సాహితి
కవిత్వం వ్యాపారపరత్వం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పాఠకుల కంటె కవులు ఎక్కువ. ప్రతి కవి పాఠకుడు కాదు. తెలుగు సాహిత్యానికి సంబంధించి ఉద్యమ కవిత్వం ఒక చక్కని వ్యాపారం. ఇంత చదువుకోని పూర్వ కవులు తమ కృతుల కారణంగా ఇంకా మిగిలి వున్నారంటే అపుడు ఇంత జనాభా లేరు. కవులున్నూ లేరు. ఇన్ని సభలప్పుడు లేవు. ఇన్ని ఆవిష్కరణలున్నూ లేవు. ఐతే ఆధునిక సాహిత్యంలో పది కాలాలపాటు నిలచే రచనలేమైనా వున్నాయా అంటే- అసలీ ప్రశ్న ఎవరు ఎవర్కి వేయాలి అనే సమస్య తల ఎత్తుతుంది. ఎవరి కారణాలు వారికుంటాయి. ఎవరి వాదనలు వారికుంటాయి. అపార్థానికి గురి కాకుండా దీనికి సమాధానం చెప్పటం కష్టం. ఏ ఒక్క కవిని గురించి కూడా రుూ విషయం మీద తన అభిప్రాయం చెప్పటం కంటే కవిత్వం అంటే ఏమిటో క్షుణ్ణమైన జ్ఞానం గడించుకుని దానితో ఎవరికి వారై అంచనా వేసుకోవటం వివేకమంతమైన పద్ధతి.
‘‘ఒక క్రైస్తవ కవి ఉదిత మాధుర్య
రసోత్కటంబగు శబ్దమూది పలుకు
ఒక బ్రహ్మ మత కవి ఉల్లోలమగు కూర్పు
టదుకులో కూటస్థుడైన వాడు
అల గౌతమీ కోకిలాఖ్య కవి
పంచవ స్వరంబున మాట మాటనూదు
పరగ నిద్దరదృష్టవంతులౌ కవులు
చిక్కగ సన్నగా పాడగలరు గీతి
నినె్నవరు మెచ్చుకొందురీ నేల యందు
పలుకు పెళుసైన యట్టి నిర్భాగ్య కవిని
కలిత లౌకిక సాంసారిక ప్రగాఢ
దుఃఖ దూషిత వాంఛా విధూత మతిని’’
ఇది యథార్థమైన అంచనా వేయు పద్ధతి. అసలు తెలుగు కవిత్వం ఇతర భాషా కవిత్వాలతో పోల్చి చూస్తే ఈ ఆధునిక కాలం వరకు కవిత్వం అనే పదానికి ఎంతో దూరం పడుతుంది. ఈ వాస్తవ స్థితిని గమనించినప్పుడు ఇందులో ఎంత నిలుస్తుందో- ఎంత ముగుస్తుందో చెప్పటం అసాధ్యం కాదు కానీ- దుస్సాధ్యం. అందునా రాజకీయాశ్రీతమైన కవిత్వానికి మారే ప్రతి ప్రభుత్వంతోను ఉపాంశు సంబంధాలుంటాయి. ఈ కారణంగా ఆ కవులు వారి రచనలు ఎక్కడో అక్కడ తోరాలు పోసుకుంటూ వ్రతాలు చేసుకుంటూ పేరంటాలు జరుపుకొంటూనే వుంటాయి. కొన్ని సంవత్సరాల నుండి ప్రభుత్వం కానీ- ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంస్థలు కానీ వాటి దృష్టిలో ఉత్తమ రచన అనిపించిన వాటికి బహుమతులు ఇస్తున్నాయనుకుంటే, ప్రతిభను బట్టి కాక పరిచయాన్ని బట్టి ఈ ‘దొడ్డి’ సంభావనా కార్యక్రమం జరుగుతోందన్నది నిర్వివాదమైన అంశమే. కేవలం ఆశ్రీతులకు మాత్రమే ఈ మూర్ఛబిళ్ళలు ఇస్తున్నారన్న సంగతి జగద్వితం. ఆ విధంగా కొన్ని వర్గాలవారివో, కొన్ని సిద్ధాంతాల వారివో పుస్తకాలుగా కొంతకాలం గుర్తుంటాయి. ఈ గుర్తుకు కారణం కవిత్వం మాత్రం కాదు. వ్యక్తి చుట్టరికం. వర్తమాన తెలుగు కవుల్ని గురించి చెయ్యబడుతున్న సాహిత్య విమర్శ (సమీక్షలతో సహా) నూటికి తొంభయి పాళ్ళు ఒక్కణ్ణి ఇచ్చకంగానో- ఒకణ్ని నిచ్చకంగానో, లేక తన స్వస్థాన సంరక్షణకో లేక సంపాదనకో పోగుచేసుకునే కశ్మలం తప్ప మరొకటి కాదు. అందులో బ్రతకడమే వాడికి పరమార్థం. ఇదో వప్రక్రీడ. రుద్దుకున్నవాడికి రుద్దుకున్నంత. అసలీ నీచ గుణం 12వ శతాబ్దపు మధ్యకాలంలోనే స్థిరపడి పోయింది. ‘‘ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అప్పటికా మాటలాడి అన్యుల మనమున్ నొప్పింపక, తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’’ అనే తెలుగు నాడిని పట్టుకొని విషయాన్ని విడమరచినవాడు సుమతీ శతకకారుడు. అప్పటికే ఆ లక్షణం తెలుగువారి జీవన సరళి అయి చెలామణి నేర్పరచుకొన్నది. తెలుగు జాతీయ లక్షణంగా స్థిరపరచుకొన్నది. ఇప్పటికీ తెలుగునాట ఈ దరిద్రపుగొట్టు లక్షణం సామాజిక ఔచిత్యంగా రూపాంతరం చెందింది. ఇంకా తెలుగువాడు ఈ నీచ నాగరికతనుండి బయటపడతాడనుకోవటం వట్టి ఆత్మవంచన. రాజకీయాల్లో- కవిత్వంలో- జీవితంలో- సర్వే సర్వత్రా కళ్ళకు కట్టినట్టు కొట్టవచ్చినట్టు కనిపిస్తూనే వుంది. ఇది చాలా అనాగరకమైన స్థితి. ఈ శే్లష్మంలో కొట్టుకుపోవటమే ఆధునిక సాహిత్యకారులకి ఆచరణీయమైన దీక్షా ప్రవృత్తి. వర్తమాన కవికి వస్తు దారిద్య్రం లేదు. గుండుసూది- కత్తెర (వీటి ఔపయోగిక వివరణలకోసం మిత్రుడు ఎన్.గోపి నడగాలి)- ఇసక- పేడ ఇత్యాది. ఎందులోనైనా దేనినైనా దర్శించగల క్రాంతదర్శి. ఏవం విధా ఋషి. ఇలా ఎందుకనవలసి వచ్చిందో ఎప్పుడో ఎవరో అన్న వాక్యాలివి ‘‘నా నృషి కురుతే కావ్యం- నా గంధర్వః సురూపధృత్- నా దేవేశః దదాత్యన్నం- నా విష్ణుః పృధివీపతిః’’- ఐతే చాలామంది మేధావులైన వర్తమాన కవులు కథా కావ్యాలుగా వచ్చిన పూర్వ సాహిత్యమంతా అభూత కల్పన అని కొట్టిపారేస్తున్నారు. వీరి ఇప్పటి కవిత్వమేదో భూతకల్పన ఐనట్టు. కావచ్చు మరో అర్థంలో.
గ్రీకు- రోమన్ భాషల్లో ‘మైథాలజీ’ అనే పేరుతో పురాణాలున్నాయి. అయితే అవి ఇతిహాసాల్లో కావ్య నాటకాల్లో మిశ్రీతమై వున్నాయి. తెలుగువాడికి ఇది తెలిసినప్పటినుంచి జీవితంలోకి తర్కం ప్రవేశించింది. జీవితం తర్కమైన వాటికి కవిత్వం జీవితమైంది. ఉద్యమాలు అందుకే పుట్టాయి. సిద్ధించిన ఉద్యమాలు పరిసమాప్తి అయ్యాయో కాల మహాసర్పం తన తోక తానే పట్టుకొని తెగమింగుతున్నట్లు ఇంకా కొనసాగుతున్నాయో తెలియదు కానీ- వ్యాపారం బాగానే వున్నట్లుంది. కవులు కవులు ఒకటే కదా. ఈమధ్య ‘్ఫలానా కవిత్యోద్యమానికి కర్త కర్మ క్రియ నేనే’నంటూ పేపర్లకెక్కితే- వెంటనే ఆరుగురు ‘క.క.క్రి.’లు పుట్టుకొచ్చారు. సంఘటనల్ని ఏకరువు పెట్టారు తప్ప ఆ ఉద్యమం సాధించినదేమిటో పూర్తిచేయలేదు. తర్కంతో చేసుకున్న గృహప్రవేశ కార్యక్రమాలన్నీ యిటువంటివే. కారణమేమిటంటే ఆధునిక ప్రచార సాధనములన్నియు ఇంచుమించు అధికార వర్గ పాదాలవైపు ప్రవహించే పంట బోదెలు. సామాన్యులకు, శబ్దవిదులకు దుర్లభ స్థానాలు. ఇపుడు కవిత్వం ప్రజా కవుల ప్రధాన లైసెన్స్. ఎవరైనా వ్రాయవచ్చు. సాహిత్యానికి జీవితం జన్మభూమి అయితే- ఇప్పుడు జన్మభూమి ‘ఫెర్టిలిటి సెంటర్స్’లో దొరుకుతోంది. సాహిత్యం ఎవరి శిశువో కదా వెక్కి వెక్కి ఏడవటానికి. మానవ బాష్పాన్ని- మార్క్సిస్టు కన్నీరు - స్ర్తివాద కన్నీరు- విప్లవ కన్నీరు అని విభజించుకుంటూపోతే కన్నీటికి కన్నుదొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ‘హిజ్రా’వాదం కూడా వస్తోంది.
పూర్వం రెడ్ల రాజధాని కొండవీడు- నగర పరిసర ప్రాంతాల్లో చిత్త విత్తుగా తిరిగే గాడిదల్ని శ్రీనాథుడు ‘మీరున్నూ కవులు కాదు గదా’ అని అడిగాట్ట. అలాంటి ఈ తెలుగుదేశంలో ఇపుడు అటువంటి ప్రశ్న వేయనవసరం లేదని ఎందరు గుర్తించగలరు. అసలా ప్రశ్నలోనే సమాధాన ధ్వనిని గమనించాలని ఎవరు ఎవరికి చెప్పగలరు. ఎందుకంటే కవిత్వపు వాస్తవాత్మ అయిన ధ్వని లేక చమత్కారం అభివ్యక్తిలో బహిరంగంగా కనిపించే సూక్ష్మాంశమై- అనిర్వచనీయంగా వుంటుంది. ఈ ఐంద్రజాలిక మర్మం భాషలో వుండదు. భాషలో ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ అసలిది భావం యొక్క పుట్టుకలోనే వుంటుంది. ఈ శబ్ద విన్యాస విశేష రూప అభివ్యక్తి బహుశా భావంలోనూ కాకుండా ఇంకా లోతుల్లో అంటే- జీవితంలో కవి లోకాన్ని చూసే చూపులోనే ఉందనుకోవాలి. తరువాతే దాని పుట్టుక. ఇపుడు భాష దగ్గరకొస్తే అసలు కవిత్వం భాష కాదు అనే మహా సత్యాన్ని అర్థం చేసుకోండర్రా అంటే అదేదో వినరాని మాటల్లే చెవులు మూసుకుంటున్నారు. భాషా స్థాయిని పట్టుకుని వ్రేలాడేది అధమ కవిత్వమంటే అది ప్రజా కవిత్వమని ఎందరు ‘యూనివర్సిటీ’ ప్రొఫెసర్లు అనటం లేదు? అది యూనివర్సిటీల స్థాయంటే నోరు విప్పేదెవరట? పాఠకుల కంటె కవులు ఎక్కువే. ఏ కవీ పాఠకుడు కాదు. అనుభవం కావాలి. అనుభూతి రగలాలి. అంటే అనుభవపూర్వకమైన తీవ్ర ఉద్రేకం- అంటే ఒక మహత్తర ప్రభావశాలి. వస్తువో- పరిచయమో- సంఘటనో కవిని తీవ్రంగా కుదిపేసి భావోద్వేగానికి గురిచేసేదనే. ఐతే ఈ ఉద్రేకం ఆకాశంనుండి ఊడిపడదు. జీవితంలోనే ఉడుకెత్తిపోతున్న అగ్ని సంస్కారపు ఉష్ణోద్వేగం. ఈ అగ్నికి ఇదమిత్థ రూపం వుండదు. కానీ ఆ ఉద్వేగమే అనుభూతి తీవ్రత. తదనంతర అక్షరాకృతి. కవిత ఈ ప్రయాణానికి ఇవ్వబడిన ఒక అద్భుత సాహిత్య రూపం. విన్న సంగతి కంటే వినని సంగతి మరింత మధురం. నిర్ద్వంద్వమైనా నిజమైనా ఇదేమిటనిపించే ఒక మనోజ్ఞమైన మాధురీ రుచి.
భాష అభివ్యక్తికి అనివార్యమైతే శబ్దాలు కవిత్వానికి పునాదిగత నిర్మాణ వస్తువులౌతాయి. ఆ పునాదికి కవి లోతుల్లోకి వెళ్ళవలసిన అవసరం వుందని పూర్వులు భావించారు. వారుత్తగా భావించినట్లైతే ఇవాళ కవిత్వం ఇన్ని సభావేదికలమీద రూప ప్రదర్శన కోసం నగ్నోద్విగ్న అవదు. అంటే వస్తు నగ్నత్వం- నిరలంకార నగ్నత్వం- అపశబ్ద వ్యాపృతి ఇవన్నీ అన్నమాట. వచ్చి గుంపులు గుంపులుగా కవిత్వంలో పిలపిల్లాడుతున్నాయి. ఇలా వ్రాయరాదంటే- అలానే ఎందుకు వ్రాయాలన్నది నేటి కవుల తర్క పరిణామ వాదన. జీవితం కవిత్వమైన చోట తర్కం రాజ్యపాలన చేస్తున్న బిన్ లాడెన్ భక్తి. కనుకనే సమీక్షల్లో సైతం హృదయపు లోతుల్లో వెంట్రుకల మొదళ్ళు కనిపిస్తాయి. పెన్సిలు చెక్కిన పొట్టు- రోబో- బొప్పాయి చెక్క- సూది దారం ఇత్యాది వస్తువుల ఉపయోగంలో కనిపించే కవిత్వం తత్త్వాంశను (దీనిని గురించి సవిస్తరంగా మందరపు హైమవతినడిగి తెలుసుకోవాలి) వస్తు ప్రేమికులు మానవత్వం కంటే ఎక్కువ ఇష్టపడుతున్నారట. ఈ అద్భుతమైన విన్నాణం గలట్టి తామస కిరణం గొంతు సవరించుకున్న పక్షులైన కవులు ప్రతి సభలోను కనిపిస్తారు. అంటే వేదికలెక్కి కూర్చుంటారని కాదు. బేళ్ళు బేళ్ళు పుస్తకాలు వచ్చి పడతాయి.
కవిత్వానికి పుట్టిన నానా రూప సంతానాలలో రాజకీయాలు ఒకటి. కాబట్టి కవి రాజకీయాధినేత అధాంగ పూజ చేయవలసిందే. నిజానికి కవిత్వ ప్రక్రియతోనే జ్ఞానము- అనుకంప అవినాభావ సంబంధంగా పెనవేసుకున్నాయి. ఐతే వర్తమాన కవి మూర్ధన్యులకు ఈ అనుభూతి కళ వంటబట్టలేదు. కవిత్వం ఇంద్రియవాదం కాలేదు. జీవితం అనుభవించకుండానే కవిత్వం తన్నుకురావటం జరుగుతోంది. శోకమనే జీవధాతువు చేతనే కవి మనిషికి అందరికంటే సన్నిహితుడు అవగలడు. ఐతే ఈ విశ్వాసానికి తర్కంతో పేచీ వచ్చి- కవి అనేవాడు పుస్తకాల నచ్చువేసుకుని ఊళ్ళమీదికి వరద వెల్లువలా వదలటంలో మునిగిపోయాడు. ఆత్మ విచారం- ఆత్మ కళాభ్యాసం- హృదయ సంవాదం ఇత్యాది నాయక ఆత్మీయ ప్రక్రియలు లేక కవికి విశ్వసృష్టి అవగాహన పుట్టటం లేదు. ఆత్మవిచారం నుండి వస్తువు యొక్క నానా విధములైన విస్ఫురణ కలుగుతుందని- అక్లిష్టములైన పదాలు గోచరిస్తాయని అలాంటి శక్తి ఆత్మవిచారం వల్ల కలుగుతుందని రుద్రటుడు ఏనాడో చెప్పినా ఆ పాత చింతకాయ పచ్చడిని ఆధునికుడంగీకరించడు. ఇపుడు వాడికి కావల్సింది బహుమతులు- బహుమానాలు. సామాజిక గర్భంలో పనిచేస్తున్న అంతశ్శక్తులను ఆవిష్కరించటానికి ఒకే ఒక్క పదం ‘సామాజిక స్పృహ’ అని తేల్చిపారేశాడు. ఈ కవిని భరించటమే సామాజిక దుస్థితి.
ఉదయకిరణం గొంతు సవరించుకున్న కోకిలలైన కవులేరి? మంచుతెర తొలగించుకుని వెలుగు పులుగైన కుహూరుత కవులేరి? తెలుగు చెట్టుకొమ్మల గాలికి పదములుయ్యాల లూగుదారుల మూర్ఛనలు పోవు సంగతి కవులు యేరి? మనిషి జీవితంలోకి మానవతా వాల్లభ్యమెత్తిన మనసున్న కవులేరి? రాగవల్లికల వికసిత పుష్ప హృదయాల్లో వింజిల్క శబ్దముల నాటగల శక్తి కవులేరి? భావాలకు పరిమళ వర్ణాలు కళ్ళకు పరిసర దృశ్యాభిరామ కల్హరాలు కానుక పెట్టెగల కల్పనా మోహ వరిష్ట కవి రాజవర్యులేరి? చెట్లు కొమ్మ చేతులూపుతూ పిలిచినట్లు- ఆకాశం మత్తెక్కి ఒళ్లు విరుచుకున్నట్లు- పక్షులు దిగంతాల ఆవలి తీరాల్లో వసుధైక గీతాలెత్తుకున్నట్లు పద్యాలనాలపించే పరమహంసల్లాంటి కవులేరి..? అని ఎదురుచూచే మీకు కొత్త యేటి కలిమి ఎలా కలిసి వస్తుందో చూద్దాం.