సాహితి

సాహిత్యం ప్రజల్ని చైతన్యపరచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతికేండ్ల క్రితం ప్రారంభమైన
సరళీకృత ఆర్థిక విధానాల
దుష్ప్రభావం సమాజంలోని
అన్నివర్గాల ప్రజల మీద పడింది.
ఆ దిశగా రచయితలు దృష్టి
సారించాలి. సినిమా రచయితలు కూడా వీటిని విస్మరించకుండా ఉంటే మంచిది.

‘‘పత్రికల్లో ప్రత్యేకమైన, అసాధారణమైన మనుషుల గురించి చదవడానికి అలవాటుపడ్డాం. మరి సాధారణమైన మనిషి జీవితాల్లో కనిపించే మానవత్వం, సజీవ సంబంధాలు, సాహసకృత్యాలు అద్భుతంగా ఉంటాయి. వారి దైనందిన జీవితమే ఒక సాహస క్రీడ’’అని భారతీయ ప్రముఖ చిత్రకారుడు భూపేన్ కకర్ అంటారు. సాధారణ మనిషి జీవితం నేడు అత్యంత దుర్భర స్థితిలోకి నెట్టబడింది. కనీస అవసరాలు తీర్చుకోలేని దయనీయ స్థితిలో సామాన్య ప్రజానీకం అతలాకుతలం అవుతోంది. దేశ సంపద పెరిగిందని గారడీ (కథలు) లెక్కలు చెపుతున్నారు పాలకులు. ఆ సంపద ఏ కొద్ది మంది చేతుల్లోనే ఉంటుంది. వేళ్ళమీద లెక్కించగలిగేవారు అపర కోటీశ్వరులుగా మారుతుంటే, దేశ అత్యధిక జనం రెండో పూటకు తిండికోసం అలమటించాల్సిన దుస్థితి నేటికీ మన దేశంలో ఉంది. అరిస్టాటిల్ మహాశయుడు చెప్పినట్లు కేవలం సంపదలో పెరుగుదల మాత్రమే అభివృద్ధికి సూచిక కాదు కదా!
ప్రపంచీకరణ ప్రవాహవేగంలో సేద్యంచేస్తున్న రైతు, కార్ఖానాలో పనిచేసే కార్మికుడు, క్లాసు రూములో బోధిస్తున్న ఉపాధ్యాయుడు, రవాణా రంగంలో, గనిలో నిత్యం అత్యంత ప్రమాదాల మధ్య పనిచేస్తున్న కార్మికులు, అసంఘటిత కార్మిక వర్గం ఎవరూ సంతోషంగా లేరు. పాలకులు తెస్తున్న విధానాలు జనసామాన్యాన్ని నిలకడగా ఉండనివ్వటం లేదు సరికదా. బతుకు నిత్యపోరాటంగా మారుతోంది. కార్పొరేట్ శక్తులకు ధనాన్ని సమకూర్చే యంత్రాలుగా దేశ శ్రామికవర్గాన్ని మార్చుతున్నాయి
ఇప్పుడిక మనం ప్రముఖ నాటక విమర్శకుడు కె.కృష్ణారావు మాటల్ని గుర్తుచేసుకుందాం. ‘‘మనిషి రెండు ప్రపంచాల్లో జీవిస్తాడు. తన జీవన యానానికి అవసరమైన అన్ని వస్తుసేవలు పొందే భౌతిక ప్రపంచం- స్థూల ప్రపంచం. ఇక మహేంద్రజాలం సృష్టించే మనస్సు అంతఃప్రపంచం- సూక్ష్మ ప్రపంచం. ఆ మనస్సు ఆకలి తీర్చేది అనుభూతి, రసానుభూతి.. అది కళద్వారానే సిద్ధిస్తుంది’’ అంటారు. స్థూల ప్రపంచంలో మనిషి తన జీవన యానానికి అవసరమైన వస్తుసేవల్ని పొందాలంటే మార్గం ఉపాధి. దీనిని ఇప్పుడు ఈ దేశంలో కారుచౌకగా మార్చే ప్రయత్నాలకు ప్రభుత్వాలు పూనుకున్నాయ. పరిశ్రమలు, ప్రాజెక్టుల పేరుతో రైతులను నిర్వాసితులుగా మార్చుతున్నాయ. చేనేత లాంటి చేతివృత్తుల వారికి ప్రోత్సాహకాలు ఇవ్వకుండా రోడ్డున పడేస్తున్నాయ. పోడు వ్యవసాయం చేసుకుని బతికే గిరిజనులను అక్కడినుండి బయటకు వెళ్ళగొడుతున్నాయ. దేశంలోని సంఘటిత కార్మిక వర్గం కూడా ఉపాధిని కోల్పోయే చర్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి. శాశ్వత ఉద్యోగులను తొలగించి కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య పెంచాలని పాతికేళ్ల క్రితం ప్రపంచ బ్యాంక్ చేసిన సూచనలకు ఇప్పుడు మరింత ఊపు పెరిగింది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దేశంలోని రక్షణ రంగం కూడా మినహాయింపు కాకుండా ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడుతున్నాయి. మతోన్మాద శక్తులు మనిషిని మనిషిగా బతకనివ్వని చర్యలకు పూనుకుంటున్నాయి. ఇదీ నేటి భారతీయ భౌతిక ప్రపంచం.
మానవ సంబంధాల గురించి దృశ్యకావ్యంగా మలచిన సినిమాలు రాకపోలేదు. జన సామాన్యం ఎదుర్కొంటున్న సమస్యల్ని విస్మరించకుండా మంచి కథలతో సినిమాలు రాకుండా లేదు, కానీ వాటి సంఖ్య చాలా స్వల్పం. గారడీ కథలు, ప్రేమ వియోగ కథలు, భూత, ప్రేత కథలు ఇప్పుడు సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
రచయితలు రాయడం తగ్గింది, చదివే పాఠకుల సంఖ్యా తగ్గింది, ఇది కాదనని సత్యం. సి.నా.రె. అన్నట్లు ‘‘బుక్ కల్చర్ తగ్గింది- లుక్ కల్చర్ పెరిగింది.’’
మనకు అద్భుతమైన కథలు, నవలలు ఉన్నాయి, అవి సినిమాలుగా మల్చబడితే బావుంటుంది. కథల కొరత ఉంది అంటూ సినిమావాళ్ళు తరచుగా ఇచ్చే ప్రకటనల్లో ఏమాత్రం వాస్తవంలేదు. పాతికేండ్ల క్రితం ప్రారంభమైన సరళీకృత ఆర్థిక విధానాల దుష్ప్రభావం సమాజంలోని అన్నివర్గాల ప్రజల మీద పడింది. ఆ దిశగా రచయితలు దృష్టిసారించాలి. సినిమా రచయితలు కూడా వీటిని విస్మరించకుండా ఉంటే మంచిది.
ప్రేక్షకులు ఆదరించరు అన్న విషయం తప్పు అని మరోమారు ‘‘చౌథీకూత్’’పంజాబీ చిత్రంతో రుజువయ్యింది. అత్యంత తక్కువ ఖర్చుతో నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. ఈ సినిమాకు సాహిత్యంతో సంబంధం ఉంది. సాహిత్య అకాడెమీ అవార్డుగ్రహీత వర్మమ్‌సింగ్ సింధు రాసిన ‘‘చౌథీకూత్’’ ‘‘హుమై ఠీక్ ఠాక్ హా’’ అన్న కథల ఆధారంగా దర్శకుడు గుర్విందర్‌సింగ్ స్క్రిప్టును మల్చుకున్నాడు. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం సిక్కులపై జరిగిన అమానుష ఘటనలకు ఇది దృశ్యరూపం.
ఒడిషాలోని జాజ్‌పూర్ జిల్లాలోని కళింగనగర్‌లో ఆదివాసీలపై పోలీసుల పాశవిక కాల్పులతో 2006 సంవత్సరం ప్రారంభమైంది. ఆ కాల్పుల్లో 16మంది గిరిజనులు నేలరాలారు. తరతరాలుగా తాము నమ్ముకున్న భూముల్లో టాటా ఉక్కు కర్మాగారం రావడాన్ని వారు వ్యతిరేకిస్తూ పోరాటం చేశారు. దాదాపుగా దేశంలోని లక్షలాది మంది ఆదివాసీల పరిస్థితి ఇంతే ఉంది. ఇదికాదా ఇతివృత్తం?
రాష్ట్రంలో నేడు లక్షల ఎకరాల భూముల్ని రైతులనుండి ప్రభుత్వం చట్టవ్యతిరేకంగా సేకరిస్తూ వారిని నిర్వాసితులుగా మార్చుతోంది. అదేమని ప్రశ్నించిన వారిపై లాఠీలు, తూటాలతో బలప్రయోగం చేస్తోంది. నిర్వాసిత రైతు కుటుంబాలది ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ, ఇది ఇతివృత్తం కాదా?
రాచరికపు అహం నగ్నంగా రాజ్యం చేస్తున్న తెలంగాణలో మామూలు మనుషుల ఆత్మగౌరవం కోసం పోరాడిన అపూర్వ రచయిత దాశరథి వారసత్వం ఉన్న నేల ఇది. ఆ దిశగా కథలు, నవలలు, పాటలు, సాహిత్యం రావాలని కోరుకుందాం.
ఒక తరాన్ని తమ కథలతో, నవలలతో ఆలోచింపచేసిన రచయితలు వారిప్పుడు ఎక్కడున్నా, నేటి యువ రచయితలు వారిని కలుసుకోవాలి. వారి అనుభవాల్ని ఆకళింపు చేసుకుని, నేటి సమాజానికి అవసరమైన చక్కని సాహిత్యాన్ని సృజించాలని మనసారా కోరుకుందాం. ఇక ఎంతైనా చూడటానికి నిరాదరించే వాస్తవాల్ని చూపించి, ప్రజల్ని ఆలోచింపచేయాల్సిన సామాజిక బాధ్యత రచయితలది కదా!

- పి.వి.రావు, 8096193960