సాహితి

భావజాల చిత్రణే ‘బేగరి కథలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భావజాలం అనేది మనస్తత్వం యొక్క విశాల పరిధి. సాంఘిక ఆచరణ ద్వారా ఇది వ్యక్తమవుతుంది. భావజాలం ఆధారంగానే వ్యక్తకి లేదా సంఘానికి అస్తిత్వం స్థిరపడుతుంది. పరిస్థితులు భావజాలాన్ని మార్చగలిగినట్టే, భావజాలం పరిస్థితులను మార్చగలుగుతుంది. రచన అనేది భావజాల వ్యాప్తికోసం రచయిత ఎన్నుకున్న సాటిలేని మాధ్యమం.
అనుభూతి కోసం, ఉల్లాసం కోసం చైతన్యం కోసం రచనలను చదువుతుంటారు పాఠకులు. తమ స్వభావాలను, సంఘర్షణలను ప్రతిబింబించే సంఘటనలు, సన్నివేశాలు మరియు పాత్రలు తారసపడినప్పుడు తాము శమ్య పడిన కోణాలను విడమరిచి చెప్పే శక్తి కూడా పాఠకులకు ఉంటుంది. ఈ శక్తే రచయిత ఆశించిన భావజాల వ్యాప్తిని మరింత వేగవంతం చేయగలదు. పాఠకుల వౌఖిక ప్రచార స్థాయిని పెద్దఎత్తున కూడగట్టుకున్న రచనే గొప్ప రచన కాగలదు. తన కాలంలోని వ్యవస్థీకృత సమస్యలను, రుగ్మతలను, అవరోధాలను, ఆధిపత్యాలను తడమడం ద్వారానో, చర్చించడం ద్వారానో మాత్రమే భావజాల వ్యాప్తి జరగగలదన్న సత్యం రచయితలకు తెలుసు. ఐతే తడమడం, చర్చించడం వేరువేరు అంశాలు. తడమడం అనేది విషయంయొక్క ఉపరితలాంశం. చర్చించడం అనేది విషయానుగతమైన తాత్త్విక రాజకీయ, సామాజిక దృక్కోణాలకు సంబంధించిన పునాది అవగాహన. చర్చించడం అనే సంవిధానం ద్వారా పాఠకులను ఇతివృత్తంలోకి ఆహ్వానించే పద్ధతిని ఇటీవలి కథకులు పరిపుష్టం చేస్తున్నారు. ఈ తరహా కథకుల్లో నల్లగొండ జిల్లాకు చెందిన భూతం ముత్యాలు ఒకరు. భూతం ముత్యాలు రాసిన ‘బేగరి కథలు’ సంపుటిని ‘గుంపు’ సాహితీ సంస్థ ప్రచురించింది. ఈ కథల్లో ముత్యాలే చెప్పినట్టు ‘‘2000 సంవత్సరంనుండి సమాజంలో వస్తున్న పరిణామాలు, ఆర్థిక అసమానతలు, గ్రామీణ నేపథ్యం, అణగారిన కులాలు, జీవన సమరంలో వారి ఆశలు ఆవిరి అవుతున్న తీరు, రిజర్వేషన్లు, పెద్దకులాలు మతమార్పిడితో దోచుకుంటున్న తీరు, గ్రామీణులపై గ్లోబల్ ప్రభావం, బతకనీకి దిగజారుతూ పై కులాల అవసరాల కోసం మారుతున్న తీరు’ను సమగ్రంగా చర్చించడం జరిగింది. నేను ఎక్కడ్నుంచి వచ్చానో అదే రాస్తాను, కల్పిత కథ రాయను అని గర్వంగా ప్రకటించుకునే భూతం ముత్యాలు వృత్తిరీత్యా గవర్నమెంటు టీచరు. మారుమూల మెట్ట ప్రాంతంలో దశాబ్దకాలంగా పనిచేస్తున్న ముత్యాలు తన జీవితంలోంచి జనజీవితాన్ని లోతుగా పరిశీలిస్తు వస్తున్నాడు. నిమ్న వర్గాల్లోంచి టీచర్లుగా మారిన వాళ్లకు గ్రామీణ వాతావరణంలో ఏయే ఒడిదొడుకులు, ఆత్మన్యూనత, అవమానాలు, సంఘర్షణ ఎదురవుతాయో వాటన్నింటినీ తనివితీరా అనుభవించాడు ముత్యాలు.
వర్ణనా భేషజాలకు పోకుండా దైనందిన వ్యవహారంలోని విషయ నిష్టమైన వాగ్వైఖరులను ముత్యాలు బేగరి కథల్లో వాడుకున్నాడు. నేర్పు, వైవిధ్యాల మేళవింపును ప్రదర్శించడం కంటే నిజాల్ని నిర్భయంగా చెప్పడానికే ఆసాంతం ప్రయత్నించాడు. అభివృద్ధి కులాలనుండి ఎదురయ్యే ముష్టును తిప్పికొడుతూ అగ్రవర్ణ ఆధికారులనుండి ప్రేరేపింపబడే గాయాల్లోంచి తనను తాను అప్రమత్తం చేసుకుంటూ ‘విన్నవానికన్న కన్నవాడధికుండు’ అన్నట్టుగా కంట చూసిన వాస్తవాలను కథలనిండా పదిలపరిచాడు ముత్యాలు. కల్పిత ఇతివృత్తాలకంటే యదార్థ సంఘటనల చిత్రణకే ప్రాధాన్యం ఇచ్చిన ఒక ప్రత్యేక శైలి బేగరి కథలను చదివించడమే కాదు, పాఠకులను ప్రత్యాచరణకై పురికొల్పుతుంది. నల్లగొండ గ్రామీణ మాండలికంలో నడుస్తూ సరళీకరణ అనంతర పరిస్థితులను దృశ్యమానం చేస్తూ సగటు వ్యక్తి ఆత్మిక ఆరాటాలకు అద్దం పడతాయి ఈ కథలు. మొదటి కథ ‘బతుకులాట’కు అవసరాలు మనుషుల్ని మారుస్తాయనేది ప్లాట్. ఏమాత్రం వృత్తి భద్రత లేని చిరుద్యోగం ‘విద్యావాలంటీరు’ కోసం -‘‘మోహన్‌రెడ్డికి బదులు మోహన్ అని ఉంది. కులం దగ్గర మున్నూరు కాపు అని రాసి ఉంది’’/కులాలు తారుమారు చేసి ఉద్యోగాలెక్కుతున్న మోసాన్ని ఈ కథ వివరిస్తుంది. ‘‘సూడు సారు మావోడు పది. కిరస్తాన వోళ్ల ఇస్కూళ్ల సద్వుతుండు. అప్పుడు తీస్కపోయిన సప్‌తికెట్‌ల మేము ‘హిందు’ అని రాసివుంది. దాన్ని గనక కొద్దిగా మార్సి కిరస్తానం అని గనుక మీరు రాస్తే మీ మేలు మరువలేము’’/-అనే చోట ఫీజు రాయితీ కోసం హిందూ క్రైస్తవాన్ని పుచ్చుకోవడాన్ని,/‘‘ఇదిగో చైర్మన్ నువ్వేనా అనె సారు. ఆ...నేనే ఇంటిదాకా వస్తిరి సారు. ఏం జెయ్యాలె మిమ్ముల ఎన్నిసార్లు పిల్సినా మీరు రారు. మాకు తప్పదాయె. అందుకే వస్తిగాని జర కాయితాలమీన సందకమైతే పెట్టు అన్నడు సార్. ఏంది సార్ ఇది అడిగె యాదయ్య. ఏముందయ్యా లక్ష వరాలేమి లేవుగాని నెల నెల మీటింగు అయినట్టు గంతె. ఓహ్ అట్లనా అయితే పెడతసారు. అన్కుంట సంతకం పెట్టిండు’’/-లో విద్యా కమిటీల్లోని లోప భూయిష్టతను, చర్మకార వృత్తి అనుబంధ శ్రమను మరొకరు కొల్లగొట్టే ‘తంగెడు పొట్టు’ సన్నివేశాన్ని ముత్యాలు చర్చిస్తూ వీరబ్రహ్మంగారి కాలజ్ఞానానికి అన్వయిస్తాడు. రెండో కథ ‘ఉసురు’లో ఇప్పటికీ అంతరించి పోని పటేండ్ల అరాచకాలు కథాంశం. పటేలు గ్రామరక్షకురాలు కావలి మార్తమ్మను లైంగికంగా వేధించడం, కొట్టడం, సాక్ష్యానికి ఎవరూ రాకపోవడం ‘సాక్ష్యం లేకుంటే మేమేం చేయలేమ’ని డిఎస్‌పి చెప్పడం, పటేలు కండకావరానికి అంతమెట్లా అని మార్తమ్మ ఆలోచన చేయడం కొండంత వాస్తవాన్ని నిగ్గు తేలుస్తుంది. గొల్లపెద్దులు భార్య లింగమ్మపై బత్తాయితోటలో పటేలు అత్యాచారానికి పాల్పడడం, గొల్లపెద్దులు చేతిలోని గొడ్డలి దెబ్బకు ‘పటేలు తల కొబ్బెరి బొచ్చెలా పాపిట్లకు రెండు ముక్కలు‘ కావడం, ఊరిపెద్దలు పోలీసులు చేయని సమ్మతి ఆ దేవుడు రూపంలో చేసినందుకు మార్తమ్మతోపాటు జనం సంబరపడ్డ తీరును ఈ కథ విశదీకరిస్తుంది. ‘పేగుపాశం’ కథలో తల్లిదండ్రుల బాధల్ని పట్టించుకోని కొడుకు వైమనస్యాన్ని వివరిస్తుంది. గ్రామీణ జీవితంలోంచి విద్య ఉద్యోగాల్లో చేరి కులీన వర్గ స్వభావాన్ని అతికించుకునే ఉద్యోగి నారాయణ అతని తల్లిదండ్రులు దుర్గమ్మ ఎట్టయ్య మధ్యన ఆసక్తికరంగా పరిస్థితులను చిత్రిక పడుతుంది/ ‘‘నారాయణ టికాన నల్లగొండకు మార్సిండు. అమ్మయ్యను మట్కు ఊళ్లనే ఉంచిండు. నెలకింద కర్సులకు పంపుతనని చెప్పి బిస్తర్‌గట్టిండు. ఆడ పులినిజూసి నక్కాత పెట్టుకున్నట్టు లేని గొప్పలకు పోయి అప్పుల పాలయిండు. అమ్మయ్య ఊసే మర్సిండు’’/-లో గ్లోబలీకరణ ప్రభావాన్ని కుటుంబ సంబంధాలమీద జరుగుతున్న దాడులను ముత్యాలు పేగుపాశం ఆధారంగా చర్చకు పెట్టాడు. ‘పచ్చనోటు’ కథలో అంగన్‌వాడీ టీచర్ కొలువుకోసం ఇద్దరు దళిత మహిళలు పోటీపడడం వస్తువు. ఉద్యోగ సాధనకోసం గ్రామ పటేలును ప్రాధేయపడడం, కమిటీ సభ్యులందరికీ పసిపిల్లల తల్లులకు లంచం ఇవ్వడం, మోసపోవడం, చివరకు గొల్ల రాములు యాక్సిడెంటులో మరణించినందుకు అతని భార్యకు ఆ పిండిబడి టీచరు పోస్టు ఇవ్వడం, ఈ క్రమంలో ప్రచ్ఛన్న నిరుద్యోగిత, గ్రామీణ పోటీతత్వాన్ని, ఒక వర్గం లోపల, ఒకే వర్గం లోపల వారైనప్పటికీ స్వార్థకాంక్ష మూలంగా విరోధులుగా మారే మనుషుల మనస్తత్వాన్ని ఈ కథ విపులంగా తర్కిస్తుంది. పనిలో పనిగా అంగన్‌వాడి కేంద్రాల్లో జరిగే అవకతవకలు అవినీతిని పాఠకుల ముందు పెట్టాడు. ఈ కథ చివర్లో గొల్ల రాములుకు యాక్సిడెంటు అయి మృతి చెందడం బాధపెట్టినా వర్గ శత్రువును వదిలి సుగుణమ్మ, పద్మలు తమను ఒకర్నొకరు ద్వేషించుకోవడం వెనకాల పటేలు పెట్టుబడిదారీతనపు ఆధిపత్యం పాఠకుల మనోపేటికలపై సమాంతర రాజకీయపు దుష్టత్వాన్ని బలపరుస్తుంది. పరోక్ష ఆధిపత్యం గ్రామీణ జీవితాన్ని బలిగొంటున్న వైనాన్ని ఈ కథ కళ్లకు కడుతుంది.
కృత్రిమ జీవన జాడల జీవితం కంటె భిన్నమైన స్వచ్ఛమైన జీవితం ఈ కథల్లో లభిస్తుంది. వచ్చిన మార్పులు, ప్రపంచంలో ఇక రానున్న మార్పులతో తమకు ఏమాత్రం సంబంధం లేకున్నా ఆ మార్పులు ఆ ఉప్పెన ప్రప్రథమంగా తమనెందుకు బలిగొంటున్నాయో కూడ అడగడానికి నోరులేని మారుమూల ప్రాంతాల మనుషుల తరఫున మామూలు మనుషుల తరఫున ఈ కథలు గట్టిగా మాట్లాడతాయి. గ్రామీణాంధ్రప్రదేశ్ పరిస్థితులను భావజాలాన్ని ప్రతిధ్వనించే ఈ తొమ్మిది కథలు చదివిన ఏ పాఠకుడూ వౌనంగా వుంటాడని అనుకోను. పాలకులు కాకుండా పాలనా నమూనా మారాలని మూగగా రోదించే ముత్యాలు గుంపులోకి తనతోపాటు కథాయిష్టులందర్నీ కలుపుకుపోతాడని ఓ పాఠకుడిగా నేను భావిస్తున్నాను.

- బెల్లి యాదయ్య, 9848048504