Others

కథక చక్రవర్తి మునిపల్లె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, కథక చక్రవర్తి మునిపల్లె రాజు 95వ జయంతి.
వారిని గురించి విశ్వర్షి వాసిలిగారి మధుర జ్ఞాపకాలు కొన్ని..
**
ముని...పల్లె...రాజు మూడు పదాల సంగమం. కాదు కాదు, మూడు భావాల సంయోగం.
ముని అంటే వౌని అనే కదూ. మునులు ఆశ్రమాల్లో ఉంటారు. ఇంకా చెప్పాలంటే అరణ్యాల్లో ఉంటారు. అంటే జనసంచారం లేని ప్రదేశం అన్నమాట. మరి, నాకు తెలిసిన మునిలో రాజు కూడా ఉన్నాడు. పైగా రాజ్యంలేని రాజు. అయితే ఈ రాజుగారికి సంసారం అంటే అమిత ప్రేమ. సంసారాన్ని డామినేట్ చేస్తూ దేశం అంటేనూ మరింత ప్రేమ. ఇలా మా రాజు గారిని గురించి చెప్పుకుంటూ పోతే నేను చెప్పదల్చుకున్న రాజుగారి కథ డామిట్ అడ్డం తిరిగే తీరుతుంది.
అన్నట్టు, నాకు తెలిసిన ఈ రాజుగారు కథక చక్రవర్తి... అంటే రాజు అనే కదా. సో, ఈ రాజుగారు కథాప్రపంచంలో రాజుగారిలా వెలిగిపోతూ మునిలా జీవించారు. హైదరాబాద్ వంటి జనారణ్యంలో నాకు తెలిసి నాలుగు దశాబ్దాలు గడిపినా తమకు తాముగా పల్లెలో ఉన్నట్టే. అదీ ఆయన స్టైల్. అందుకే నాకు మునిపల్లె రాజుగారు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పటికీ మునిపల్లె రాజుగారే.
నాకు తెలిసీ మునిపల్లె అనే పల్లె గుంటూరు జిల్లాలో ఉంది... మన మునిపల్లె రాజు స్వగ్రామం ఈ మునిపల్లెనే. పుట్టింది మార్చి 16, 1925న గుంటూరు జిల్లా గరికపాడు గ్రామంలో... చదువు సంధ్యలు మునిపల్లె, నిడుబ్రోలు, పొన్నూరు, తెనాలిలలో తమ పద్దెనిమిదవ ఏటనే భారత రక్షణ శాఖలో చేరి నాలుగు దశాబ్దల పాటు అదే శాఖలోనే ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. అందుకే కాబోలు రాజుగారు తెనాలి గురించి చెబుతుంటే తెనాలిని గురించి వారికి మించి మరొకరు అంత సమగ్రంగా చెప్పలేరు అనిపించేది. తెనాలి అంటే చాలు వారి వౌనం బద్దలయ్యేది.
రెండు మూడేళ్ల క్రితం వరకు మునిపల్లె వారి పుట్టినరోజులు కుటుంబ సభ్యుల, ఆత్మీయుల మధ్య నిరాడంబరంగా జరుపుకున్నాం. మునిపల్లెరాజు భౌతికాన్ని వీడింది ఫిబ్రవరి 24, 2008న. అప్పుడే రెండేళ్లు అయింది. ఈరోజు వారి 95వ జయంతి. రాజుగారిని గురించి రాయాలంటే వారి స్మృతులు కళ్ల ముందుకొచ్చి కలం మూగబోతోంది.
* * *
మునిపల్లె రాజుగారితో నలభై సంవత్సరాల అనుబంధం నాది... మా కుటుంబాలది. హైదరాబాద్ గాంధీనగర్ బ్యాంక్ కాలనీలో ఒకే బిల్డింగ్‌లో మేము కింద ఉండేవారం... వారు పైన ఉండేవారు. ఇరు సంధ్యలలోను పలకరిస్తుండేవారు. సిగరెట్ తాగటానికి బయటికి వెళ్లినప్పుడల్లా నేను కనిపిస్తే చాలు పలకరిస్తుండేవారు. దాదాపు ఏడాది పాటు వారు నాకు ఇరుగుపొరుగే. వారొక కథా రచయిత అని నాకు తెలీదు. ఆ తర్వాత తెలిసింది వారే సుప్రసిద్ధ కథా రచయిత మునిపల్లె రాజుగారని. అప్పటి నుండి మా స్నేహం అక్షర మైత్రి అయింది. నిజానికి మాది పైకి స్నేహమే కానీ నన్ను మునిపల్లె రాజుగారు, వారి శ్రీమతి సులోచనదేవి - దంపతులిద్దరూ వారి పెద్దబ్బాయిలా అంత చనువుగానూ చూసుకునేవారు. ఆ చనువు ఎంతటిది అంటే-
రాజుగారు చివరి రోజులలో బాగా నీరసించారు. ఒంట్లో ఓపిక ఉండేది కాదు. ఒకరోజు మామూలుగా కబుర్లు చెప్పటానికి వెళ్తే రాజుగారి వేలికి గోరుచుట్టు అని తెలిసింది. బాగా బాధపడుతున్నారు. డాక్టర్ దగ్గిరకి అంటే వెళ్లటానికి ఒప్పుకోవటం లేదు. అప్పుడు అమ్మ ‘వసంత్, నువ్వయినా చెప్పు... వింటారేమో’ అంటే రాజుగారికి నచ్చచెప్పి మా డాక్టర్ బంధువుతో మాట్లాడి పంపించాను. అప్పటికే వారు హాల్లోకి రావటం మానేశారు... మంచం దిగటానికి కానీ, ఎవరితోనూ మాట్లాడటానికి కానీ ఇచ్చగించటం లేదు. అప్పుడు నన్ను వారు తమ బెడ్‌రూమ్‌లోకి రమ్మంటే వెళ్లి దాదాపు రెండు గంటలు ఆ పుణ్య దంపతులిద్దరితో గడిపాను. అప్పుడు సెల్‌ఫోన్‌లో తీసుకున్న మా ముగ్గురి ఫోటోలు వారితో నా చివరి జ్ఞాపకాలు.
* * *
మునిపల్లె రాజు ‘‘అస్తిత్వనదం ఆవలితీరాన’’ కథకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు 2006లో రావటం కథా రచయితలకు దక్కిన గౌరవంగా మునిపల్లెవారు భావించే వారు. ‘మునిపల్లె రాజు కథలు’, ‘పుష్పాలు - ప్రేమికులు - పశువులు’, ‘దివోస్వప్నాలతో ముఖాముఖి’, ‘అస్తిత్వనదం ఆవలి తీరా’ వారి ఈ కథక చక్రవర్తి కథా సంపుటాలు. వీరి ‘పూజారి’ అనే నవలను బి.ఎన్.రెడ్డిగారు ‘పూజాఫలం’ పేరుతో తెరకెక్కించారు. వీరి ‘జర్నలిజంలో సృజనరాగాలు’, ‘సాహితీ మంత్రనగరిలో సుస్వరాలు’ కొత్త దనాన్ని సంతరించుకున్న వ్యాస సంపుటులు... సమీక్షా వ్యాసాలకు కొత్త ఒరవడిని దిద్దిన సంపుటాలు. ‘వేరొక ఆకాశం వేరెన్నో నక్షత్రాలు’, ‘అలసిపోయిన వాడి అరణ్యకాలు’ రాజుగారి రెండు కవితాసంపుటాలు... ఒక తాత్విక నేపథ్యంలోకి తీసుకెళ్లే కవితా మందారాలు. మునిపల్లె వారి ముద్ర ఇదీ అనే చెప్పుకోదగ్గ కవితా రీతి వీరిది.
తమస్సులో తపస్సులు, దివోస్వప్నాలతో ముఖాముఖి, నిశ్శబ్దం ఒక పదం కాదు, నిష్క్రమణ ద్వారం, నైమిషారణ్యంలో సత్రయాగం, మహాబోధి ఛాయలో, వేరే లోకపు స్వగతాల్లో, శ్మశానం చిగిర్చింది మొదలైన మునిపల్లె రాజు కథలు అనంత తాత్వికతను మోసుకొచ్చే కథాస్రవంతులు. వారు వందల కథలు రాసినా నేను ఈ పదుల కథలనే ప్రస్తావించటానికి కారణం అవి తాత్విక వారధులు కావటమే. వారి కొన్ని కథలు నేల విడిచి సాము చేయవు అన్న రీతిన వాస్తవికతకు, సమకాలీనతకు ప్రతిబింబాలు. అలాగే తాత్వికంగా సైతం ఆ పరసీమలను గురించి అంటే ప్రామాణికంగా వారి కథారచన సాగింది. ఎంతైనా వారు మునిపల్లె వారు కదా.
* * *
ఈమధ్య రాజుగారు బాగా జ్ఞాపకం వస్తున్నారు... కారణం నా ‘‘నేను’’ గిక కావ్యం వారికి ఇవ్వలేకపోవటవే. నేను ఏ పుస్తకం ప్రచురించినా మొదటి కాపీ మునిపల్లె వారికి ఇవ్వటం అలవాటు. వారు సదరు పుస్తకాన్ని చదివి ఒక సమీక్ష రాయటమో లేదా ఆ పుస్తకం గురించి ఫోన్లో చర్చించటమో చేసేవారు. అటువంటిది తెలుగులో తొలి గిక కావ్యంగా పేరపడ్డ నా ‘‘నేను’’ దీర్ఘ కవిత వారు చదివి ఉంటే ఎంత అపురూపంగా సమీక్షించే వారో. ఎంత సంబరపడేవారో.
ఈ సందర్భంలో మునిపల్లెరాజు గారు నేను మా నాన్నగారిపై రాసిన ‘‘మాస్టర్ శార్వరి మిషన్ అండ్ విషన్’’ పుస్తకానికి ముందుమాట రాస్తూ చివరలో ఆ పుస్తకాన్ని గురించి ‘‘ఈ గ్రంథం ఒక మధురమైన దీర్ఘకవిత. ఒక పరంపర పతాకం. ఒక నివాళి. ఒక యోగ సింఫనీ’’ అని అన్నారు. వారు నేను రాసిన ఆ జీవిత చరిత్రను ‘దీర్ఘ కవిత’ అని అనటం ఇప్పుడు చూస్తే అబ్బురం అనిపించింది. నా భవిష్యత్తును ముందే చూసిన ద్రష్ట అనిపించింది. నేను కవితా సంకలనం ఒక్కటి కూడా ఇప్పటివరకు వేయని వాడిని, పనికట్టుకుని కవిత్వం రాయని వాడిని ఇప్పుడు ‘‘నేను’’ దీర్ఘ కవితగా రాయటం ఏమిటి, దానికి తొలి గిక కావ్యం అని పేర రావటం ఏమిటి... దీన్ని మునిపల్లె రాజుగారు ముందే దర్శించారా అన్నట్టుగా ఆ జీవిత చరిత్రనే ‘దీర్ఘకవిత’ అనటం ఎంతో అపూర్వం అనిపిస్తోంది.
పైగా నవలలా రాసిన జీవితకథలోని నా శైలిని గురించి వారు ‘‘ఈ గ్రంథకర్తను సరళసుందర కవితాత్మ ఆవహించింది. ఒక అమలిన సెలయేటి గీతంగా, ఆథ్యాత్మిక మార్మిక శబ్దజాలం మీది ఆచ్ఛాదనను తొలగించిన ఒక ఆధునిక భావకవి రచించిన రమ్యమైన వచన కవిత్వంగా రూపొందింది.’’ అనటం నాకు ఎంతో హృద్యమైన జ్ఞాపకం. మునిపల్లె రాజుగారు అక్టోబర్ 2009లో రాసిన మాటలు ఇవి. నిజానికి ఇవి మాటలు కాదు... వారు నా భవిష్యత్తుపై అదృశ్యంగా కురిపించిన అక్షర అక్షతలు. బహుశా ఆ ఆశీర్వాద బలం వల్లనే కాబోలు నా ‘‘నేను’’ దీర్ఘ కవిత తెలుగులో తొలి గిక కావ్యంగా మద్రితాక్షరాలలో తొలుతగా ‘‘ఆంధ్రభూమి’’ పాఠకుల ఆదరాభిమానాలను చూరగొంది.
ఇలా మునిపల్లె రాజుగారిని గురించి, వారి దర్శన ప్రతిభను గురించి ఎన్నని చెప్పేది. వారికి భవిష్యత్ ఇలా ముందే తెలుస్తుండేది... కాబట్టి వారు నా దృష్టిలో ఎప్పటికీ మునిపల్లెరాజుగారే.

- విశ్వర్షి వాసిలి, 9393933946