ఖమ్మం

గెలుపోటములపై సమీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మార్చి 10: ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపోటములపై అన్ని రాజకీయ పార్టీలు సమీక్షలు ప్రారంభించాయి. ప్రధానంగా కమ్యూనిస్టుల కంచుకోటగా పేరొందిన ఖమ్మంలో వామపక్ష పార్టీలకు ఆశించిన స్థానాలు రాకపోవటంపై అన్ని వర్గాల్లోనూ సుదీర్ఘంగా చర్చ నడుస్తోంది. కమ్యూనిస్టుల కంచుకోటను ఇతరులు ఆక్రమిస్తున్నారా అనే అంశాన్ని చర్చల్లో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారన్నారు. మరో వైపు ఖమ్మం జిల్లాలో ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యాన్ని కూడా కోల్పోవటం ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశను కలిగిస్తోంది. ప్రధానంగా నాయకత్వ లేమి కారణంగానే పార్టీకి ఈ దుస్థితి కలిగిందని అంచనా వేస్తున్నారు. నగరంలోని ప్రధాన నేతలంతా అధికార పార్టీ తీర్థం పుచ్చుకోవటంతో ఈ పరిస్థితి వచ్చినట్లు అంచనా వే స్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా కచ్ఛితంగా గెలుస్తామనుకున్న కొన్ని స్థానాలను ఓడిపోవటంపై సమీక్ష నిర్వహించింది. ఇదిలా ఉండగా అధికార టిఆర్‌ఎస్ కూడా గెలవాల్సిన కొన్ని స్థానాల్లో ఓడిపోవటంపై సమీక్ష నిర్వహించింది. ప్రధానంగాఇటీవల టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన మందడపు రామకృష్ణ లాంటి నేతల ఓటమికి పార్టీలోని విభేదాలే కారణమనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా ఒకప్పుడు ఖమ్మంలో కమ్యూనిస్టు పార్టీలు ఎటువైపు ఉంటే వారే విజయం సాధిస్తారనే నానుడి ఉండేది. ఈ సారి సిపిఎం ఒంటరిగా పోటీ చేయగా, సిపిఐ మాత్రం కాంగ్రెస్‌తో జత కట్టింది. కానీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఆ పార్టీ అగ్రనేత పువ్వాడ నాగేశ్వరరావు కోడలు జయశ్రీ 11వ డివిజన్‌లో ఓటమి పాలైంది. అలాగే సిపిఎం డివిజన్ కార్యదర్శిగా ఇటీవల కాలం వరకు పని చేసి ప్రస్తుతం జిల్లాకార్యదర్శివర్గ సభ్యుడిగా ఉన్న యర్రా శ్రీకాంత్ 48వ డివిజన్‌లో పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచారు. అలాగే 8డివిజన్లలో పోటీ చేసిన సిపిఐ 2స్థానాల్లో, 41డివిజన్లలో పోటీ చేసిన సిపిఎం 2 స్థానాల్లో మాత్రమే విజయం సాధించటం పట్ల ఆ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

రవన్న ఆశయాల సాధనకు ఉద్యమిస్తాం
ఖమ్మం, మార్చి 10: సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యదర్శి రాయల సుభాష్‌చంద్రబోస్ అలియాస్ రవన్న ఆశయాల సాధన కోసం ఉద్యమిస్తామని పలువురు వక్తలు స్పష్టం చేశారు. అనారోగ్య కారణంతో బుధవారం రాత్రి మరణించిన రవన్న మృతదేహాన్ని ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రానికి గురువారం మధ్యాహ్నం తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి యతీంద్రకుమార్, నాయకులు పోటు రంగారావు, వేములపల్లి వెంకటరామయ్య, డివి కృష్ణ, ప్రసాద్‌లు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు 48 సంవత్సరాలుగా అజ్ఞాత జీవితం గడుపుతూ పేద ప్రజల సమస్యల కోసం పోరాడిన రవన్న నేటి తరానికి ఆదర్శమన్నారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటంతో పాటు నగ్జల్బరి ఉద్యమంలో కూడా రవన్న చేసిన పోరాటాలు మరిచిపోలేనివన్నారు. పాలక వర్గాలు అణచివేత ధోరణిని అవలంభించినా తట్టుకొని ప్రజలకు అండగా నిలబడిన వ్యక్తి అని కొనియాడారు. కాగా రవన్న మృతదేహాన్ని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సిపిఐ జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు భాగం హెమంతరావు, పోతినేని సుదర్శనరావు, నాయకులు నున్నా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బేగ్, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, టిడిపి జిల్లా అధ్యక్షుడు బ్రహ్మయ్యలతో పాటు నాటి ఆయన సమకాలికులు, ఉద్యమంలో ఆయనతో పాటు పాల్గొన్నవారు, బంధువులు, స్నేహితులు, న్యూడెమోక్రసీ కార్యకర్తలు, నాయకులు, భారీగా పాల్గొన్నారు. కాగా గురువారం సాయంత్రం రవన్న స్వగ్రామమైన తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన వేలాది మంది ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కార్యదర్శి నాగన్న నేతృత్వంలో రవన్నను స్మరిస్తూ కళారూపాలను ప్రదర్శించారు.

ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
60లక్షల మేర ఆస్తినష్టం
ముదిగొండ, మార్చి 10: మండల కేంద్రమైన ముదిగొండలో ప్లాస్టిక్ ముడిసరుకు తయారు చేసే పరిశ్రమ గురువారం తెల్లవారుఝామున అగ్నికి ఆహుతైంది. వివరాలు ఇలా ఉన్నాయి . ముదిగొండకు చెందిన దగ్గుల అంజిరెడ్డి స్థానిక పారిశ్రామిక ప్రాంతంలో ముదిగొండకు చెందిన మనె్నం పుల్లయ్యకు చెందిన ఎకరం భూమి 5సంవత్సరాలు లీజుకు తీసుకొని అందులో బ్యాంకు నుండి 15లక్షల లోను తీసుకోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమను నడిపిస్తున్నారు. ప్రతి నెల సుమారు 8లక్షల వరకు తయారు అయిన ప్లాస్టిక్ ముడి సరుకును అమ్ముతుంటారు. రోజు లాగానే పని ముగించుకొని ఇంటికి వచ్చాడు. గురువారం తెల్లవారుఝామున పరిశ్రమలో నైట్ వాచ్‌మెన్‌గా పనిచేసే నూకల రామయ్య, పక్కనే గ్రానైట్ పరిశ్రమలో పని చేసే కూలీలు ప్లాస్టిక్ పరిశ్రమలో మంటలు రావటం చూసి అంజిరెడ్డితో పాటు ముదిగొండ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఎస్‌ఐ తాటిపాముల కరుణాకర్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్ళి మంటలలో కాలిపోతున్న ప్లాస్టిక్ వస్తువుల నుండి కొంతమేరకు వస్తువులను వేరు చేసి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో ఫైర్ సిబ్బంది మూడుగంటల పాటు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఫైర్ సిబ్బందికి స్థానిక పరిశ్రమలలో పనిచేసే కూలీలు సహకారం అందించారు. మంటలు భారీగా రావటంతో పరిశ్రమలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులు కాలిపోవటంతో పాటు ఏడు మిషనరీలు, బాయిలర్, గ్రైండర్, వెయింగ్ కాటాలు, రేకులషెడ్ కూడా కాలిపోయింది. ప్లాస్టిక్ వస్తువులకు మంటలు త్వరగా అంటుకుంటాయని దీంతో భారీ అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉందని అక్కడ వున్నవారు భయబ్రాంతులకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది సమయస్ఫూర్తిని ఉపయోగించి మంటలను అదుపుచేసి ప్రమాదం అధికం కాకుండా చేశారు. విలువైన మిషనరితో పాటు కొనుగోలు చేసిన ప్లాస్టిక్ వస్తువులు కూడా కాలిపోవడంతో సుమారు 60లక్షల మేరకు ఆస్తి నష్టం వాటిల్లిందని ఆ పరిశ్రమ యజమాని అంజిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ముదిగొండ ఎస్‌ఐ తాటిపాముల కరుణాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా, ప్లాస్టిక్ వస్తువులు కొనుగోలు చేసినప్పుడు అందులో ఉండే రసాయనాల వల్ల ఏమైనా మంటలు లేచి ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

విద్యా ప్రమాణాలు పెంచాలి
ఖానాపురం హవేలి, మార్చి 10: ఉన్నత విద్యకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం మరిన్ని నూతన విధానాలు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాలలో ఉన్నత విద్యలోను సమస్యలు అనే అంశంపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ విద్యా ప్రమాణాలు పెంచేందుకు సెమిస్టర్ పద్దతిపై ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. డిగ్రీలో 90శాతం ప్రైవేటు కళాశాలలో, బిటెక్ 85ప్రైవేటు విద్యావ్యవస్థలో నడుస్తున్నాయన్నారు. ప్రస్తుతం ఇంజనీరింగ్‌లో ఫీజు రియంబర్స్‌మెంట్ వల్ల ప్రమాణాలు పాటించే విషయంలో కొంత జాప్యం చేస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితులు విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న ఫీజు రియంబర్స్‌మెంట్‌ను సద్వినియోగం చేసుకొని నలుగురికి ఉపయోగపడేలా ఉండాలన్నారు. అధ్యాపకులు తమదైన శైలిలో విద్యాబోధన చేస్తూ విద్యార్థులకు నూతన పద్దతులపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం కళాశాల మాజీ ప్రిన్సిపాల్ ఆత్మరామారావు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులు విద్యార్థులు చదువుపై దృష్టిసారించి, వారిలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీయాలన్నారు. కళాశాల కరస్పాండెంట్ కోటా అప్పిరెడ్డి మాట్లాడుతూ తమ కళాశాల స్థాపించి 25సంవత్సరాలు పూర్తవుతుందని, నాటి నుంచి నేటి వరకు అనుభవజ్ఞులైన వారిచే విద్యాబోధన అందించి అనేక మంది ఉన్నత శిఖరాలకు చేర్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సదస్సులో గౌరి శంకర్, మువ్వా శ్రీనివాసరావు, రమణారావు, సీతారామారావు, పుష్పలత, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

భూహీన్ పథకం అమలులో
జిల్లా డిసిసిబికి మొదటి స్థానం
ఖమ్మం, మార్చి 10: నాబార్డు సౌజన్యంతో భూమి లేని పేదలకు భూహీన్ ద్వారా రుణాలు అందించడంలో ఖమ్మం డిసిసిబికి తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానం లభించిందని, ఇందుకు ఖమ్మం డిసిసిబికి ఉత్తమ పురస్కారం అందించారని డిసిసిబి చైర్మన్ మువ్వా విజయబాబు పేర్కొన్నారు. గురువారం డిసిసిబిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో భూహీన్ పథకం కింద 2,500 సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు నాబార్డు అనుమతించిందని, కాని ఇక్కడ పేదల అవసరాలను బట్టి బ్యాంక్ ముందుకు వచ్చి 5,752 సంఘాలకు 56 కోట్ల రూపాయల రుణాలు అందించినట్లు తెలిపారు. నాబార్డు సూచనలను పాటిస్తూ, డిసిసిబి కొన్ని నిబంధనల నడుమ పనులు చేస్తుందని, దీంతో లబ్ధిదారులకు అందించే ప్రతి పథకంలో విజయం సాధిస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులతో ప్రత్యేకంగా బ్యాంక్‌లో పొదుపు చేయిస్తున్నట్లు తెలిపారు. దీంతో వారిపై రుణ ఒత్తిడి పెరగకుండా చూస్తున్నట్లు తెలిపారు. త్వరలో మరో 5వేల జెఎల్‌జిలకు రుణాలు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సిఇవో నాగచెన్నారావు, నాగప్రసాద్, రాంబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

సత్తుపల్లి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులు
సత్తుపల్లి, మార్చి 10 : ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు చదువులో రాణించేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోనే ప్రథమంగా సత్తుపల్లి స్థానిక యన్‌టిఆర్ నగర్ పాఠశాలలో డిజిటల్ తరగతులను డీఈఓ రాజేష్ గురువారం ప్రారంభించారు. ఆరు నుండి 10వ తరగతి విద్యార్థులకు డిజిటల్ తరహాలో తరగతులను బోధించాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు దృశ్యశ్రవణ విద్యావిధానం ద్వారా మరింత గ్రహణ శక్తి పెరిగి సబ్టెక్టుపై పట్టు పెరిగేందుకు దోహదపడుతుందన్నారు. ప్రస్తుత భోదనా పద్దతిసాధారణ స్థాయి విద్యార్థి బట్టీ విధారం నుంచి బయట పడి తనలోని సృజనాత్మకతకు పదునుపెట్టే పద్దతికి అలవాటు పడే అవకాశం ఉందని అన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులను నిర్వహించేందుకు అవసరమైన వనరులను ఏర్పాటు చేసుకునేలా విద్యా కమిటీలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జ్యేష్ట అప్పారావు, ఎంపిడివో ఎన్. రవి, డిప్యూటీ ఈఓ రాములు, హెచ్‌ఎంల సంఘం జిల్లా కార్యదర్శి రాజేశ్వరరావు, పాఠశాల హెచ్‌ఎం సరోజిని, ఉపాధ్యాయులు టి.శ్రీనివాసరావు, వేము రత్నాకర్, ఉదయ్ భాస్కర్ తదితరులున్నారు.

మార్కెట్‌కు భారీగా చేరిన మిర్చి
* రోడ్లపైనే కాంటాలు వేసిన రైతులు
ఖమ్మం, మార్చి 10: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు గురువారం రైతులు మిర్చి బస్తాలను భారీగా తరలించారు. గత 5 రోజుల నుంచి మార్కెట్ యార్డుకు వరుస సెలవులు రావడంతో రైతులు మార్కెట్ ప్రారంభమైన రోజునే తమ పంటను అమ్ముకునేందుకు ముందుకు వచ్చారు. దీంతో ప్రధాన యార్డుతో పాటు, మిర్చియార్డు నిండడంతో రైతులు రోడ్లపైనే తమ మిర్చి బస్తాలను దింపి అమ్మకానికి పెట్టారు. దీంతో ప్రధాన మార్కెట్ యార్డు రోడ్లు రైతుల బస్తాలతో నిండిపోయాయి. ధరలో మాత్రం మార్పులు అధికంగా లేకపోవడంతో రైతులు కొంత ఆనందాన్ని వ్యక్తం చేశారు. అత్యధికంగా క్వింటాకు 12,275 రూపాయల ధరను వ్యాపారులు చెల్లించి జెండాపాటను నిర్వహించారు. రైతులు తాము తీసుకొచ్చిన పంటకు మంచి ధర రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. కాగా రైతులు రోడ్లపై బస్తాలను దిగుమతి చేయడంతో ట్రాఫిక్‌కు కొంత అంతరాయం కలిగింది. దీంతో రైతు బస్తాలను సకాలంలో కాంటాలు వేయించి తరలించేందుకు అధికారులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సువర్ణాపురంలో గడ్డివాము దగ్ధం
ముదిగొండ, మార్చి 10: మండల పరిధిలోని సువర్ణాపురంలో అగ్ని ప్రమాదం జరిగి మాజీ జడ్పిటిసి పసుపులేటి దేవేంద్రం గడ్డివాము దగ్ధమైన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుని కథనం ప్రకారం ఖమ్మం నగర కార్పొరేషన్‌లో టిఆర్‌ఎస్ పార్టీ గెలవటంతో ఆ పార్టీ కార్యకర్తలు సువర్ణాపురం సర్పంచ్ భర్త తోట ధర్మతో కలసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆ పార్టీ కార్యకర్తలు బాణాసంచా కాల్చుతూ సంబురాలు జరుపుకున్నారు. ఈ క్రమంలో నిప్పురవ్వలు గ్రామానికి చెందిన మాజీ జడ్పిటిసి పసుపులేటి దేవేంద్రంకు చెందిన గడ్డివాముపై పడటంతో గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది. ఫైరింజన్ వచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదంలో సుమారు లక్ష రూపాయల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు దేవేంద్రం తెలిపారు. ఈ సంఘటనకు కారణమైన తోట ధర్మతో పాటు మరో 20మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కరుణాకర్ తెలిపారు.

విభీషణుడి శరణాగతి
* వైభవంగా శ్రీరామ మహాక్రతువు ప్రారంభం
భద్రాచలం, మార్చి 10: భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయంలో గురువారం శ్రీరామ మహాక్రతువు వైభవంగా ప్రారంభమయింది. స్థానిక చిత్రకూట మండపంలో ఉదయం క్రతువులో యుద్ధకాండ శ్లోక హవనం జరిగింది. 6 సర్గలు హవనం చేశారు. లంకాదహనం అనంతరం రావణాసురుడు చర్చ పెడతాడు. రాక్షసులంతా రాముడిని మేము చంపుతామంటూ ముందుకొస్తారు. విభీషణుడు మాత్రం వ్యతిరేకిస్తాడు. ఆంజనేయుడొక్కడే లంకను ఛిన్నాభిన్నం చేశాడని, రాముడు తన సైన్యంతో వస్తే ఇంకా ఏమీ మిగలదని, సీతమ్మ వారిని అప్పగించడమే మేలంటూ రావణాసురుడికి హితబోధ చేస్తాడు. కానీ పెడచెవిన పెట్టిన రావణాసురుడు విభీషణుడిపై దాడి చేస్తాడు. తప్పించుకు పోయి విభీషణుడు రాముడిని శరణు కోరుతాడు. కానీ రాముడు వానరుల అభిప్రాయం తీసుకుంటాడు. వారంతా విభీషణుడిని వ్యతిరేకిస్తారు. కానీ ఆంజనేయుడు మాత్రం శరణుకోరి వచ్చిన విభీషణుడిని మన పరివారంలో చేర్చుకోవాలని కోరుతాడు. దీంతో రాముడు వెంటనే విభీషణుడిని తన సైన్యంలో చేర్చుకుంటాడు. అతన్ని రక్షించడానికి సమ్మతిస్తాడు. ఇలా ఈ సన్నివేశాలతో శ్లోక హవనం చేశారు. అనంతరం నవాహ్నిక శ్రీరామాయణ మహాక్రతువుకు శ్రీకారం చుట్టారు. ముందుగా శ్రీసీతారామచంద్రస్వామి మూలవరుల వద్ద ఉత్సవ అనుజ్ఞ తీసుకున్నారు. భద్రగిరి ప్రదక్షిణం చేశారు. యాగశాల వద్ద ఓంకార రామధ్వజారోహణం చేసి విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన, రుత్విగ్వరణం, రక్షాబంధనం, శాలావాస్తు, పర్యగ్నికరణం చేశారు. యాగశాలలో యాగకుండాలను వెలిగించి శ్రీసుదర్శన మూర్తి యాగప్రవేశం చేయించారు. సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోపణ, అఖండ దీపాస్థాపనం, ద్వారతోరణపూజ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం ఎంఎస్ రామారావు మనుమడు డా.పి.శ్రీనివాస్ ఆలపించిన సుందరాకాండ గానసప్తాహం విశేషంగా ఆకట్టుకుంది. తాతను మరిపించే విధంగా ఆయన చేసిన గానం ఆహుతులను ఆనంద పరవశులను చేసింది.