తూర్పుగోదావరి

అసంపూర్తిగా ముగిసిన చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, ఫిబ్రవరి 17: అల్లవరం మండలం ఓడలరేవు గ్రామస్థులకు, ఓఎన్‌జీసీ సంస్థకు మద్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించేందుకు శనివారం అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన చర్చలు అసంపూర్తిగా ముగిసాయి. గ్రామస్థులు కోరిన డిమాండ్లు అన్నీ ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని ఉపముఖ్యమంత్రి నిమ్మకాలయ చినరాజప్ప, ఎంపీ పండుల రవీంద్రబాబు హామీ ఇచ్చినా స్థానికులు సంతృప్తి చెందలేదు. 2015లో ఓఎన్‌జీసీ అధికారులు గ్రామాభివృద్ధికి ఇచ్చిన 18 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 60 రోజులుగా ఓడలరేవు గ్రామస్థులు రిలే దీక్షలు చేస్తున్న సంగతి విదితమే. సమస్యను పరిష్కరించేందుకు ఎంపీ రవీంద్రబాబు ఢీల్లీలో ఓఎన్‌జీసీ ఛైర్మన్‌ను రెండురోజుల క్రితం కలిసి సమస్యను వివరించారు. దీనిపై ఛైర్మన్ స్వయంగా రాకుండా ఆయన ప్రతినిధిని శనివారం అమలాపురం పంపించారు. దీంతో ఆర్డీవో కార్యాలయంలో ఓఎన్‌జీసీ ప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులతో ఉప ముఖ్యమంత్రి రాజప్ప, ఎంపీ రవీంద్రబాబులు చర్చలు నిర్వహించారు. గ్రామస్థుల కోరిక మేరకు గ్రామానికి నిరంతరం మంచినీరు సరఫరా చేస్తామని, రూ.2.5 కోట్లతో గ్రామంలో గల అన్ని రహదారులను అభివృద్ధి చేస్తామని, ఇళ్ళ నిర్మాణాలకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఇచ్చే రుణానికి అధనంగా మరో లక్ష రూపాయలను ఓఎన్‌జీసీ సంస్థ భరిస్తుందని, రూ. 3 కోట్లతో బహుళ ప్రయోజన కమ్యూనిటీ భవనం నిర్మిస్తామని, సముద్రపు కోతను నివారించే విధంగా రక్షణ గోడ నిర్మాణాన్ని చేపడతామని, గ్రామంలో గల నిరుద్యోగులందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అవసరం మేరకు స్థానికంగా ఉండే వారినే లేబర్ పనులకు తీసుకుంటామని, టెక్నికల్ ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు, ఇంటర్యూలు ఆధారంగా తీసుకుంటామన్నారు. సమస్యలన్నింటినీ మార్చి 5 తరువాత పరిష్కరిస్తామని రాజప్ప, ఎంపీ పండుల హామీ ఇచ్చారు. అయితే వీటిపై స్థానికులు సంతృప్తి చెందలేదు. సమస్యల పరిష్కారానికి చర్యలు ప్రారంభించిన రోజునే తాము దీక్షలు విరమిస్తామని గ్రామస్థులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపి పండుల మాట్లాడుతూ సమస్య ఇంతవరకూ పెరగడానికి గతంలో ఇక్కడ పనిచేసిన అసెట్ మేనేజర్ అలోక్‌నంద నిర్లక్ష్యమేనన్నారు. సమస్యలను ఢీల్లీలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళక పోవడం వల్లే సమస్య మరింత జఠిలంగా మారిందన్నారు. అంతకు ముందు మంత్రి రాజప్ప, ఎంపి పండుల, ఎమ్మెల్యే ఆనందరావు, ఓఎన్‌జీసీ అధికారులు సుమారు గంట పాటు రహస్యంగా సమావేశమై చర్చించారు. ఈ చర్చల్లో కేంద్రం నుండి వచ్చిన ఓఎన్‌జీసీ అధికారి సిన్హా, ఆర్డీవో బి వెంకటరమణ, స్థానిక ఓఎన్‌జీసీ అధికారులు పాల్గొన్నారు.
కాగా తమ వాదన వినకుండా కేవలం ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, ఎంపి రవీంద్రబాబు, ఎమ్మెల్యే ఆనందరావు ఏకపక్షంగా మాట్లాడారని, వారి మాటలను తాము నమ్మే ప్రసక్తేలేదని దీక్షలు నిర్వహిస్తున్న గ్రామస్థులు సామాని వెంకటరమణ, తాడి జ్ఞానేశ్వర్, గుబ్బల దుర్గ, కొల్లాటి దుర్గా శివశంకర్ స్పష్టం చేశారు. తమకు ఇచ్చిన హామీలను అమలుకు చర్యలు చేపట్టిన రోజునుండే తాము దీక్షలు విరమిస్తామని, అంతవరకూ దీక్షలు కొనసాగుతాయని వారు ప్రకటించారు.

గండేపల్లి, ఫిబ్రవరి 17: గత నాలుగురోజులుగా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న ప్రో గోకార్ట్ ఛాంపియన్‌షిప్ పోటీలు శనివారం ముగిసినట్టు విద్యాసంస్థల ఛైర్మన్ సతీష్‌రెడ్డి తెలిపారు. ఫైనల్స్‌కు ముఖ్య అతిథులుగా మాజీ ఐఎఎస్ అధికారి, రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఫౌండర్ డైరెక్టర్ కె లక్ష్మీనారాయణ, డిప్యూటీ చీఫ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎంవి శివకుమార్‌రెడ్డి హాజరయ్యారు. మధ్యాహ్నం 12 గంటల నుండి రెండు గంటల వరకు జరిగిన ఫైనల్స్‌లో కర్ణాటక రాష్ట్రం పుత్తూరుకు చెందిన వివేకానంద కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచారు. రన్నర్ ఆఫ్‌గా హైదరాబాద్ శ్రీనిధి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు నిలిచారు. ఆండ్రైజ్ విన్నర్‌గా ఆదిత్య కళాశాల విద్యార్థులు నిలిచారు. బెస్ట్ డిజైన్, బెస్ట్ ఇన్నోవేషన్, యాక్సిలరేషన్ తదితర విభాగాల్లో ఆదిత్య కళాశాల విద్యార్థులు బహుమతులు కైవసం చేసుకున్నారు. విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు ఇటువంటి పోటీలు దోహదపడతాయని లక్ష్మీనారాయణ అన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎం శ్రీనివాసరెడ్డి, పికె రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో రూ. 565 కోట్ల పంచాయితీల విద్యుత్ బకాయిలు
22లోగా చెల్లించకపోతే సరఫరా నిలిపివేత
ఏపీఈపీడిసిఎల్ సీజియం భాస్కరరావు
రంపచోడవరం, ఫిబ్రవరి 17: తూర్పుగోదావరి జిల్లాలోని పంచాయితీల విద్యుత్ బకాయిలు ఈ నెల 22లోగా చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఎపీఈపీడీసిఎల్ సీజీయం భాస్కరరావు తెలిపారు. శనివారం విద్యుత్ బిల్లుల బకాయిలు, వాటి వసూళ్లపై రంపచోడవరం, చింతూరు సబ్ డివిజన్ అధికారులతో రంపచోడవరం ఏడీఈ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పంచాయితీలకు సంబంధించిన బకాయిలు 565 కోట్ల రూపాయలున్నట్టు చెప్పారు. జగ్గంపేట డివిజన్‌కు సంబంధించి పంచాయితీల నుండి రావాల్సిన బకాయిలు 34 కోట్లు ఉందన్నారు. చింతూరు సబ్ డివిజన్ నుండి 1.6 కోట్లు, రంపచోడవరం సబ్ డివిజన్‌లో 3.84 కోట్లు బకాయిలున్నట్టు చెప్పారు. అలాగే ఏజన్సీలో వ్యవసాయ విద్యుత్ బకాయిలు 23 లక్షలున్నాయన్నారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టి బకాయిలు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జగ్గంపేట డివిజన్ ఢీఈ రమణమూర్తి, ఏడీఈలు లక్ష్మీనారాయణ, మీన కేతనరావు, రంపచోడవరం ఏఈ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

మండపేట, ఫిబ్రవరి 17: విద్యుత్‌ను ఆదా చేయడమే లక్ష్యంగా అన్ని గ్రామాల్లోను ఈ ఏడాది చివరికి వీధి లైట్ల కోసం ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటుచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు రాష్ట్ర ఎల్‌ఈడీ ప్రాజెక్టు అధికారి కుమారస్వామి పేర్కొన్నారు. మండలంలోని ద్వారపూడిలో శనివారం రామచంద్రపురం డివిజన్ పరిధిలోని పంచాయతీ కార్యదర్శులకు ఎల్‌ఈడీ బల్బులపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో 28 లక్షల ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటుచేయడం లక్ష్యం కాగా, ఇప్పటి వరకూ 2లక్షల బల్బులు అమర్చినట్టు తెలిపారు. ట్యూబ్‌లైట్‌కు 40 వాల్ట్స్ విద్యుత్ అవసరం కాగా, ఎల్‌ఈడీ బల్బుకు 24 వాల్ట్స్ విద్యుత్ అవసరమవుతుందన్నారు. దీనివల్ల విద్యుత్ ఆదా కావడంతోపాటు బిల్లు తక్కువగా వచ్చి పంచాయతీల ఆర్థికాభివృద్ధి మెరుగుపడుతుందన్నారు. ఎల్‌ఈడీ బల్బులు అమర్చేందుకు అవసరమైన వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందన్నారు. అనంతరం డిఎల్పీవో ఎం వరప్రసాద్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలోని గ్రామాల్లో రూ.44 కోట్లు ఆస్తిపన్నులు వసూలు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకూ 55 శాతం వసూలు చేసినట్టు తెలిపారు. అనంతరం గ్రేడ్-2 నుంచి గ్రేడ్ -1కు పదోన్నతి పొందిన కార్యదర్శులను తోటి కార్యదర్శులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండపేట, రాయవరం, బిక్కవోలు, రామచంద్రపురం, అనపర్తి, కె గంగవరం మండలాలకు సంబంధించిన పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

దఫదఫాలుగా హామీలన్నీ అమలు
రంగంపేట, ఫిబ్రవరి 17: పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హమీలన్నీ ధఫదఫాలుగా అమలు చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. శనివారం రంగంపేట మండలం వెంకటాపురంలో నిర్మించిన వెంకటాపురం-కోటపాడు-ఈలకొలను రోడ్డును రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా ఇవ్వని రీతిలో 47 లక్షల పింఛన్లు ఆంధ్రప్రదేశ్‌లోనే ఇస్తున్నామన్నారు. దానిని త్వరలోనే 65 ఏళ్ళనుంచి 60 ఏళ్ళకి మార్పుచేయడమే గాక ప్రతి ఇంట్లో అర్హులైన వారు ఎందరున్నా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే గత రెండేళ్ళలో 11 లక్షల ఇళ్లు ఇచ్చామని, ఇంటింటికీ టీడీపీలో మరో తొమ్మిది లక్షల దరఖాస్తులొచ్చాయని, వారికి కూడా ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. అలాగే త్వరలోనే నిరుద్యోగ భృతి, ఆడపిల్లలకు కల్యాణ కానుక రూ. 50 వేలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ 50 ఏళ్ళ నుండి అయిదు గ్రామాల ప్రజల ఇబ్బందులను గుర్తించి 12.5 కిలోమీటర్ల రోడ్డుని నిర్మించి వారి కష్టాలు తొలగించామన్నారు. అనివార్య కారణాల వల్ల రోడ్డు నిర్మాణం ఆలస్యమైనా నాణ్యతతో కూడిన రోడ్డు ఏర్పాటు చేసిన ఘనత ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికే దక్కిందన్నారు, భవిష్యత్‌లో తుపాన్లు, వరదలొచ్చినా పంట చేలు మునగకుండా 17 కల్వర్టులు నిర్మించి రోడ్డు నిర్మించిన ఇంజినీరింగ్ అధికారులను ఎంపీ, మంత్రి అభినందించారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం పార్లమెంటు ఇన్‌ఛార్జి మాగంటి రూపాదేవి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు
రాజవొమ్మంగి, ఫిబ్రవరి 17: ఈ నెల 28 నుండి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమారాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నామని ప్రాంతీయ ఇంటర్ విద్యాధికారి (ఆర్‌ఐవొ) టి వెంకటేశ్వరరావు అన్నారు. రాజవొమ్మంగిలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 137 కేంద్రాల్లో 1,10,197 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి విద్యార్థికి టేబుల్ సదుపాయాన్ని కల్పిస్తున్నామని, నేలపై కూర్చుని పరీక్ష రాయాల్సిన అవసరం లేదన్నారు. 47,820 మంది ప్రథమ ఇంటర్ జనరల్ కాగా, 5147 మంది ఒకేషనల్, 51,391 ద్వితీయ ఇంటర్ జనరల్ కాగా 5841 మంది ఒకేషనల్ పరీక్షలు రాయనున్నారన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పలు రకాల తనిఖీ బృందాలతో బాటు రాష్టస్థ్రాయి బృందాలు కూడా ఈ పరీక్షలను పర్యవేక్షిస్తాయన్నారు. విద్యార్థులు ఎటువంటి కాపీయింగ్‌కు పాల్పడకుండా కష్టపడి చదివి ఉత్తీర్ణులు కావాలని వెంకటేశ్వరావు కోరారు.

ప్రాణాంతక రోడ్డుపై ప్రత్యామ్నాయ చర్యలు ‚
- ప్రమాణాలు నిల్..ప్రాణాలు హరీ..!!
- ఉభయ గోదావరి కలెక్టర్లు, ఎస్పీలు సుదీర్ఘ చర్చ
- రూ. 1530 కోట్లతో ఈజీకే రోడ్డు
- నిబంధనలకు విరుద్ధంగా భారీ వాహనాలు
- భారీ వాహనాలు మళ్ళించేందుకు చర్యలు
- ఆర్ అండ్ బి యంత్రాంగం తీరుపై అసంతృప్తి
- గామన్ వంతెనపై భారీ వాహనాలు నిషేధం
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 17: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు - గుండుగొలను - కొవ్వూరు (ఈజీకే) రోడ్డు ప్రమాణాలకు విరుద్ధంగా భారీ వాహనాలు వెళ్తుండటంతో ప్రాణాంతకంగా మారింది. నిత్యం ఏదో మూల ఏదో ప్రమాదం సంభవిస్తూనే వుంది. గత కొంత కాలం నుంచి ఈ రోడ్డు దుస్థితి మరీ దుర్భరంగా మారడంతో భారీ వాహనాలతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇటీవల కాలంలో 203 మంది ప్రాణాలు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితికి కారణం ప్రమాణాల్లేని ఈ రోడ్డుపై నిబంధనలకు విరుద్ధంగా భారీ వాహనాలు ఇటు విజయవాడ వైపు నుంచి, జీలుగుమిల్లి వైపు నుంచి, మరోవైపు 16వ నెంబర్ జాతీయ రహదారిపై రాజమహేంద్రవరం దివాన్‌చెరువు జంక్షన్ వైపు నుంచి రావడంతో నిత్యం ఏదో ప్రమాదం సంభవిస్తూనే వుంది. ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతూ సంఘటన జరిగినపుడు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చేంతవరకు ఆందోళన విరమించేది లేదంటూ ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్‌ను నిలుపుదల చేసి ఆందోళనకు దిగుతున్న పరిస్థితులు తలెత్తాయి. వాస్తవానికి ఈజీకే రోడ్డుగా పిలిచే ఈ రోడ్డు ప్రస్తుతం ఆర్ అండ్ బి అధీనంలో డబుల్ లేన్ రోడ్డుగా వుంది. భారీ వాహనాలు రావడంతో పెద్ద పెద్ద గుంతలు పడిపోయి ప్రమాదభరితంగా మారింది. ఈ రోడ్డును ప్రస్తుతం జాతీయ రహదారుల అధారిటీ ఆఫ్ ఇండియాకు బదలాయించామని ఆర్ అండ్ బి అధికారులు చెబుతున్నారు. ఈ ఈజీకే రోడ్డును నాలుగు లేన్ల రోడ్డుగా విస్తరించేందుకు రూ.1530 కోట్ల నిధులు మంజూరయ్యాయని, టెండర్లు కూడా పిలిచామని, ఏప్రిల్ నుంచి పనులు మొదలవుతాయని ఎంపీ మాగంటి మురళీమోహన్ చెప్పారు. అయితే 30 నెలల పాటు రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయ్యేంత వరకు ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్‌ను గామన్ వంతెనపై నిషేధించాలని, పశ్చిమ గోదావరి జిల్లా వైపు నుంచి గుండుగొలను వైపు ట్రాఫిక్ రాకుండా తాడేపల్లిగూడెం మీదుగా వెళ్ళే విధంగా 16వ నెంబర్ జాతీయ రహదారి వైపు నుంచి మళ్ళించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారని కలెక్టర్ కాటమనేని భాస్కర్ తెలిపారు.
ఈ రోడ్డుపై ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుని ప్రమాదాల నివారణకు కృషి చేయాలని, ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని, భారీ ప్రమాదాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అనేకసార్లు, అనేక సందర్భాల్లో మొత్తుకుంటూనే వున్నారు. ఆఖరికి అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇటీవల జరిగిన పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి నిర్వహించిన సమావేశంలో కూడా చర్చించారు. ఈ నేపథ్యంలో ఎంపీ మాగంటి మరళీమోహన్ శనివారం రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు భాస్కర్, కార్తికేయ మిశ్రా, ఎస్పీలు రవిప్రకాష్, బి రాజకుమారి, ఎన్ హెచ్, ఆర్‌అండ్‌బి, గామన్ వంతెన అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మం వైపు నుంచి కూడా భారీ వాహనాలు వచ్చి దేవరపల్లి వద్ద కలిసి గామన్ వంతెన నుంచి వెళ్తున్నాయని, భారీ వాహనాలను నిరోధించాలని, గామన్ వంతెనను తాత్కాలికంగా మూసేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లభించదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ అంతర్ జిల్లా రోడ్డుగా వున్న ఈ ఈజీకే రోడ్డులో జాతీయ స్థాయి ట్రాఫిక్ వెళుతోందని, ఈ రోడ్డును నాలుగు లేన్ల రోడ్డుగా విస్తరించేంత వరకు ట్రాఫిక్‌ను తూర్పుగోదావరి జిల్లా వైపు గామన్ బ్రిడ్జిపైకి రాకుండా దివాన్‌చెరువు నుంచి జాతీయ రహదారి పైకి మళ్ళించాలన్నారు. 30 టన్నుల సామర్ధ్యం కలిగిన ఈ రోడ్డుపై ప్రస్తుతం 70 టన్నుల సామర్ధ్యం కలిగిన భారీ వాహనాలు వెళ్తున్నాయన్నారు. భారత్‌లో ఇంత అధ్వాన్నమైన రోడ్డు మరొకటి వుండదన్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ ట్రాఫిక్‌నంతా రావులపాలెం ఎన్‌హెచ్ వైపు మళ్ళిస్తే రాజమహేంద్రవరం వైపు జాతీయ రహదారి ప్రమాదభరితంగా మారే ప్రమాదం వుందని, ఇప్పటికే బొమ్మూరు, మోరంపూడి ప్రాంతాల్లో ప్రమాద జోన్లుగా వున్నాయని, ఇక గామన్ వంతెన నుంచి వెళ్ళాల్సిన ట్రాఫిక్‌ను ఇటువైపు మళ్ళిస్తే ప్రమాదాలు జరుగుతాయన్నారు. దీనికి తోడు ఎంపీ మాగంటి కృషితో ఎన్‌హెచ్‌పై ఐదు ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు వస్తున్నాయని, వీటిని నిర్మించేటపుడు కూడా ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తుతుందన్నారు. అనేక నిర్మాణాలు, విద్యాసంస్థలు వున్నాయని, ట్రాఫిక్‌ను మళ్ళించాలంటే ఇరవై నాలుగు గంటల పాటు విధులు నిర్వహించేందుకు అదనపు ట్రాఫిక్ సిబ్బంది అవసరం వుంటుందని అర్బన్ జిల్లా ఎస్పీ బి రాజకుమారి చర్చించారు. రాత్రి సమయంలో అత్యధిక ప్రమాదభరితంగా ఈ రోడ్డు మారిందని, టోల్ టాక్సు వల్ల గామన్ వంతెన వైపు వచ్చేస్తున్నాయని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవి ప్రకాష్, డీఎస్పీ వెంకటేశ్వరరావు అన్నారు. మొత్తం మీద తీవ్ర తర్జన భర్జనల మధ్య రాత్రి సమయంలో గామన్ వంతెన నుంచి భారీ వాహనాలు వెళ్ళకుండా నిరోధించారు. అదే విధంగా ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎన్‌హెచ్ 16పై భారీ వాహనాలు వెళ్ళకుండా నిరోధిస్తూ చర్యలు తీసుకున్నారు. ఎంపీ మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ రూ.1530 కోట్లతో ఈజీకే రోడ్డును నాలుగు లేన్ల రోడ్డుగా విస్తరిస్తామన్నారు. విశాఖ నుంచి విజయవాడకు 45 కిలోమీటర్లు దూరం తగ్గుతుందనే నేపథ్యంలో గామన్ వంతెనపై ట్రాఫిక్ అధికమైందని, రోడ్డు నిర్మాణం పూర్తయ్యేంత వరకు ట్రాఫిక్‌ను మళ్ళించామన్నారు. ఈలోగా ఈజీకే రోడ్డులో స్పీడు బ్రేకర్లను, తాత్కాలిక డివైడర్‌ను నిర్మించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రాణనష్టం లేకుండా, ప్రమాదాలు జరగకుండా ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికార యంత్రాంగం సమన్వయంగా చర్యలు తీసుకున్నారన్నారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఈ ప్రత్యామ్నాయ చర్యలకు సపహకరించాలని కోరారు.

రాష్ట్రాన్ని అప్పుల పాల్జేస్తున్న చంద్రబాబు
- అవినీతిపరులకు అండగా మోదీ ప్రభుత్వం
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 17: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అప్పుల పాల్జేస్తుంటే, మోదీ ప్రభుత్వం అవినీతిపరులకు అండగా నిలుస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. భారత్‌లో 25 వేల కోట్ల మైనింగ్ మాఫియాకు పాల్పడిన గాలి జనార్ధనరెడ్డికి మోదీ అండగా నిలిచారని, గాలితో పాటు యడ్యూరప్పకు మోదీ కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. సీపీఐ 24వ జిల్లా మహాసభలు రాజమహేంద్రవరం ఆనం రోటరీ హాలు దేవ ముసలయ్య ప్రాంగణంలో శనివారం జరిగాయి. ఈ సభలకు జిల్లా కార్యదర్శి తాటిపాక మధు స్వాగతం పలికారు. ముఖ్య వక్తగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ సీపీఐ జిల్లా మహాసభలు రాష్టమ్రంతా చాలా ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతున్నాయన్నారు. గత పోరాటాలను సమీక్షించుకుంటూ కొత్త ఉద్యమాలకు పునరంకితమవుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల వ్యతిరేకతను పార్టీ పటిష్టవంతానికి సానుకూలంగా అందిపుచ్చుకుని ఉద్యమించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధ ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నారన్నారు. 135 కోట్ల జనాభా కలిగిన చైనా కమ్యూనిస్టు పాలనలోనే వుందని, సూపర్ పవర్‌గా మారుతున్న చైనాను చూసి ప్రపంచ దేశాలు వణుకుతున్నాయన్నారు. కమ్యూనిస్టులను ఎద్దేవా చేసేవారికి వియత్నాం, క్యూబా, చైనా, నేపాల్ వంటి దేశాల్లో కమ్యూనిస్టు పాలనలు కనువిప్పు కావాలన్నారు. నేపాల్‌కు వీసా అవసరం లేకుండా వెళ్ళి రావొచ్చన్నారు. కష్టజీవులున్నంత కాలం ఎర్రజెండా అజేయశక్తి అన్నారు. మతోన్మాద, అభివృద్ధి నిరోధక బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిపరులకు అండగా నిలుస్తోందన్నారు. రైతుల ఆత్మహత్యలు ఏమాత్రం తగ్గలేదన్నారు. తమిళనాడులో 40 రోజుల పాటు వినూత్న ఆందోళన చేసిన రైతులకు మోదీ కనీసం పట్టించుకోలేదన్నారు. నోట్ల రద్దు వల్ల పరిశ్రమలు మూతపడ్డాయని, జీఎస్టీ వల్ల వ్యవస్థలు కుప్పకూలాయన్నారు. మోదీ అధికారంలోంచి దిగే సమయానికి లీటర్ పెట్రోల్ రూ. 100 అవ్వడం ఖాయమన్నారు. బీజేపీకి ఇంటికిపోయే రోజులు దగ్గరపడ్డాయన్నారు. వేల కోట్లు బ్యాంకులకు ఎగనామం పెట్టిన వారిని మోదీ కాపాడుతున్నారని ఆరోపించారు. రూ. పదివేలు అప్పుకోసం బ్యాంకుల చుట్టూ సామాన్యుడు కాళ్ళరిగేలా తిరుగుతుంటే వేల కోట్లు బురిడీ కొట్టినవారికి అప్పులపై అప్పులు ఇస్తున్నారన్నారు. మోదీ ప్రభుత్వం ఉన్నత స్థాయిలో సహకారం లేకుండా వేల కోట్ల బ్యాంకుల దోపిడీ సాధ్యం కాదన్నారు. జిల్లా మహాసభల ప్రతినిధుల సభలో అధ్యక్ష కార్యవర్గంగా బి సత్యనారాయణ, నల్లా భ్రమరాంబ, కొండలరావు, మోహన్, వై బాబి, కె రమాదేవి పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే చిట్టూరి రవీంద్ర, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రావుల వెంకయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు, ఆహ్వాన కమిటీ, న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు, నల్లా రామారావు, డాక్టర్ స్టాలిన్ తదితరులు మాట్లాడారు.

పాఠశాలల్లో వౌలిక వసతుల కల్పనకు కృషి
గనుల శాఖ మంత్రి సృజయ కృష్ణ రంగారావు
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, ఫిబ్రవరి 17: ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషిచేస్తుందని రాష్ట్ర భూగర్భ, గనుల శాఖ మంత్రి సృజయ కృష్ణ రంగారావు అన్నారు. అమలాపురం రూరల్ మండలం పేరూరు డీఎన్ శెట్టి, డీవీ రెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో రూ. 22 లక్షలతో నిర్మించిన పాఠశాల అదనపు తరగతి గదులను శనివారం మండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ పెచ్చెట్టి చంద్రవౌళి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి రంగారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ జిల్లాకు ఇవ్వని విధంగా తూర్పు గోదావరి జిల్లాలో అదనపు తరగతి గదులు అవసరాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు రూ. 300 కోట్లు కేటాయించారన్నారు. రాష్ట్ర విభజన కారణంగా విద్యాపరంగా ఇక్కడ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, ముఖ్యమైన విద్యాలయాలన్నీ హైదరాబాద్‌లో ఉన్నాయన్నారు. ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు అమరావతిలో అధునాతన హంగులతో విశ్వవిద్యాలయాల స్థాపనకు సీఎం కృషి చేస్తున్నట్లు చెప్పారు. పాఠశాలకు సంబంధించి దాతలు సమకూర్చిన 50 ఎకరాల ఫలసాయాన్ని నేరుగా ఇవ్వడం సాధ్యకాక పోయినా, జడ్పీ నుండి పాఠశాల అభివృద్ధికి అధికంగా నిధులు మంజూరు చేయించేందుకు తన వంతు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న సర్పంచ్ చంద్రవౌళి, హెచ్‌ఎం మట్టపర్తి పురుషోత్తమరాజును మంత్రి అభినందించారు. మరో ముఖ్య అతిథి మండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ విద్యావంతులైతే ఆ సమాజంతో పాటు దేశం అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఈ సూత్రాన్ని గుర్తించిన జ్యోతీరావుపూలే, అంబేద్కర్, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి మేధావులు విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేసారు. ఉపాధ్యాయులు బాధ్యతలు గుర్తెరిగి క్రమశిక్షణతో కూడిన విద్యనందించాలన్నారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. అంతకు ముందు అమలాపురం జడ్పీ హైస్కూల్‌లో రూ.20 లక్షలతో నిర్మించిన నాలుగు అదనపు తరగతి గదులను మంత్రి, మండలి డిప్యూటీ ఛైర్మన్ ప్రారంభించారు. కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ డైరెక్టర్ మెట్ల రమణబాబు, జడ్పీటీసీలు ఎ వెంకటలక్ష్మి, వి ప్రవీణ, మున్సిపల్ వైస్ చైర్మన్ పీ విజయలక్ష్మి, పెచ్చెట్టి విజయలక్ష్మి, డీవైఈఓ ఎన్ సుబాష్‌బాబు, ఎంఈవో డి విమలకుమారి, హెచ్‌ఎం కె రామ్మోహనరావు, పశ్చిమ గోదావరి జిల్లా మాజీ జడ్పీ ఛైర్మన్ జయరాజు, తహసీల్దార్ బీ బేబీ జ్ఞానాంబ తదితరులు పాల్గొన్నారు.
ఎడీబీ రోడ్డు విస్తరణలో బాధితులను ఆదుకుంటాం
రోడ్లు భవనాల శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు
రంగంపేట, ఫిబ్రవరి 17: రాజానగరం నుండి పెద్దాపురం వరకు ఎడిబి రోడ్డు విస్తరణలో స్థలాలు, భూములు కోల్పోతున్న వారిని అన్ని విధాలా ఆదుకుంటామని రోడ్లు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు హామీ ఇచ్చారు. శనివారం మండలంలోని వెంకటాపురం విచ్చేసిన ఆయనకు బాధితులు వినతిపత్రం అందించారు. చాలా చోట్ల చెరువులు వున్నాయని, అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చెరువులను మూయరాదని తెలపడంతో పక్కనే గల పొలాలు అత్యధికంగా నష్టపోతున్నారన్నారు. కాని ఆ చెరువులు వాడకంలో లేవని అవి నిరుపయోగంగా వున్నాయని వాటిని దృష్టిలో పెట్టుకుని రోడ్డు పనులపై మరోసారి సర్వే చేయించి ఎలైన్‌మెంట్ మార్చి రైతులను ఆదుకోవాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంత్రిని కోరారు. అలాగే పంట పొలాల రేట్లు ఎకరా కోటి నుండి రెండు కోట్లు పలుకుతుందని, ఇళ్ల స్థలాలు చదరపు గజానికి ప్రభుత్వ రేటు రూ 4,200 ఉండగా నష్ట పరిహారం రూ 356.35 ప్రకటించడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాజానగరం, రంగంపేట, కోటపాడు గ్రామాలకు చెందిన బాధితులు పి కృష్ణప్రసాద్, చొల్లంగి సత్యనారాయణ, పోతుల వెంకటలక్ష్మి తదితరులు మంత్రికి వినతిపత్రం అందించారు. దీనిపై స్పందించిన మంత్రి వేదికపైనుండే ఉన్నతాధికారులతో మాట్లాడి ఈ నెల 20న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు.

ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఆడిట్ అధికారి
రు.5 వేల లంచంతో పట్టుబడ్డ అధికారి
కాకినాడ సిటీ, ఫిబ్రవరి 17: తూర్పుగోదావరి జిల్లాలో ఎసిబి అధికారుల విసిరిన వలలో ఓ ప్రభుత్వ అధికారి పట్టుబడ్డాడు. జిల్లా కేంద్రం కాకినాడ నగరం నరసన్ననగర్ కాలనీలో ఉన్న జిల్లా ఆడిట్ కార్యాలయంపై ఎసిబి అధికారులు శనివారం మధ్యాహ్నం సమయంలో దాడిచేసి అవినీతి అధికారిని రెడ్‌హేండడ్‌గా పట్టుకున్నారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన అవినీతి అధికారి కార్యాకలాపాలకు సంబంధించి రాజమండ్రి అవినీతి నిరోదకశాఖ డిఎస్పీ ఎం సుధాకర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ ఫిషరీష్ కార్యాలయంలో గండేపల్లి రామారావుఅనే వ్యక్తి అటెండర్‌గా పనిచేస్తు 2016వ సంత్సరంలో మృతి చెందడం జరిగింది. ఆయనకు కుమార్తె పి పద్మావతి ఉండగా, తండ్రి రామారావు చనిపోవడానికి ముందుగానే ఆమె భర్త 2014వ సంవత్సరంలో మృతి చెందడంతో తండ్రిపై ఆధారపడి జీవిస్తోంది. తల్లిదండ్రుల ప్రభుత్వ ఉద్యోగులై ఉండి వారిపై ఆధారపడి ఉండే అవివాహితులైన కుమార్తెలు, విడోలు తల్లిదండ్రులు మరణానంతరం వారికి చెందిన పెన్షన్‌కు అర్హులని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పద్మావతి తన తండ్రి రామారావుకు వారసురాలుగా తనకు విడో పెన్షన్‌ను మంజూరు చేయాల్సిందిగా కాకినాడ ఫిషరీష్ కార్యాలయం అధికారులకు దరఖాస్తు చేసుకుంది. ఫిషరీష్ అధికారులు పద్మావతి దరఖాస్తును పరిశీలించి విడో పెన్షన్ సేంక్షన్ కోసం జిల్లా ఆడిట్ కార్యాలయంకు పంపించారు. దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్న విడో పెన్షన్ సేక్షన్ కాకపోవడంతో పద్మావతి తన పెన్షన్ కోసం మరోసారి ఫిషరీష్ కార్యాలయం అధికారులను సంప్రదించగా వారు ఆమె దరఖాస్తును జిల్లా ఆడిట్ కార్యాలయంకు పంపినట్లు తెలియజేశారు. దీంతో పద్మావతి విడోపెన్షన్ కోసం జిల్లా ఆడిట్ కార్యాలయంలోని అసిస్టెంట్ ఆడిట్ అధికారి బత్తుల రాజేంద్రను సంప్రదించింది. విడో పెన్షన్ సేక్షన్‌చేస్తు ఉత్తర్వులను జిల్లా ట్రెజరీ కార్యాలయంకు పంపించాలంటే తనకు 25వే రూపాయలు లంచం ఇవ్వాల్సిందిగా అసిస్టెంట్ ఆడిట్ అధికారి రాజేంద్ర డిమాండ్ చేయడంతో తాను అంతమొత్తం ఇచ్చుకోలేనని ఆమె బ్రతిమలాడింది. తుదకు 5వేల రూపాయలు లంచం ఇవ్వగలనని పద్మావతి చెప్పగా దానికి ఆయన అంగీకరించడంతో ఈవిషయంపై ఎసిబి అధికారులకు ఫిర్యాదుచేసింది. ఎసిబి అధికారులు ఇచ్చిన సూచనలపై శనివారం మధ్యాహ్నాం సమయంలో పద్మావతి జిల్లా ఆడిట్ కార్యాయంలో విధినిర్వాహణలో ఉన్న అసిస్టెట్ ఆడిట్ అధికారి రాజేంద్రకు 5వేల రూపాయల లంచం ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్‌హేండెడ్‌గా పట్టుకున్నారు. ఈసందర్భంగా డిఎస్పీ సుధాకర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఫిర్యాదురాలు పద్మావతికి విడోపెన్షన్ సేంక్షన్‌చేస్తు ఉత్తర్వులను జిల్లా ట్రెజరీ కార్యాలయంకు పంపడానికి అసిస్టెట్ ఆడిట్ అధికారి రాజేంద్ర 25వేల రూపాయలు డిమాండ్ చేయగా, బాధితురాలు, ఆడిట్ అధికారి రాజేంద్రకు మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 5వేల రూపాయల నగదును శనివారం పద్మావతి ఆయనకు అందజేస్తుండగా పట్టుకున్నట్లు చెప్పారు. కేసు నమోదుచేసి విజయవాడ రాజేంద్రను ఎసిబి కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈదాడుల్లో ఎసిబి సిఐలు పివిఎస్ మోహన్‌రావు, టి పుల్లారావులు పాల్గొన్నారు.

రిజర్వేషన్‌లపై ముద్రగడ కేంద్రంపై పోరాటం చేయాలి
ఉప ముఖ్యమంత్రి రాజప్ప
కాపు రిజర్వేషన్ల అమలు బాధ్యత టీడీపీదే
ఆంధ్రభూమి బ్యూరో
అమాలాపురం, ఫిబ్రవరి 17: కాపు రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, ఈ అంశాన్ని ఢిల్లీలోని ఒక శాఖ తిరస్కరించినంత మాత్రాన ప్రక్రియ మొత్తం ఆగినట్లు కాదని, దీనిపై పదేపదే ముఖ్యమంత్రికి లేఖలు రాస్తున్న ముద్రగడ పద్మనాభం ఇకపై తన ప్రతాపాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై చూపించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సవాల్ విసిరారు. శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీ మేరకు కమిషన్ వేశారన్నారు. కమిషన్ నివేదిక ఆధారంగా కేబినెట్‌లో ఆమోదించి, శాసనసభలో బిల్లు పెట్టి ఆమోదింపచేసి కేంద్రానికి పంపించామన్నారు. రాజ్యాంగంలో ఉన్న 50 శాతం రిజర్వేషన్‌లు మించకూడదన్న అంశాన్ని ఆధారం చేసుకుని హోం మంత్రిత్వ్ర శాఖ 15 రోజుల గడువు అడిగిందన్నారు. రాజ్యాంగలో 9వ షెడ్యూల్‌ను సవరించి రిజర్వేషన్‌లను అమలు చేసుకోవచ్చన్నారు. తీరిగ్గా కూర్చుని పదేపదే చంద్రబాబుకు లేఖలు రాయాల్సిన అవసరం ముద్రగడకు లేదన్నారు. లేఖలు రాయాలనిపిస్తే ఇకపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాయాలని రాజప్ప సూచించారు. కాపు రిజర్వేషన్‌లు అమలుచేసే బాధ్యత తమ ప్రభుత్వానిదేనన్నారు.
న్యాయం చేయకపోతే తెగతెంపులకైనా సిద్ధమే: రాజప్ప
విభజన హామీలను కేంద్రం అమలు చేయకపోతే ఎన్‌డీఎ ప్రభుత్వంతో తెగతెంపులు చేసుకునేందుకు సిద్ధమేనని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారని, జగన్‌లాగ నాటకాలాడే అలవాటు తమ నాయకుడికి లేదని చినరాజప్ప అన్నారు. ప్రత్యేక హోదాకోసం పోటారం చేస్తానని గత మూడేళ్ళుగా చెపుతున్న వైసీపీ అధినేత జగన్ బీజేపీతో లాలూచీ వ్యాపారం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్ 6 తరువాత వైసీపీ ఎంపీలంతా రాజీనామాలు చేస్తారన్న ప్రకటనను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. జగన్ ఈ మాటను గత మూడేళ్ళుగా చెపుతూనే ఉన్నారని రాజప్ప ఎద్దేవా చేశారు. హోదాకు సమానంగా నిధులివ్వకపోతే కేంద్రంపై తామే పోరాడతామన్నారు.
పవన్ నాయకత్వంలోని జేఎఫ్‌సీని స్వాగతిస్తాం!
పవన్ కళ్యాణ్ రాష్ట్భ్రావృద్ధి కోసం కొంతమంది మేధావులతో కలిసి జెఎఫ్‌సీ (జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ) ఏర్పాటుచేయడాన్ని తెలుగు దేశం పార్టీ స్వాగతిస్తుందన్నారు. రాష్ట్రానికి అధిక నిధులు తీసుకు వచ్చేందుకు కేంద్రంపై వత్తిడి తేవాలని రాజప్ప పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గణులు, భూగర్భ శాఖ మంత్రి సృజయకృష్ణ రంగారావు, ఎమ్మెల్యేలు ఆనందరావు, పులపర్తి నారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తదితరులు పాల్గొన్నారు.