శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఆత్మగౌరవంపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుచ్చిరెడ్డిపాళెం, జూన్ 16: ఆత్మగౌరవం కార్యక్రమానికి అధికారులు రాత్రి బసకు ఎక్కువ సంఖ్యలో అధికారులు గైర్హాజరు కావడంపై కలెక్టర్ జానకి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని దామరమడుగు గ్రామ పంచాయతీ పరిధిలో గల ఆర్‌ఆర్‌నగర్‌లో బుధవారం రాత్రి ఆత్మగౌరవంపై జరిగే బసను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. రాత్రి 11 గంటల సమయంలో ఆమె అధికారులు బస చేసిన ప్రదేశానికి వెళ్లారు. కాని ఆ సమయంలో కేవలం బుచ్చిరెడ్డిపాళెం ఎంపిడిఒ నరసింహారావ్, హౌసింగ్ ఎఇ వెంకటేశ్వర్లు ఒక ఎఎన్‌ఎం తప్ప మరెవరూ లేకపోవడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి బసకు బుచ్చిరెడ్డిపాళెం తహశీల్దార్ ప్రేమ్‌చంద్‌సాల్మన్‌తో పాటు వ్యవసాయశాఖ, విద్యాశాఖ, ఇరిగేషన్ శాఖ, పంచాయతీరాజ్, వైద్య సిబ్బందితో పాటు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అధికారులుగా నియమితులైన ఐసిడిఎస్ పిడి విద్యావతితో సహా గైర్హాజరయ్యారు. దీంతో ఆమె వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గైర్హాజరైన వారందరికీ చార్జ్ మెమోలు జారీ చేయాలని ఎంపిడిఒ నరసింహారావును ఆదేశించారు.

సమాజ సేవ కోసం జీవితం అంకితం
* టిడిపిలో చేరుతున్నా
* ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వెల్లడి
నెల్లూరు, జూన్ 16: సమాజం కోసం తన సంపద, జీవితం ఏ విధంగా ఉపయోగపడుతుందని నిత్యం ఆలోచిస్తూ అంకితమైన వాడినని ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిషివ్యాలీలో ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి విద్యాసంస్థలో చదువుకున్న తనకు సమాజం పట్ల బాధ్యత వహించాలనే భావన నాడే కలిగినట్లు వెల్లడించారు. చెన్నై నగరంలో మానసిక స్థితి సరిగా లేని పిల్లల సంస్థకు కార్యదర్శిగా పనిచేశానని గుర్తు చేశారు. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ వోల్వో తన ప్రతిభ గుర్తించి వారి వార్షిక క్యాలెండర్‌లో తన ఆటోబయోగ్రఫీ ప్రచురించిందన్నారు. జిల్లా జైలులో ఖైదీల కోసం ఫ్యాన్లు, టివిలు, ప్లేట్లు అందించానని, నెల్లూరు జయభారత్ ఆసుపత్రి, వాత్సల్య అనాథ శరణాలయానికి ఎంతో భూరి విరాళాలు అందచేసినట్లు తెలిపారు. సమాజ సేవతో పాటు ఆధ్యాత్మికంగానూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టానన్నారు. నెల్లూరు నగరంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆర్జిత సేవలను ఏర్పాటు చేయడం, ఇస్కాన్ మందిరంలో గోశాల ఏర్పాటు, రామ్మూర్తినగర్‌లో సాయిబాబా మందిరంకు సిమెంటు రోడ్డు నిర్మించడం వంటి పలు కార్యక్రమాలను చేపట్టానని తెలిపారు. కొండాయపాలెం గేటు సమీపంలో సాంఘిక సంక్షేమ హాస్టల్‌కు భవనం నిర్మించి ఇవ్వడంతో ఆ భవనానికి తన పేరు పెట్టారని, అయితే అక్కడ ఉన్న తన పేరు కంటే అక్కడ చదువుకునే విద్యార్థులకు వసతి కల్పించానన్న తృప్తే తనకు ఎక్కువగా కలిగిందన్నారు. ప్రస్తుతం నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు 4 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇక్కడ చదివే విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు అందించడం జరుగుతోందని, అదే విధంగా వైద్యశాలలో ఎక్స్‌రే, ఇసిజి, రక్త పరీక్షలు ఉచితంగా చేస్తారని, ఇందుకోసం ఇద్దరు వైద్యులు 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని ఆయన చెప్పారు.
సేవలను విస్తరించేందుకు టిడిపిలోకి..
తన సేవలను విస్తృత పరచాలనే సదుద్దేశంతో, సన్నిహితుల సూచన మేరకు తాను శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సమక్షంలో నెల్లూరులో టిడిపిలో చేరనున్నట్లు వెల్లడించారు. విభజనలో సర్వస్వం కోల్పోయిన రాష్ట్రం కోసం చంద్రబాబునాయుడు అహర్నిశలు ఎంతో కృషి చేస్తున్నారని, ఆయనకు తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు నిర్ణయించుకుని టిడిపిలో చేరేందుకు సిద్ధమైనట్లు వేమిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి తన శ్రేయోభిలాషులు, అభిమానులు అందరూ పెద్ద సంఖ్యలో హాజరై తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు.

స్కూల్ ఎడ్యుకేషన్‌లో ఇంటర్‌ను చేర్చేందుకు ఏకగ్రీవ తీర్మానం
* సామాజిక పింఛన్ల అంశంపై గందరగోళంగా మారిన చర్చ
* వైకాపా వర్సెస్ టిడిపి ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం
* ప్రశాంతంగా ముగిసిన జడ్పీ సర్వసభ్య సమావేశం
నెల్లూరుసిటీ, జూన్ 16: జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో స్కూల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఇంటర్మీడియట్ విద్యను చేర్చేందుకు సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. శాసన మండలి సభ్యుడు విఠపు బాలసుబ్రహ్మణ్యం సమావేశంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గురువారం జరిగిన జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య కాసేపు మాటల యుద్ధం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు కురిపించిన వైకాపా ఎమ్మెల్యేలను కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, శాసన మండలి సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వాకాటి నారాయణరెడ్డి, బీద రవిచంద్రలు అడుగడుగునా అడ్డుకున్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి ప్రభుత్వ పనితీరును సమావేశంలో ఎండగట్టడంతో శాసన మండలి సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కూడా తనదైన శైలిలో అడ్డుతగులుతూ వచ్చారు. ముఖ్యంగా సామాజిక పింఛన్ల అంశంను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి చర్చకు తీసుకురావడంతో సమావేశం రసాభాసగా మారింది. సమావేశం ప్రారంభమైన గంట సేపు వరకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డికి మాట్లాడేందుకు మైక్‌ను ఇవ్వకపోవడంతో జడ్పీ చైర్మన్‌పై తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీంతో జడ్పీ చైర్మన్ వెంటనే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డికి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. ఇదిలావుంటే సామాజిక పింఛన్ల కోసం అన్ని అర్హతలు ఉండి దరఖాస్తు చేసుకున్న రెండేళ్ల నుంచి పింఛన్‌ను మంజూరు చేయడం లేదన్నారు. అందులో ఎస్సీ, ఎస్టీలు కూడా ఎక్కువగా ఉన్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నియమాలను ఉల్లంఘించినందుకు దళితుల వేధింపుల చట్టం కింద ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని డిమాండ్ చేయడంతో కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అడ్డుకోవడంతో వారిద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం నెలకొంది. దీంతో సమావేశం కాసేపు గందరగోళంగా మారడంతో సోమిరెడ్డి జోక్యం చేసుకోవడంతో సద్దు మణిగింది. ఇదిలావుంటే సమావేశంలో జడ్పీటిసిలు, ఎంపిపిలకు మాట్లాడే అవకాశం లేకుండా సమావేశాన్ని ఎమ్మెల్యేలు, శాసన మండలి సభ్యులు ఒకరిపై ఒకరు దుమ్ముత్తి పోసుకోవడంతో జడ్పీటిసి సభ్యులు తమ సమస్యలను విన్నవించేందుకు అవకాశం ఇవ్వాలని జడ్పీ చైర్మన్ ముందు విన్నవించుకోవడంతో ఎమ్మెల్యేలు సద్దుమణిగారు. జడ్పీ సర్వసభ్య సమావేశంలో డ్వామా, విద్యాశాఖ, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యుఎస్, మైనింగ్, డిఆర్‌డిఎ, ఐటిడిఎ, సివిల్ సంప్లయస్, మత్స్యశాఖ అధికారులపై సభ్యులు తీవ్రంగా విరుచుకుపడ్డారు.

ఎన్‌డిఎ ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు
* అవినీతి రహిత, పారదర్శక పాలనతో ముందుకు సాగుతాం
* సంస్థల శంకుస్థాపనలు చేసి వదిలేయటం కాంగ్రెస్ సంస్కృతి
* ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా అంతకన్నా ఎక్కువే చేస్తాం
* సామాన్యులకు బీమాతో ధీమా కల్పించాం
* రక్షణమంత్రి మనోహర్ పారికర్ వెల్లడి
నెల్లూరు కలెక్టరేట్, జూన్ 16: కేంద్రంలో ఉన్న ఎన్‌డిఎ ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని, అవినీతిరహిత, పారదర్శక పాలనతో ముందుకు సాగుతామని రక్షణమంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని నర్తకి సెంటర్‌లో గురువారం మోదీ రెండేళ్ల పాలన (వికాస్‌పర్వ్)పై ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన కేంద్ర జలవనరుల శాఖ సహాయమంత్రి సవర్‌లాల్ జాట్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారికర్ మాట్లాడుతూ మోదీ అధికారం చేపట్టాక దేశ ప్రజల మానసిక ఆలోచనలతో మార్పు వచ్చింది. అప్పటి లాల్ బహుదూర్ శాస్ర్తీ పిఎంగా ఉన్నపుడు దేశంలో ఆహార కొరత ఏర్పడిందని, దీనిని అధిగమించడానికి ఆయన దేశ ప్రజలకు వారంలో ఒకరోజు ఉపవాసం ఉండమని పిలుపిస్తే ఇప్పటి పిఎం నరేంద్రమోదీ అధిక ఆదాయం కలవారు గ్యాస్ రాయితీ వదులుకోవాలని పిలుపు ఇవ్వటంతో కోటి మందికి పైగా స్వచ్ఛందంగా వదులుకున్నారని వెల్లడించారు. ఆ రాయితీలతో ఐదు కోట్ల మంది పేద మహిళలకు గ్యాస్ రానున్న మూడేళ్ల కాలంలో అందిస్తామన్నారు. ఆధార్ అనుసంధానం ద్వారా నకిలీ కనెక్షన్లు తొలగించామని, దీని ద్వారా 15వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం లభించిందని చెప్పారు. నగదు ప్రత్యక్ష బదిలీ ద్వారా సంక్షేమ పథకాలకు 63కోట్ల రూపాయల రాయితీ అందజేశామన్నారు. బొగ్గు, స్పెక్ట్రం, ఎఫ్‌ఎం రేడియో స్టేషన్‌ల వేలం పాటల ద్వారా లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా చేకూరిందని తెలిపారు. గతంలో బొగ్గు, స్పెక్ట్రం వంటివి అవినీతికి ఆలవాలమై ప్రజల నగదును లూటీ చేస్తే ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా నిలిచిందన్నారు. సున్నాతో ప్రారంభించిన ప్రధానమంత్రి జనధన్ ఖాతాల్లో ప్రస్తుతం 37కోట్లు రూపాయల నగదు బ్యాంక్‌లలో ఉందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా అంతకన్నా ఎక్కువే చేస్తామన్నారు. రాష్ట్ర రెవెన్యూ లోటు భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలో 12 సంస్థల ఏర్పాటును ఉటంకిస్తే ఇప్పటకే 9 సంస్థలు ప్రారంభ దశలో ఉన్నాయన్నారు. చిత్తూరు, ఒంగోలు, కర్నూలు, అనంతపురం, మచిలీపట్నంలో రక్షణశాఖకు చెందిన పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సంస్థల శంకుస్థాపనలు చేసి వాటిని గాలికొదిలేయటం కాంగ్రెస్ లక్షణమన్నారు. ఎన్‌డిఎ సర్కార్ దానికి భిన్నంగా తాత్కాలిక వసతులతో ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. నూరు శాతం కేంద్ర నిధులతో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు. కేంద్ర జలవనరుల శాఖ సహాయమంత్రి సవర్‌లాల్ జాట్ మాట్లాడుతూ కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉందన్నారు. విదేశాల్లో మోదీ హవా చూస్తే హృదయం ఉప్పొంగుతుందన్నారు. వాజ్‌పేయి హయాంలో రైతులకు వ్యవసాయ భీమా కల్పిస్తే కాంగ్రెస్ హయాంలో ఆ బీమా కంపెనీలకు మేలు కల్పించిందని విమర్శించారు. సామాన్యులకు సంక్షేమ పథకాలు అందించేందుకు ఎలాంటి హామీలు లేకుండా ముద్ర బ్యాంక్ ఏర్పాటు చేశామని, దీంతో పథకాలకు కేంద్రమే హామీ ఉంటుందన్నారు. అనేక ప్రమాద, జీవిత బీమాలతో సామాన్యులకు ధీమా కల్పించామన్నారు. పోలవరం నిర్మాణానికి అప్పటి కాంగ్రెస్ విముఖమని, అందుకే ముంపు ప్రాంతాలను తెలంగాణలో కలిపిందన్నారు. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కట్టుబడి ముంపు ప్రాంతాలను ఒక్క ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్రంలో కలిపి ప్రాజెక్ట్ నిర్మాణానికి పూనుకుందన్నారు. మోదీతో భారత్ రూపురేఖలు మారుతున్నాయని, భారత్‌లో ఎన్‌డిఎ (బాజపా) 43శాతం ప్రాతినిధ్యం వహిస్తుంటే కాంగ్రెస్ కేవలం 6శాతం మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుందని ఎద్దేవా చేశారు. బిజెపి ఉపాధ్యక్షుడు దినేష్‌శర్మ మాట్లాడుతూ సంక్షేమ పథకాలలో దళారుల పాత్ర లేకుండా నేరుగా ప్రత్యక్షంగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేసేందుకు పిఎం జనధన్ యోజన పథకం రూపొందించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి హరిబాబు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, జిల్లా అధ్యక్షుడు పి సురేంద్రరెడ్డి, నేతలు మండవ ఈశ్వరయ్య, కందుకూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కరవు రహిత రాష్టంగా తీర్చిదిద్దుతాం
* జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి శిద్దా రాఘవరావు స్పష్టం
జలదంకి, జూన్ 16: సమగ్ర సాగునీటి పథకాలు, నీటిసంరక్షణా విధానాల అమలు ద్వారా రానున్న రెండేళ్లలో రాష్టాన్ని కరవురహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, ఇందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృతనిశ్చయంతో ముందుకు పోతున్నారని రాష్ట్ర రవాణా మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి శిద్దా రాఘవరావు స్పష్టం చేశారు. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండలకేంద్రం జలదంకిలో ఫైబర్ చెక్‌డ్యాంను ప్రారంభించేందుకు రానుండగా ఏర్పాట్లను పరిశీలించే నిమిత్తం గురువారం ఎమ్మెల్సీ, జిల్లా టిడిపి అధ్యక్షులు బీద రవిచంద్ర, ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, జెసి ఇంతియాజ్ అహ్మద్, డ్వామా పిడి హరిత తదితరులతో కలిసి వచ్చారు. ముందుగా చెక్‌డ్యాం నుంచి అదనపునీటిని నిల్వ చేసేందుకు 1.5 కోట్ల లీటర్ల సామర్ధ్యంతో సాగునీటి గుంటలను నిర్మించగా, వాటిలోకి నీటిని విడుదల చేశారు. పరిసరాలను పరిశీలించారు. చెక్ డ్యాం కట్టల పటిష్టత, ప్రారంభించే సమయంలో తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు, తదితర విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొత్త చెరువు వద్ద నిర్మించిన హెలిపాడ్, అక్కడ జరిగే బహిరంగ సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. శనివారం మధ్యాహ్నం 3.15 గంటలకు ముఖ్యమంత్రి రానుండగా ఎక్కడా చిన్న పొరపాటు జరగకూడదని, ప్రజలకు కూడా అసౌకర్యం కలగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కరవే భయపడాలి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీర్ఘకాలిక ప్రణాళికతో సమగ్ర సాగునీటి విధానాల అమలు ద్వారా రాష్ట్రంలో కరవుకు తావులేని విధంగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. నీరు- చెట్టు పథకంతో చెరువుల్లో పూడికతీసి నిల్వ సామర్ధ్యాలు పెంచేందుకు, ఆ మట్టిని పంట పొలాలకు తరలించి భూసారాన్ని పెంచేందుకు బృహత్ కార్యక్రమాన్ని చేపట్టారని వివరించారు. పంటకుంటల ద్వారా పొలాల్లో నీరు నిల్వలు ఉండేలా చేసి అవసర సమయాల్లో వాటిని సంజీవినిగా ఉపయోగించుకుని పంటలు పండించుకునేలా చర్యలు చేపట్టారన్నారు. నీరు-ప్రగతి, ఇంకుడు గుంటల నిర్మాణం, వీలున్న చోట్లల్లా చెక్‌డ్యాంల నిర్మాణాలు ద్వారా నీటినిల్వల పెంపుకు, భూగర్భ జలాలను అత్యధిక స్థాయిలో నిల్వ చేసుకునేందుకు కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. సాగునీటి పథకాల అమల్లో స్థానిక ఎమ్మెల్యే బొల్లినేని కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కావలి, ఆత్మకూరు ఆర్డీవోలు ఎంఎల్ నరశింహం, రమణ, కావలి డిఎస్పీ రాఘవరావు, మండల టిడిపి అధ్యక్షులు చిత్తాబత్తిన మస్తాన్‌రెడ్డి, సీనియర్ నాయకులు మధుమోహన్‌రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో టిడిపి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

రక్షణ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపి మేకపాటి
నెల్లూరు, జూన్ 16: బిజెపి వికాస్ పర్వ్‌లో భాగంగా పాల్గొనేందుకు గురువారం నెల్లూరు విచ్చేసిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్‌ను నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నెల్లూరు పోలీసు పెరేడ్‌గ్రౌండ్‌కు రక్షణ శాఖ మంత్రి ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చారు. ఈ సందర్భంగా ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి పుష్పగుచ్ఛం అందజేశారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కె సంజీవయ్య, వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర కార్యదర్శి మేరిగ మురళి తదితరులు ఉన్నారు.

సిఎం పర్యటన సమర్థవంతంగా నిర్వహించాలి
* జిల్లా కలెక్టర్ జానకి ఆదేశం
నెల్లూరు, జూన్ 16: రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 18న జిల్లా పర్యటనకు వస్తున్నందున పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం జానకి అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక బంగ్లాలో ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్షించి పలు సూచనలు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దగదర్తి మండలం, దామవరం వద్ద హెలిప్యాడ్ బిఎంఆర్ ష్రింప్ ఫీడ్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆక్వా రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి మాట్లాడే అవకాశం ఉన్నందున ఈ ప్రక్రియలో సంబంధిత మత్స్య శాఖాధికారులు అవసరమైన ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉండాలన్నారు. తదుపరి నెల్లూరు కనుపర్తిపాడు వద్ద ప్రారంభించే విపిఆర్ పాఠశాల, హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఏర్పాట్లకు సంబంధించి జిల్లా విద్యా శాఖాధికారి, వైద్య ఆరోగ్య శాఖాధికారి సమన్వయంతో పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మధ్యాహ్నం జలదంకి వద్ద హెలిప్యాడ్ ఏర్పాట్లు, ఫైబర్ చెక్ డ్యాం, పంటగుంటల నిర్మాణాలను బహిరంగ సభ వేదిక ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించడంతోపాటు, మైక్ సిస్టమ్ సక్రమంగా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకొని ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. బహిరంగ వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రక్రియలో ఇరిగేషన్, రెవెన్యూ డివిజనల్ అధికారులు, పోలీసు అధికారులు సమన్వయంతో తగిన ఏర్పాట్లు పటిష్టంగా నిర్వహించి ఎలాంటి సమస్యలు లేకుండా విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్-2 ఆర్‌ఎస్ రాజ్‌కుమార్, అడిషనల్ ఎస్‌పి శరత్‌కుమార్, జడ్‌పి సిఇఓ బి రామిరెడ్డి, ఇరిగేషన్ ఎస్‌ఇ సుబ్బారావు, నెల్లూరు, కావలి, ఆత్మకూరు, ఆర్‌డిఓలు వెంకటేశ్వర్లు, నరసింహన్, ఎస్‌వి రమణ, మత్స్య శాఖ జెడి విజయభారతి, డ్వామా పిడి హరిత, వ్యవసాయ శాఖ జెడి హేమమహేశ్వరరావు, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.