Others

సుధామ మనోభూమిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుధామ మనోభూమిక
వెల: రూ.300/-
: ప్రతులకు :
ప్రముఖ గ్రంథ విక్రయశాలల్లో..
*
హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా అల్లంరాజు వెంకట్రావు, శ్రీమతి ఉష ఇరువురూ సుప్రసిద్ధులే. వెంకట్రావు కలం పేరు సుధామ. లోగడ 1960వ దశకంలో హైదరాబాదులో యువ భారతి సంస్థ విజృంభించి లహరి ప్రసంగాలు ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారి గురించి ఇప్పించి ప్రాచీన ప్రబంధ సాహిత్యానికి ప్రాచుర్యం కల్పించిన రోజులలో అల్లంరాజు వెంకట్రావు ‘‘మేం’’ అంటూ కార్యకర్తగా ముందుండి ఉద్యమ స్ఫూర్తితో యువకులను నడిపాడు. అమెరికానుండి మందపాటి వారు శ్రీ త్యాగరాయ గానసభలో తన గ్రంథావిష్కరణ పెట్టుకుంటే ‘మంద’పాటి అట్ట మాత్రమే కాదు లోపల గ్రంథంలోనూ సరుకు ఉంది అని సమీక్షలు నిర్వహించి ఎందరో రచయితలకు కవులకు కలికితురాయిలు అలంకరించినవాడు. ఒకటా రెండా వందలాది గ్రంథాలకు పీఠికలు, ముందుమాటలు, ప్రాకథనాలు, ఆశీస్సులు, అభినందన వందనాలు, వర్ధిష్ణువులకు వెన్నుదట్టి ధైర్యం చెప్పిన హితోక్తులు ఇవన్నీ గాలి (ఎయిర్)కి పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? పీఠికలు సమీక్షలు కలిపి ఓ గ్రంథంగా వేస్తే విమర్శకులకు పరిశోధకులకూ రిఫరెన్సు బుక్‌గా ఉపయోగపడుతుంది. ఇదిగో ఇదే సుధామగారి మనోభూమికావిష్కరణ. కొందరు టెక్స్ట్ చదివి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. మరి కొందరు గైడ్ చదివి కూడా మార్కులు తెచ్చుకుంటారు. ఇదిగో ఇలా మూలగ్రంథం చదువలేని వారు ఈ భూమిక చదివితే మూలం చదివిన సంతృప్తి ప్రయోజనం కలుగుతుంది.
అల్లంరాజువారు గళ్లనుడికట్టు నిర్వహించటంలో సిద్ధహస్తులు. ఐతే భూమికలో ఎట్టి పజిల్ లేదా- ముక్కుకు సూటిగా చెప్పవలసిందేమిటో సందర్భోచితంగా కుండబద్దలు కొట్టినట్లో కొండ బద్దలుకొట్టినట్లో చెప్పి ముదావహులైనారు. రత్నదీధితులు శీర్షికలోనే సబ్జెక్ట్ తెలిసిపోతున్నది. వై.వి.రమణగారి పుత్రరత్నం, రత్నంగారు రచనలపై ఇదొక సమీక్షా వ్యాసం. తండ్రి కొడుకు ఇరువురు ప్రసిద్ధులే. సాహితీ ప్రియులే.
187వ పుటలో సుధామ ఒక వౌలికమైన వ్యాసం వ్రాశారు. శీర్షిక పేరు దివాకరుని పద్య జలపాతం. వ్యాసాంశం ఏమంటే, డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్యగారు ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారిని సంస్తుతిస్తూ ఒక పద్య సుమాంజలి సమర్పించారు. ఆ గ్రంథంపై సుధామ సమీక్షా వ్యాసం ఇది. సుధామకు దివాకర్లలు- శ్రీనివాసాచార్య ఇరువురూ హృదయస్థానీయులే. కాబట్టే ఈ వ్యాసం మూలగ్రంథంవలెనే ఎంతో రక్తికట్టింది. ఒక్కొక్కప్పుడు గ్రంథం ఎంత బాగుంటుందో పీఠికలు కూడా అంతే విలువ కలిగి ఉంటాయి. మహాప్రస్థానం విలువ చలం పీఠికతో ఇనుమడించిందని సాహితీవేత్తలందరికీ తెలిసిన విషయమే. దివాకర్ల వేంకటావధాని గారి శిష్యవాత్సల్యం అస్మదాదులంతా ఆస్వాదించిన వారమే. వారి ఆర్షధర్మానురక్తి, ఆంధ్రభాషా వైశారద్యము ఉపన్యాస గాంభీర్యము జగద్విదితం.
సుధామ వాక్యాలల్లో దివాకర్ల వారిని దర్శించుకుందాం. ‘‘నన్నయభట్టును చూడలేదు. అల్లసాని పెద్దననూ చూడలేదు. కాని వారు సాక్షాత్తు ఇలాగే ఉంటారా అని మా యువతరం ఓ సాహితీ మూర్తిని దర్శించింది. నేను హైస్కూలులో ఉన్నప్పుడు మా పాఠశాల వార్షికోత్సవ సభలో ఆయన ఉపన్యాసం విని తెలుగు పట్ల విపరీతమైన మమకారానికి లోనైనాను. సైన్సు, లెక్కలు కాదనుకొని ప్రాచ్య కళాశాలలో ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆయన బోధనలు వినే అదృష్టం లభించింది. యువ భారతి కావ్యలహరితో ఆయన సాన్నిధ్యం మరింతగా దక్కింది’’ (పుట 186) ఇది ఒక్క సుధామ చరిత్ర మాత్రమే కాదు వేలాది సాహితీ విద్యార్థుల ఆత్మానుభవం. ‘‘నేనే కాదు- ఇలాంటి నేనులు ఎనె్నన్నో’’ ఒక తరాన్ని కంఠదఘ్నమైన తన ప్రభావంతో తీర్చిదిద్ది శిష్యప్రశిష్య పరంపరను సృష్టించిన దివాకరునికి తిరుమల శ్రీనివాసాచార్య కవితా జలపాతంతో అభిషేకించారు.
‘‘అతని ధ్వని విని మొక్క మహాగమయ్యె
అతని నుడి విని చుక్క మహాంశువయ్యె
అతడు పట్టిన యొక రాయి రతనమయ్యె
అతడు ముట్టిన మట్టి ముత్యముగనయ్యె’’
విశ్వనాథవారి ఏకవీర నవలకు దివాకర్లవారు వ్రాయసగాడుగా పనిచేసిన సంగతి సుధామ ఈ పీఠికలో ఉదాహరించారు. ‘‘ఆగ్రహం ఆవేశాన్ని కలిగిస్తుంది. ఆవేశం ఆలోచనను మందగింపజేస్తుంది. అందువల్ల విచక్షణా రాహిత్యం సంభవిస్తుంది. విచక్షణ లేకపోవటమే అనేక విరూపతలకు హేతువు. ఇది లోక సామాన్యం. కాని కవిత్వంలో ఇందుకు భిన్నంగా ఉంటుంది. కవితావేశం వరణీయమే - అంటారు సుధామ.
సందర్భం ఏమిటంటే సత్యవోలు సుందరశాయి ‘సత్యదర్పణం’ అనే కవితా సంపుటి రచించారు. ‘ఇవి అబద్ధాలు కావు’ అని రచయిత ఈ సంపుటికి శీర్షిక నిర్ణయించారు. దీనికి సుధామ సవరించిన పీఠికా పంక్తులివి.
రాబర్ట్ ఫ్రాస్ట్ అన్నట్లు కవిత్వం భావావేశంగా మారి ఆవేశం అక్షరాలుగా దొర్లుతాయి- ఈ ఆంగ్ల పంక్తులు సుధామ యథాతథంగా ఉదాహరించారు.
‘‘కవిత్వం ఒక్కటే, నిజంగా సత్యసుందరం’’ అని సుధామ అనటంలో సత్యవోలు (రచయిత) ప్రస్తావన చమత్కారంగా సూచించారు.
ఈ సందర్భంగా మనం కొనే్నళ్ల క్రితం జరిగిన ఒక సంఘటనను గుర్తుచేసుకోవాలి. ఒక వర్ధిష్ణువు శేషేంద్ర దగ్గరకు వచ్చి ‘‘అయ్యా! నేను భావకవిత్వం వ్రాయాలా? అభ్యుదయ కవిత్వం వ్రాయాలా? విప్లవ కవిత్వం రాయాలా? సలహా ఇవ్వండి’ అన్నాడు. అప్పుడు శేషేంద్ర ‘‘కవిత్వం వ్రాయి’’ అని సముచితమైన సలహా ఇచ్చాడు.
నిజమేకదా! కవిత్వం నిజం? ఇజం దాని క్రీనీడ.
ఈ విషయమే సుధామ ఈ పీఠికలో చెప్పారు.
‘మనసును జయించినవాడు మహాత్ముడు. మనసు జయిస్తే సామాన్యుడు’ ఇవి సుందరశాయి వాక్యాలు. ఇందులో సత్యం, శివం, సుందరం ఉంది కదా! అందుకే సుధామ వీటిని ఉటంకించారు (పుట 197)
‘‘శేముషికీ సృజనకూ అంతగా పొంతన కుదరదని కొందరి వాదం. అది మా శేషంను చూస్తే ప్రతిభా పాండిత్యాలు ఒకేచోట కనపడటం మాత్రమే కాదు సవ్యమైన పంథాలో ఆయన హృదయం, మేధ పయనిస్తున్నాయని గొప్ప నమ్మకం కుదురుతుంది.’’ ఇది శేషం రామానుజాచార్యులు అని ఆకాశవాణి సహోద్యోగి రచనపై సుధామ విరిజల్లు. చైతన్య రేఖలు అనే శేషం వారి కవితా సంపుటికి సుధామ అందించిన మిత్రవాక్యం (పుట 58). మిత్ర శబ్దానికి సూర్యుడు అనే అర్థం కూడా ఉంది. సూర్యుడు అందరినీ సమంగానే దర్శించి వెలుగునిస్తాడు కదా!!
ఈ గ్రంథంలోని సుధామగారి లెక్కలేనన్ని పీఠికలు చూస్తే అలాగే అనిపిస్తుంది. వీటిలో కొన్ని శిఖరాయమానమైన గ్రంథాలు, కొన్ని లోయలూ ఉన్నాయి. అయినా అన్నింటినీ సుధామ అంతులేని ఓపికతో చదివి ఆషామాషీగా పైపైన పుప్పొడి అద్దకుండా హృదయదఘ్నంగా అభినందనలు అందించి వెన్నుతట్టడం ఆనందం ఆశ్చర్యం.
నిజానికి ఇన్ని పుస్తకాలు చదవడానికి ఎంతటి సహనశీలత ఉండాలో కదా? ఈ సందర్భంగా ఒక జోక్ గుర్తుచేస్తాను. బాపుగారు ఒకాయనకు బొమ్మగీచేందుకు మూడు వేల రూపాయలు పారితోషికం తీసుకున్నాడు. మిత్రులెవరో అడిగారట. బాపూగారూ బొమ్మగీచినందుకు మూడు వేల రేటుపెట్టారా? అని ‘‘కాదు ఆ పుస్తకం చదివినందుకు ఆ పారితోషికం’’ అని చమత్కరించాడు బాపు. పుస్తకం యోగ్యమైనా అయోగ్యమైనా చదివి ఆత్మీయులకు అభినందనలు అందచేయడం అంత సులభం కాదు.
ఐతే సుధామకు ఆ సమస్య రాలేదు. ఎందుకంటే ఏదో ఒకటి రెండు తప్ప తక్కిన గ్రంథాలన్నీ ప్రశంసాయోగ్యాలే కాబట్టి సుధామ అబద్ధం చెప్పలేదు. మొగమాటానికీ పోలేదు.
తురకా జానకీరాణి కవితకు పీఠిక వ్రాస్తూ ఈ కాపీ ఉపద్రవం కాదు, హృదయార్ద్రవం అని చమత్కరించటం సుధామకే చేతనయింది. సుధామలో ఒక కవి, ఒక సంస్కారి, ఒక కార్యకర్త, ఒక సహృదయుడూ ఉన్నాడు. అందుకే ఈయన పీఠికలకోసం అర్రులు జాచారు. అందరికీ సమానంగానే పూలు పండ్లూ పంచాడు. మరి ముళ్లు ఏవీ?? బహుశా అవి తన గుండెలోనే దాచుకున్నాడేమో??
వానమామలై వారి భోగినీ లాస్యం చదవండి.
కనీసం సుధామగారి ఈ సంపుటిలోని వ్యాసం చదవండి. ఉపనిషత్తులు అధ్యయనం చేయండి. కనీసం యువభారతి ఉపనిషత్ సుధ అభ్యసించండి.
అధమ పక్షం ఈ సంకలనంలో సుధామగారి ఉపనిషత్తులపై పరిచయం చదవండి!
సుధామగారి (ఎయిర్) ప్రోగ్రాం చేసే ఉద్యోగంలో ఉండి కూడా ఎంతటి అంతర్ముఖుడైనాడో తెలుస్తుంది. బహుశా జన్మసంస్కారం కావచ్చు. ఈ సంకలనానికి శ్రీమతి ఉషారాణి వ్రాసిన ముందుమాట కూడా చదవండి. సుధామ బహుముఖీన వ్యక్తిత్వాన్ని ఆమె చక్కగా విశే్లషించారు.

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్