మెయిన్ ఫీచర్

సంస్కృతీ సంఫ్రదాయాల దర్పణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టా కరంగా నిర్వహించుకునే పండుగల్లో బోనాలు మొదటిది. మానవ సమాజంలో ప్రకృతి ఆరాధన అనాదికాలంనుంచి సాగుతూ వస్తున్నదే. కొండల్లో కోనల్లో జీవిస్తూ క్రమ పరి ణామదశలో నూతనోత్తేజుడై ఆధునిక మానవుని గా రూపుదిద్దుకుంటున్న మానవుడు రూపం లేని రాయని లేక కట్టె అంటే దారువునో భగవంతునికి ప్రతీకగా మార్చుకుని ఆనాడు తనకు లభించిన ఆకులు అలములు కాయలు పండ్లలాంటి వాటిని భగవంతునికి నివేదన చేసి తన పరివారంలో కలసి ఆ భగవంతునికి సమర్పించిన దాన్ని ప్రసాదంగా ఆరగించి సంతోషించేవాడు. నేడు కంప్యూటర్ యుగం లో ఉన్నా గ్రహాంతర యానం చేస్తున్న ఆ భగవంతుణ్ణే తనకు నచ్చిన రూపాన్ని భగవంతుని రూపంగా మలుచుకుని తనకు ఈనాడు లభిస్తున్న పదార్థాలను భగవంతునికి నివేదన చేసి తన తోటివాళ్లతో ఆ నివేదన ప దార్థాన్ని దైవ ప్రసాదంగా కలసి సేవిస్తూ ఆనందిస్తున్నాడు.
ఈ ప్రకృతి ఆరాధనే శక్తి ఆరాధనగా, మాత్రారాధనంగా భిన్న ప్రాంతాలలో విభిన్న రూపాలలో భిన్నత్వంలో ఏకత్వానికి రూపంగా కనిపిస్తుంది. ఈ బోనాలు 15 రోజుల పాటు జరిగే పెద్ద పండుగ. ఈ పండుగోత్సవం లో మొట్టమొదటక అమ్మవారికి ఎదురెళ్ళి పుట్టింటి నుంచి తీసుకుని వచ్చే ఎదురుకోళ్ళతో ప్రారంభమవుతుంది. దీనే్న ఘటోత్స వం అంటారు. ఆ తరువాత బోనాల ఊరేగింపు, సాకసమర్పణ, తొట్టెళ్ల శోభాయాత్ర, ఫలహా రాల బండ్లయాత్ర, పోతురాజుల వీరంగాలు, పడి సమర్పణ, రంగమెక్కడం- భవిష్యవాణి చెప్పడం,గావు పట్టడం అంటూ వివిధరకాలుగా అమ్మవారికి బోనాల పండుగ ఆసక్తిదాయకంగా సాగుతుంది. ఈ బోనాల జాతరనే ఆషాఢ జాతరగా కూడా పిలుస్తారు. నాడు ప్లేగువ్యాధి నివారణ కోసం అమ్మను పూజించడం ఆరంభించిన జనం నేడు వివిధ రకాల వ్యాధులనుంచి కాలుష్యంనుంచి తమను కాపాడమంటూ వేడుకుంటారు. ముఖ్యంగా సికింద్రాబాద్‌లోని శ్రీఉజ్జయినీ మహాకాళి దేవాలయం, హైదరాబాద్ పాతబస్తీ షాలిబండలో వెలసిన ప్రాచీన అక్కన్న మాదన్న మహంకాళీ దేవాలయం, పాతబస్తీలోని లాల్‌దర్వాజా మహంకాళి అమ్మవారి దేవాలయాలు విశేషంగా బోనాల ఉత్సవాలను నిర్వహిస్తాయి. జంటనగరాల ప్రజలే కాకుండా తెలంగాణ ప్రాంతంలోని గ్రామాల్లో అక్కడి గ్రామదేవతలకు బోనాలు సమర్పిస్తూ లక్షలాదిగా ప్రజలు ఈ ఉత్సవాలకు తరలి వస్తారు.
ఘటోత్సవం :
అమ్మవారిని పూర్ణకుంభంతో స్వాగతించడ మే ఘటోత్సవం. అమ్మవారిని స్వాగతిస్తూ నగర వీధులలో ఊరేగిస్తారు. తన్ను కాపాడే శక్తినే ఎల్లమ్మ, మారెమ్మ, పోచమ్మ, పోలేరమ్మ, మైసమ్మ, పెద్దమ్మ, మాంకాళమ్మ, రేణుక ఎల్లమ్మ అంటూ వివిధ పేర్లతో పిలుస్తూ అమ్మవారిని వేపమండలతో, పసుపు కుంకుమలతో అలంకరించి దీపారాధన చేసి ఊరేగిస్తూ దేవాలయానికి తీసుకొస్తారు.
భోనాల శోభాయాత్ర :
భక్తిప్రపత్తులతో సమర్పించేనివేదనే బోనం.ఈ బోనంను భక్తులు తాము మొక్కుకున్న రీతిలో రకరకాలుగా సమర్పిస్తారు. కాని ప్రతి మహిళ అమ్మవారికి నివేదన చేసే పదార్థాన్ని కుండలో పెట్టుకుని దానిపై దీపం వెలిగించి తమ తమ ఇండ్లనుండి తరలివెళ్లిఅమ్మవాఠికి బోనాన్ని సమర్పించి మొక్కు తీర్చుకుంటారు. ముఖానికి పసుపు రాసుకుని ఎర్రని కుంకుమను నుదటిపై ధరించి బోనం సమర్పించే స్ర్తీలందరూ అమ్మవారికి ప్రతిరూపంలో భాసిస్తారు. తప్పెట్ల మోతలతో, మంగళవాయిద్యాలతో విభిన్న రీతుల నృత్యాలుచేస్తూ పురుషులు వెంటరాగా అమ్మవారి గుడికి ఆనందోత్సాహాలతో తరలివస్తారు.
సాక సమర్పణ :
ఇలా వచ్చిన మహిళందరూ అమ్మవారికి బోనసమర్పణలో భాగంగా సాక ను పసుపు నీటిలో ముంచిన వేపమండలను అమ్మవారిపైన, భక్తులందరిపైనా చల్లుతారు. దీనే్న సాక సమర్పణ అంటారు. గుడి ముందర గాని, బొడ్రాయ దగ్గరగానీ కొబ్బరి కాయలు కొడ్తారు. వేపరెమ్మలను సమర్పిస్తారు. కొంతమంది బెల్లం పానకాన్ని, కల్లు సారాలను కూడా సమర్పిస్తారు.ఇక్కడకు వచ్చిన భక్తులందరికీ సాక పంచడంవల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం.
తొట్టెల ఊరేగింపు - ఫలహారపుబండ్లు :
రంగురంగుల మెరిసే కాగితాలు, పూలతో అలంకరించి తొట్టెలను అంతస్థులుగా పేర్చి అమ్మవారికి సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల సంతానం లేనివారికి అమ్మ సంతానం అనుగ్రహిస్తుందని భక్తులు నమ్ముతారు.
అమ్మవారికి ఇష్టమైన పదార్థాలను తమ, తమ ఇళ్ళలో తయారుచేసుకుని వాటిని అందంగా అలంకరించిన బండ్లల్లో పెట్టుకుని ఆలయానికి వస్తారు. దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి తెచ్చిన ఫలహారాలను అమ్మవారికి సమర్పించి అక్కడ ఉన్న భక్తులందరూ కలసి పంచుకుని సేవిస్తారు. వందల సంఖ్యలో బండ్లపై ప్రసాదాలు తెచ్చి అమ్మవారికి సమర్పించడం అంగరంగవైభవంగా సాగుతుంది.
పోతురాజుల వీరంగం:
శరీరానికి పసుపు రాసుకుని, లంగోటి ధరించి, కళ్ళకు కాటుకతో, కుంకుమ దిద్దుకుని, నోటిలో పచ్చటి నిమ్మకాయలు పెట్టుకుని నడుము చుట్టూ వేపమండలు కట్టుకుని, కాళ్ళకు గజ్జెలు కట్టుకుని, కొరడాగా చేసుకున్న పసుపుతాడును ఝుళిపించుకుంటూ తప్పెట వాయిద్యాలకు అనుగుణంగా నాట్యం చేస్తూ పోతురాజులు కదిలివెళ్ళడం పోతురాజుల వీరంగం. ఈ పోతురాజును అమ్మవారికి సోదరుడుగా భావిస్తారు.
రంగం :
భవిష్యవాణిని చెప్పే వేడుకే ‘రంగం’. బోనాల పండుగ నిర్వహించిన మరుసటి రోజు సోమవారం ఉదయం అమ్మవారి ముఖమండపంలోని మాతంగేశ్వరి ఆలయం వద్ద దేవికి ఎదురుగా ఒక కన్య (మాతంగి) పచ్చికుండపై నిలబడుతుంది. భవిష్యత్తులో జరిగే పరిణామాలను, ముఖ్య విషయాలను మాతంగి అక్కడ గుమికూడిన భక్తులందరికీ చెబుతుంది. ఈ మాతంగి ఒక కత్తికి మాంగళ్యధారణ చేసి జీవితాంతం అవివాహితగా ఉండిపోతుంది.
అంబారీ ఊరేగింపు
అమ్మవారి చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించిన ఏనుగుపై ఉంచి మంగళవాయిద్యాలతో ఊరేగించుకుంటూ తీసుకుని వెళ్ళి సాగనంపి ఉత్సవాన్ని ముగిస్తారు. ఈబోనాల జాతర జనుల్లో భగవద్భక్తిని పెంచుతుంది. ఐకమత్యాన్ని సౌభాతృత్వాన్ని కలుగచేస్తుంది.

బోనం - దీపజ్యోతి
ముఖానికి పచ్చని పసుపు, నుదుటి న గుండ్రని కుంకుమబొట్టు అల్లనల్లన ఎగిరే నల్లటి కురులు మడిగా కట్టుకున్న పట్టుచీర , రెండు చేతుల నిండుగా గాజుల గలగలలు, నడుముకు వడ్డాణం, కాళ్లకు ఘల్లు ఘల్లుమనే మంజీరాలు తలపై నిండైన బోనం కుండల దొంతర్లు, ఆపై రంధ్రాలున్న ముంత దానిలో దేదీప్యమానంగా వెలిగే దీపజ్యోతి అమ్మవారికి ప్రతీక

పోతురాజుల వీరంగం
శరీరమంతా పసుపు నుదురుకు కుంకుమబొట్టు, కళ్లకు కాటుక, నడుముకు లంగోటి, కాళ్ళకు గజ్జెలు నోటిలో నిమ్మకాయలు పెట్టుకుని చేతుల్లో వేపమండలు, పచ్చటి కొరడా చుట్టూ తప్పెట వాయిద్యాలు వాటిని వింటూ అమ్మవారి ఊరేగింపులో నాట్యంచేస్తూ కోలాహాల మధ్య తరలివేళ్లే అమ్మసోదరుని సంతోష తరంగమే పోతురాజు వీరంగం

-సాయ కృష్ణ