సాహితి

నిరుపమాన ప్రతిభాశాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఈ దేశంలో భారతరత్నాలున్నాయ్. పద్మవిభూషణ్‌లూ, పద్మభూషణ్‌లూ, పద్మశ్రీలూ ఉన్నాయి. దేశం విడిచి పోతామని ఝడిపించిన వారికి భారత రత్నాలు ఇచ్చారు. కావల్సిన వారికి, కొద్దిమంది అర్హులకీ పద్మ అవార్డులందజేశారు. కొందరైతే పద్మశ్రీ అవార్డులు కొనుక్కున్నారట కూడా...’’
ఇలా నిక్కచ్చిగా మాట్లాడే ‘‘అభినవ భరతాచార్య’’ చాట్ల శ్రీరాములు. నాటకరంగ నిష్ణాతుడైన చాట్లవారికి అత్యంత సన్నిహితుడైన గొల్లపూడి మారుతీరావుగారి మాటల్లో చెప్పాలంటే- ‘‘చాట్ల ఉదారుడు, ఉదాత్తుడు. అపారమైన నాటకానుభవం కలవాడు. తన అభిప్రాయాల తలుపులను ఏనాడూ మూసుకోనివాడు. ఎన్నో ప్రభావాల, ధోరణుల, జీనియస్‌లకు రూపకల్పన చేసిన "Open minded ఛాంపియన్ చాట్ల’’. గత ఆరుపదుల తెలుగు నాటక రంగ పరిణామ వికాసాలకు, ఉత్థాన పతనాలకు నిలువెత్తు సాక్ష్యం చాట్ల శ్రీరాములు. చాట్ల ఆంగ్ల సాహిత్యాన్ని ముఖ్యంగా నాటక సాహిత్యాన్ని బాగా ఆకళించుకొన్నారు. నేను 2000 సంవత్సరంలో హైదరాబాద్‌కు రాగానే పరిచయమయ్యారు. అప్పుడు తెలిసింది ఎంత గొప్ప వ్యక్తిత్వం గలవారో, చిన్నవారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో ఎంత సౌజన్యమూర్తో లోపాలను చెప్పటంలో అంత మొహమాటం లేని మనిషి. ఓసారి నేను ‘ఇంటర్వ్యూ’ చేసినప్పుడు- ‘‘ఎంతసేపూ కన్యాశుల్కమే చెప్తారు. ఆ తరువాత నాటకాలు లేవా? మీవంటివారు ఉత్తమ నాటకాలను వెలుగులోకి తెచ్చి ప్రాచుర్యం కల్పించాలి’’ అన్నారు. చాట్లవారి ప్రయోగాలలోకెల్ల గొప్ప ప్రయోగం ‘మరో మొహెంజొదారో’. ఎన్.ఆర్.నంది రాసిన ఈ నాటకాన్ని రచయిత హృదయాన్ని ఆవిష్కరింపజేసే ప్రయత్నం చేశారు. ఇందులో ‘‘ఫ్రీజ్’’ పద్ధతిని ప్రవేశపెట్టారు. దీనికి మూలం ‘దెయ్యం’ నాటికను వేస్తున్నప్పుడు (చాట్లవారు దర్శకత్వం వహించిన ఈ నాటికలో గురువుగారు కె.వెంకటేశ్వరరావు నటించారు) మధ్యలో సినిమా నటులు రావడం, ప్రేక్షకుల గొడవ సహించలేకపోయారు. అప్పుడు ‘‘ఫ్రీజ్’’ అయిపోండి అని చాట్లవారు సహ నటులకి చెప్పారు. అప్పుడు వారి మెదడులో మరో మొహంజోదారోను కూడా అలావేస్తే సముచితంగా ఉంటుందనుకొన్నారు. చాట్లవారు నాటక రంగస్థల పండితులు. నటులు, బోధకులు, దర్శకులు. అంతేకాదు- విశిష్ట వ్యక్తిత్వంగలవారు. ఉద్యోగం తర్వాతే నాటక రంగానికి అంకితమై బోధనే శ్వాసగా జీవించారు. చాలామంది గొప్పవాళ్ళలాగా చాట్లకూడా కష్టాల పంకం నుంచి పుట్టిన కళాకమలం! ఈ భీష్మాచార్యుని నటప్రస్థానం గురించి వీరి శిష్యులు కందిమళ్ళ సాంబశివరావు గొప్ప పుస్తకం రాశారు. నేటి నటులకు, నటనా శిక్షణ కేంద్రాలకు ఇదొక పాఠ్యపుస్తకం! చాట్లవారికి నవ్యత, ప్రయోగం అనేవి రెండు కళ్ళు. ‘కీర్తి తామర’తో కొట్టుకుపోతూ, ‘నంది పిచ్చి’లో లీనమైపోతూ ‘మేమే’ అనుకొనేవారికి చాట్లవారి జీవితం కనువిప్పు కలిగిస్తుంది. 1931లో డిసెంబరులో విజయవాడలో జన్మించి డిసెంబరులోనే 85వ ఏట ‘కీర్తిశేషు’ లయ్యారు. 12వ ఏటనే రంగస్థల ప్రవేశం చేశారు. రైల్వే ఉద్యోగిగా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. 1970లో లండన్ వెళ్ళి మూడు సంవత్సరాలు దర్శకత్వంలో శిక్షణ పొందారు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలను సందర్శించి ఆధునిక నాటక పోకడల్ని బాగా పరిశీలించారు. వాటి నేపధ్యంతో తెలుగు నాటక, నాటికా ప్రదర్శనలకి నవ్యతను తీసుకువచ్చారు. ఇవాళ పెద్ద హీరోలనబడే వారిలో కొందరు చాట్ల దగ్గర అభినయం నేర్చుకొన్నవారే. అయితే గురువును మర్చిపోవటం తెలిసి కూడా చాట్లవారు ఎప్పుడూ పల్లెత్తు మాట అనకపోవటం చాట్లవారి సహనం, ఔదార్యం గుర్తుకు వస్తాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఉస్మానియా, తెలుగు విశ్వవిద్యాలయాల నాటక విభాగాలలో పనిచేసి కొత్తతరం నటీనటుల్ని రూపొందించిన నాటక శిల్పి చాట్ల శ్రీరాములు. తన గురించి కాకుండా రంగస్థలం గురించే తపించిన వ్యక్తి. ఒకసారి ఒక విషయంలో మా ఇద్దరి మధ్య పేచీ వచ్చింది. ప్రభుత్వం రంగస్థల దినోత్సవంగా కందుకూరి వారి జయంతిని జరపటాన్ని నేను వ్యతిరేకిస్తూ, తొలి నాటక రచయిత కోరాడ రామచంద్రశాస్ర్తీ జయంతినే నాటక దినోత్సవంగా జరుపుకోవటం సముచితమని పత్రికలలో వ్యాసాలు రాసాను. అప్పుడు చాట్ల నాకు ఫోనుచేసి ‘‘శాస్ర్తీగారూ మీరు మరీ ఈ అంశంపై గొడవ చేయకండి. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం చేశాం. ఏదో మొత్తంమీద ప్రభుత్వం ఒప్పుకొంది. మళ్ళీ రాద్ధాంతం చేస్తే ప్రభుత్వం ఏమీ చెయ్యదు. పెద్దవాడిగా నా మాట మన్నించి ఆ అంశం మర్చిపోండి. గాడ్ బ్లెస్ యు’’ అన్నారు. అది నాకు శిలాక్షరమైంది. వయసు పైబడినా ప్రకాశం పంతులు పాత్ర వేసి రక్తికట్టించారు. నాటక రంగ మేధావి అంటే చాట్ల శ్రీరాములే!
chitram..
చాట్ల శ్రీరాములు

- ద్వా.నా.శాస్ర్తీ, 9849293376