Others

గాంధీజీ అడుగుజాడ.. టీవీఎస్ జీవన బాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాత్మాగాంధీ మహాభినిష్క్రమణంతోపాటే ఆయన మనుషులందరూ మాయమైపోయినట్లు వర్తమాన రాజకీయ భారతదేశ చిత్రపటాన్ని చూస్తే విచారం కలుగుతుంది. కర్మణా, మనసా, వాచా గాంధీజీని అనుసరించినవారు శ్రీ టి.వి.ఎస్.చలపతిరావు (1911-1979). నిష్కలంకోజ్జ్వల జీవితం వీరిది. గాంధీజీ ఆదర్శాల, ఆశయాల సాచరణ కార్యరూపం శ్రీ టి.వి.ఎస్.దైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, దేశ పునర్నిర్మాణ, సత్యాహింసాచరిత, త్యాగ సంభృతమూర్తిమత్వం. దేశం మొత్తంమీద ఇటువంటి పుణ్యశ్లోకుడు ఇప్పుడు ఇంకొకరు కన్పించరు. శ్రీ టి.వి.ఎస్. దేశహితైక జీవనప్రస్థానంలో రోజుకు 24 గంటలు ఎట్లా సరిపోయిందో అనిపిస్తుంది వారి జీవిత చరిత్ర చదివిన వారికి. స్వాతంత్య్రోద్యమ శాంతిసేనాని ఆయన. సురుచిర, సుందర, స్వాతంత్య్ర సముపార్జన స్వప్నాలకు ఆయన జీవితం సభాష్య వ్యాఖ్యానం. 17 సంవత్సరాల వయసులోనే రాయపురం మెడికల్ విద్యాసంస్థ విద్యార్థిగానే ఆయన విదేశీ వస్తద్రహనం, తమ హాస్టల్‌లో నిర్వహించి, సైమన్ కమీషన్‌ను వ్యతిరేకించి తన దేశభక్తిని ఆదర్శీకరించుకున్నాడు. దక్షిణ భారతదేశంలో ఆధునిక వైద్యవిజ్ఞాన విధానాన్ని ప్రవేశపెట్టినవాడాయన. ఎక్స్‌రే, డీప్‌ఎక్స్‌రే, ఇ.సి.జి. మొదలైన చికిత్సా పద్ధతులను మొట్టమొదటిగా తెలుగువారికి ప్రసాదించిన వాడాయనే. 1937నాటికే అంటే ఆయన 26వ సంవత్సరంలోనే కనీవినీ ఎరుగని క్రాంతదర్శి ఆయన. తన 21 సంవత్సరాల వయసునుంచే స్వాతంత్య్రసిద్ధివరకూ సత్యాగ్రహోద్యమంతో క్షతగాత్రులైన వారికి ఉచిత వైద్యచికిత్స చేసేవారు. పోలీసు దురాగతాలకు గురిఅయినవారికి, కారాగారం పాలైనవారికి ఆర్థిక సాయం అందిస్తూ ఆదుకుంటూ వచ్చారు. గాంధీజీ బోధించిన పునర్నిర్మాణ కార్యక్రమాలన్నిటినీ ఆయన ఆచరణ సాధ్యం చేశారు. మునిసిపల్ ఛైర్మన్‌గా ఉండగా ఆయన మురికి కాలువలలో చీపురుతో దిగి శుభ్రంచేశారు. బలహీనవర్గాలకు, దళిత వర్గ ఉద్ధరణకు ఆయన చేసిన సేవ భారతదేశంలోనే ఎవరూ చేసి ఉండరనీ, ఇది అపూర్వమనీ 1987లో ఆయన కాంస్య విగ్రహాల ప్రతిష్ఠాపనకు వచ్చిన ఆనాటి ఉపరాష్టప్రతి ఆర్.వెంకట్రామన్ శ్రీ టి.వి.ఎస్.స్మృతికి నివాళులర్పించారు. టి.వి.ఎస్. ప్రజాహిత జీవనాన్ని గర్వించిన విజయవాడ ప్రజలు వారిని 1939లో మునిసిపల్ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. 1942లో క్విటిండియా ఉద్యమ సందర్భంగా గాంధీజీని చెరసాల పాలుచేసినందుకు నిరసనగా టి.వి.ఎస్. ఛైర్మన్ పదవి పరిత్యజించారు. బహుముఖీనమైన సామాజిక సేవాకార్యనిమగ్నత ఆయనది. మద్రాసు రాష్ట్ర మునిసిపల్ ఛైర్మన్ సంఘానికి ఆయన 1948లో కార్యదర్శి. మద్రాసు మునిసిపాలిటీల సంబంధి ఆయన ఒక సమాచార పత్రిక నిర్వహించారు. శ్రీ జయప్రకాశ్ నారాయణ్ సలహామేరకు టి.వి.ఎస్. కొంతకాలం అజ్ఞాత జీవితం గడిపి ‘కాంగ్రెస్’అనే పత్రిక నిర్వహించారు. క్విటిండియా ఉద్యమ స్ఫూర్తిని బరంపురంనుంచి చిత్తూరువరకు ఈ పత్రిక రగిల్చింది.
1956వ సంవత్సరంలో ‘ప్రజాసేవ’ అనే తెలుగు వారపత్రికను ఆయన ప్రారంభించారు. జయప్రకాశ్ నారాయణ అధ్యక్షత వహించగా సర్వోదయ భావనాశీలి జె.సి.కుమారప్ప ఈ పత్రిక ప్రారంభ సంచిక ఆవిష్కరించారు. విజయవాడలో వైద్యవృత్తి సంఘాన్ని నిర్మింపచేశారు. అయ్యదేవర కాళేశ్వరరావుగారు కీర్తిశేషులుకాగా 1962లో అప్పటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా ఆయన ఎన్నికైనారు. 1967లో తిరిగి మరొకసారి శాసనసభకు ఎన్నికైనారు. 1964లో ఆయన ప్రజాసేవా పద్దుల అంచనా కమిటీకి ఎన్నికైనారు. కార్మిక సంఘటిత కార్యరంగంలో ఆయన సేవ నిరుపమానం. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వినియోగ సంస్థ ఉద్యోగుల సంఘానికి ఆయన అధ్యక్షులుగా పనిచేశారు. అప్పట్లో నాలుగు కార్మిక సంఘాలు 15వేల మందితో పనిచేసేవి. శ్రీ టి.వి.ఎస్. అధ్యక్షులైన తర్వాత సభ్యత్వ సంఖ్య 35వేలకు చేరింది. ప్రజాసేవా పద్దుల కమిటీకీ ఆయన పంచాయతీ రాజ్‌శాఖ నిర్వహణ, ప్రజాపనుల శాఖ, వైద్యకళాశాలలు, ప్రభుత్వాసుపత్రుల నిర్వహణగూర్చి అసెంబ్లీకి సమర్పించిన నివేదికలు అత్యంత విజ్ఞానదాయకమైనవి. 1980 నుంచి 1994 వరకు విజయవాడలో శ్రీ టి.వి.ఎస్. ప్రజాహిత దేశసేవ పునఃనిర్మాణ కార్యాచరణ, కార్మిక సంఘటిత కృషి, పత్రికా ప్రబోధం, పురపాలక సంఘ సంస్థాగత ప్రజాహితైక కార్యాచరణ తత్పరతల విషయమై ఆయన పేరిట స్మారక సంఘం, సంస్మరణోపన్యాసాలు నిర్వహింపచేసింది. ఈ సంస్మరణోపన్యాసాలు చేసినవారిలో సర్వశ్రీ సూరిభగవంతం, పి.వి.నరసింహారావు, మన్మోహన్‌సింగ్ (తరువాత కాలం ప్రధానమంత్రి) ఎల్.కె.ఝా (రిజర్వు బ్యాంక్ గవర్నర్), కె.వి.కామన్ (ప్రముఖ పత్రికా సంపాదకుడు), ఎ.పి.వేంకటేశ్వరన్ (విదేశాంగ రాయబారి) మొదలైనవారు ఉండటం శ్రీ టి.వి.ఎస్. హృదయ, మేధాసంపదలను ఆవిష్కరిస్తుంది.

- అక్కిరాజు రమాపతిరావు