సాహితి

అమృత కవిత కురిపించిన అమరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనవరి 12న అలిశెట్టి ఫ్రభాకర్ వర్ధంతి.. జయంతి
.......................

గ్రాఫ్ పేపర్‌మీద జీవితాన్ని చిత్రించినవాడు అలిశెట్టి ప్రభాకర్ (12-1-1954 - 12-1-1993). తెరవెనుక పొంచి వున్న మృత్యువును ఫోటో తీసిననాడు ప్రభాకర్. ఒక్క క్షణానికి కూడా విరామమివ్వక కాలాన్ని కవిత్వీకరించినవాడు ప్రభాకర్. అతనికి లోకం తెలుసు. లౌక్యం తెలియదు. అతనికి కళ తెలుసు. కళను అమ్ముకోవటం తెలియదు. సమాజ రోగాలకు మందు తెలుసు. తన జబ్బును నయం చేసుకోవటమే తెలియదు. భార్యాబిడ్డలకు అపారమైన ప్రేమనిధిని ఇచ్చిపోయినవాడు. స్నేహితులకు అపూర్వమైన స్నేహరాశిని పంచిచ్చినవాడు. పాఠకులకు అమూల్యమైన కవిత్వాన్ని రాసిచ్చినవాడు ప్రభాకర్. అందరినీ ప్రేమించినట్లే జాన్‌కీట్స్‌లాగా తనలోని క్షయను కూడా ప్రేమించాడా అనిపిస్తుంది!
మనిషి మనిషిని మోసం చేస్తాడు. రోగం నిర్వీర్యం చేస్తుంది. ఒక ప్రమాదం క్రుంగదీస్తుంది. ఇవన్నీ జీవితం తీసిన దెబ్బలుగానే చిత్రితమవుతాయి. వీటన్నింటినుంచి కోలుకునే శక్తి మనిషికి వుంది.
‘‘గుండె నిండా బాధ
కళ్ళనిండా కన్నీళ్ళున్నప్పుడు
మాట పెగలదు
కొంత సమయం కావాలి’’
అంటున్నాడు, ప్రభాకర్. పరిణతి వున్ననాడే ఈ అవగాహనకు రాగలడు. ప్రభాకర్ జీవితంలో చేసిన సంభాషణే అతని కవిత్వం. ప్రభాకర్ సాహిత్య రంగంలోకి ప్రవేశించింది 1974లో. ఎర్రపావురాలు (1978), మంటల జెండాలు, చురకాలు (1979), రక్తరేఖ (1985), ఎన్నికల ఎండమావి (1989) సంక్షోభ గీతం (1990), సిటీలైఫ్ (1992) అచ్చయిన కవిత్వ సంకలనాలు. ఇప్పుడీ ‘అలిశెట్టి ప్రభాకర్ కవిత’ పేరుతో సమగ్ర సంకలనం వెలువడింది.
‘చంద్రుని కాల్చేస్తా’ అనే కవిత చూడండి. శతాబ్దాలుగా కవులు సౌందర్యానికి చిరునామాగా ఆరాధిస్తున్న ‘వెనె్నల’ ప్రభాకర్‌ను ‘రొచ్చుగుంట’గా, చంద్రుడు ‘చచ్చిన కప్ప వెల్లకిలా’ పడ్డట్టుగా కనిపిస్తున్నాడు. అంటే కవిగా కాల్పనిక సౌందర్య భావనకు దూరంగా జరుగుతున్నాడు. 1939లో ‘్ఫడేల్ రాగాల డజన్’లో-
‘తగిలించబడి యున్నది జాబిల్లి
చయినా బజారు గగనములోన, పయిన
అనవసరంగా అఘోరంగా’
అంటూ పఠాభి ఒక నగర కవిగా చంద్రుణ్ణి యాంత్రిక వాతావరణం నడుమ చూసి, చూపించాడు. ఇక్కడ ప్రభాకర్ సూర్యుణ్ణి చైతన్య ప్రతీకగా, శక్తిదాతగా ప్రదర్శించటం ద్వారా వైరుధ్య శిల్ప మార్గంలో ఒకడుగు ముందుకు వేశాడు.
ప్రభాకర్‌కు సూర్యుడు బాగా ఇష్టమైన ఇమేజ్. సంక్షోభ గీతం (1999) సంపుటిలోని ‘సూర్యుడే నా ముఖ చిత్రం’ అన్న కవిత చూసినా ఇది మనకు అర్థమవుతుంది. అందుకే కవితల్లో సూర్యరశ్మిలాంటి స్పష్టత, స్వచ్ఛత కనిపిస్తాయి. వీటిని ‘ప్రిజమ్’ ద్వారా పంపిస్తే రంగు రంగుల హరివిల్లులు కనిపిస్తాయి.
‘సిటీ లైఫ్’ 1992లో పుస్తక రూపంలో వచ్చింది. ఈ మినీ కవితలు ఆరు సంవత్సరాలపాటు ఒక దినపత్రికలో ధారావాహికంగా వచ్చాయి. ఈ కవిత్వానికి చాలా పెద్ద పెద్ద వాళ్ళే దాసోహమన్నారు. దీంతో మినీ కవితకు గ్రామరు, గ్లామరు ఏర్పడ్డాయి. అవన్నీ వెంటాడే కవితలు. ఈ చిన్నపాదాలలో వ్యక్తమయిన కవి అవగాహన ముందు దొరికిపోయిన దొంగలాగా జీవితం ముఖం చాటేస్తుంది.
‘‘నగరాల్లో
అత్యధికంగా / అత్యద్భుతంగా
అస్థిపంజరాల్ని
చెక్కే / ఉలి
ఆకలి’’
అంటాడు. పైకి ఖరీదైన వాహనాలతో కనిపించే నగరం రోడ్ల కింద డ్రైనేజీ మురుగు పారుతున్నట్టు దారిద్య్రం! అందుకే ఎంతో కొంత కండగల దేహాలతో వచ్చిన శ్రామికులను నగరాల ఆకలి కార్చిచ్చు బలి తీసుకుంటుంది. ఉలి రాతిని చెక్కితే ఆకారం పుట్టుకొస్తుంది. ఆకలి ఉలి చెక్కితే ప్రాణి అస్థిపంజరంగా మిగిలిపోతుంది. సౌందర్యాన్ని భగ్నపరిచే విలోమ భావుకతను అదీ 30 అక్షరాలలోపు కవితలో ప్రకటించటం తెలుగు సాహిత్యంలో లేదు. ప్రపంచ సాహిత్యంలో అరుదు.
మినీ కవితకు ఇనే్న పాదాలుండాలని నిర్దేశించటం ఛందస్సు వైపు తిరోగమించటమే. ఈ అవగాహన వున్నవాడు కావటంవల్ల ప్రభాకర్ తన వస్తువుకు అనుగుణంగా భావాన్ని వ్యక్తీకరించటానికి రెండు పాదాల నుంచి పది పనె్నండు పాదాల దాకా మినీ కవితను రాస్తూపోయాడు.
ప్రభాకర్ రాసిన ‘చురకలు’ (1974) రెండు పాదాలమీద సాహిత్యంలోకి నడిచి వచ్చినవే. కవితా ప్రక్రియ పొట్టిదవుతున్నకొద్దీ సాంద్రతరం కావాలె. అప్పుడే అది రాణిస్తుంది. ఇందుకు సామర్థ్యంతో పాటు సాధన కూడా అవసరమే.
ఈ ప్రమాణాల రీత్యా చురకులను ప్రభాకర్ తన తర్వాతి కవులకు మాదిరిగా వదలిపోయాడు. కాని ఈ వారసత్వాన్ని అందుకున్నవాళ్ళెవరూ కనిపించలేదు.
తిలక్ తర్వాత అంత కవితాత్మకంగా, శక్తిమంతంగా వచన కవితను రాసినవాడు ప్రభాకర్ ఇందుకు ‘మరణం నా చివరి చరణం కాదు’ అన్న కవితే తిరుగులేని ఉదాహరణ.
ఈ కవిత ప్రభాకర్‌కు భాషమీద, భావనమీద, అభివ్యక్తిమీద వున్న పట్టును తెలియజేస్తుంది. నిజానికది ప్రాణమూలాల అక్షర తూణీరం నుంచి దూసుకొచ్చిన బాణాల పరంపర.
శ్రీశ్రీ తర్వాత అత్యధికంగా కోట్ అయిన కవితా కోటి ప్రభాకర్‌దే అంటున్నారు విమర్శకులు. ఇది అక్షరసత్యం. ఎన్ని వచన కవితలు రాసినా చిన్న కవితకు చిరునామాగా నాడూ, నేడూ నిలిచినవాడు అలిశెట్టి ప్రభాకరే.
రక్తమంత చిక్కగా, కన్నీళ్ళంత నిజాయితీగా వుండే కవిత్వంతోపాటు, కాలంతోపాటు పెరిగే జీవన విలువలను మనకు తన వారసత్వంగా ఇచ్చిపోయాడు ప్రభాకర్. అతని జీవితమూ సాహిత్యమూ అద్వైతసిద్ధిని పొందాయి. అందుకే ఆయన జయంతి, వర్థంతి ఒక్కరోజే కావటం యాదృచ్ఛికం కాదు.

- అమ్మంగి వేణుగోపాల్, 9441054637