సాహితి

రంధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్నించాల్సి వస్తుందనుకోలేదు
తర్కించాల్సి ఉంటుందనుకోలేదు
చావు ముందా బతుకు ముందా
సుద్దులను సరిహద్దులను రద్దుచేసే
జీవిత విధానం నిర్ణయస్తుంది
కాలానికి ఎదురీదే గట్టిదల
బతుకును గెలుచుకోవాలనే పట్టుదల
చావు పుట్టుకల్ని నిర్ధారిస్తుంది

అనాల్సి వస్తుందనుకోలేదు
అడగాల్సి వస్తుందనుకోలేదు
విత్తు ముందా విత్తం ముందా
మట్టి మహత్తు చెప్తుంది
చిత్తం హస్తగతం చూపుతుంది
నాణ్యత ఎన్నిక ముఖ్య గుణం
నాగలిసాలు సక్కదనం
దిగుబడి గిట్టుబాటు వెక్కిరింత
విత్తూ విత్తముల క్రమాన్ని విప్పుతుంది

చూడవల్సి వస్తుందనుకోలేదు
పాడవల్సి వస్తుందనుకోలేదు
పంట ముందా మంట ముందా
ఎండి నెర్రెలిచ్చిన దైన్యం
దండి ధైర్యమిచ్చిన కారుణ్యం
పొట్టమీదున్న చేను కరువుకు చెర
తడి లేని మడి రూపాయకి రైను
పంటనూ మంటనూ కంట కనిపెడుతుంది

కలువాల్సి వస్తుందనుకోలేదు
తలపడాల్సి వస్తుందనుకోలేదు
రైతుల ఆత్మహత్యలకు ధర కట్టి
చేతులు దులుపుకుంటుంది
ఓటు చుట్టూ ఒట్టు పెట్టి తిరిగినోళ్లు
గదువలు పట్టుకున్న వెదవలవుతారు
పూట గడవని దగ్గర
మాట కేవలం మాటకారిగా మారుతుంది
ఓదార్పు లేని రైతులు పిట్టల్లా రాలిపోతుంటారు
ఉపసంఘం బాతాకాని చేస్తుంది
మనిషికంట నీరు తుడవని ఏ రాజ్యమైనా
ఉంటేంది ఊడితేంది?
ఏడ కొలిచినా దుఃఖం
గదే ఏడు మానికలు
ఏడ నిలిచినా ఎవుసం
గదే తాడు బొంగరం లేని జూదం

అగ్గిల చెయ్య పెట్టినట్టు
అన్నీ పిరమే
చదువు దవాఖాన పెండ్లి నీళ్లూ
అన్ని వ్యాపారమయం
రూపాయ గోమారి బీమారి వ్యవస్థలో
ఇక్కడ అగ్గువ సగ్గువ వస్తువు
ఒక్క గరీబోళ్లే

రాష్ట్రం ఏర్పడితేనేం
నాయకత్వం మారితేనేమి
మనుషుల కాష్టం కాలుతూనే ఉంది

నిన్నకు కొనసాగింపు నేడు
నేడుకు తరువాయ రేపు గంతే
వాళ్ల భాషను సాగిస్తున్నందుకు శభాష్

కవులు కాకరకాయలు పులకించి
పల్లకీ మోస్తుండ్రు అపురూపం
వాళ్లు తన్ని పడేస్తే వీళ్లు పడేసి తంతుండ్రు

ఇన్నినాళ్లు ఆవుతోలు కప్పుకుంది పులి రూపం
గుర్తించడంలో ఓడడమే పెద్ద శాపం

- జూకంటి జగన్నాథం