Others

సాహిత్యంతో మానవీయ ప్రయోజనం (సుహృల్లేఖ -3)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగీత - సాహిత్య సంచారిణి
*
కావ్యంలో ఉపదేశ వాక్యమొకటి ఉంటుంది. అది ప్రత్యక్షంగా ఉండవచ్చు, లేదా పరోక్షంగాను ఉండవచ్చు. మొత్తం కావ్యవస్తువా వాక్య భావం చుట్టూ తిరుగుతుండవచ్చు. విపులంగా చర్చించడానికిది చోటుగాకున్నా, ఒక మంచి మాటను లౌకికులు వారి వారి అవసరాలకి ఉపయోగపడేట్టు వాడుకొంటారు. ఇట్లాంటి అనేక విషయాలు మనస్సులో ఉంచుకొని కావ్యం చదవాలి. శబ్దతశ్చ, అర్థతశ్చ విషయాన్ని మధించి (వస్తువు, వాస్తవికత), వస్తుతత్వమును గ్రహించాలి. ‘వయస్యః పరమాగతిః’ అని వున్నది. ఈ వాక్య కావ్యతత్త్వాన్ని త్రికరణశుద్ధిగా గ్రహించి అనుసరించినవారు రామసుగ్రీవులు; వస్తువునంటిబెట్టుకున్న వాస్తవికతను మాత్రం తీసికొన్న వారు వాలి రావణులు. వారిద్దరు కూడా మిత్రులే. వారి వారి అవసరాలకు ఈ సూక్తిని వాడుకున్న విధమిది-
దారాః పుత్రాః పురం రాష్ట్రం భోగచ్ఛాదన భాజనం
సర్వమేవా విభక్తం నో భవిష్యతి హరీశ్వర!!
- అంటాడు రావణుడు.
భార్యా పుత్రాదులతో సహా రాజ్యాన్ని, దేశాన్ని సర్వభోగాలను వాలి రావణులిద్దరూ సమానంగా అనుభవించాలి అని భావం. కొంతమంది ఒక ఉపదేశ వాక్యాన్ని తమకనుకూలంగా అన్వయింపజేసికొంటారు. ఇది దుష్టాచరణం. మరి వాలి రావణులిద్దరూ విద్వాంసులే. అపరిమిత బలశాలురే. వారి ఆచరణ మంచిది కాదని మనకు కథ చెప్తూనే ఉంటుంది. కావ్యంలో ఉల్లేఖించబడిన మంచిని కొంతమంది తెలిసినవారే దానికి స్వార్థం రంగునెట్లా పూస్తారో గ్రహించవలసిన అవసరమున్నది.
భారతంలో ఒక వాక్యమున్నది. ‘అర్థస్యదాసః పురుషః’. ఈ వాక్యాన్ని చాలామంది స్వార్థపరులు తమను తాము సమర్థించుకునేందుకు వాడుతుంటారు. భీష్ముడు కౌరవ పక్షాన ఉన్నందున తన నిస్సహాయతను, అర్థప్రాబల్యాన్ని వెల్లడించే సందర్భంలోనిదీ మాట. ఇంతకీ ఒక సూక్తికి కావ్యంలోగల ప్రముఖ స్థానాన్ని గురించి తెలుసుకోవాలి. చాలామంది ఈ ఉపదేశాలు మాకెందుకు అంటుంటారు. మరి నన్నయభట్టు నానారుచిరార్థసూక్తి నిధి. ఆయన వెర్రివాడు కాదు, కుర్రవాడు కాదు.
కవిత పరమార్థం ఆనందం. ఇది ముఖ్యమైన ప్రయోజనం. రేఖామాత్రంగా చూద్దాం. లాక్షణికులు ఆత్మానందమనీ, రసానందమనీ, అది బ్రహ్మానంద సహోదరమనీ వివరించారు. మళ్లీ ‘రసోవైసః’ అన్నారు. మనలో చాలామందికి సాహిత్యంలో, ముఖ్యంగా కవిత్వంలో అభిరుచి ఉన్నదనేది స్పష్టం. కొంతమందికి అభినివేశం కూడా ఉండి ఉండవచ్చు. మీతో ఈ మాటలు చెప్తూ క్రమంగా ఒక సన్యాసి ఆశ్రమానికి తీసికొని వెళ్తున్నానని భావించకండి. సంతోషానికి వ్యతిరేకం విచారం, సుఖానికి దుఃఖం, శాంతికి అశాంతి వ్యతిరేకాలు. అవి దేశ కాల మనస్సంబంధ స్థితులు. ఆనందానికి వ్యతిరేకం లేదు. గణితశాస్త్ర రీత్యా ఆది ఒక బిందువనుకొంటే దానికి కొలతలు లేవు. తైత్తిరియోపనిషత్తులో ‘యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా’ అని అంటారు. ఎక్కడ ఈ మాటలు, మనస్సు యింక ముందుకు వెళ్ళలేక వెనక్కి తిరుగుతాయో అది ఆనంద స్థానం. సత్కావ్య రచనం, పఠనం, శ్రవణం ఆ మహత్తరమైన ఆనందసీమకు ప్రయాణింపజేస్తుంది. అభ్యుదయ కవితా స్రష్ట అనిపించుకున్న మహాకవి శ్రీశ్రీ ఈ ఆనంద పథాన్ని హేతువాదపరంగా, గతితార్కిక భౌతికవాద దృష్ట్యా అంటే మార్క్సిస్టు దృక్పథంతో కూడా నిర్వచించవచ్చునన్నారు (శ్రీశ్రీ సాహిత్య వ్యాస సంపుటి). వివరాలు వచ్చే లేఖలో వ్రాస్తాను. ‘అగ్ని కురిసినా - అమృతం జల్లినా (దాని) పరమవాధి ఆనందం’ (తిలక్)
ముగింపుగా- సాహిత్యం వ్యష్టి వికాసాన్ని సమష్టి పర్యంతం విస్తరిస్తూ ఒక మానవీయ ప్రయోజనాన్ని సంపాదించి పెడుతుంది. ‘జీవితమంటే మంచు- ఉన్నదానిలో అందరికి పంచు’ అంటాడు గోపాల చక్రవర్తి. ‘ఆనందం జీవనదిలో మిగిలినది అనుభవించు’ అన్న మరొక వాక్యం చేరిస్తే భావం పరిపుష్టమవుతుంది.

- ముళ్ళపూడి సచ్చిదానందమూర్తి