శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ప్రారంభమైన ప్రక్షాళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, అక్టోబర్ 17: తప్పులు చేసేవారు తమ వారైనా క్షమించే ప్రసక్తే లేదంటున్నారు జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ. ఇంతవరకూ అవినీతికి ఆలవాలమైన పోలీస్ శాఖను ప్రక్షాళన చేస్తూ ఎంతోకొంత మెరుగైన వాతావరణం నెలకొనేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. ఈ కోవలోనే స్టేషన్లలోనూ, తమకు నిర్దేశించిన స్థానాల్లో తిష్ట వేసుకుని కూర్చుని అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 52 మంది పోలీస్ సిబ్బందిని విఆర్‌కు పిలిపిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం ప్రస్తుతం జిల్లా పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎంతోకాలంగా కొన్ని స్టేషన్లకే పరిమితమై అక్కడ్నుండి కదలకుండా వచ్చిన స్టేషన్ హౌస్ అధికారులను తమకు అనుకూలంగా మార్చుకొని వారి అవసరాలు తీరుస్తూ వచ్చిన కొందరు సిబ్బందికి ఈ సంఘటన గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లయింది. జనరల్ డ్యూటీ (జిడి)ల పేరుతో స్టేషన్‌లో రెండో ఎస్‌హెచ్‌ఓ స్థాయిలో వ్యవహరిస్తూ వచ్చిన కొందరు పోలీస్ కానిస్టేబుళ్ల వ్యవహార శైలిపై ఇప్పటికే ఎన్నో ఫిర్యాదులు అందుకున్న జిల్లా ఎస్పీ ఎట్టకేలకు వారిపట్ల చర్యలకు ఉపక్రమించడం విశేషం. కేవలం జిడిలకే పరిమితం కాకుండా ఇతరచోట్ల పాతుకుపోయిన పలువురు కానిస్టేబుళ్లు, చివరకు హోంగార్డులను సైతం విఆర్‌కు బదిలీ చేస్తూ ఎస్పీ తీసుకున్న నిర్ణయం కొందరికి కంటగింపుగా ఉన్నప్పటికి జిల్లాలోని ఎక్కువ మంది పోలీస్ సిబ్బంది మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుండడం గమనార్హం. జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేస్తున్న 30 మందికి పైగా సిబ్బందిని వారి విధుల నుంచి ఇతర విధులకు బదిలీ చేస్తూ ఎస్పీ తీసుకున్న అసాధారణ నిర్ణయంతో బెంబేలెత్తిన జిల్లా పోలీస్ శాఖ మరోసారి అదే తరహాలో జిల్లాలోని 52 మంది ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిని విఆర్‌లో రిపోర్టు చేసుకోవాలంటూ తీసుకున్న నిర్ణయంతో మరోసారి అవాక్కయినట్లయింది. ఎవరి సిఫార్సులున్నా, ఎందరు నేతలు పైరవీలు చేసినా తన వద్ద కుదరదన్న సంకేతాన్ని మరోసారి జిల్లా ఎస్పీ క్షేత్రస్థాయి సిబ్బందికి, అధికారులకు తెలియవచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నారని స్పష్టమవుతోంది. గతంలో బెట్టింగ్ కేసులో ఓ డిఎస్పీ, ఇద్దరు ఇన్స్‌పెక్టర్లపై శాఖాపరమైన చర్యలకు దిగడంతోనే ఒకింత ఆశ్చర్యానికి గురైన జిల్లా ప్రజానీకం ప్రస్తుతం మరోసారి ఎస్పీ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుండడం విశేషం. దీనికితోడు ఉత్తర్వుల్లో పేర్కొన్న సిబ్బందిని మంగళవారం సాయంత్రానికి రిలీవ్ చేయాలంటూ ఎస్పీ స్వయానా డిఎస్పీలకు ఫోన్ ద్వారా సూచనలు చేయడం గమనార్హం. దీన్నిబట్టి అవినీతి ఆరోపణల విషయంలో ఎస్పీ ఎంత కఠినంగా ఉన్నారో పోలీస్ శాఖతో పాటు జిల్లావాసులకు కూడా అర్థమవుతోంది. సిఫార్సులు చేయిస్తారనే ఆలోచనతో ఎస్పీ వెంటనే రిలీవ్ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్షేత్రస్థాయి కానిస్టేబుళ్లు, పరిపాలనా సిబ్బంది విషయంలో తీసుకున్న నిర్ణయం మరోసారి ఎస్సైలపై కూడా శాఖాపరమైన చర్యలతో పునరావృతం చేసే ఆలోచనలో జిల్లా పోలీస్ బాస్ ఉన్నారనే సమాచార నేపథ్యంలో అవినీతికి పాల్పడుతున్న కొందరు పోలీస్ శాఖ సిబ్బంది వెన్నులో వణుకు పుడుతోంది.

ఉరకలేసిన ఉత్సాహం
* సందడిగా యువజనోత్సవాలు
నెల్లూరు, అక్టోబర్ 17: జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నెల్లూరు డివిజన్ స్థాయి యువజనోత్సవాల పోటీలు మంగళవారం స్థానిక డికెడబ్ల్యు కళాశాలలో ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన సంయుక్త కలెక్టర్-2 వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ యువతీ యువకులు చదువుతోపాటు క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం అవసరమన్నారు. స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని దేశాభివృద్ధికి పాటుపడాలని కోరారు. యువత ఈ యువజనోత్సవాల అవకాశాలను వినియోగించుకొని జిల్లా, రాష్టస్థ్రాయి, జాతీయస్థాయి పోటీలకు వెళ్లి విజయం సాధించాలని ఆకాంక్షించారు. సెట్నల్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ యువతీ యువకుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు 18 అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువతీ యువకుల కేరింతలతో పోటీలు జరిగే ప్రాంగణం మారుమోగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల వారు ఈ పోటీల్లో పాల్గొనడానికి అనుకూలంగా ఈసారి పోటీలను పూర్తిచేసి ఆ తర్వాత డివిజన్ స్థాయి విజేతలకు జిల్లా స్థాయి పోటీలు అక్టోబర్ నెల చివరి వారంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్టస్థ్రాయి పోటీలకు ప్రభుత్వ ఖర్చులతో పంపనున్నట్లు ఈ అవకాశాన్ని జిల్లాలోని యువత వినియోగించుకోవాలని కోరారు. అంతక్రితం వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు ఇవిఎస్ నాయుడు, డికెడబ్ల్యు కళాశాల ప్రిన్సిపాల్ మస్తానయ్య, మహ్మద్ గయాస్ అహ్మద్, డి.సర్వేశ్వరరావు, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

సెమీఫైనల్‌కు చేరిన జట్లు
బుచ్చిరెడ్డిపాళెం, అక్టోబర్ 17: స్థానిక డిఎల్‌ఎన్‌ఆర్ ప్రభుత్వ పాఠశాల క్రీడాప్రాంగణంలో జరుగుతున్న అండర్-17 రాష్టస్థ్రాయి కబడ్డీ టోర్నమెంట్‌లో పలు జట్లు సత్తా చాటాయి. రెండవ రోజైన మంగళవారం జరిగిన పోటీలలో బాలుర విభాగంలో నెల్లూరు, విశాఖపట్టణం, ప్రకాశం, గుంటూరు, బాలికల విభాగంలో గుంటూరు, ప్రకాశం, విజయనగరం, అనంతపురం జట్లు సెమీఫైనల్‌కు చేరాయి. ప్రత్యర్థి జట్లతో జరిగిన ఈ హోరాహోరీ పోరులో వ్యూహాత్మకంగా ఆడిన పైజట్లు విజయాన్ని సొంతం చేసుకున్నాయి. బాలికల విభాగంలో విశాఖపట్టణం, నెల్లూరు, కడప, ప్రకాశం, గుంటూరు, బాలికల విభాగంలో ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, వైజాగ్ జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరినట్లు నిర్వాహకులు తెలిపారు. డిఎల్‌ఎన్‌ఆర్ పాఠశాల 1986-87 విద్యాసంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు 100 మంది విజేతలకు మెమెంటోలు అందజేయనున్నట్లు ఆ బృందం నిర్వాహకులు తెలిపారు. మంగళవారం జరిగిన రాష్టస్థ్రాయి కబడ్డీ పోటీలను ప్రకాశం జిల్లా డిప్యూటీ కలెక్టర్ సుధాకర్, రీజనల్ వెరిఫికేషన్ అధికారి రమణారెడ్డి, కపిల్ చిట్‌ఫండ్స్ సీనియర్ మేనేజర్ కృష్ణచైతన్య, జిల్లా ఎస్‌జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కోటేశ్వరమ్మ, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పద్మనాభం, వ్యాయామ ఉపాధ్యాయులు భీమతాటి రమణయ్య, గురుప్రసాద్, శేషయ్య, దశరధరామయ్య, తిరివీధి రాధాకృష్ణయ్య, మేనకూరు సీతయ్య, సిఐ సుబ్బారావు, ఎస్‌ఐ నాగశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఘాట్‌రోడ్డులో అదుపుతప్పిన బస్సు
* ప్రయాణికులకు స్వల్ప గాయాలు
సీతారామపురం, అక్టోబర్ 17: జిల్లా సరిహద్దు ప్రాంతమైన సీతారామపురం- టేకూరుపేట మార్గంలో ప్రకాశం జిల్లా పొదిలి నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఓ హైటెక్ బస్సుకు చెందిన ముందు టైర్ పగిలిపోవడంతో అదుపుతప్పి లోయ వైపు పడింది. మంగళవారం జరిగిన ఈ దుర్ఘటనలో పది మందికి స్వల్పగాయాలు కావడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇదే మలుపు వద్ద గతంలో మరో బస్సు అదుపుతప్పి బోల్తాకొట్టడంతో 12 మంది మృతి చెందారు. అలాగే కొద్దిమాసాల క్రితం బోరుబండి అదుపు తప్పడంతో నలుగురు మృతి చెందారు. ఇదే మలుపు వద్ద టైర్ పగిలిపోవడం వల్లే ఒక్కసారిగా లోయలోకి సైతం ప్రవేశించేందుకు రిమ్ములు అడ్డుకోవడంతో ప్రమాదం చాలావరకు తప్పినట్లైంది. బస్సులో ప్రయాణిస్తున్న ఏభై మందికి ప్రాణముప్పు వాటిల్లి ఉండేదని చెబుతున్నారు. సుమారుగా వెయ్యి అడుగుల లోతైన లోయ కావడంతో ముప్పు తీవ్రంగా ఉండేది. ఈ సందర్భంగా ప్రయాణికులు మాట్లాడుతూ తమ కళ్ల ఎదుట బస్సు లోయలోకి వెళ్లే వైనం ఎంతో భయాందోళనకు గురి చేసిందని చెబుతున్నారు.

సార్ మా డబ్బులు వస్తాయా..
*అగ్రిగోల్డ్ బాధితుల్లో ఆగని ఉత్కంఠ
ఆత్మకూరు, అక్టోబర్ 17: అందరి ముఖాల్లో ఎంతో ఆశతో కూడిన ఒకటే ఉత్కంఠ.. ఆశ అంటే ఆయాచితంగా వచ్చే సొమ్ము కోసం కాదు.. తాము ఎంతో నమ్మకంగా పొదుపు చేసుకున్న రూకలే తిరిగి వచ్చేనా తుదిగా ఎదురవుతున్న ఆవేదన. ఇన్నాళ్లు ఎంతో నిర్వేదంగా కనిపించిన అగ్రిగోల్డ్ డిపాజిట్‌దార్లలో ఇప్పుడు ఉద్వేగానికి లోనవుతున్నారు. గతంలో 2011 సంవత్సరాన జిల్లాలో విస్తృతంగా కొనసాగిన మనీ సర్కులేషన్ స్కీమ్ వ్యవహారం కూడా అప్పట్లో సిబిసిఐడి ఆధ్వర్యంలో అంతా నిగ్గు తేలుస్తున్నామని, ఆయా బోగస్ సంస్థల ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. అయితే ఎట్టకేలకు తిరిగి చెల్లింపు ఉంటుందనే వార్తల్లోనే ఆరేళ్లగా ఓ రూపుదాల్చడం లేదు. మంగళవారం కూడా ఆత్మకూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయ పరిధిలో అగ్రిగోల్ డిపాజిట్ల బాధితులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. గత నాలుగేళ్లగా ఎటూ అర్ధంగాక బావురుమంటూ రోజులు వెళ్లదీసిన బడుగుజీవుల్లో ఎట్టకేలకు అగ్రిగోల్డ్ సంస్థపై విచారణపర్వంలో కీలకంగా డిపాజిట్‌దార్ల వైపునుంచి వివరాలను సేకరించడంతో అందరి ముఖాల్లోనూ లోలోన ఆనందం కనిపిస్తోంది. అదే సమయంలో చేతికి డబ్బులు వచ్చేదాక కూడా ఇప్పుడు అనుభవిస్తున్న ఉత్కంఠను వీడలేకున్నారు. తమ భవిష్యత్ అవసరాల కోసం ఎంతో భరోసాతో స్థానికంగా పరిచయస్తులైన ఏజెంట్ల ద్వారా నగదు చెల్లించి కడకు తీరని విషాదంతోనే ఇన్నాళ్లు గడిపారు. టీవీల్లో, పేపర్లలో తరచూ అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తుల స్వాధీనమని, డైరెక్టర్ల అరెస్ట్ అంటూ డిపాజిట్‌దార్లకు నగదు చెల్లించడం జరుగుతుందనే వార్తలొస్తున్నాయే తప్పా సరైన స్పష్టత కరవు. ఇటీవల కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనకారులతో నిర్వహించిన సభలోనూ పోరాటం కొనసాగుతుందనే ప్రకటనలే తప్పా అగ్రిగోల్డ్ నుంచి తిరిగి ఎప్పుడు సొమ్ములు వస్తాయనే భరోసా కరవైంది. ఇదిలాఉంటే నెల రోజులపాటు నమోదు ప్రక్రియకు గడువు ఉందని చెబుతున్నా తండోపతండాలుగా వచ్చిన డిపాజిట్‌దారులతో పోలీస్‌స్టేషన్ ఆవరణ అంతా జాతర వాతావరణాన్ని తలపిస్తోంది. వీరికోసమై సిబిసిఐడి అధికార్ల నేతృత్వంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయగా భారీగా క్యూలైన్లలో నిలిచి తమ వద్ద ఉన్న ఆధారాలను పరిశీలనలో భాగంగా అందచేశామని చెపుతున్నా, లా అండ్ ఆర్డర్‌కు చెందిన స్థానిక పోలీస్ కానిస్టేబుళ్లే ఎంతో కీలకంగా విధుల నిర్వహణలో పాల్గొంటున్నారు. ఈ నమోదు ప్రక్రియ కోసం ఎంతో ఆశగా వేచి చూస్తూ క్యూలైన్లలో నిలబడ్డ డిపాజిట్‌దార్లను కొంతసేపు విద్యుత్ సరఫరాలో, అంతర్జాలంలో అంతరాయం కలగడంతో ఈ పరిశీలన, వివరాల నమోదు ప్రక్రియకు తీవ్రంగా ఆలస్యం ఎదురవుతోంది. మంగళవారం ఆత్మకూరు, పొదలకూరు సర్కిళ్ల పరిధిలో మొత్తం 772 మంది డిపాజిటర్ల నమోదు ప్రక్రియను పూర్తిచేశారు.