అక్షర

నేతన్నల జీవన చిత్రణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ముత్యాల పందిరి’’(నవల)
-పోరంకి దక్షిణామూర్తి,
ఎమెస్కో, వెల: రు.60/-
పేజీలు: 112
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో

కందుకూరి వీరేశలింగం పంతులు వలె ‘అన్నీ నేనే మొదట రాశాను’ అని చెప్పుకోవడం దాశరథి రంగాచార్యకు అలవాటు. తొలి తెలంగాణ మాండలిక నవల ‘‘చిల్లర దేవుళ్ళు’’ రాసింది కూడా నేనేనని ఇంటర్వ్యూలలో, సభలలో బాహాటంగా చెప్పుకోవడం కూడా జరిగింది. చదివే ఓపిక, పరిశోధించే తీరిక లేని విమర్శకులు రంగాచార్య మాటలనే వేదవాక్కుగా భావించి, దాన్ని బలపరుస్తూ వ్యాసాలు కూడా రాసేశారు. దాశరథి రంగాచార్య కంటే ముందు అనగా 1964లోనే పోరంకి దక్షిణామూర్తి ‘ముత్యాల పందిరి’ పేరిట తెలంగాణ మాండలికంలో నవల రాయడం, అదే సంవత్సరం ఆంధ్రప్రభ ఉగాది నవలల పోటీలో మూడవ బహుమతి పొందడం జరిగింది. ఆంధ్రప్రభలో 1964లో సీరియల్‌గా వచ్చిన ఈ నవల 1968లో ఎమెస్కో పాకెట్ బుక్‌గా వచ్చింది. రంగాచార్యవారి ‘‘చిల్లర దేవుళ్ళు’’ కూడా 1970లో ఎమెస్కో పాకెట్ బుక్స్‌లోనే వచ్చింది. తిరిగి 2005లో రచన మాస పత్రికవారు ‘‘ముత్యాల పందిరి’’ని మళ్ళీ సీరియల్‌గా ప్రచురించడం కూడా విశేషమే.
మాండలిక వృత్తిపదకోశాల నిర్మాణంలో భాగంగా క్షేత్ర పర్యటన చేసి మాండలిక పదాలను సేకరించిన పరిశోధకుడిగా పోరంకివారు మాండలికాల మీద విపరీతమైన ఆసక్తిని పెంచుకున్నారు. సృజనాత్మక రచయితగా వివిధ స్థల మాండలికాలలో నవలలు రాయడానికి సంకల్పించుకున్న వీరు, క్షేత్ర పర్యటనలతో చేనేత పనివారి జీవన విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం వల్ల, అదే నేపథ్యంగా తీసుకుని ‘ముత్యాల పందిరి’ నవలను రూపొందించారు.
ఇందులో చేనేత పనివారి కుటుంబంలో జన్మించిన చంద్రయ్యకు నేత పని ఇష్టంలేక చదువుకోవడానికి వెళుతుంటాడు. ధనవంతుడైన మేనమామ లచ్చయ్య కూతురు ముత్యాలుతో ఆటపాటలతో అన్యోన్యంగా మెసలుతాడు. ముత్యాలు పుట్టినరోజుకు తండ్రి కొత్తగా చేయించిన ఉంగరాన్ని చూసి ముచ్చటపడిన చంద్రయ్య తన వేలికి పెట్టుకుని పోగొట్టుకుంటాడు. తండ్రికి, మేనమామకు భయపడి చంద్రయ్య ఇల్లు వదిలి పారిపోతాడు. కొత్త వూర్లో చేరదీసిన సాలోండ్ల ఇండ్ల పెరుగుతూ నేత పని నేర్చుకుంటాడు. ఊర్లన్నీ తిరిగి రకరకాల నైపుణ్యాలను అలవరుచుకుంటాడు. చంద్రయ్య పోయిన చాన్నాళ్ళకి బతుకమ్మ పండుగ సందర్భంగా నడ్డికుంటలో ముత్యాలుకు ఉంగరం దొరుకుతుంది. చంద్రయ్య నిర్దోషి అని తేల్చుకుంటుంది. ముత్యాలు తండ్రి లచ్చయ్య, మరో మోసగాడైన రాములుతో కలిసి ఊర్లో సహకార సంఘం పెట్టి అందర్ని మోసంచేసి బోలెడు డబ్బు గడిస్తారు. కొడుకు మీది బెంగతో, వృద్ధాప్యంతో చంద్రయ్య తండ్రి చనిపోతాడు. తల్లిదండ్రులు జ్ఞాపకం వచ్చి చంద్రయ్య పెంచిన వాళ్ళకు చెప్పి వాళ్ళ సహాయంతో ఇంటికి చేరుకుని, తల్లిని ఆదుకుంటాడు. ముత్యాలు, చంద్రయ్య మనసులు కలుస్తాయి. ముత్యాలు పట్ల తన ప్రేమకు గుర్తుగా చంద్రయ్య అపురూపమైన ‘‘ముత్యాల పందిరి’’ చీర నేయడానికి పూనుకుంటాడు. అంతలో లచ్మయ్య, ముత్యాలు పెండ్లి రాములుతో చేసేస్తాడు. లంబాడీ లచ్మివల్ల రాములు దుర్మార్గుడనీ, వాడు అమ్మాయిలను పెళ్ళిచేసుకుని అమ్మివేస్తాడని తెలుసుకున్న చంద్రయ్య, పెళ్ళికూతురుతో వెళుతున్న రాములును అదే రైలు ఎక్కి వెంబడిస్తాడు. రాములు పారిపోగా, ముత్యాలును ఓదార్చి ‘‘ముత్యాల పందిరి’’ చీరగప్పి, తన స్వంతం చేసుకుంటాడు.
ఈ ప్రధాన ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకుని చేనేత వృత్తిపనివారు, వాళ్ళ జీవన విధానాన్ని వివరంగా తెలియజేయడంలో రచయిత సక్సెస్ కాగలిగారు. నేత పని- తీరొక్కరీతులు, సాలోల్లలో రకాలు, పోగునుండి పెట్టెవరకు వరుసగా వివరించడం, నెంబర్‌నుబట్టి దారం తెలుసుకోవడం, కండెలు పట్టడం అన్నింటి గురించి సందర్భోచితంగా తెలియజేశారు. ఇంటిల్లిపాది రోజంతా కష్టపడినా కడుపునిండేది కష్టం. నేత పనిచేయడం కంటే కూలి పనికి పోవడమే మేలని సాలె పోసయ్య తెలుసుకుంటాడు. ఇదంతా చూసిన పిల్లలుకూడా సాలె పనిచేసుకోవడం కంటె చదువుకుని కొలువుచేద్దాం అని నిర్ణయించుకుంటారు. హోలీ, బతుకమ్మ పండుగలతోపాటు చంద్రయ్య పెరిగిన ఇంట్లో అక్కడా వున్న పున్నమ్మ పెండ్లి- మొదలైన సాంస్కృతికపరమైన విషయాలనెన్నింటినో వివరంగా తెలియజేస్తారు. సాలెవాళ్ళు- వారి ఆశ్రీత కులాల గురించి వివరిస్తారు. మధ్యలో లంబాడీల ప్రస్తావన వస్తే వాళ్ళ పేర్లు, వాళ్ళ ఇంటి పేర్లు, వారు ధరించే నగల వివరాలను ఇస్తారు. ‘‘తరీక, సాల్లె, ధోడం దినాల్ల, శనారం, పొద్దుమీకి, పోరలు, ఎక్క, అంబటాల, పెయ్యి’’లాంటి ఎన్నో మాండలిక పదాలను పొదుపుకున్న ఈ నవలలో సంభాషణలే కాకుండా కథాకథనాలను కూడా తెలంగాణ మాండలికంలో రాసి పాఠకులను ఆకట్టుకోగలిగారు. దీన్ని ఒకవైపు తెలంగాణ మాండలిక నవలగా, మరోవైపు పద్మశాలీ జీవన చిత్రణల నవలగా కూడా చెప్పుకోవచ్చు.

-కె.పి.అశోక్‌కుమార్