Others

ధాన్య మానవునికి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతనికి అందరూ తెలియకపోవచ్చు
కానీ అన్నం తెలిసిన ప్రతివాడికీ
అతను తెలుసు, ఆకలి తెలిసినట్లే...

మన స్వాగత వాక్యాల్లాంటి పొందికైన భాష
అతనికి తెలియకపోవచ్చు
కానీ నేల సారతలమీద నాగలిపాళీతో
చక్కని చాళ్ల వాక్యాలు గాల్లోంచి
నేల్లోకి వాలి మట్టిదయతో లేచి
సౌరభాల్ని వెదజల్లుతాయో లేదో కానీ
అతని వాక్యాల గర్భాల నుంచి మాత్రం
పత్ర పుష్పాలూ ఫల సంపదలూ ఉద్భవిస్తాయి

మన ఉత్సవ సందర్భాల్లో మెరిసే
అమోఘ ప్రశంసావాక్యాల్లాంటి లయాత్మక భాష
అతనికి తెలియకపోవచ్చు
కానీ అతనికి పైర్ల గుసగుసలూ
గాలుల పోకడలూ గగనాల గర్జనలూ
పంటకాల్వల జలలయలూ
ధాన్యం గలగలలూ తెలుసు!

మనం పండిపోయిన భాషా ప్రావీణ్యంతో
నిన్న మొన్నటి మాటల్ని మర్లేసి
మహా లౌక్య కళతో కొత్త మూటల్ని చెప్పగలం
మన చాతుర్యానికి మనమే తెగ మురిసిపోతూ-
కానీ ధాన్యం గింజలాంటి నిఖార్సైన
బతుకు మూట కోసం అతను కాళ్లకింద నేలనైనా
అవలీలగా వొదులుకోగలడు
మనం మనుషుల్తోనే మాట్లాడగలం, జాగ్రత్తల్తో-
మహా అయతే ఇంకా
పెంపుడు బుజ్జికుక్క పిల్లతోనో
చిలుకతోనో కాసిన్ని పలుకులు చిలకగలం
అతను భూమితోనూ మాట్లాడగలడు
అతనికి తెలిసినంతగా
భూమి గురించి ఎవరికి తెలుసు
లిపిని దాటిన భాష
భూమిలో అనంతంగా అల్లుకుని ఉందని
అతనికి తెలుసు
మనం భాషల శైలీ భేదాల రహస్యాల మీద
తర్జుమాల మీద తెగ తర్జన భర్జనలు పడతాం
కానీ ధాన్యం తడిసిన నాడు అతని కళ్ళల్లో
ఉబికే దుఃఖ భాషను పట్టుకున్నామా
గిట్టుబాటు కరువైనపుడు చెదిరిపోయ
పంటనతడు తగులబెట్టుకున్నప్పుడు
లేచిన ఎర్రని మంట భాషను పట్టుకున్నామా
సాగుతో ఆసరా దక్కక అవమానాల్లో చితికి
అతను బతుకు గుడారం నుంచే నిష్క్రమించినపుడు
పొలాలు ప్రకటించే ఆగ్రహ సంతాప భాషను
పట్టుకున్నామా
భాష లేకుండా బతుకు లేదు, సరే!
కానీ అతను లేకుండా మనకు బతుకుందా?

పొలాల్నీ చేలనూ వొదిలేసి మనం
చాలా దూరమొచ్చాం
చాలా కాలం కరిగింది కూడా
ఇక ఇక్కడ ఇపుడతడు మనకు గుర్తుకొస్తున్నాడా

ఇవాళ ఏ మాటల మాంత్రికునికో కాదు
సమస్త ప్రాణ సారాన్ని చేతుల్లోకి తీసుకుని
ముందుగా అతనికి దండం పెడతాను
భూమి భాష తెలిసిన ఆ ధాన్య మానవునికి!

- దర్భశయనం శ్రీనివాసాచార్య, 9440419039