సాహితి

కథారాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ అంటే యేమిటి? దానికి ఎన్ని ముఖాలున్నాయి? ఈ విషయం అందరికీ తెలిసిందే. కథంటే జరుగుతున్న ప్రపంచంలో నడుస్తున్న చరిత్ర. ఎందరు మనుషులున్నారో అన్ని ముఖాలూ ఉన్నాయి కథకు. ఒక్కో ముఖం ఒక్కో క్షణంలో బహురూపాలు ధరిస్తూ ఉంటుంది. వీటన్నిటినీ విరామంగా అక్షరబద్ధం చేయడమే కథ చేసే పని.
మానవ జీవితానుభవాలను నాటకీయంగా చెప్పగలవాళ్లందరూ కథలు వ్రాయవచ్చును, కలరు కూడా. చెప్పడంలో నాణ్యత, నాజూకుతనం వుండాలి. కథలు యే భాషలోనయినా వ్రాయవచ్చును. ప్రతి దేశంలోనూ అనేక భాషలున్నాయి. వీటన్నిటిలోనూ కథలు వున్నాయి. ఒక భాషలోనుంచి మరో భాషలోనికి అనువాదం చేసుకునే ప్రక్రియ కూడా అనాదినుంచి వుండటం వల్లనే, ప్రపంచంలో యే దేశ ప్రజలయినా ఇతర దేశాల, భాషల కథలు - ఈ రోజున చదవగలుగుతున్నారు. తద్వారా ఆయా దేశాల ప్రజల సంస్కృతి వికాసాలను తెలుసుకోగలుగుతున్నారు.
జరుగుతున్న విషయం, తగిన వివరాలు కల్పించి, యదార్థ జీవితానికి దూరం పోకుండా వ్రాసేది కథ. దానికో అర్థం, అంతరార్థం, పరమార్థం వుండాలి. చొప్పదంటు సందర్భాలు కథలు కాలేవు. కథ జరుగుతున్నంత సేపూ, చదువుతున్నంత సేపూ, వింటున్నంత సేపూ ఆసక్తికరంగా వుండాలి. ముందు ముందు యేం జరుగుతుంది అన్న ఉత్సాహం మనసులో ఉబుకుతూ వుండాలి. విన్న తరువాత మనం జీవితాన్ని గురించి కొత్త విషయం యేదో తెలుసుకున్నాం అనే ఆలోచన మిగలాలి. జీవితం ఎంత ఆశ్చర్యకరం, అద్భుతకరం అయినది - అనే స్ఫురణ యేర్పడాలి. అంటే కథకు ముందుగా ఒక సందర్భం, ఒక దృక్పథం, మానవ స్వభావంలో ఒక మరుపు, పదాల కూర్పులో ఒక కొత్తదనం, పొందిక, భాష - శైలి వివరాలలో సరికొత్త స్పందన వుండాలి. వీటన్నిటినీ సమరసంగా సంయుక్తంగా నడిపించేదే కథ.
ప్రతి మనిషికీ కథ వుంటుంది. అతని స్నేహితులు, ఉద్యోగ వ్యవహారాలు, సంబంధ బాంధవ్యాలలో అరమరకలు, అభిప్రాయ వినియోగ సందర్భాలలో వచ్చే సంఘటనలు... ఇవన్నీ కథలు. ఆ మనిషి చెబుతున్న కథతో పాటు, ఆ కథలో ఇతర పాత్రలు దానిని గురించి చెబుతున్నప్పుడు వచ్చే విపర్యాయాలు - మరెన్నో కథలు అవుతాయి. ఒక్కో మనిషి తన కథ చెప్పే పద్ధతిలో తనదే అయిన ధోరణి, సరణి అవలంబించుతాడు.
ప్రేమ కథ, పిల్లల కథ, తెలిసీ తెలియని వాళ్ల కథలు యెన్ని రకాలుగానయినా వ్రాసుకోవచ్చును. జీవితాన్ని తరచి తరచి, విరిచి విరిచి చూపిన కొద్దీ, మనసులో తవ్విన కొద్దీ, ఎన్నయినా కొత్త కథలు బయలుదేరుతాయి. కథ ఒక నదీ ప్రవాహం వంటిది. రాగప్రస్తారం లాంటిది. దారిలో ఎన్నో వాగులను, స్వరాలను కలుపుకుంటూ ఎనె్నన్నో మెలికలు తిరుగుతుంది. చివరకు సముద్రంలో కలిసిపోతుంది. ‘నదీనాం సాగరో గతిః’ అని గదా సామెత. నదిలో వున్నదీ సముద్రంలో వున్నదీ ఒక నీటి బొట్టే, చుక్కే. ఆ చుక్కే ఎన్నో గీతలుగా మారి రకరకాల దృశ్యాలను మన ముందు ప్రదర్శిస్తోంది. సముద్రం అంటే చదివేవారి మనస్సు అనుకోవచ్చు. మానస సరోవరం అని దానికి పేరు పెట్టుకోవచ్చు. ఆ సరోవరానికి ఈ కథ ఎన్నో ప్రకంపనలు తీసుకువస్తుంది. గందరగోళాలు సృష్టిస్తుంది. ఒక్కోమారు సాదాసీదాగా నిద్రపుచ్చుతుంది.
కథ రాసేవాడి మనసులో వాస్తవ జీవితంలో జరిగే ప్రతి ‘కంపన’ అనుభవసారం, యితరులతో రుూ విషయం పంచుకుంటే బావుండును అనే ఉద్దేశ్యం తీసుకువస్తుంది. ప్రతిదీ ఒక కథగా, సరికొత్త కథగా రూపుదిద్దుకుంటుంది. ఈ అనుభవం ఎంత లోతుగా ప్రగాఢంగా అతని మనస్సుకు హత్తుకుపోయిందో అంతే ప్రమాణంలో కథకుడి నుంచి చదివేవాడికి సరఫరా అవుతుంది. రాసినవాడు, చదివేవాడు - ఒకే శృతిలో వున్నప్పుడు యిది తప్పకుండా జరిగే పని. సమశృతి లేనప్పుడు ‘అడవిలో కాసిన వెనె్నల’ లాంటి సందర్భం యేర్పడుతుంది.
జీవితంలో జరిగిన సంఘటనలు, ఎదురయిన సందర్భాలు - మనసులో గూడు కట్టుకు కూర్చుంటాయి. ఈ గూడు చెదిరి, గుడ్లు పొదిగి పిల్లలుగా, కథలుగా తయారుకావడానికి ఎన్నో సంవత్సరాల సమయం పట్టవచ్చును. ఒక్కోసారి గూడులోనే చితికిపోవచ్చును, బాగా పొదిగి సుందరంగా తయారయిన పిల్లలు చాలాకాలం చదువరులను అలరించి, వారి మనస్సులను పల్లవింపచేయవచ్చును.

ఫోన్ : 09444963584