శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

పోలీసు స్టేషన్లలో పంచాయితీలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 20: ఏ వివాదాలైనా ఇట్లే పరిష్కరిస్తారు.. పంచాయితీలు చేయాలన్నా వారికే చెల్లు.. అధికారులను ప్రసన్నం చేసుకోవడం నుంచి బాధితులను కలిపివేయడం వరకు అన్నీ తామై వ్యవహరిస్తారు. అందుకుతగ్గ ప్రతిఫలం అందుకోవడం, అధికారులకు అండదండగా నిలవడం పరిపాటిగా మార్చుకున్నారు. అధికారుల సాక్షిగా అనధికార సెటిల్మెంట్లలో రాజీపడకపోతే కేసులు పెడతారు. పోలీసు స్టేషన్‌లో పెట్రేగిపోతున్న మధ్యవర్తుల వ్యవస్థ శాఖాపరంగానే పెనుసవాల్‌గా విసురుతోంది. జిల్లా పోలీసు శాఖలో ఐదు సబ్ డివిజన్‌లు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 57 పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. ఇందులో కొన్ని స్టేషన్లపరంగా మధ్యవర్తుల వ్యవస్థ ఎక్కువైంది. దళారులుగా పిలిచే వీరు స్టేషన్‌కు వచ్చే బాధితులకు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి స్టేషన్‌లో పంచాయితీలు, సెటిల్మెంట్లు చేయకూడదని ఉన్నత వర్గాలు ఎప్పుడో ఆదేశాలు ఇచ్చాయి. చిన్నపాటి వివాదాలు, గొడవలతో వచ్చేవారిని సామసర్యంగా కలిపే విధంగా కృషి చేయాలని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. అలాకాని పక్షంలో కేసులు నమోదు చేయాలన్న ఆదేశాలు ఉన్నాయి. ఇక్కడ కొందరు పోలీసులు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కొన్ని స్టేషన్‌ల పరిధిలో ఎక్కడికక్కడ అనధికారికంగా మధ్యవర్తులను ఏర్పాటు చేసుకొని వారి ద్వారానే నడిపిస్తున్నారు. ఎవరైనా బాధితులు స్టేషన్‌కు వచ్చినప్పుడు కేసు నమోదు చేయకుండా ఇరు పక్షాలను మధ్యవర్తులకు అప్పగిస్తుండడం గమనార్హం. వారు తమదైన రీతిలో ‘పంచాయితీ’ నడిపి ఇరుపక్షాలను ఒప్పిస్తున్నారు. కాదంటే కేసులు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. సర్దుబాటు చేసినందుకు మధ్యవర్తులు భారీగా, బలవంతంగా ప్రతిఫలం ఆశిస్తుండడం పరిపాటైంది. ఇరుపక్షాల నుంచి వచ్చిన సమస్య వ్యక్తుల స్థాయినిబట్టి రూ.10 వేల నుంచి 50 వేల వరకు రాబడుతున్నారన్నది బహిరంగ రహస్యం. అలా వచ్చిన సొమ్ములో కొందరు అధికారులకు మూటలు వెళ్తుండడంతో ఈ వ్యవస్థ మూడు గ్రూపులు, ఆరు కట్టలుగా వర్థిల్లుతోంది. వాస్తవానికి కొందరు పోలీసులను ప్రత్యేక బృందాలుగా విభజించి కేసుల విచారణ కోసం వాడుకునేవారు. గతంలో ఏర్పాటు అయిన ఓ విభాగం ఇప్పటికీ కొనసాగుతోంది. భారీ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో జిల్లా పోలీసు వర్గాలు సీరియస్‌గా తీసుకున్నారు. జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని ఇటీవల కావలిలో విలేఖరులతో మాట్లాడుతూ పోలీసులు తప్పు చేస్తే తమకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. అందుకు వాట్సాప్, ఇతర మేసేజ్‌ల ద్వారా తెలియజేస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. ఆయా స్టేషన్‌ల పరిధిలో కీలకంగా మారి కాసులు కురిపిస్తున్న ఆ కొందరిని బదిలీలో భాగంగా దూరపు స్టేషన్‌లకు తరలించారు. ఇలా ఎక్కడికక్కడ అవినీతికి చెక్కుపెట్టే దిశగా ప్రయత్నిస్తున్న కొత్త మార్గాల్లో సొమ్ములు రాబట్టేందుకు ఆ కొందరు ప్రయత్నిస్తున్నారు. నెల్లూరులో ఖాకీయిజం కొత్త పుంతలు తొక్కుతుండడం అందకు అద్దం పడుతోంది. ప్రస్తుతం స్టేషన్లలో హెచ్చుమీరిన మధ్యవర్తుల వ్యవస్థ కారణంగా పోలీసు శాఖ అప్రదిష్టపాలవుతోందని పలువురు పేర్కొంటున్నారు.

పారిశుద్ధ్యంపై పటిష్ఠ చర్యలు చేపట్టాలి
* అధికారులకు కలెక్టర్ ఆదేశం
నెల్లూరు టౌన్, సెప్టెంబర్ 20: గ్రామాలలో ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ కాలనీలలో విషజ్వరాలు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై కార్యక్రమాలను పటిష్ఠంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని దర్గామిట్టలో ఉన్న జిల్లా పరిషత్ సభా మందిరంలో మంగళవారం ఆత్మగౌరవం, పారిశుధ్య కార్యక్రమాలు, ఆరోగ్య కార్యక్రమాలు, ఎన్‌ఆర్‌ఇజిఎస్ పనులపై ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గతంలో విషజ్వరాలు ప్రబలిన గ్రామాలను సందర్శించి అక్కడి పారిశుద్ధ్య కార్యక్రమాలు, మంచినీటి సరఫరా, మురుగుకాలువల మరమ్మతులు తదితర పనులు సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అమలులో భాగంగా మండలస్థాయి కమిటీలు ఆయా గ్రామాలను సందర్శించి విషజ్వరాలు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రధానంగా ఆరోగ్య, వైద్య, ఆశా, ఎఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు ఆయా గ్రామాల్లో వచ్చే రోగాలను గుర్తించి వెంటనే సంబంధిత పిహెచ్‌సి అధికారికి తెలియపరచాలన్నారు. అందులో భాగంగా గ్రామాల్లో ప్రతి ఇంటికి తిరిగి పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణ తదితర కార్యక్రమాలపై అవగాహన కల్పించి వాటిని అమలు అయ్యేలా చూడాలన్నారు. పారిశుద్ధ్య పనులపై ఆయా గ్రామాల్లో దండోరాల ద్వారా ప్రజలకు తెలియచేసి విషజ్వరాలు సోకకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విషజ్వరాలు సోకినట్లైయితే 18004252499 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. అలాగే వైద్య, ఆరోగ్య కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఫీవర్ సెల్ 9618232115 నెంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఆత్మగౌరవం కార్యక్రమం కింద నిర్దేశించిన లక్ష్యాలను సెప్టెంబర్ నెలాఖరులోపల పూర్తిచేసి బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా రూపొందించాలన్నారు. ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆత్మగౌరవం కార్యక్రమం కింద గ్రామాలలో పూర్తిస్థాయిలో మరుగుదొడ్ల నిర్మాణాలు ఏర్పాటు చేసుకోవడంలో అవసరమైన ఇటుక, సిమెంటు, ఇసుక తదితర వస్తువులను పూర్తిస్థాయిలో సరఫరా చేసి నిబంధనలకు అనుగుణంగా పటిష్టంగా నిర్మించేలా చూడాలన్నారు. చెల్లింపుల ప్రక్రియ సక్రమంగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. దానికి సంబంధించిన స్టేషనరీ, ఎంబుక్స్ తదితర ప్రతిపాదనలను అంచనాలతో సహా అందచేయాలన్నారు. అక్టోబర్ 2వ తేదినాటికి నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తిచేయడంలో టాస్క్ఫోర్సు అధికారులు, సంబంధిత మండల, గ్రామస్థాయి అధికారుల సమన్వయంతో తగిన చర్యలు తీసుకొని పూర్తిచేయాలన్నారు. టాస్క్ఫోర్సు అధికారులు తప్పనిసరిగా ఆయా గ్రామాల్లో రాత్రుళ్లు బసచేసి బహిరంగ మలవిసర్జన రహిత ప్రక్రియపై అవసరమైన తనిఖీలు చేసి ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్ది సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన పనులను సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన కూలీలకు ఉపాధి పూర్తిగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో హౌసింగ్ స్కీం కింద మంజూరు చేసిన గృహనిర్మాణ లక్ష్యాలను పూర్తిచేయడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పారిశుద్ధ్యంపై ఈనెల 24న నగరంలో ర్యాలీ నిర్వహిస్తామని, దానికి అవసరమైన తగు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈసమావేశంలో జడ్పీ సిఇఓ రామిరెడ్డి, జిల్లా వైద్యశాఖాధికారి వరసుందరం, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఇ కెవి కృష్ణారెడ్డి, హౌసింగ్ పీడి రామచంద్రారెడ్డి, ఆత్మగౌరవం జిల్లా కో ఆర్డినేటర్ సుస్మితారెడ్డి, వ్యవసాయ శాఖ జెడి హేమమహేశ్వరరావు, మత్స్యశాఖ జెడి సీతారామరాజు, వివిధ మండలాలకు చెందిన ఎంపిడిఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఆత్మకూరు మున్సిపాలిటీపై విజిలెన్స్‌కు ఫిర్యాదు
ఆత్మకూరు, సెప్టెంబర్ 20: ఆత్మకూరు పురపాలక సంఘంలో అంతూదరి లేకుండా కొనసాగుతున్న అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నెల్లూరు జిల్లా డిఎస్పీ వెంకటనాధరెడ్డికి ఫిర్యాదు అందింది. మంగళవారం ఆత్మకూరుకు చెందిన చల్లా వెంకటేశ్వర్లు, ఇందూరు రమణారెడ్డి, దోర్నాదుల ప్రభాకర్, తదితరులు ఈ ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. ఇటీవల కాలంలో పురపాలక సంఘంలో పన్నులు పెంచారన్నారు. అయితే పన్నుల పెంపుదలలో నిబద్ధత లేదని, పెంచి వసూలు చేస్తున్న మొత్తాలకు సార్ధకత లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. పురపాలక సంఘ సమావేశాల్లో అనుమతులు పొందే వైనం ఓరకంగానూ, ఖర్చు చేస్తున్న వ్యవహారశైలి మరోవిధంగానూ ఉంటోందన్నారు. ముందస్తు ఆమోదం లేకుండా చేసే పనుల్లో ఎక్కువగా అవినీతి చోటుచేసుకుంటుందన్నారు. పందుల తరలింపు పేరిట లక్షలాది రూపాయల నిధులు డ్రా చేస్తున్నారని, అయినా ఆ సమస్య కొలిక్కి రావడం లేదని దీని వెనుక జరుగుతున్న తతంగాన్ని పరిశీలించాలని విజిలెన్స్ డిఎస్పీని కోరారు. అలాగే మున్సిపాలిటీ కార్యాలయానికి ఏసిల కొనుగోలుకు సంబంధించి అవకతవకలు చోటుచేసుకున్నాయన్నారు. ఎన్‌టిఆర్ సుజల స్రవంతి పథకం కింద నీటి నిర్వహణకు సంబంధించి నిధులను వెచ్చించిన వైనంలో చోటుచేసుకున్న అక్రమాలపై కూడా ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్వహించిన జన్మభూమి కార్యక్రమాలకు ముందస్తుగా మున్సిపాలిటీ తరపున ఖర్చు చేశారు. అయితే ఆ నిధుల విషయంలో కూడా అనుమానాలు ఉన్నాయన్నారు. ఇలా వివిధ ఫిర్యాదులు, వాటి ఆధారాలతో సహా విజిలెన్స్ డిఎస్పీకి అందజేశారు. దీనిపై డిఎస్పీ వెంకటనాధరెడ్డి స్పందిస్తూ విచారణ జరిపి కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామన్నారు.

ఘరానా దొంగ అరెస్ట్
* ఒక లారీ, బంగారు ఆభరణాలు స్వాధీనం
నెల్లూరు, సెప్టెంబర్ 20: అంతర్ జిల్లా ఘరానా దొంగగా పోలీస్ రికార్డుల్లో ఉన్న వ్యక్తిని 2వ నగర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను 2వ నగర సిఐ సుధాకర్‌రెడ్డి మంగళవారం తెలియచేశారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు.. జూలై 12వ తేదిన రమణారెడ్డి పార్శిల్ కార్యాలయానికి చెందిన లారీని గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించుకు పోయినట్లు 2వ నగర పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన దేవూరి బాలాజీ అనే వ్యక్తి సోమవారం సాయంత్రం కొడవలూరు మండలం రేగడచెలిక వద్ద జాతీయ రహదారిపై దొంగిలించిన లారీతో సహా పోలీసులకు చిక్కాడు. గతంలో పలు నేరాల్లో నిందితుడిగా ఉన్న బాలాజీ వద్ద నుంచి సుమారు 7 సవర్ల బంగారు ఆభరణాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ సుమారు రూ.7 లక్షలు ఉంటుందని సిఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. అరెస్ట్ చేసిన బాలాజీని కోర్టులో హాజరుపర్చినట్లు ఆయన తెలిపారు.

హడ్కోతో అప్పుల పాలే
వైకాపా కార్పొరేటర్ల ధ్వజం
నెల్లూరుసిటీ, సెప్టెంబర్ 20: హడ్కో రుణంతో నగరంలో నిర్మిస్తున్న తాగునీటి పథకం, భూగర్భ డ్రైనేజీతో ప్రజలు అప్పులపాలు కావడం తథ్యమని డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాధ్ అన్నారు. మంగళవారం తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగర నియోజకవర్గానికి నిధుల పంపిణీలో తీరని అన్యాయం జరుగుతోందని అన్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి నగరాన్ని అందంగా తీర్చిదిద్దుతామని మేయర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తోపుడుబండ్ల టెండర్లలో కూడా అక్రమాలు జరిగాయని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంత అవినీతి కార్పొరేషన్‌ను చూడలేదన్నారు. 7500 రూపాయలు విలువ చేసే తోపుడుబండిని 11వేలకు కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు దుర్వినియోగం అవుతున్నట్లు పేర్కొన్నారు. వైసీపీ ఫ్లోర్‌లీడర్, కార్పొరేటర్ రూప్‌కుమార్ మాట్లాడుతూ తాగునీటి పథకం, భూగర్భ డ్రైనేజి నిర్మాణానికి 1200 కోట్లు హడ్కో రుణం తీసుకుంటున్నారని తెలిపారు. ఇది పూర్తిగా అప్పు అని ఇందుకు సంబంధించి సుమారు 100 కోట్ల రూపాయల వడ్డీ కింద చెల్లించాల్సి వస్తుందన్నారు. మేయర్ మాత్రం అప్పు కాదని చెబుతున్నారని ఇందులో ఎంతమాత్రం నిజం లేదన్నారు. ఇది ముమ్మాటికి అప్పు అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాతపూర్వకంగా ఇచ్చారని వివరించారు. ఇది రుణమని సాక్షాత్తు పురపాలక శాఖ మంత్రి ధ్రువీకరించారని వివరించారు. మేయర్ ఈ వ్యవహారంలో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. గత అసెంబ్లీ సమావేశంలో నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ తాగునీటి పథకం, భూగర్భ డ్రైనేజీలపై ప్రశ్న వేశారని ఆ ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారని తెలిపారు. అసలే కార్పొరేషన్ అప్పుల్లో ఉందని ఇంత పెద్దమొత్తంలో అప్పు తీసుకుని వచ్చి ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. మేయర్ కల్లబొల్లి కబుర్లు చెప్పి కార్పొరేషన్‌ను అప్పుల ఊబిలోకి నెట్టేశారని అన్నారు. కార్పొరేటర్ బొబ్బలి శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పత్రిక నడుపుతామని, అందుకు ఎడిటర్‌ను నియమించి 50వేల రూపాయలు జీతం ఇస్తూ స్టాండింగ్ కమిటీ సమావేశంలో తీర్మానం చేయడం దుర్మార్గమన్నారు. మేయర్ తన అనుయాయులకు కార్పొరేషన్ నిధులు దోచి పెట్టేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని తెలిపారు. నెలకు 1.50 లక్షల ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు ఖలీల్, ఓబలి రవిచంద్ర, గోగుల నాగరాజు, వైకాపా నాయకులు వేలూరు మహేష్, వందనాసి రంగ తదితరులు పాల్గొన్నారు.

కన్నుల పండువగా కార్తికేయుని కల్యాణం
చిట్టమూరు, సెప్టెంబర్ 20: మండలంలోని మల్లాం గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామి, అమ్మవార్లకు కల్యాణం కన్నుల పండువగా జరిగింది. ఈ మేరకు స్వామి అమ్మవారి విగ్రహాలను ఆలయ ప్రాంగణంలో ఉన్న శతస్తంభ కల్యాణ మండపంలో ప్రత్యేకంగా అలంకరణ చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలు, వేలాది భక్త జనసందోహం నడుమ స్వామివారి కల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తగా వాకాడు మండలం తూపిలిపాలెం హరిహర హేచరీస్ యజమాని కత్తి మోహన్‌రావు, విజయలక్ష్మి వ్యవహరించారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు, కల్యాణ తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా తెనాలికి చెందిన ములకల్లు విశ్వనాధ శర్మ వ్యహరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు గ్రామాల నుండి వచ్చిన నూతన వధూవరూలు ఆలయ ప్రాంగణంలో వివాహాలు చేసుకున్నారు. ప్రధాన ఆలయంలోని స్వామి, అమ్మవార్ల మూలవిరాట్లకు ప్రత్యేక చందన అలంకారం చేసి భక్తులకు దర్శనం కల్పించారు. మల్లాం గ్రామానికి చెందిన కరణం కాళప్ప పిళ్లై జ్ఞాపకార్థం వారి పిల్లలు ప్రసాద వినియోగం నిర్వహించారు. కల్యాణానికి వచ్చిన భక్తులు 5 వేల మందికి అన్నదానం నిర్వహించారు.

‘మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేయాలి’
గూడూరు, సెప్టెంబర్ 20: గూడూరు పురపాలక సంఘంలో మరుగుదొడ్ల నిర్మాణంలో చాలా వెనుకబడి ఉందని, వెంటనే లబ్ధిదారులను చైతన్యపరిచి త్వరితగతిన నిర్మాణాలను పూర్తిచేయాలని పురపాలక సంఘ గుంటూరు రీజనల్ చైర్మన్ అనురాధ కోరారు. మంగళవారం ఆమె పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి జరుగుతున్న మరుగుదొడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దోమల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను ఆదేశించారు. అంటు వ్యాధులు ప్రబలకుండా తాగునీటిని ఎప్పకప్పుడు క్లోరినేషన్ చేయించాలన్నారు. కాలువల్లో నీరు నిల్వ చేరకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలన్నారు. తాగునీరు విషయంలో కూడా ప్రజలను చైతన్యవంతులను చేసి కాచి చల్లార్చిన నీటినే తాగాలని కోరారు. ప్రధానంగా దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం కావడంతో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, తగు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె కమిషనర్‌కు సూచించారు.

డెంగ్యూ, మలేరియా మరణాలకు
అధికారులే బాధ్యత వహించాలి:కలెక్టర్
నెల్లూరు కలెక్టరేట్, సెప్టెంబర్ 20: దోమల వల్ల ప్రమాదకరమైన డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాలు ప్రబలకుండా అరికట్టవలసిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ రేవు ముత్యాలరాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని దర్గామిట్టలో ఉన్న కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం పారిశుద్ధ్యం, దోమలు, వ్యాధుల నివారణపై అయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డెంగ్యూ, మలేరియా వ్యాధులపై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు అవగాహన ర్యాలీలు, శిబిరాలు చేపట్టాలని ఆదేశించారు. అందుకోసం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మురికివాడల్లో పాగింగ్ చేయటం, యాంటీ మస్కిటో లార్వాలను ఉపయోగించటం వంటి చర్యలు తీసుకోవాలన్నారు. డెంగ్యూ, మలేరియా వ్యాధుల వల్ల మరణాలు సంభవిస్తే ఆ ప్రాంతపు అధికారి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అందుకోసం ఇప్పటినుండే ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు కూడా తమ ప్రాంతాలలో అధికారులు అవసరమైన పాగింగ్, దోమల నివారణ చర్యలు చేపట్టకపోతే 1800 425 2499 సంఖ్య గల ఉచిత ఫోన్‌కు సమాచారం అందించాలన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీసం ఇద్దరు వైద్యులు ఉండేలా చూడాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. దీంతో వ్యాధులను ఒక పద్ధతి ప్రకారం అరికట్టగలమన్నారు. డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాలు సోకితే వెంటనే దగ్గరలోని ప్రాంతీయ, జిల్లా ప్రధాన వైద్యశాలకు తరలించాలన్నారు. వైద్యశాలల్లో అవసరమైన ఔషధాలు, పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, స్వయం సహాయక సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు బాధ్యతతో పారిశుద్ధ్య ప్రాముఖ్యతపై ప్రజలకు తెలియజేయాలన్నారు. సమావేశంలో జడ్పీ సిఇఒ బి రామిరెడ్డి, డిఆర్‌డిఎ పీడి లావణ్యవేణి, జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డాక్టర్ వరసుందరం, పలువురు మున్సిపల్ కమిషనర్లు, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బ్యాంక్ సేవలు విస్తృతపరచాలి:కలెక్టర్
నెల్లూరు కలెక్టరేట్, సెప్టెంబర్ 20: ప్రజలు, ఖాతాదారులకు వివిధ రకాలైన రుణాలు, పథకాలను అందించేందుకు సేవలను మరింత విస్తృత పరచాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కవాతు మైదానంలో మంగళవారం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ (ఎపిజిబి) ఏర్పాటు చేసిన రుణ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రుణ పథకాలు, దరావతు పథకాలు, ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ తదితర లావాదేవీల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. రుణాలను సకాలంలో చెల్లించవలసిన ఆవశ్యకతను వివరించారు. పంట రుణాలను పునరుద్ధరించుకుని నూతన రుణాలు పొందాలని సూచించారు. ప్రజలు, ఖాతాదారులకు విస్తృత సేవలందించేందుకు బ్యాంక్‌లు కృషి చేయాలన్నారు. బ్యాంక్ రుణాలు ప్రజలకు ఆశాకిరణాలన్నారు. ఎపిజిబి బ్యాంక్ ఛైర్మన్ సంపత్‌కుమార్ మాట్లాడుతూ తమ బ్యాంక్ రైతులకు ఇతోధికంగా సేవలందిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆ బ్యాంక్ ప్రాంతీయ మేనేజర్ బివి శివయ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటరావు, నాబార్డు ఎజిఎం రమేష్‌బాబు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి పోలేమర్మ జాతర
వెంకటగిరి, సెప్టెంబర్ 20: వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతరకు పట్టణం ముస్తాబైంది. పోలేరమ్మ ముఖ మండపానికి, అమ్మవారి దేవస్థానాన్ని ప్రత్యేక విద్యుత్ దీపాలతో అలంకరించారు. పట్టణంలో పలుచోట్ల అమ్మవారి ప్రతిమను విద్యుత్ దీపాలతో అలంకరించారు. జాతరంటే ముందు కనపడేది చిన్నారుల సందడి కావడంతో వారి కోసం జయింట్‌వీల్స్, అనే రకాల వస్తులు చేరుకున్నాయి. అమ్మవారి మొక్కులు తీర్చుకునేందకు భక్తులు లక్షల సంఖ్యలో కొబ్బరికాయలు కొట్టడం ఇక్కడ విశేషం. అందుకే భారీ సంఖ్యలో రోడ్డుకు ఇరువైపులా కొబ్బరికాయలు అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. దేవస్థానం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక భారీగేట్లు ఏర్పాటు చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘనలు జరగకుండా మంగళవారం నుంచే జిల్లా నలుమూలల నుంచి పోలీసులు వెంకటగిరి చేరుకున్నారు. పోలేరమ్మ అమ్మవారి ఇల్లు, అత్తవారి ఇల్లు, దేవస్థానం దగ్గర దేవాదాయ శాఖ అధికారులు, చైర్మన్ తాండవ చంద్రారెడ్డి, కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఏర్పాట్లు అన్నీ చకచకా జరుగుతున్నాయి. ఎప్పడు లేనివిధంగా ఈ సంవత్సరం పోలీసు యంత్రాగం అధిక సంఖ్యలో వెంకటగిరి చేరుకోవడంలో జాతర హడావిడి మరింత కొట్టచ్చినట్లుగా కనిపిస్తోంది.

నిర్దిష్ట కాలపరిమితిలోగా
ఉపాధి పనులు పూర్తిచేయాలి
* ముఖ్య కార్యదర్శి దినేష్‌కుమార్ ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, సెప్టెంబర్ 20: జిల్లాలో చేపట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను వేగవంతం చేసి నిర్దిష్ట కాలపరిమితిలోగా పూర్తిచేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న ఉపాధి పనుల తీరుపై మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో గ్రామీణాభివృద్ధి కమిషనర్ బి రామాంజనేయులు, కలెక్టర్ కాంతిలాల్ దండేలతో కలిసి జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా దినేష్‌కుమార్ మాట్లాడుతూ 2014-15 సంవత్సరంలో మంజూరైన పనులను ఈ ఏడాది డిసెంబర్ లోగా పూర్తిచేయాల్సి ఉందన్నారు. అలాగే 2015-16కు మంజూరైనవి 2017 మార్చి నెలాఖరు నాటికి పూర్తి కావాలని స్పష్టంచేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో చేపట్టిన ఉపాధి హామీ పథకం పనుల తీరులో గుంటూరు జిల్లా, ప్రధానంగా పల్నాడు ప్రాంతం వెనుకంజలో ఉందని, పనులను వేగవంతం చేసి జిల్లాను ముందు వరుసలో నిలపాల్సిన అందరిపై ఉందన్నారు. సమీక్ష, 15 రోజులకోసారి వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా అధికారులందరూ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కమిషనర్ బి రామాంజనేయులు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కూలీలు, రైతులకు కల్పతరవు వంటిదని, ఈ పథకం కింద చేపట్టే పనులు త్వరితగతిన పూర్తి చేయగలిగితే కూలీలకు ఆర్థికపరంగా సహాయం, మరోవైపు రైతులకు, ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఈ పథకం కింద 153 కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రధానంగా పనులు పూర్తి చేయడంలో సర్పంచుల పాత్ర కీలకమని, వారి సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. సేద్యపు కుంటలు, ఇంకుడు గుంతలు, సిసి రోడ్లు, గ్రామ పంచాయతీ, మంల, అంగన్‌వాడీ భవనాలు, మరుగుదొడ్ల నిర్మాణాలు, పారిశుద్ధ్యం, చెత్త తొలగింపు, చెరువుల పూడికతీత వంటి అనేక కార్యక్రమాలు ఈ పథకం కింద చేపడుతున్నామని వివరించారు. జిల్లాలో ఉపాధి పథకంలో ఏర్పడుతున్న సమస్యలు, వివరాలను కలెక్టర్ కాంతిలాల్ దండే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వెంకట సుబ్బయ్య, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి పి శ్రీనివాసులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన రాష్టస్థ్రాయి అధికారులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నేలపాడు ట్రిపుల్ మర్డర్ కేసులో నిందితుల అరెస్టు
* పోలీసులకు దొరక్కుండా హైకోర్టులో లొంగిన ప్రధాన నిందితుడు
తెనాలి/తెనాలి రూరల్, సెప్టెంబర్ 20: తెనాలి మండలం నేలపాడు శివారులో గతనెల 24న సంచలనం రేకెత్తించిన ట్రిపుల్ మర్డర్ కేసు నిందితులను మంగళవారం అరెస్టు చేసినట్లు డిఎస్పీ రమణమూర్తి చెప్పారు. స్థానిక తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ సంఘటన వివరాలు వెల్లడించారు. కొల్లిపర మండలం తూములూరు గ్రామానికి చెందిన ఆళ్ళ సీతమ్మకు ముగ్గురు సంతానం. కాగా పెద్దకుమార్తె పగడాల శ్రీలక్ష్మి అల్లుడు బలరామిరెడ్డి ఆగస్టు 24న తూములూరు నుండి తెనాలి కోర్టుకు ఆటోలో వస్తుండగా వారి వెంటవున్న సాక్షి దేవయ్య, ఆటో డ్రైవర్ నాని, సీతమ్మ లపై నేలపాడు శివారు ప్రాంతంలో వెనుకగా అంబాసిడర్ కారుతో ఆటోను ఢీకొట్టి పథకం ప్రకారం కిరాయి రౌడీలతో ఆటో ప్రయాణిస్తున్న ఐదుగురిపై మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడిజరిగింది. ఈదాడిలో బలరామిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్ నాని, సాక్షి దేవయ్య, చికిత్స పొందుతూ ఆసుప్రతిలో మృతి చెందారు. మిగిలిన ఇద్దరు మహిళలకు గాయాలు కావటంతో ఇటీవలే చికిత్స అనంతరం ఆసుపత్రి నుండి గృహాలకు చేరుకున్నారు. ఈహత్య ఉదంతాన్ని రెండవ అల్లుడు వంగా సుధాకరరెడ్డి ఆస్తి వివాదాల నేపథ్యంలో చేయించినట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఈహత్యకేసులో ఎనిమిదిమంది ముద్దాయిలుకాగా ఆరుగురిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకోగా ప్రధాన నిందితుడు సుధాకరరెడ్డి హైకోర్టులో లొంగిపోయాడు. అనంతరం ఎస్పీ ఆదేశాల మేరకు అతిడిని కూడా మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్పీ వివరించారు. అయితే ఈకేసులో మరో ముద్దాయి జన్ను శ్రీరామ్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని అతడిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని ఆయన తెలిపారు. ఆస్తివివాదాల నేపథ్యంలో విచక్షణా రహితంగా తోడి అల్లుడు, సాక్షిపై, అత్త, వదిన, డ్రైవర్‌లపై దాడి చేయించిన సుధాకరరెడ్డిని పోలీసులు నేరుగా అరెస్టు చేయక పోవటం, నిందితుడు నేరుగా హైకోర్టులో లొంగిపోవటం, కోర్టు గుంటూరు జిల్లా కార్యాలయంలో లొంగిపోవాలని ఆదేశించటం తదితర సంఘటనలు పోలీసుల వైఫల్యాన్ని కొట్టొచ్చినట్లు చూపుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఈసమాశంలో డిఎస్పీతో పాటుగా రూరల్, 1,2,3 పట్టణ సిఐలు బి చినమల్లయ్య, బెల్లం శ్రీనివాసరావు, కళ్యాణ్‌రాజ్, అశోక్‌కుమార్, కొల్లూరు ఎస్‌ఐ అద్దంకి వెంకటేశ్వర్లు, కొల్లిపర ఎస్‌ఐ అనిల్‌కుమార్‌రెడ్డి సిబ్బంది ఉన్నారు.

బాధితుల దాడిలో రౌడీషీటర్ మృతి

తాడేపల్లి, సెప్టెంబర్ 20: మండల పరిధిలోని ప్రాతూరు గ్రామంలో మంగళవారం జరిగిన దాడిలో కనపాల నాగరాజు(35) అనే రౌడీషీటర్ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాతూరుకి చెందిన బాలస్వామి కుమార్తె జయంతికి, కొల్లూరుకి చెందిన ఆలపాటి నాగరాజుతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. ఏడాది క్రితం జయంతి భర్త ఆలపాటి నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం రౌడీషీటర్ కనపాల నాగరాజు జయంతిని తనతో ఉండాలని వేధించసాగాడు. దీనికి నిరాకరించిన ఆమె ప్రాతూరులోని తన పుట్టింటికి వచ్చేసింది. కాగా రౌడీషీటర్ నాగరాజు జయంతి అడ్రస్ చూపించాలని ఆమె మామ ఇస్సాక్‌పై ఒత్తిడి తెస్తూ అతడిపై దాడి చేశాడు. దీనితో ఇస్సాక్ భయపడి నాగరాజుని తీసుకుని మంగళవారం తెల్లవారుఝామున ప్రాతూరు వచ్చి జయంతి ఇల్లు చూపించాడు. జయంతి నిద్రిస్తుండగా రౌడీషీటర్ నాగరాజు ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించగా ఆమె పెద్దగా కేకలు వేయటంతో పక్కనే నిద్రిస్తున్న ఆమె తండ్రి బాలస్వామి రౌడీషీటర్ నాగరాజుపై దాడి చేశాడు. దీనితో నాగరాజు తన ద్విచక్ర వాహనంపై ఉడాయించటానికి ప్రయత్నించగా అతని వెంటపడి బాలస్వామి దాడి చేయటంతో నాగరాజుకి బలమైన గాయం తగిలి మృతి చెందాడు. సమాచారం అందుకున్న మంగళగిరిరూరల్ సిఐ హరికృష్ణ, తాడేపల్లి ఎస్సై వినోద్‌కుమార్, సిబ్బంది ప్రాతూరు చేరుకుని రౌడీషీటర్ మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రౌడీషీటర్ మృతికి కారణమైన బాలస్వామి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

అనధికార కట్టడాలపై సిఆర్‌డిఎ ఆరా..

మంగళగిరి, సెప్టెంబర్ 20: గుంటూ రు - విజయవాడ నగరాల మధ్య రాజధాని అమరావతికి సమీపంలో ఉండి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మంగళగిరి పురపాలకసంఘం పరిధిలో విచ్చల విడిగా జరుగుతున్న అనధికార కట్టడాలపై క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అధారిటీ (సిఆర్‌డిఎ) ఆరా తీస్తోంది. ఇటీవల విజయవాడ, యనమలకుదురు, పెనమలూరు మొదలైన ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను కూల్చివేసిన సిఆర్‌డిఎ అధికారులు మంగళగిరి ప్రాంతంపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. పట్టణంలో 90 వేలకు పైగా జనాభా నివసిస్తోంది. 16 వేలకు పైగా వాణిజ్య, నివాస భవనాలు ఇక్కడ ఉన్నాయి. 2014 వరకు ఉన్న విజిటియం ఉడా, ఆ తరువాత ఏర్పడిన సిఆర్‌డిఎ నిబంధనలను విస్మరించి అనేక అనధికార కట్టడాలు పట్టణంలో వెలిశాయన్నది బహిరంగ రహస్యమే. రాజకీయ పలుకుబడి కలిగిన నేతలు పలువురు అక్రమ కట్టడాలను నిర్మించి మున్సిపల్ అధికారులను ఖాతరుచేయని పరిస్థితి నెలకొంది. ఇదే స్ఫూర్తితో మరికొందరు వ్యాపారులు కూడా ప్లానుకు విరుద్ధంగా భవనాలు నిర్మించగా అడ్డుకున్న అధికారులను హేళనగా మాట్లాడుతూ రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తుల భవనాల జోలికి వెళ్లకుండా తమ జోలికెందుకొస్తున్నారని పేర్కొంటూ చేతనైతే అనధికార కట్టడాలన్నీ కూల్చివేయాలని సవాల్ విసురుతున్నారు. ఈ పరిస్థితి మున్సిపల్, పట్టణ ప్రణాళికా విభాగం అధికార యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. అనధికార కట్టడాలు నిర్మించిన వారి విషయంలో ప్రభుత్వం కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తూ అదనపు రుసుములు చెల్లిస్తే అనధికార కట్టడాలను క్రమబద్ధీకరిస్తుండటంతో అక్రమ కట్టడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. కనీసం కారు తిరగని చిన్న సందుల్లో సైతం ఐదంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. వీటిని అరికట్టడంలో మున్సిపల్ యంత్రాంగం వల్ల కావటంలేదని గ్రహించిన సిఆర్‌డిఎ అనధికార కట్టడాలపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉన్న సిఆర్‌డిఎ రంగంలోకి దిగితే స్థానికంగా ఉన్న అధికార పార్టీ నేతలు కూడా అనధికార కట్టడాలు కూల్చివేత అడ్డుకునే విషయంలో జోక్యం చేసుకోరని సిఆర్‌డిఎ యంత్రాంగం భావిస్తోంది. అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ గడువు ముగిశాక సిఆర్‌డిఎ రంగంలోకి దిగేందుకు వేచిచూస్తోంది. రాజధానికి అతిసమీపంలో ఉన్న రెండు పురపాలక సంఘాల్లో మంగళగిరి కూడా ఒకటి కావడంతో మాస్టర్ ప్లాన్ ప్రకారం రహదారులు విస్తరించి క్రమపద్ధతిలో అభివృద్ధి పరచాలనే యోచనలో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పట్టణంలో కొన్ని రద్దీ ప్రాంతాల్లో పార్కింగ్ కోసం నిర్మించిన సెల్లార్‌లో సైతం వ్యాపారాలు ఏర్పాటు చేసి వాహనాల పార్కింగ్ నడిరోడ్డుపైనే పెడుతున్నారు. పురపాలక సంఘంలో కొన్ని బిల్డింగ్ ప్లాన్‌లకు సంబంధించిన ఫైళ్లు అదృశ్యమయ్యాయని అధికారులే చెబుతున్నారు.

ఉగ్రవాద పాకిస్తాన్‌కు బుద్ధిచెప్పాలి
* బిజెపి ఆధ్వర్యంలో ఉగ్రవాద దిష్టిబొమ్మ దగ్ధం
గుంటూరు, సెప్టెంబర్ 20: ఉగ్రవాదులను పెంచిపోషిస్తూ భారత్‌ను దొంగదెబ్బ తీస్తున్న పాకిస్తాన్‌కు తగిన బుద్ధిచెప్పాల్సిన సమయం ఆసన్నమైందని, ఈ విషయమై కేంద్రప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు బిజెపి నాయకులు కోరారు. ఉగ్రవాద దాడిలో వీరమరణం పొందిన 17 మంది సైనికుల ఆత్మలకు శాంతి కలగాలని కోరుతూ ఉగ్రవాద పాకిస్తాన్ చర్యలను ఖండిస్తూ మంగళవారం బిజెపి నగర కమిటీ ఆధ్వర్యాన భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. అరండల్‌పేటలోని నగరపార్టీ కార్యాలయం నుంచి లాడ్జిసెంటర్ మీదుగా శంకర్‌విలాస్ వరకు ప్రదర్శన కొనసాగింది. అనంతరం ఉగ్రవాద దిష్టిబొమ్మను నాయకులు, కార్యకర్తలు దగ్ధంచేశారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మజ్దూర్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కెవి సుబ్బారావు మాట్లాడుతూ సైనికుల వీరమరణం భారత్‌కు తీరనిలోటన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు భారతసైన్యం తగిన బుద్ధిచెప్తుందని తెలిపారు. రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి రంగరాజు మాట్లాడుతూ పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించి ఏకాకిని చేసి ప్రపంచ సమాజం నుంచి వెలివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు నేరెళ్ల మాధవరావు, నాయకులు గౌస్ మొహిద్దిన్, ఆలూరి కోటేశ్వరరావు, చెరుకూరి తిరుపతిరావు, అప్పిశెట్టి రంగా, మంత్రి సుగుణ, ఏడుకొండలు, లక్ష్మీ అన