సాహితి

విప్లవ జ్యోతి వెలిగించిన తొలి అక్షర దివిటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనవరి 3న సావిత్రిబాయి ఫూలే
184వ జయంతి సందర్భంగా...

మహారాష్టల్రోని నాయగావ్ గ్రామంలో 1831 జనవరి మూడో తేదీన సావిత్రి బాయి ఫూలే జన్మించారు. 18 సంవత్సరాల వయస్సులోనే స్ర్తి విద్యకోసం తపించింది. అందుకు కావలసిన బీజాలు నాటారు. అనేక శతాబ్దాలుగా విద్యకు దూరమైన దళిత, పీడిత, ఆదివాసీ, స్ర్తి సమాజాన్ని మేల్కొలిపిన గొప్ప విదూషిరాలు సావిత్రి బాయి. సహజసిద్ధమైన నిస్వార్థ ప్రేమతో సమాజం పట్ల అంకిత భావంతో అహర్నిశలు కృషిచేశారు. అణగారిన వర్గాలకు ఆనాడే విద్యా హక్కుని అందించారు. కుట్రలు, కుతంత్రాలతో అధికారం చెలాయిస్తున్న అగ్రవర్ణాల వారికి కోలుకోలేని విధంగా బుద్ధిచెప్పారు.
ఈ దేశంలో ఏకలవ్యుడి బొటన వ్రేలును గురుదక్షిణగా అడిగిన గురువు ఉన్నాడు. ఆ గురువు పేరు మీద బహుమతులు ప్రదానం చేసే సంస్కృతి ఉంది. గొప్ప మేధావి అయిన శంబూకుడిని వధించిన సంప్రదాయం యింకా కొనసాగుతూనే ఉంది. శూద్రులు, అతి శూద్రులు, స్ర్తిలు చదువుకుంటే వారి చెవులలో సీసం పోయాలని ఆదేశించే ధర్మగ్రంథాలను ఇంకా పూజిస్తూనే, శ్లాఘిస్తూనే ఉన్నారు. స్ర్తికి స్వాతంత్య్రం అవసరం లేదని, వంటిల్లు కుందేలని, గొడ్డు ల్లాంటిదని, హద్దులు దాటొద్దని శాసించే కట్టుబాట్లు ఇంకా కరాళ నృత్యం చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి దేశంలో ఒక శతాబ్దం క్రితం ఒక శూద్ర సమాజానికి చెందిన స్ర్తి అనేక అవమానాలను, అవహేళనలను సహిస్తూ భరిస్తూ మూఢనమ్మకాలను, కట్టుబాట్లను ఎదురిస్తూ నిర్భయంగా ఇంటింటికి, వీధి వీధుల్లో తిరుగుతూ దళితులకు, స్ర్తిలకు చదువు చెప్పుతూ విద్యాజ్యోతిని వెలిగించడం భారతదేశంలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే విప్లవాత్మకమైన సంఘటన అనడంలో అతిశయోక్తి లేదు.
భారత సమాజం కుల ప్రధాన సమాజం. కులమయం ఇధం భారతం. పెద్ద పెద్ద పదవులు, హోదాలు పొందడం వెనకాల కులమే ముఖ్యం. శాస్త్ర, సాంకేతిక పరంగా ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ, రంగుల కలలు ఎన్ని చూపిస్తున్నప్పటికీ కులం ఆధారంగానే ప్రభుత్వాలు, వ్యవస్థలు నడుస్తున్నాయి. అలా లేకపోతే ఉపాధ్యాయ దినోత్సవం నేటికీ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు మీదే ఎందుకు జరుపుకోవలసి వస్తుంది? ఎలాంటి సౌకర్యాలు, చైతన్యం లేని సమయంలో దళితులు, పీడితులతో మమేకమై వారిలో విద్యాజ్యోతిని వెలిగించిన సావిత్రి బాయి పేరు మీద ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవడం లేదు? మార్చి ఎనిమిదో తేదీన ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎంతో ఆర్భాటంగా జరుపుతారు. సావిత్రిబాయి పేరు మీద మహిళా విముక్తి దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోలేకపోతున్నామో ఆలోచించాలి.
భారతదేశ చరిత్రలో సావిత్రిబాయి కేవలం ప్రథమ ఉపాధ్యాయురాలో లేదా ప్రధానాచార్యురాలో కాదు. మొత్తం సమాజానికి ఒక ఆదర్శం, ప్రేరణ, సంఘ సంస్కర్త, చైతన్యవంతురాలు, కవయిత్రి, దార్శనికురాలు. అన్నింటికీ మించి భారతదేశంలో స్ర్తి ఉద్యమాన్ని నడిపిన మొట్టమొదటి ఉద్యమకారిణి. ఎన్ని అడ్డంకులు, ఇబ్బందులు ఎదురైనా తాను ఎంచుకున్న మార్గాన్ని వదలలేదు. జీవిత భాగస్వామి అయిన గొప్ప స్వాప్నికుడు, దార్శనికుడు జ్యోతిరావ్ ఫూలేతో కలిసి ముందుకే అడుగు వేసింది. కాని ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. భౌతిక జరిగే దాడులను కూడ లెక్క చేయలేదు. ఆమె చేస్తున్న సామాజిక కార్యాలను సహించలేక ఒక వర్గానికి చెందిన వ్యక్తి ప్రతిరోజు ఆమెను వెంబడిస్తూ అవమానించేవాడు. ఒక రోజు అది శ్రుతిమించింది. వాడు సావిత్రిబాయి చేయి పట్టుకునే ప్రయత్నం చేశాడు. అంతే సావిత్రిబాయి వెనక్కి తిరిగి వాడి చెంప చెళ్ళుమనిపించింది. ఇక ఆ తరువాత వాడు మళ్ళీ ఎపుడు కనిపించలేదు. నిర్భయ లాంటి సంఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్న నేటి సమాజంలో సావిత్రిబాయి మొత్తం సమాజానికి ఒక దివిటి.
మూఢనమ్మకాలు, మూఢాచారాలు, సామాజిక కట్టుబాట్లు, అంటరానితనం, దళితులు, స్ర్తిల మీద మానసిక, శారీరక దాడులు పరాకాష్టకు చేరుకున్న సమయంలో సావిత్రి బాయి కారు చీకటిలో చిరుకాంతిలా వెలిశారు. సమాజంలో బాల్య వివాహాలు, సతీసహగమనం, అమ్మాయి పుట్టగానే చిదిమేయడం, విధవరాలిపట్ల అమానుషంగా ప్రవర్తించడం, బహుభార్యత్వం మొదలైన సామాజిక రుగ్మతలు తాండవ నృత్యం చేస్తున్న సమయంలో, బ్రాహ్మణ వాదం, కులతత్వం తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తున్న సమయంలో సావిత్రిబాయి, జ్యోతిరావ్ ఫూలేలు కాంతి పుంజంలా పనిచేశారు. శతాబ్దాలుగా నిష్క్రియత్వానికి లోనైనా సమాజంలో చైతన్యపు కెరటంలా పనిచేశారు. కేవలం మూడునాలుగు సంవత్సరాల కాలంలో (1848-52) పూణే తదితర ప్రాంతాలలో 18 స్కూళ్ళు తెరవడం సామాన్య విషయం కాదు.
సావిత్రి బాయి కేవలం విద్యారంగంలోనే కాదు సామాజిక రంగంలో ఎంతో కృషిచేశారు. సమాజంలో స్ర్తిల స్థితిగతులను చూసిన తరువాత వారి జీవితంలో మార్పు తీసుకురావాలనే దృఢ సంకల్పంతో 1852లో ‘మహిళా మండలి’ని స్థాపించారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా మరియు సమాజంలో స్ర్తిల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి అధ్యయనం చేసి మహిళలను జాగృతపరచిన చైతన్యవంతమైన సంస్థ మహిళా మండలి. హిందు సమాజంలో, భర్త చనిపోయాక స్ర్తిలు విధవలవుతారు. విధవలయిన స్ర్తిల జీవితాలు ఎంతో దుర్భరం. హిందూ సంప్రదాయాల ప్రకారం విధవలయిన స్ర్తిలు శిరోముండనం చేసుకోవాలి. స్ర్తిల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా శతాబ్దాలుగా చెలామణి అవుతున్న రివాజు. ఇప్పటికి ఈ రివాజును పాటించే కుటుంబాలు ఉన్నాయి. అయితే ఈ సంప్రదాయానికి వ్యతిరేకంగా సావిత్రిబాయి పెద్ద ఉద్యమానే్న నడిపారు. ఈ ఉద్యమం యొక్క ప్రత్యేకత ఏమిటంటే మంగలి వారితో కలిసి సావిత్రిబాయి ఉద్యమాన్ని నడిపారు. విధవలయిన స్ర్తిల శిరోముండనం చేయకూడదని మంగలివారితో ప్రతిజ్ఞ చేయించి ఉద్యమ స్ఫూర్తిని చూపారు. ఆ కాలంలో హిందు సమాజంలో ఇది చాల కలకలం రేపింది.
సమాజంలో అనేక విప్లవాత్మక మార్పులకు దోహదం చేసిన సావిత్రిబాయి ఫూలే 1897 మార్చి 10వ తేదీన అంతిమ శ్వాస విడిచారు. ఆమె చేసిన కార్యాలు, చూపిన మార్గం అనన్యమైంది. సావిత్రిబాయి ఫూలే నిజంగా గౌరవించబడాలంటే, రాబోయే తరాలకు ఆమె పోరాట స్ఫూర్తినందించాలంటే ఆమె పుట్టినరోజు జనవరి 3ను ఉపాధ్యాయ దినోత్సవంగా, చనిపోయిన రోజు మార్చి 10ని మహిళా విముక్తి దినోత్సవంగా అధికారికంగా జరుపుకోవాలి. చైతన్యంతో కూడి ఉన్న నేటి పౌర సమాజంలో ఇది పెద్ద కష్టమైన పనికాదు. ఇందుకోసం దళితులు, బహుజనులు, స్ర్తిలు ఏక కంఠంతో ప్రభుత్వంమీద ఒత్తిడి తీసుకురావాలి. ఆమె సాహిత్యాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి.

- ఆచార్య వి.కృష్ణ, 9848603071