సాహితి

మాయమైన ‘మెరుపు పువ్వు’ ( అద్దేపల్లి రామమోహనరావు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జననం: 6-9-1936 మరణం: 13-1-2016

1972 ప్రాంతంలో అమలాపురంలో పెద్ద బహిరంగ సభ జరుగుతోంది. జ్వాలాముఖి గంభీరంగా ఉపన్యాసమిచ్చారు. ఆ వెంటనే - ‘‘ఏం చెయ్యాలేంచెయ్యాలి / ఇందిరమ్మకు భజన చెయ్యాలి’’ - అంటూ ఒక ఉద్రేకపూరితమైన పాట పాడి అందరి చేత పాడించారు. అప్పుడు తెలిసింది ఆ పాట పాడిన వారు అద్దేపల్లి రామమోహనరావు అని! అప్పటి పరిచయం నిన్న మొన్న శ్వాస వీడే వరకు కొనసాగుతూనే వచ్చింది. పరిచయం కావడం గొప్పకాదు- ఆ పరిచయం కలకాలం నిలవటం గొప్ప. ఒకడు కవి కావచ్చు. విమర్శకుడు కాలేడు. విమర్శకుడు కావచ్చు, వక్త కాలేడు. ఇన్నీ కావచ్చు కానీ ‘అందరివాడు’ కావటం చాలా అరుదు. ఇటువంటి అరుదైన అక్షర సేద్యగాడు అద్దేపల్లి రామమోహనరావు. ‘‘నాకు కవిత్వం వారసత్వంగా రాలేదు. బహుశః కవిత్వం వలన నేను పొందిన అనుభూతి మాత్రమే నన్ను కవిగా మలిచి ఉంటుంది’’ అన్న విశిష్ట కవి అద్దేపల్లి. తన గురువైన టి.ఎల్.కాంతారావుకి నమస్కందంగా నిలబడ్డాడు. శ్రీశ్రీ, దేవులపల్లి ప్రభావంనుంచి బయటపడ్డట్టే, అద్దేపల్లి విశ్వనాధ వలయంనుంచి బయటపడ్డాడు. పద్యరచనలో ఆరితేరాడు అనటానికి ‘మధుజ్వాల’ కావ్యం సాక్ష్యం.
అద్దేపల్లి పద్యకవిగా స్థిరపడి ఉంటే మంచి పేరు వచ్చేది కానీ ఇప్పుడు వచ్చినంత ప్రాచుర్యం వచ్చి ఉండేది కాదు. అలాగని పద్యవిరోధి కానేకాదు. తనని తాను పుటం పెట్టుకుంటూ సామాజిక ప్రగతికి నిబద్ధుడుగా మారాడు. కుందుర్తి సాహచర్యంతో వచన కవిత్వాన్ని అందిపుచ్చుకున్నాడు. ఇతని ‘అంతర్ జ్వాల’ అభ్యుదయ నేపథ్యంగా వెలువడితే ‘రక్తసంధ్య’ విప్లవ నేపథ్యంతో వెలువడింది. ఏ ముద్రకీ లొంగకుండా అన్నిటినీ రాజముద్రలుగా చేసుకున్నాడు. ‘‘మనిషినీ అగ్గిపుల్లని / ఏ రోడ్డు మీద గీసినా భగ్గుమని మండే / సమాజ బాధామయ వాతావరణం’’ అంటాడు తొలి కవితా సంపుటిలోనే!
అద్దేపల్లి ఎంతటి సామాజిక చైతన్యం కలవాడో మచ్చుకి చూడండి- ‘‘దేశ భవిష్యత్తు నా ముందు / భూతంవలె జడలు విరబోసుకుని నర్తిస్తున్నది / భవిష్యదగాధాలలో తలపగిలిన / మనిషి వేసే జాలికేక నా గుండెను పిండి వేస్తున్నది’’
‘‘లేచిపోయిన ఆడది / తన కులంవాడితో లేచిపోలేదని / కుమిలి కుమిలి ఈ దేశపౌరుడు ఏడుస్తున్నాడు’’
మినీ కవిత్వం ఒక ఉద్యమస్థాయిలో వచ్చినప్పుడు దానికి సారధ్యం వహించి కవితారంగాన్ని ఉత్తేజపరిచాడు. విమర్శలను తట్టుకొని మినీ కవిత అవసరమని, ఇదొక వన రాపమనీ చాటాడు. అంత మాత్రాన వచన కవిత, దీర్ఘ కవితలు వద్దనలేదు. తాను వచన కవితా సంపుటాలు రాస్తూ, ‘మెరుపు పువ్వు’ దీర్ఘ కావ్యం రాస్తూ, గజళ్లు రాస్తూ పాడుతూ, పాటలు వెలువరిస్తూ మినీ కవిత్వం సమకాలీనమైన, గాఢమైన కవితా రూపమని ప్రచారం చేసాడు. అద్దేపల్లి అనగానే ‘గోదావరి నా ప్రతిబింబం’ అనే కవితా సంపుటి గుర్తుకువస్తుంది. ఆ వెంటనే - ‘రాజమండ్రిలో / గోదావరి నది ఒడ్డున నిలబడి / నీళ్లలోకి తొంగి చూస్తే / నా ముఖం కనిపించదు/ వీరేశలింగం గారి ముఖం కనిపిస్తుంది’’ - అనే పంక్తులు గుర్తుకువస్తాయి. ఇది ‘కోటబుల్ కోట్’గా వ్యాప్తికెక్కింది. ‘‘కవిత్వం రాసిన క్షణాలు మాత్రమే నీవి’’ ‘‘ఏదైనా స్పాంటేనియస్‌గా రావాలి’’ వంటి సూక్తులు అతని కవిత్వంలో కనబడతాయి. అద్దేపల్లి కవితాశిల్పానికి, భావ నైశిత్యానికి, గుండె చప్పుడుకి నిదర్శనాలు ఈ పంక్తులు- ‘‘కవిత్వాన్ని మాత్రమే ప్రేమించినప్పుడు / గోదావరి నన్నయ పద్యాల్లా / శ్రీనాథుడి సీసాల్లా కనబడింది. ఇప్పుడు జీవితాన్ని కూడా అర్థం చేసుకున్నప్పుడు / దోవ పొడుగునా పోరాటాల్ని మోసుకుపోతున్న / పరమాణు ప్రవాహంగా కనిపిస్తోంది. ప్రపంచీకరణ విధ్వంసంపై అభ్యుదయ విప్లవ, స్ర్తివాదులు చర్చలు చేసారు. వ్యాసాలు రాసారు. అప్పుడప్పుడు కవితలు, కథలు వచ్చాయి. అద్దేపల్లి ప్రపంచీకరణపై ధ్వజమెత్తుతూ ‘పొగచూరిన ఆకాశం’ అనే తొలి కవితా సంపుటిని వెలువరించి తన ప్రగతిశీలత్వాన్ని వెల్లడించాడు. అద్దేపల్లి ప్రస్థానం కవిత్వంతోనే కాదు విమర్శతోనూ సాగింది. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ 1960 ప్రాంతంలో ప్రసిద్ధికెక్కింది. అందరూ చదువుతున్నారు. కానీ అందులోని కవితలకి సరైన అర్ధాలు చెప్పలేకపోతున్నారు. అద్దేపల్లి ముప్పయ్యేళ్ల వయసులోనే మహాప్రస్థానంపై విమర్శ గ్రంథం మొట్టమొదటగా రాశాడు. శ్రీశ్రీ ఈ పుస్తకం వస్తుందని తెలిసి ఎగిరి గంతేశాడు. రాచమల్లు రామచంద్రారెడ్డి (రా.రా) దీనిని ఖండిస్తూ వ్యాసాలు రాశాడు. చర్చలు జరిగాయి. అద్దేపల్లి పుస్తకం ఇటీవల మళ్లీ అచ్చయింది. మహాప్రస్థానంలోని గేయాలకు అద్దేపల్లి వ్యాఖ్యానం సమంజసమని తెలుసుకుంటాం. సంప్రదాయ అలంకారిక సూత్రాలు తెలిస్తేనే మహాప్రస్థానం తెలుస్తుందన్న అద్దేపల్లితో ఏకీభవిస్తాం. యువభారతికి తిలక్ కవిత్వంపై లఘు వ్యాఖ్యనిచ్చారు. కృష్ణశాస్ర్తీని కొత్త కోణంలో పరిశీలించాడు. స్ర్తివాదంలోని మంచీ చెడు రెండింటినీ సంయమనంతో బేరీజు వేశాడు.
మచిలీపట్నం, నందిగామ కళాశాలల్లో అధ్యాపకుడుగా పనిచేసి కాకినాడ వచ్చి ఎంఎస్‌ఎన్ చారిటీస్ కళాశాలలో స్థిరపడ్డాడు. ‘తెలుగు క్లాస్’కి గ్లామర్ తీసుకువచ్చాడు. సాహిత్యాభిమానుల్ని తయారుచేశాడు. కాకినాడలో సాహిత్యానికి మరో పేరయ్యాడు. ఆలస్యంగానైనా ‘అభ్యుదయ విప్లవ కవిత్వాల్లో వస్తువు-శిల్పం’ మంచి సిద్ధాంత వ్యాసం రాశాడు. ఉద్యమ కవిత్వంలో శిల్పం ఉండదన్న వాళ్ల కళ్లు తెరిపిస్తుందీ పుస్తకం. ఇలా రాసుకుంటూ ఉంటే ఎన్నో పుస్తకాలు రాసి ఉండేవాడే. కానీ అతని హృదయంలోని మరో కోణం ఉండనివ్వలేదు. ఎవరు పిలిచినా, రానుపోను ఖర్చులు ఇవ్వకున్నా సాహిత్య సభలకు వెళ్లడం ఒక సేవగా భావించాడు. కొత్త తరాన్ని రూపొందించాలి. ప్రోత్సహించాలి-అనుకుని ఎందర్నో అక్కున చేర్చుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలలో అద్దేపల్లి అభిమానులు, వారసులు వేలమంది ఉన్నారు. అతను తిరగని ప్రదేశం ఉండదు, ‘సంచార కవితా సారధి’ అనేవారు, ‘సాహితీ విహారి’ అనేవారు. ఎప్పుడూ పదిమంది కవులూ, కవయిత్రులూ తన చుట్టు లేనిదే దిగులు చెందేవాడు. సాహిత్య చర్చలతో అర్ధరాత్రి దాటినా విసుగు కనిపించేది కాదు. ఒకనాడు కవిత్వ వ్యాప్తికి శివశంకరశాస్ర్తీ, కుందుర్తి, శివారెడ్డి ఎలా శ్రమపడేవారో అద్దేపల్లీ అంతే! చివర్లో భార్యకి సేవ చేయడం కోసం రాత పని తగ్గించాడు. మొహమాటానికి పోయి కొంతమందిని అతిగా ప్రోత్సహించిన సన్నివేశాలు ఉన్నాయి. అదేమంటే ఏదో ఒకటి రాస్తున్నా గదా అనేవాడు తప్ప పేచీ పెట్టుకోలేదు. కుహనా రాజకీయాలన్నా, ఉద్యమాల పేరుతో పదవులూ, పురస్కారాలు పొందేవారన్నా ఈసడించుకునేవాడు. వందల వందల కవుల్ని తయారుచేసినా అద్దేపల్లి జీవితమే ఒక సాహిత్యోద్యమం. ఇంట్లో పిల్లలతో చాలా స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేవాడు. పిల్లల మీదగానీ, భార్యమీద కానీ కోపించడం ఎరుగని వాడు. తన కుమారుడు విప్లవాభిమాని అయినా, మంచి కవి అయినా సంతోషించాడు తప్ప జోక్యం చేసుకోలేదు. ‘మా నాన్న మమ్మల్ని తిట్టడం ఎప్పుడూ లేదు’ అని పిల్లలనడం అద్దేపల్లి తండ్రిగా కూడా విజయుడనడమే!
‘‘నాకు కవిత్వం నేను పీల్చే ఊపిరి / నా బ్రతుకులోని పోరాటం’’ అన్న అసలైన నిబద్ధ కవి!!

- ద్వా.నా.శాస్ర్తీ, 9849293376