సాహితి

సమాజానికి రచయితలు స్ఫూర్తినివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచయిత పి.వి.బి.శ్రీరామమూర్తితో ముఖాముఖి
==== ఒకరితో ఒకరు =====
కథతో జీవితాలను చెప్పడం ప్రారంభించి ఆయనకి నాలుగు దశాబ్దాలకు పైగా గడిచింది. తెలుగు పండితునిగా పదవీ విరమణ చేసిన రచయిత పి.వి.బి. శ్రీరామమూర్తి ఉత్తరాంధ్ర మాండలిక యాస, వ్యవహారిక భాషను కలగలిపిన శైలితో మూడు వందలకు మించి రచనలు చేసిన దిట్ట. హాస్య, వ్యంగ్య, సృజనాత్మకతలతో సమకాలీనతకు పెద్దపీట వేశారు. సరళమైన సంప్రదాయక పద్ధతిలో గ్రామీణ బ్రతుకుల్ని చిత్రించిన అనుభవం కనిపిస్తుంది. తొలి కథను 1970లో కృష్ణా పత్రికలో రాశారు. కథలతోపాటు పలు నవలలు, నాటికలు, కవితలు రాసిన నేపథ్యముంది. స్వతహాగా మంచి పౌరాణిక రంగస్థల నటులు. వీరి జన్మస్థలం శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం. ప్రస్తుత నివాసం విజయనగరం.

మధ్య తరగతి, గ్రామీణ నేపథ్యంలోంచే మీ పాత్రలు తొంగిచూస్తాయి. వీటికి కారణాలేమిటి?
మాది 30 మంది సభ్యులు గల ఉమ్మడి కుటుంబం. పైగా శుద్ధ పల్లెటూరు. కుగ్రామం. ఉద్యోగరీత్యా పార్వతీపురం (పట్నం- పల్లె కానిది)లో పూర్తి గ్రామీణ వాతావరణంలో, గ్రామీణులతో కలిసిమెలిసి తిరగడంవల్ల.
మూడు వందలకు మించి రాసిన మీ కథల్లో ప్రాంతీయ మాండలిక యాసతోపాటు, వ్యవహారిక భాషను వాహికగా చేసుకుని రచనలు చేశారు. వీటిమధ్య ఎలాంటి తేడా కనిపించింది?
మా చిన్నాన్నగారు గ్రామకరణం. మా మామయ్య మరో గ్రామానికి మునసబు. తరచూ వాళ్ళ దగ్గరికి వచ్చే తగవులు, తీర్పులూ చూశాను. గ్రామీణుల అమాయత్వం, అవిద్య, పేదరికం వల్ల దుర్భర జీవితాన్ని సాగించటం నేను కళ్ళారా చూశాను. వాళ్ళు వాడే యాస భాషకు వ్యవహారికార్థం తెలుసుకుని గుర్తుగా రాసుకునేవాణ్ణి. అందువల్ల వాళ్ళ గురించి రాయాలనుకునేటపుడు- నేనుగా కాక- ఆ పాత్రలో ఒదిగిపోయి రాయటంతో గ్రామీణ భాషకీ, వ్యవహారిక భాషకీ తేడా తెలిసేది కాదు.
మీ కథలూ, నవలలూ రచనాపరంగా ఎలాంటి సంఘర్షణలకు గురిచేశాయి? వాటి లోతుల వివరాలను మీ స్వీయ అనుభవాల్లోంచి విశే్లషించి చెబుతారా!
కథ విషయానికొస్తే- ఇంచుమించుగా నేను రాసిన కథలన్నీ మా ఇంటి వాతావరణాన్నించి, మిత్రుల నుంచి పొందినవే! కథ రాగానే మా ఇంట్లో వాళ్ళంతా మన కథే అయివుంటుంది అనుకునేవారు. నవల విషయానికొస్తే- ‘సంకెళ్ళు’ చాలా సంఘర్షణకే గురి చేసింది. అది పూర్తిగా ఏ.ఎన్.ఎమ్స్ (ఆక్సిలరీ నర్స్ మిడ్‌వైఫ్) గురించి. మా ఇంట్లో బంధువు గురించిన ఇతివృత్తం. ‘జేబులో దొంగ’ పూర్తిగా మా దూరపు బంధువు గురించి రాస్తూ కల్పన చేసింది. ఆవిడ నామీద దాడి చేస్తుందేమోనని భయపడ్డాను. ‘ఇదో యజ్ఞం’ నవల ఒక గ్రామంలో జరిగిన కథ. ప్రధాన పాత్రలు కల్పితాలు. గ్రామాలు బాగుపడాలనే ధ్యేయంతో రాసింది. ఈ నవల నాకు గొప్ప తృప్తినిచ్చింది.
సమకాలీన సమస్యలైన కాకరాపల్లి, విశాఖ బాక్సైట్ గనుల తవ్వకాలు, సెజ్‌లు, భోగాపురం విమానాశ్రయ నిర్మాణ వ్యతిరేక పోరాటాలు వంటి అంశాలపై మీ రచనల్లో ప్రతిస్పందించకపోవడానికి వ్యక్తిగత అభిప్రాయాలు ఏమైనా అడ్డొచ్చాయా?
సెజ్‌మీద నేనోసారి ఓ పత్రికకి కథ రాసి పంపాను. ఓసారి ఆ పత్రికా సంపాదకునితో కలిసినపుడు ఆ కథ గురించి అడిగితే - ‘ఎందుకండీ ఇవాళుండీ రేపు మరచిపోయే సమస్యలమీద కథలు రాస్తారు. మంచి ‘కుటుంబ కథ’ రాయండి’ అన్నాడు. ఇక ఆ రోజుల్లో ఏ పత్రికలో చూసినా ఇవే కథలు. దాంతో మరి ఆ జోలికి పోలేదు. ఇక పోరాటాల మీద కథలెందుకు రాయలేదూ అంటే- ఈ పోరాటాలు చేస్తున్నది ప్రతిపక్ష రాజకీయ పార్టీలేగానీ- బాధిత కుటుంబాలు కాదు. బాధితుల్ని ప్రత్యక్షంగా పరామర్శించి కనుక్కునే వ్యవధి లేక కూడా వాటిపై కథలు రాయలేకపోతున్నాను.
ఇప్పుడొస్తున్న ఉద్యమాలు, వాదాలు, ప్రపంచీకరణ నేపథ్యంలో అస్తిత్వ పోరాట హక్కుల కోసం గిరిజన అడవి బిడ్డల బతుకుల్ని సమస్యాత్మకంగా చిత్రించడం ఎంతవరకూ సబబుగా అనిపిస్తుంది?
గిరిజన అడవి బిడ్డల బ్రతుకులను ఉద్యమాలతో ముడిపెట్టడం సబబుకాదు. 1970కి పూర్వం గిరిజనుల బ్రతుకులు దారుణంగా ఉండేవి. ఇప్పుడు వాళ్ళూ చదువుకుంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. కాకపోతే చదువుకున్న గిరిజనులు అమాయక గిరిజనులని దోచుకుంటున్నారు. తేడా అంతే!
ప్రస్తుత సామాజిక ధోరణులని సాహిత్య రంగపు పోకడల తీరుతెన్నుల్ని మీరు ఎలాంటి కోణంలో అర్థం చేసుకుని, ఏ దృష్టితో పరిశీలిస్తారు?
ఇప్పటి సమాజంలో అవిద్య, పేదరికం తక్కువ. సమాజంలో ఎదుగుదల, అభివృద్ధి, విద్య, ఉద్యోగం, వైద్యం వంటి అనేక సమస్యలున్నాయి. 60 ప్రాంతాల్లో భూములు, ఆక్రమణలు, రైతు సమస్యలూ, కరువూ ఉండేవి. 70 తరువాత నక్సల్స్ ఉద్యమం రచయితలపై ఎక్కువ ప్రభావం చూపింది. ఇది చాలా కాలం నడిచింది. నేడు వస్తున్న సాహిత్యం వాణిజ్యపరంగా సాగుతోంది. రచయితలలో నిబద్ధత కరువయ్యింది. ఏ పత్రిక ఎంత మొత్తం ఇస్తారూ, ఎలాంటి రచనని స్వీకరిస్తారూ అనే ధోరణిలో ఆలోచిస్తున్నారు. నా మట్టుకు మన సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ దృష్టితో ఆలోచిస్తాను.
వర్తమాన కళింగాంధ్ర కథకుల రచనల్ని అధ్యయనం చేసేటపుడు అప్పటి ఇప్పటి తరాలమధ్య తొంగిచూసే శిల్ప వైవిధ్యం, శైలి, వస్తువు పరంగా ఎలాంటి మార్పుల్ని తీసుకొచ్చింది?
కళింగాంధ్ర రచనా విషయానికొస్తే శిల్ప వైవిధ్యం, శైలి, వస్తుపరంగా అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులొచ్చాయి. శిల్పం, వస్తు, వైవిధ్యంలో తేడాలకి చాలా కారణాలున్నాయి. అప్పట్లో కథ నిడివి 15 నుండి 20 పేజీలవరకూ ఉండేది. ఇపుడు ఆరు పేజీలు దాటితే కథల్ని పత్రికలు తిప్పి పంపేస్తున్నాయి. ఆరు పేజీల్లో పద్ధతులన్నీ పాటించడం కష్టం కూడా. అందువల్ల అప్పటికి ఇప్పటికి చాలా మార్పులే వచ్చాయి. నడకపరంగా మంచి శైలితో ఉన్న రచనలూ వస్తున్నాయి.
హాస్య వ్యంగ్యపూరిత రచనలు చేసేటపుడు ఇతివృత్తాల్లో సామాజిక సంఘటనలనే కథాంశాలుగా మలచడంలో మీ ఉద్దేశ్యం ఏమిటి?
హాస్యం విషయానికొస్తే ఏ కొద్దిమంది రచయితలో తప్పితే నవ్వించే హాస్యాన్నీ, ఆలోచింపచేసే వ్యంగ్యాన్నీ అందించలేకపోతున్నారు. మన చుట్టూ ఉన్న సామాజిక వాతావరణాన్ని పరిశీలిస్తే బోల్డంత హాస్యాన్ని అందించవచ్చు. అందుకే నేనలా చేశాను.
కథకుడిగా నవలాకారుడిగా వైవిధ్యపూరితమైన సాహిత్య సృష్టిని చేసేటపుడు వాస్తవికతకూ కల్పితానికి మధ్య సహజత్వం ఏ స్థాయిలో తొంగి చూస్తుంది?
కల్పన ఎప్పుడూ సహజత్వాన్ని మింగేయకూడదు. ఉన్న యధార్థాన్ని రాస్తే వార్త అవుతుంది. వాస్తవానికి, కల్పనకూ దగ్గర సంబంధం ఉన్నట్లు రాస్తే సహజత్వం తొంగిచూస్తుంది. రచన రాణిస్తుంది.
ఇటీవల వచ్చిన ‘కథా పార్వతీపురం’ సంకలనంలో ప్రముఖులైన కథా రచయితల స్ఫూర్తి, ఛాయలు, వారసత్వం, నిర్మాణశైలి ఈ తరం కథకుల్లో కనిపిస్తోందా?
వర్తమాన రచయితల్లో ఎవరిదారి వారిదిగా కనిపిస్తోంది. ఏ కొద్దిమందో తప్ప, తక్కిన వారెవ్వరూ ఎవ్వర్నీ ఆదర్శంగా కానీ, ప్రేరణగా కానీ తీసుకోవడం లేదేమో అనిపిస్తోంది నాకైతే!?
మీ రచనా సాధన నిర్మాణ కృషి ఎలాంటిది? వివరిస్తారా!
‘చదువుకున్నవాళ్ళు ఉద్యోగాలకే పరిమితం కారాదు. అవకాశాలకు తలొగ్గకూడదు. కుల రాజకీయాలకు తావివ్వరాదు’ అనే దృక్పథంతో నిరంతరం ఆలోచిస్తాను. అందుకు అనుకూలమైన పరిస్థితులను ఆకళింపు చేసుకొని- వాటినే నా రచనలుగా చేస్తాను.

- మానాపురం రాజా చంద్రశేఖర్, 9440593910