్షణ అధికారుల చెల్లింపులు ఉంటాయన్నారు. పజాప్రతినిధులు, అంగన్‌వాడీలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశావర్కర్లు, వైద్య సిబ్బంది కృషి చేయాలని కోరింది. ఈ సమీక్షలో గ్రామాల్లో ఇంకా ఎన్ని మరుగుదొడ్లు నిర్మించాలో అనే అంశంపై ప్రతిఒక్కరిని తెలుసుకుని త్వరితగతిన పూర్తి చేసేలా కృషిచేయాలని కోరారు.

అమరావతి, పోలవరం త్వరగా పూర్తికావాలంటూ సైకిల్ యాత్ర
కొండాపురం, జనవరి 27 : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రాష్ట్ర రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం త్వరగా పూర్తికావాలని కోరుకుంటూ కృష్ణా జిల్లాకు చెందిన కొందరు టిడిపి నాయకులు సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ యాత్ర శుక్రవారం కొండాపురం చేరుకుంది. ఆ జిల్లాలోని పెనమలూరు మండల అధ్యక్షుడు అనుమోలు ప్రభాకర్ సారధ్యంలో కె వెంకటసుబ్బయ్య ఇంకొంత మందితో కలసి సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఈ విధంగా యాత్ర చేసుకుంటూ అరుణాచలం వెళ్లనున్నట్లు ప్రభాకర్ తెలిపారు. తాము గ్రామీణ ప్రాంతాల మీదుగా యాత్ర చేస్తున్నామని ఇందువల్ల రైతుల సమస్యలు తెలుసుకునే అవకాశం కలిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల కష్టాలు తొలగిపోవాలన్న ఉద్దేశ్యంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేయిస్తున్నారన్నారు. అమరావతిని కూడా ప్రపంచ స్థాయి రాజధానిగా చేసేందుకు కష్టపడుతున్నారని అన్నారు. ఈ రెండు కార్యక్రమాలు త్వరగా పూర్తి కావాలని తాము అరుణాచలం వెళ్లి అక్కడ స్వామికి మొక్కులు చెల్లిస్తామన్నారు. ఈ సందర్భంగా వారికి టిఎన్‌ఎస్‌వి జిల్లా ప్రచార కార్యదర్శి మద్దసాని రాజా తదితరులు స్వాగతం పలికారు.

సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన రైతులు
మనుబోలు, జనవరి 27 : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గత నాలుగురోజులుగా కండలేరు వాగు వెంబడి ఉన్న వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించిన విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో మండల పరిధిలోని వీరంపల్లి గ్రామానికి చెందిన మెట్టరైతులు శుక్రవారం స్థానిక సబ్‌స్టేషన్‌ను ముట్టడించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కండలేరు పరిధిలో ఉన్న అక్రమంగా ఉన్న మోటార్లను అధికారులు తొలగించకుండా రైతులకు సంబంధించిన విద్యుత్ సరఫరా మొత్తం నిలిపివేయడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన విషయాన్ని స్థానిక ఏఈ ఖాదర్‌బాషా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారిచ్చిన సూచనల మేరకు ప్రతిరోజు రాత్రి 2 గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఎస్‌ఐ గంగాధర్ తన సిబ్బందితో కలిసి హుటాహుటిన సబ్‌స్టేషన్ వద్దకు చేరుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

సెల్‌టవర్ నిర్మాణాన్ని అడ్డుకున్న ప్రజలు
కావలి, జనవరి 27 : పట్టణంలోని 1వ వార్డు, 40వ వార్డు మధ్య ఓ ప్రైవేటు కంపెనీ సెల్ టవర్ నిర్మాణాన్ని చేపట్టగా అడవిరాజుపాలెం వార్డు ప్రజలు దాని నిర్మాణాన్ని కొన్ని నెలలుగా అడ్డుకుంటుండగా శుక్రవారం తీవ్రరూపం దాల్చింది. తమిళనాడు జల్లికట్టు ఉద్యమం స్ఫూర్తినిచ్చిందో ఏమో కాని వార్డులోని ప్రజలంతా చేరుకొని సెల్ టవర్ నిర్మాణానికి తీసిన పునాదులను పెకిలించారు. కాంక్రిట్ వేసేందుకు ఇనుపతడికలు కట్టి ఉండటంతో కొంతభాగాన్ని మట్టితో పూడ్చివేశారు. 1వ వార్డు కౌన్సిలర్ పులి రజని అక్కడికి చేరుకొని ఆ పనులను పర్యవేక్షించగా 40వ వార్డు కౌన్సిలర్ డేగా రామయ్య యాదవ్ స్థానికులకు మద్దతుగా నిలిచారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు జగదీష్‌రెడ్డి, మండల నాయకులు రాఘవులు, జిల్లా కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులుతో పాటు పలువురు చేరుకోగా స్థానికులు వారి వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. సెల్ టవర్ నిర్మాణాన్ని తాము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నామని, అయినప్పటికీ కొంతమంది నాయకులు అధికారుల మద్దతుతో బలవంతంగా నిర్మించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఊరి మధ్యలో కాకుండా కొంతదూరంలో ఏర్పాటు చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని చెప్తూ ఆ మేరకు తీర్మానించుకొని ఊరు ఊరంతా కదిలి వచ్చామని వివరించారు. అధికారులు తమ అభిప్రాయానికి విలువిచ్చి పంతాలకు పోకుండా తరలించాలని హెచ్చరించారు. ఉదయం, మధ్యాహ్నం భోజనాలు కూడా అక్కడే చేసుకోగా ఆ వార్డు నాయకులు సైతం ఆందోళనకారులతో జత కట్టాల్సిన తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి.
ప్రజాభిప్రాయాన్ని మన్నించండి
ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయానికే విలువ ఇవ్వాలని రెండు వార్డుల ప్రజలు వ్యతిరేకిస్తున్న సెల్ టవర్‌ను మరోచోటకు తరలించుకోవాలని ఎమ్మెల్యే రామిరెడ్డి అన్నారు. వార్డు ప్రజలకు అండగా ఉంటానని చెప్తూ అందుబాటులో ఉన్న అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. అలాగే టవర్ నిర్మిస్తున్న సంబంధిత సెల్ కంపెనీ అధికారులతోను చర్చించిన రామిరెడ్డి స్థానిక ప్రజల అభిప్రాయాన్ని ఉల్లంఘించి ముందుకుపోతే పర్యావసనాలను గుర్తెరిగి మరోచోటకు తీసుకెళ్లాలన్నారు. అనంతరం 1వ వార్డు కౌన్సిలర్ పులిరజని మాట్లాడుతూ ప్రతిపాదనల సమయం నుంచి తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇప్పటికే మున్సిపల్ కమిషనర్, తహశీల్దార్, ఆర్‌డిఓలకు, అలాగే జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి కూడా తీసుకొచ్చామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను నిర్మాణాన్ని అనుమతించబోమన్నారు. 40వ వార్డు కౌన్సిలర్ డేగా మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలను అధికారులు గౌరవించాలని చెప్పారు. సాధారణ పరిస్థితుల్లో ఎలా ఉన్నప్పటికి పార్టీలకు అతీతంగా విభేదాలను సైతం పక్కన పెట్టి జనం అంతా ఒక్కటయ్యారని వివరించారు.