శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నిరంకుశ పాలన సాగిస్తున్న చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి, అక్టోబర్ 20: రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఏకపక్ష విధానాలు, నిరంకుశ ధోరణితో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనల కోసం కావలి పట్టణానికి రాగా, ఎమ్మెల్యే రామిరెడ్డితో కలిసి విలేఖరులతో మాట్లాడారు. ఎంపి మేకపాటి మాట్లాడుతూ ప్రతి సంక్షేమ పథకాన్ని జన్మభూమి కమిటీలకు పెత్తనం ఇచ్చి అర్హులను పక్కనపెట్టి రాజకీయ రంగులు చూసి మరీ లబ్ధి చేకూరుస్తున్నారని విమర్శించారు. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి దృష్టిలో ఏ పార్టీవారైనా అందరూ సమానంగానే ఉండాలని, అందరికీ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందివ్వాల్సిన గురుతర బాధ్యత ఉందన్నారు. కానీ దానిని విస్మరించి చంద్రబాబు వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. గత ఎన్నికల్లో 104 స్థానాలు సాధించిన చంద్రబాబు మరో నలుగురు బిజెపి ఎమ్మెల్యేలతో కలిపి 108 ఎమ్మెల్యేలు కలిగి వున్నారని, అయినప్పటికీ విపక్షం అన్నది లేకుండా చేయాలనే కుట్రతో 20మంది తమ పార్టీ ఎమ్మెల్యేలను తనవైపు లాక్కొన్నారని విమర్శించారు. పైగా అసెంబ్లీలో చట్టపరంగా ఉన్న హక్కుల మేరకు ప్రత్యేక హోదా ప్రస్తావన తెచ్చినా 14మంది తమ పార్టీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇప్పించి వారిని భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇది ఎంతమాత్రం ప్రజాస్వామ్య సమ్మతం కాదన్నారు. కేరళ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ఒక్కో ఎమ్మెల్యేకు 8కోట్ల రూపాయల అభివృద్ధి నిధిని ఏడాదికి అందిస్తుండగా, రాష్ట్రంలో వున్న కోటి రూపాయల అభివృద్ధి నిధిని రద్దుచేసి ప్రజాప్రతినిధికి విలువ లేకుండా చేశారన్నారు. అయితే టిడిపి ఎమ్మెల్యేలకు, ఓడిపోయిన ప్రస్తుతం ఇన్‌చార్జ్‌లుగా వున్నవారికి అభివృద్ధి నిధులు అందుబాటులో వుంచారని, ఇది ఒక్కటే కక్షపూరిత వివక్ష రాజకీయాలకు నిదర్శనం అన్నారు. ఒక్కొక్క ఎంపికి ఆరుకోట్ల రూపాయల అభివృద్ధి నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించి వుండగా దానిని రెట్టింపు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఎంపీలు అంతా విజ్ఞప్తి చేస్తున్నారని, దీనిపై సానుకూల నిర్ణయం రాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఆక్వాపార్క్ నిర్మాణానికి నిరంకుశంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతోందని, ఎక్కడాలేని తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని మండిపడ్డారు. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆప్రాంతంలో పర్యటించి వారికి భరోసా కల్పించారని అన్నారు.
6వ వార్డులో గడపగడపకు వైకాపా
ఎమ్మెల్యే రామిరెడ్డి, ఫ్లోర్‌లీడర్ కనమర్లపూడి, జిల్లా అధికార ప్రతినిధి కామరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి సుకుమార్‌రెడ్డి, కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు, పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, కౌన్సిలర్లు, నేతలతో కలిసి 6వ వార్డులో గడపగడపకు వైకాపా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఎంపి మేకపాటి వంద ప్రశ్నలతో కూడిన కరపత్రాలను ఇంటింటా మహిళలకు అందచేశారు. ఈసందర్భంగా డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణ మాఫీ, సామాజిక పింఛన్‌ల పంపిణీ తదితర అనేక ప్రభుత్వ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ అందుతున్నాయా, లేదా అని వాకబు చేశారు. మెజార్టీ ప్రజలు తమకు ఏమీ అందడంలేదని బదులు ఇచ్చారు. ఇచ్చిన కరపత్రంలో అభిప్రాయాలను తెలిపి తిరిగి ఇవ్వాలని ఈసందర్భంగా ప్రజలకు ఎంపి, ఎమ్మెల్యేలు సూచించారు. తమ ప్రాంతంలో మంచినీటి బోర్లు లేవని, వేయించాలని కోరారు. అలాగే పోలేరమ్మ గుడి వద్ద మరో బోరును ఏర్పాటు చేయాలని మహిళలు విన్నవించారు. ఎస్‌ఎస్ ట్యాంక్ నుంచి తమ ప్రాంతానికి మంచినీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన ఎంపి, ఎమ్మెల్యేలు మున్సిపల్ అధికారులకు సూచనలు ఇచ్చారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
మంత్రి శిద్దా స్పష్టం
నెల్లూరు టౌన్, అక్టోబర్ 20: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. చంద్రబాబు నదుల అనుసంధానం చేపట్టి 13 జిల్లాలను కరవు రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలోని టిడిపి కార్యాలయంలో గురువారం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అధ్యక్షతన జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఇన్‌చార్జి మంత్రి శిద్దా రాఘవరావు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి శిద్దా మాట్లాడుతూ త్వరలో జరగనున్న శాసనమండలి ఎన్నికల్లో అన్ని సీట్లను జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు అందరు కలసి పనిచేసి కైవసం చేసుకోవాలన్నారు. ఇతర పార్టీల వారిని కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీయే విజయం సాధించేలా కృషి చేయాలన్నారు. ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని, జనచైతన్య యాత్రల్లో సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని సిఎం సూచించారన్నారు. రాష్ట్రంలో 5వేల కిలోమీటర్ల మేర రోడ్లు వేశామన్నారు. రవాణా శాఖలో సాంకేతికతను ప్రవేశపెట్టామని, దీంతో ప్రజలు తమ ఇళ్ల నుంచే వారికి కావాల్సిన పనులను చేసుకుంటున్నారన్నారు. తమ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ భారీఎత్తున రైతులకు సబ్సిడీలు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటుతున్న తరుణంలో పంట కుంటలు, నీరు-చెట్టు, పాంఫాండ్స్ వంటి కార్యక్రమాలను చేపట్టి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్నడూ టిడిపి గెలుపొందలేదని ఈసారి గెలుపొంది దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత లోకేష్‌కు కానుకగా ఇవ్వాలన్నారు. ఇందుకోసం గ్రామ, మండలస్థాయిలో ఓట్ల నమోదు కార్యక్రమాన్ని నవంబర్ 1వ తేదీలోగా పూర్తిచేయాలన్నారు. సిఎం ఆదేశాల మేరకు తాను, గంటా శ్రీనివాసరావు రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకుల నాయకులతో ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించామన్నారు. తొలివిడతగా రైతుల రుణమాఫీ కోసం దాదాపు రూ.24 వేల కోట్లను వడ్డితో సహా రూ.50 వేల లోపు రుణాలు పొందిన రైతులకు నేరుగా వారి వారి ఖాతాలలో జమ చేశామన్నారు. రెండో విడతగా రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విదేశీ చదువుల నిమిత్తం విద్యార్థులకు 10 లక్షల వరకు సాయం అందించనున్నట్లు వెల్లడించారు. చంద్రన్న బీమా, పింఛన్లు, రేషన్‌కార్డులను బయోమెట్రిక్ విధానం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. 1.25 లక్షల గృహాలను ఏడాదిన్నర లోపు పూర్తిచేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ప్రధానంగా విశాఖ, నెల్లూరు, కాకినాడ, పోర్టులను ఎన్నుకుంటున్నారన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో 14 పోర్టులను, 14 విమానాశ్రయాలను ఏడాదిలోపు నిర్మించనున్నట్లు ఆయన తెలియజేశారు.

రోడ్డు విస్తరణకు సమీపిస్తున్న ముహూర్తం
* ఎల్‌ఆర్‌పల్లెలో ఐదు అడుగుల తగ్గింపు మార్కింగ్
ఆత్మకూరు, అక్టోబర్ 20: ఆత్మకూరు పట్టణంలోని లక్ష్మణరావుపల్లె బంగ్లా కూడలి నుంచి సోమశిల సెంటర్ వరకు ప్రధాన రహదారి విస్తరణ పనులు అనతికాలంలో చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. రోడ్డు మధ్య కేంద్రం నుంచి ఇరువైపులా 35 అడుగుల వరకు ఆక్రమణల తొలగింపునకు తొలుత మార్కింగ్ చేశారు. ఇటీవల మాజీ మంత్రి, టిడిపి ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఆనం రామనారాయణరెడ్డి సూచన మేరకు ఆక్రమణ తొలగింపులో ఇరువైపులా ఐదు అడుగుల నిడివి వరకు మినహాయింపుచర్యలు చేపట్టారు. గురువారం రోడ్డుమధ్య నుంచి 30 అడుగులతో మార్కింగ్ ప్రక్రియ నిర్వహించారు. తొలుత ఎర్రటి వర్ణపుమార్కింగ్, తగ్గింపు అనంతరం ఆకుపచ్చ రంగుతో మార్క్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బి ఏఇ గోపికృష్ణ, వర్క్‌ఇన్‌స్పెక్టర్ పంతులు, తదితరులు పాల్గొన్నారు. కాగా, సొంత స్థలాలు, పోరంబోకు స్థలాలకు సంబంధించి రెవెన్యూ యంత్రాంగం కసరత్తు పూర్తి చేయగానే ఆక్రమణల క్రమబద్దీకరణకు శ్రీకారం చుట్టనున్నారు. ఇదిలాఉంటే స్థానిక కెకెఆర్ ఆసుపత్రి యాజమాన్యం రోడ్డు విస్తరణ పనులపై అభ్యంతరం వెలిబుచ్చుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం విధితమే. తమ సొంత స్థలంలో నిర్మించుకుని ఉన్న భవన సముదాయానికి ఆమోదయోగ్యమైన రీతిలో పరిహారం ఇచ్చిన తదుపరే రోడ్డు విస్తరణ చర్యలు తీసుకోవాలని డాక్టర్ సుధాకర్‌రెడ్డి పట్టుబడుతున్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీ ఏ గణాంకాలను అనుసరించి తమ భవన సముదాయానికి ఆస్తి పన్ను విధిస్తున్నదో అదే లెక్క ప్రకారం భవనాలకు విలువ పరిగణించాలని కోరుతున్నారు. భవన విలువకు రెట్టింపుమొత్తాల పరిహారం అందజేస్తేనే తాము రహదారి విస్తరణకు సమ్మతిస్తామని లేకుంటే ఉన్నత స్థాయి వరకైనా న్యాయపోరాటాలు సాగిస్తూనే ఉంటామని విలేఖర్ల వద్ద ఖరాఖండిగా స్పష్టం చేస్తున్నారు.

ప్రజలను చైతన్యవంతుల్ని చేసేది గ్రంథాలయాలే
* గ్రంథాలయాలకు రూ.23.56 కోట్లు మంజూరు
* మంత్రులు శిద్దా, నారాయణ స్పష్టం
నెల్లూరుటౌన్, అక్టోబర్ 20: ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు గ్రంథాలయాలు ఎంతో ఉపయోగపడతాయని జిల్లా ఇన్‌చార్జి మంత్రి శిద్దా రాఘవరావు, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. గురువారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ కన్వీనర్ కిలారి వెంకటస్వామినాయుడు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ప్రమాణస్వీకారోత్సవం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అధ్యక్షత వహించారు. ఈసభకు ముఖ్యఅతిధులుగా మంత్రులు పాల్గొని మాట్లాడారు. గ్రంథాలయమంటే ఒక దేవాలయమని, దానిలో మంచి వాతావరణం కల్పిస్తే పదవి చిన్నదైనా జిల్లాలో వెంకటస్వామినాయుడు పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత రూ.23.56 కోట్లు గ్రంథాలయాల అభివృద్థికి నిధులను మంజూరు చేశారన్నారు. గ్రంథాలయాలు ప్రజలను చైతన్యవంతులుగా చేసేందుకు ప్రముఖపాత్ర పోషిస్తున్నాయన్నారు. గ్రంథాలయాల్లో ఎంతోమంది పేదలు చదువుకొని నేడు ఉన్నత పదవుల్లో ఉన్నారని గుర్తు చేశారు. అలాంటి గ్రంథాలయాలు నేడు శిథిలావస్థలో ఉన్నాయని, వాటి అభివృద్ధి కోసం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. జిల్లాలోని గ్రంథాలయాల్లో ఉన్న సమాచారాన్ని సిడిల రూపంలో భద్రపరచి రాబోవు తరాల వారికి అందించాలని వారు సూచించారు. పదవి చిన్నదా, పెద్దదా అనేది ముఖ్యం కాదని ఆ పదవికే గుర్తింపు తీసుకురావాలన్నారు. గతంలో ముద్దు కృష్ణమనాయుడు అటవీ శాఖ, నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పంచాయతీరాజ్ శాఖలకు వారు గుర్తింపును తీసుకువచ్చారన్నారు. అలాగే జిల్లా గ్రంథాలయ సంస్థకు కూడా గుర్తింపు తీసుకొచ్చే బాధ్యతను వెంకటస్వామి పోషించాలన్నారు. గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలని, అందుకు తమ వంతు సహాయాన్ని అందిస్తామన్నారు. పార్టీ కోసం జెండాను భుజాన వేసుకొని మోసిన సీనియర్ నాయకులను, కార్యకర్తలను, కష్టించి పనిచేసేవారికి సిఎం నామినేటెడ్ పదవులు అందచేస్తారన్నారు. కన్నబాబు, జోత్స్నలతలు కూడా బాధపడాల్సింది లేదని వారికి కూడా నామినేటెడ్ పదవులు వరించనున్నాయన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం అందించే నిధులే కాకుండా తన సొంత నిధులు, కొంత దాతల సహకారంతో చేపట్టాలని కోరారు. అనంతరం కిలారి వెంకటస్వామి నాయుడు మాట్లాడుతూ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు తాను ఈ పదవి చేపట్టానన్నారు. ఈ పదవిని తనకు కట్టబెట్టడంతో మరింత బాధ్యత పెరిగిందని, జిల్లాలోని అన్ని గ్రంథాలయాలను ఉన్నతంగా తీర్చిదిద్దుతానని ఆయన వెల్లడించారు. అనంతరం ఆయనను గజమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, మాజీ మంత్రులు పరసా రత్నం, ఆనం రామనారాయణరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి, తియ్య చంద్ర, పిఆర్‌వి మురళి, జయకుమార్‌రెడ్డి, ధర్మవరపు సుబ్బారావు, అనురాధ, చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, మండవ రామయ్య, జలదంకి సుధాకర్, హరిబాబుయాదవ్, గోపాలకృష్ణచౌదరి, దేవరాల సుబ్రహ్మణ్యం, రాజేష్, జడ్ శివప్రసాద్, మొయినుద్దీన్, ఎన్.ఝాన్సీ, షంషుద్దీన్, ఖాదర్‌బాష, డివి లక్ష్మి, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఎం.రజని, సత్యనాగేశ్వరరావు, తిరుమలనాయుడు, పెంచులయ్యనాయుడు, డి.వాణి, కొండ్రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలుత శిద్దా రాఘవరావు, నారాయణ, బీద, సోమిరెడ్డి, వాకాటి నారాయణరెడ్డి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా గ్రంథాలయ శాఖ కార్యదర్శి పోలిరెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామినాయుడితోపాటు ఆ కమిటీ సభ్యులైన దశరధరామయ్య గౌడ్, జలదంకి సుధాకర్, రవీంద్రబాబు, దొడ్ల విజయలక్ష్మి, పుట్ట ఇందిరతో ప్రమాణస్వీకారం చేయించారు.

ఎస్‌ఎస్ కాలవ పనులు పరిశీలించిన జడ్పీ చైర్మన్
వెంకటగిరి, ఆక్టోబర్ 20: వెంకటగిరి మండలం చెలికంపాడు ప్రాంతంలోని వడ్డిపల్లి సెంటర్ వద్ద జరుగుతున్న ఎస్‌ఎస్ కాలువ పనులను జిల్లా పరిషత్ చైర్మన్, నియోజకవర్గ వైకాపా ఇన్‌చార్జ్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి గురువారం పరిశీలించారు. గతంలో చెలికంపాడు, వడ్డిపల్లికి చెందిన 90 కుటుంబాలు 150 ఎకరాల్లో భూమిని సాగు చేసుకుంటుండగా ఆ పొలాలకు ఎగువ భాగాన ఎస్‌ఎస్ కాలువ నిర్మించారు. అయితే పది రోజుల క్రితం మరలా పొలాలకు పైభాగాన చేస్తున్న నిర్మాణ పనులు ఆపి మరలా రైతులు సాగు చేసుకుంటున్న పొలాల్లో పనులు చేసేందుకు సిద్ధం కాగా రైతులు అడ్డుకున్నారు. తాము ఈ పొలాలను నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని ఇప్పుడు ఈ పొలాల్లో కాలువ పనులు చేస్తే 90 కుటుంబాలు రోడ్డున పడతాయంటూ వారు అభ్యంతరం తెలిపారు. ఈ విషయాన్ని గ్రామస్ధులు జడ్పీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లడంతో బొమ్మిరెడ్డి స్థానిక వైసిపి నాయకులతో కలిసి చెలికంపాడులో ఎస్‌ఎస్ కాలువ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం సంబంధిత కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి గతంలో రైతులు సాగు చేసుకుంటుంన్న పొలాలపై నిర్మాణం చేస్తుండగా ఇప్పడు పొలాల్లో ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ నిర్మాణం వల్ల 90 కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. గతంలో చేస్తున్న కాలువ నిర్మాణాలు కొనసాగించాలని సూచించారు. అయితే పొలాలపై ఎస్‌ఎస్ కాలువ పనులు చేస్తే ఎంతటి పోరాటానికైనా సిద్ధమవుతామని రైతులు హెచ్చరించారు. ఆయన వెంట నాయకులు చిట్టేటి హరికృష్ణ , డిల్లీబాబు తదితరులు ఉన్నారు.

ఆత్మగౌరవంతో పని చేయండి
* ఎస్సీ, ఎస్టీ సర్పంచ్‌లకు కారెం శివాజీ పిలుపు

నెల్లూరు, అక్టోబర్ 20: ఎస్సీ, ఎస్టీలకు చెందిన గ్రామ సర్పంచ్‌లు ఆత్మగౌరవంతో పనిచేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ఎస్సీ, ఎస్టీ సర్పంచ్‌లకు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శివాజీ మాట్లాడుతూ పథకాల గురించి అవగాహన కల్పించుకుని గ్రామస్థాయిలో అమలు చేసి గ్రామాభివృద్ధికి తోడ్పడాలన్నారు. గ్రామ సర్పంచ్‌లు తమ విధులు తామే నిర్వహించాలని, ఇతరుల మీద ఆధారపడవద్దని సూచించారు. ఎస్సీ, ఎస్టీ సర్పంచ్‌లు కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని, స్వతంత్రంగా చెక్‌పవర్‌ను ఉపయోగించుకోవాలని, తీర్మానాలు కూడా నిబంధనలకు అనుగుణంగా సర్పంచ్‌లు నిర్వహించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ గ్రామ సర్పంచ్‌లు నిత్యం వారు ఎదుర్కొనే సమస్యల గురించి తనకు తెలుసని, ఈ విషయంలో సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు పరిశ్రమల శాఖ పరిధిలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించుకుని ఆర్థిక స్వావలంబన సాధించుకోవాలన్నారు. గ్రామస్థాయిలో చేతిపంపుల కోసం పంచాయతీరాజ్ శాఖకు దరఖాస్తు పెట్టుకుని మంజూరు చేయించుకోవాలన్నారు. పైపుల మరమ్మతులు ఉచితంగా గ్రామీణ నీటి సరఫరా శాఖల ద్వారా నిర్వహించుకోవచ్చన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి పూర్తిగా అవగాహన కల్పించుకుని సమర్ధవంతంగా అమలు చేయాలన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి వివిధ సంక్షేమ శాఖల పరిధిలో అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనున్న ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు నూటికి నూరుశాతం ఖర్చుచేసేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ తెలిపారు. సర్పంచ్‌లు ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి అవగాహన కల్పించుకుని సమర్ధవంతంగా అమలు చేసేలా చూడాలన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధికి దాదాపు 66 పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తామని వాటిని పటిష్టంగా గ్రామస్థాయిలో అమలుచేసేలా సర్పంచ్‌లు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం పెరగాలంటే గ్రామాలు అభివృద్ధి చెందాలన్నారు. ఇలాంటి అవగాహన సదస్సులు నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటుచేస్తే బాగుంటుందని మంత్రి చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద 8,832 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. సంయుక్త కలెక్టర్-2 ఆర్‌ఎస్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల గురించి పుస్తకాలు అందించడం జరిగిందని, ఆ పుస్తకాలను సర్పంచ్‌లు బాగా చదివి పథకాలపై గ్రామస్థాయిలో పటిష్టంగా అమలు చేసేలా చూడాలన్నారు. ఎస్సీ, ఎస్టీ ఆవాసాలల్లో తాగుడు అనే సాంఘిక దురాచారాన్ని రూపుమాపేలా సర్పంచ్‌లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సర్పంచ్‌లు పరిజ్ఞానాన్ని పెంచుకుని తమ అధికారాలను స్వతంత్రంగా వినియోగించేలా పాటుపడాలన్నారు. గ్రామాల్లో ప్రజలు అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉండి సమగ్ర గ్రామాభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ సమావేశంలో శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర, వాకాటి నారాయణరెడ్డి, జెసి-2 ఆర్‌ఎస్ రాజ్‌కుమార్, వివిధ శాఖల అధికారులు, ఎస్సీ, ఎస్టీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.