శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రైతు గర్వించేలా సహకార బ్యాంకును అభివృద్ధి చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాయుడుపేట, ఫిబ్రవరి 12: జిల్లా రైతాంగం గర్వంచే విధంగా జిల్లా సహకార బ్యాంకును అభివృద్ధి పరుస్తానని బ్యాంకు చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆయన నాయుడుపేటలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం గోదాములను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రైతాంగమంతా తాము జిల్లా రైతులమని చెప్పుకొనేలా వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లాలో రైతులకు మెరుగైన సేవలందించి తనకంటూ ఒక ప్రతేక స్థాన్నాని సంపాదించుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నానని చెప్పారు. సొసైటీలకు అవసరమైన నిధులు ఇచ్చినట్లు తెలిపారు. గతంలో చైర్మన్‌గా పనిచేసిన ప్రస్తుత ఎంఎల్‌సి వాకాటి నారాయణరెడ్డి తీసుకొచ్చిన సంస్కరణవల్ల సహకార బ్యాంకులు రైతుల వద్దకు వెళుతున్నాయన్నారు. వ్యవసాయ అభివృద్ధి భాగంగా డిపాజిట్ రూపేణా 165 కోట్లు రాగా వ్యవసాయ రుణాల కింద 570 కోట్లు వచ్చాయన్నారు. ప్రస్తుతం సహకార సంఘాలు 500 కోట్ల ఆదాయంలో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం బినామీలు, బ్లాక్‌మెయిల్ లాంటివి లేనందున డిపాజిట్ పెరిగిందన్నారు. తన పదవీ కాలం మరో రెండు సంవత్సరాలు ఉందని, ఈ సమయంలో 1000 కోట్ల ఆదాయం తీసుకురావటమే తన ధ్యేయమన్నారు. .అనంతరం స్థానిక ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడుతూ వ్యవసాయం, ఇరిగేషన్, తెలుగుగంగ శాఖల మధ్య సమన్వయం ఉండటం వల్ల సహకార సంఘాల ఆర్థిక సహాయంతో వ్యవసాయం అభివృద్ధి చెందుతుందన్నారు. ఎంఎల్‌సి వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాల వల్ల జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాల్లో మెండుగా నీరు ఉన్నప్పటికీ తెలుగుగంగ కాలువ 72 కిలోమీటర్ వద్ద ఇబ్బందులు కలగడంతో ప్రస్తుతం సరిపడా నీటి నిల్వలు లేవన్నారు. పచ్చకాలువ, నెర్రికాలువ ద్వారా నీరు అందించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జగన్‌మోహన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, నెలవల సుబ్రహ్మణ్యం, చైర్మన్ శోభారాణి, ఎంపిపి కన్నమ్మ, సెంట్రల్ బ్యాంక్ సిఇవో రమణారెడ్డి, బ్యాంక్ మేనేజర్ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బకాయిల వసూళ్లతో గ్రంథాలయ సంస్థను మెరుగుపరచాలి
* ఇన్‌చార్జ్ కలెక్టర్ ఇంతియాజ్ సూచన
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, ఫిబ్రవరి 12: గ్రంథాలయ సంస్థకు రావాల్సిన పన్ను బకాయిల వసూళ్లతో సంస్థను మెరుగుపరచాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఉన్న జెసి ఛాంబర్‌లో శుక్రవారం గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గ్రంథాలయాల నిర్వహణ, బకాయిలు తదితర అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ జిల్లాలో 61గ్రంథాలయాలు ఉన్నాయన్నారు. వీటిని సక్రమంగా నిర్వహించాలన్నారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచుకునేందుకు మున్సిపాలిటీ, పంచాయతీ పరిధిలలో గ్రంథాలయాలకు సంబంధించిన పన్ను బకాయిలను పూర్తి స్థాయిలో వసూలు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. గ్రంథాలయాల నిర్వహణ కోసం మున్సిపల్, పంచాయతీ అధికారుల సమన్వయంతో సమీక్షించుకుని ఖాళీలున్న చోట సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ అధికారి వెంకటేశ్వరరావు, నగరపాలక సంస్థ అధికారి గిరిజ, కావలి, గూడూరు, ఆత్మకూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట, మున్సిపల్ కమిషనర్లు వెంకటేశ్వర్లు, మోదుకొండయ్య, శ్రీనివాసులు, నరేంద్ర, చంద్రశేఖర్ రెడ్డి, ప్రసాద్, ఆడిటర్ తిరుపతయ్య తదితర అధికారులు పాల్గొన్నారు.

మహిళల అభివృద్ధి టిడిపితోనే సాధ్యం
* ఎమ్మెల్సీ బీద రవిచంద్ర స్పష్టం
నెల్లూరు టౌన్, ఫిబ్రవరి 12: మహిళలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు టిడిపి కృషి చేస్తుందని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని టిడిపి కార్యాలయంలో శుక్రవారం జరిగిన జిల్లా తెలుగు మహిళా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బీద మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో డ్వాక్రా మహిళలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న స్వయం సహాయక సంఘాలలో ఉన్న ప్రతి సభ్యురాలికి పెట్టుబడి నిధి అందజేసేందుకు మూడువేల రూపాయల నగదు జమ చేసినట్లు చెప్పారు. వారి వడ్డీని సైతం మాఫీ చేశామన్నారు. మహిళా సాధికారత సాధించేందుకు ముఖ్యమంత్రి అధ్యక్షతన అంతర్జాతీయ నిపుణులతో విజయవాడ కేంద్రంగా ఎపి మహిళా సాధికారత సంస్థను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ కోసం అంతర్జాతీయంగా పేరు గడించిన వాల్‌మార్ట్ సంస్థతో ఒప్పందం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న మహిళలందరికి దీపం పథకం ద్వారా కనెక్షన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. మహిళలపై దాడులు చేసే అరాచక శక్తులను నిలువరించడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర టిడిపి ప్రధాన కార్యదర్శి తాళ్లపాక అనూరాధ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, మాజీ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు అంచెల వాణి, గూడూరు ఇన్‌చార్జ్ బత్తల రాధా జ్యోత్స్నలత, గూడూరు మున్సిపల్ చైర్‌పర్సన్ పొణకా దేవసేన, ఎన్ విజయలక్ష్మీ, డి శారద, ఎం శోభారాణి, జడ్పీటిసిలు కలివెల జ్యోతి, ఎ రమ, కార్పొరేటర్లు బొల్లినేని శ్రీవిద్య, మేకల రజని, ఎ జానకి, వహీదా, కావలి, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి మున్పిపాలిటిలకు సంబంధించిన మహిళా కౌన్సిలర్లు పాల్గొన్నారు.
జిల్లా మహిళా కార్యవర్గం ఎంపిక
జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలుగా కార్పొరేటర్ పొత్తూరి శైలజ, ప్రధాన కార్యదర్శులుగా ముప్పల విజేత, పనబాక భూలక్ష్మీలను ఎన్నుకున్నారు.

ఎరువుల లారీ పట్టివేత
తడ, ఫిబ్రవరి 12: చెన్నై నుండి నెల్లూరుకు వేబిల్లులు సక్రమంగా లేని ఎరువుల లారీని మండల పరిధిలోని బివిపాళెం ఉమ్మడి తనిఖీ కేంద్ర అధికారులు పట్టుకున్నారు. చెన్నై నుండి నెల్లూరుకు రూ. 20 లక్షల విలువచేసే ఎరువులను తరలిస్తున్న లారీని పరిశీలించగా, సక్రమమైన బిల్లులు లేకపోవడంతో తనిఖీ కేంద్ర అధికారులు పట్టుకొని నోటీసులు అందజేశారు. ఈ వాహనం ద్వారా టాక్సీ కాంపౌండ్ ఫీజు రూ. లక్షా 10 వేలు వసూలు చేసినట్టు తనిఖీ కేంద్ర పరిపాలన అధికారి జగబంధు స్వామి తెలిపారు.

ఇసుక ఇ-వేలం ప్రక్రియంలో నిబంధనలు అనుసరించండి
* ఇన్‌చార్జ్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఆదేశం
నెల్లూరు కలెక్టరేట్, ఫిబ్రవరి 12: ఇసుక రీచ్‌లలో నూతనంగా ఇ-వేలం ప్రక్రియకు సంబంధించిన దరఖాస్తులను నిబంధనలను అనుసరించి అనుమతించాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అహ్మద్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న జెసి ఛాంబర్‌లో శుక్రవారం ఇసుక ఇ-టెండర్ల ప్రక్రియ దరఖాస్తులపై ఆయన సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు 266 మంది దరఖాస్తు చేశారన్నారు. ఈ దరఖాస్తులను నూతన విధానం ప్రకారం ఆధార్, పాన్, ఆదాయ రిటర్న్స్ వంటి అవసరమైన పత్రాలను పరిశీలించాలన్నారు. ఇ-టెండర్లలో నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఇసుక రవాణా ప్రక్రియను అనుమతించాలని చెప్పారు. ఇందుకు సంబంధించి అధికారులు అవకతవకలకు తావులేకుండా సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై రెవెన్యూ, పోలీస్ అధికారుల సహకారంతో చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం క్యూబిక్ మీటరుకు 500 రూపాయల ధర ప్రకటించిందన్నారు. అక్రమంగా ఇసుక తరలిపోకుండా సాంకేతిక కమిటీ నిర్ణయించిన రవాణా ప్రక్రియను అమలు జరపాలన్నారు. సమావేశంలో డిఆర్‌డిఎ పిడి చంద్రవౌళి, జడ్పి సిఇఒ రామిరెడ్డి, డ్వామా పిడి హరిత, మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ టి రాజశేఖర్, డబ్ల్యుఎస్ అధికారి వెంకటేశ్వర్లు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రాణం ఉన్నంత వరకు వైకాపాలోనే
* ఎమ్మెల్యే పదవి జగన్ అన్న బిక్ష
* గూడూరు శాసనసభ్యుడు పాశం స్పష్టం
చిల్లకూరు, ఫిబ్రవరి 12: నా ప్రాణం ఉన్నంతవరకు వైకాపాలోనే జగన్ నాయకత్వంలో పనిచేస్తాన్నని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం చిల్లకూరు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత రాత్రి నుంచి కొన్ని ఛానళ్లు సూళ్లూరుపేట, గూడూరు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నట్లు కథనాలు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత ఎమ్మెల్యేలమైన తమపై తప్పుడు ప్రచారం చేయడం మంచి పద్ధతికాదన్నారు. గతంలో టిడిపిలో గూడూరు మునిసిపల్ చైర్మన్‌గా 7 సంవత్సరాలు పరిపాలన సాగించానని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు గంగాప్రసాద్, నానాజీ అంటే గౌరవమని, వారు ఎప్పడూ నన్ను టిడిపిలోకి రమ్మనలేదని చెప్పారు. ఎమ్మెల్యే పదవి జగన్ ద్వారా వచ్చిందని, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే అలవాటులేదన్నారు. టిడిపి మంత్రులు కేవలం వైకాపా దళిత, ముస్లిం, మైనార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారన్నారు. గూడూరు నియోజకవర్గంలో ప్రతి వైకాపా నాయకుడు, కార్యకర్తకు తాను రుణపడి ఉన్నానని, వైకాపాలోనే ఉండి ప్రజలకు సేవచేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఉద్రిక్తతకు తావిచ్చిన దంపతుల వివాదం
* అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్‌లో కౌన్సిలింగ్
ఆత్మకూరు, ఫిబ్రవరి 12 : ఆత్మకూరు మండలం రామస్వామపల్లి గ్రామంలో ఓ దంపతుల వివాదం ఉద్రిక్తతకు తావిచ్చింది. రామస్వామపల్లికి చెందిన కవిత అనే యువతికి రెండేళ్ల క్రితం సంగం మండలం మక్తాపురం వాసి అందె శివప్రసాద్ అనే యువకుడితో వివాహమైంది. అయితే పెళ్లైన అనంతరం దంపతుల నడుమ కలహాలు చోటుచేసుకున్నాయి. శివప్రసాద్ తన అక్క కుమార్తెను రెండో పెళ్లి చేసుకోవాలనే తలంపుతోనే భార్యను హింసిస్తున్నాడని ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు అందింది. స్థానిక ఎస్సై కౌన్సిలింగ్ ఇచ్చి కొన్నాళ్లపాటు రామస్వామపల్లిలోని అత్త ఇంటిలోనే ఉండేలా సూచించారు. అయితే గురువారం అర్ధరాత్రి సమయంలో శివప్రసాద్‌ను తీసుకెళ్లేందుకు ఓ ప్రయత్నం జరిగింది. తాను నెల్లూరుకు చెందిన న్యాయవాదిని అంటూ ఓ కారులో వచ్చిన వ్యక్తి బలవంతంగా శివప్రసాద్‌ను తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ముందునుంచి అతనితో ఫోన్‌లో సాగించిన సంభాషణలతో కారు ఊర్లోకి రాగానే శివప్రసాద్ కూడా సిద్ధంగానే ఉన్నాడు. కాగా, దీనిపై అనుమానం వచ్చిన భార్య, అత్తింటి కుటుంబం ఊరి జనంతో కలసి ఆ కారును అడ్డుకున్నారు. తాను కౌన్సిలింగ్ చేసేందుకు తీసుకెళ్తున్నట్లుగా న్యాయవాది చెప్తున్నా గ్రామస్థులు సమ్మతించలేదు. దీంతో మళ్లీ ఈ వ్యవహారం పోలీసుస్టేషన్‌కు చేరింది. కాగా, సదరు ప్రబుద్ధుడైన భర్త, న్యాయవాది నెల్లూరు నుంచి పలువురు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల్ని వెంటేసుకు వచ్చారు. అయితే స్థానిక పాత్రికేయులు మాత్రం భార్య తరపున బాసటగా నిలిచి వారి దాంపత్యం కొనసాగాలని ఎస్సై అబ్ధుల్ రజాక్‌తో పోలీస్‌స్టేషన్‌లో మంతనాలు సాగించారు.

కాంట్రాక్ట్ కార్మికుల దీక్షకు బిజెపి మద్దతు
ముత్తుకూరు, ఫిబ్రవరి 12: ముత్తుకూరు, టిపిగూడూరు మండలాల మధ్య ఉన్న ఎన్‌సిసి పవర్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలంటూ కార్మికుల చేపట్టిన దీక్షకు భారతీయ జనతా పార్టీ మద్దతు ప్రకటించింది. శుక్రవారం ఆ పార్టీ మండల అధ్యక్షులు ఎస్ సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు దీక్షా శిబిరానికి చేరుకుని సంఘీభావం తెలిపారు. ప్రాజెక్టులో పనిచేస్తున్న 74 మంది కాంట్రాక్ట్ కార్మికులను థర్మల్ కేంద్రాలు పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు దీక్ష చేపట్టి మూడు రోజులు గడుస్తున్నా ప్రాజెక్టు యాజమాన్యం స్పందించకపోవడం బాధాకర విషయమని పేర్కొన్నారు. కార్మికులు మాట్లాడుతూ తమకు న్యాయం జరిగేంత వరకు ఈ దీక్షను కొనసాగిస్తామని ముక్తకంఠంతో చెప్పారు. మూడో రోజు దీక్షలో కార్మికులు వంట-వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు వంశీధర్‌రెడ్డి, సుబ్రహ్మణ్యంరెడ్డి, ఎల్లసిరి రాజేష్‌గౌడ్, తదితరులు ఉన్నారు.

పాఠశాలలను పరిశీలించిన మానిటరింగ్ కమిటీ
సైదాపురం, ఫిబ్రవరి 12: మండలంలోని పాఠశాలల్లో ఉన్న వసతులపై శుక్రవారం మానిటరింగ్ కమిటీ సభ్యులు పరిశీలించారు. అనంతరం సైదాపురం జెడ్‌పి హైస్కూల్‌లో ఉపాధ్యాయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో బోధన, వౌలిక వసతులు, మరుగుదొడ్ల ఉపయోగం తదితర అంశాలపై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఎం, ఉపాధ్యాయులు ఎంఇఓ పార్వతమ్మను కోరారు. ఈ కార్యక్రమంలో మానిటరింగ్ కమిటి సభ్యులు పాల్గొన్నారు.

సభ్యత్వ నమోదుకు శ్రీసిటీలో సిఐఐ రోడ్డు షో
తడ, ఫిబ్రవరి 12: నెల్లూరు - చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లో నెలకొల్పబడిన శ్రీసిటీ ప్రాంగణంలో శుక్రవారం సిఐఐ రోడ్డు షో నిర్వహించారు. స్థానిక పరిశ్రమలను తమ సమాఖ్యలో కొత్త సభ్యులుగా నమోదు చేయడానికి కన్ఫడిరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ (సిఐఐ) రోడ్డు షో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అమరరాజా గ్రూప్ పరిశ్రమల ముఖ్య కార్యనిర్వహణ అధికారి గల్లా విజయనాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సభ్యత్వం తీసుకోవడం వల్ల కలిగే లాభాలు వాటి ప్రయోజనాల గురించి వివరించారు. త్వరలో సిఐఐ తిరుపతి జోన్‌ను ఏర్పాటు చేయనున్నామని, ఆ జోన్‌లోని పారిశ్రామిక సంస్థలకు క్రియాశీల సేవలను సిఐఐ అందించనున్నదని ఆయన తెలిపారు. ఈ సభకు హాజరైన వివిధ పరిశ్రమల ప్రతినిధులు సిఐఐకు సంబంధించిన పలు అంశాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమల ప్రతినిధులంతా సభ్యత్వం తీసుకోవడానికి సుముఖత వ్యక్తం చేశారు. సుమారు ఏడు వేలకు పైగా సంస్థలు సిఐఐ సభ్యులుగా 90 వేల పరిశ్రమలు పరోక్ష సభ్యులుగా ఉన్నాయి. 117 సంవత్సరాలుగా మన దేశ పారిశ్రామిక వ్యాపార అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తుందన్నారు.

ఆర్‌టిసి బస్సు ఢీకొని యువకుడు దుర్మరణం
రాపూరు, ఫిబ్రవరి 12: రాపూరు మండలం కండలేరు పోలీసుస్టేషన్ పరిధిలోని శనాయపాళెం గ్రామం రోడ్డు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందాడు. కండలేరు సబ్‌ఇన్‌స్పెక్టర్ అహ్మద్ తెలిపిన వివరాల మేరకు రాజంపేట నుండి రాపూరు మీదుగా నెల్లూరు వెళుతున్న ఆర్‌టిసి బస్సు నెల్లూరు నుండి రాపూరు వస్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడిని ఢీకొంది. ఈ ప్రమాదంలో పంగలి గ్రామానికి చెందిన ద్విచక్ర వాహనదారుడు కె వెంకటాద్రి (28) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో రోడ్డు పక్కన ఉన్న ప్రజలు గుమిగూడి రాకపోకలు స్తంభింపజేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఎస్‌ఐపై ప్రజల ఆగ్రహం
ఈ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన సంఘటన వివరాలను స్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్ అహ్మద్ బాషాకు కొందరు ఫోన్ ద్వారా తెలుపగా, ఆయన ఆలస్యంగా ఘటనా స్థలానికి చేరుకోవడంతో, ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూతవేటు దూరంలో ఉన్న పోలీసుస్టేషన్ నుండి ఇక్కడకు రావడం మరింత ఆలస్యం రావడాన్ని ప్రజలు నిలదీశారు. ఈ సందర్భంగా పోలీసులకు స్థానికులకు వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి.

పుష్కలంగా వర్షాలు కురిసినా సాగునీటికి కరవు
కొండాపురం, ఫిబ్రవరి 12 : గత ఏడాది నవంబర్ నెలలో కురిసిన వర్షాలకు మండలంలోని చెరువులు నీటితో కళకళలాడాయి. గత నాలుగేళ్లుగా వర్షాలు లేకపోవడం, కురవక కురవక కురిసిన వర్షానికి చెరువులు నిండటంతో రైతులు ఎంతో సంబరపడ్డారు. వెంటనే వరి నార్లు పోసి పంటను సాగు చేశారు. అయితే వారు ఆనందం నుంచి బయటపడకముందే చెరువుల్లోని నీరు తగ్గిపోయాయి. రెండునెలల పైరు కావడం, చెరువుల్లో నీరు తగ్గిపోవడంతో రైతులు ఆందోళనలో పడ్డారు. కొన్ని గ్రామాల్లోని చెరువులలో నీరు పూర్తిగా అడుగంటిపోయింది. ఇటువంటి పరిస్థితిలో సాగు చేసిన పంట ఎండిపోతోంది. తమ పరిస్థితి ఏంటని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే ఎకరాకు 20వేల రూపాయల వంతున పెట్టుబడి పెట్టామని, వరి పొట్ట దశలో ఉందని, సాగునీరు లేక ఏం చేయాలో అర్థం కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగేళ్లుగా వర్షాలు లేనందున భూమి నీటిని బాగా పీల్చేసిందని కొందరు నిపుణులు అంటున్నారు. వర్షాలు కురవని నాలుగేళ్లలో గేదెలను నమ్ముకొని జీవనం సాగించామని, ఈ సంవత్సరం వర్షం కురవడంతో పంటలు సాగుచేసి వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టామని తెలిపారు. ఇప్పుడేమో నీరు లేక ఏమి చేయాలో తెలియని అయోమయంలో పడ్డామని వాపోతున్నారు.