సాహితి

నన్నయకు ముందు తెలుగు సాహిత్యం లేదా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదకొండో శతాబ్దపు తొలి దశకాల్లో ఆంధ్ర సాహిత్యానికి అంకురార్పణ జరిగిందనీ, వ్యాసకృతమైన సంస్కృత భారతానువాదంతో తెలుగులో లిఖిత సాహిత్యం ప్రారంభమయిందనీ అందరూ ఎరిగినదే. ‘శ్రీవాణీ గిరిజాశ్చిరాయ’ అనే సంస్కృత శ్లోకంతో ప్రారంభమైన భారతపు ఆంధ్రానువాదమే తెలుగు తొలి కావ్యంగా అందరూ అంగీకరించారు. అలా భారతానువాదాన్ని ప్రారంభించిన నన్నయభట్టునే ఆదికవిగా గుర్తిస్తున్నారు. అయితే నన్నయకన్నా ముందు తెలుగు సాహిత్యం లేదా అంటే - లిఖితరూపంలో ఏ ప్రక్రియలోనైనా - సాహిత్యమున్నట్లు ఏ రకమైన చారిత్రక ఆధారాలు ఎవరూ చూపడం లేదు. మహారాజులూ, స్థానిక ప్రభువులూ వేయించిన శాసనాల్లోని పద్యాలో, వచనమో మాత్రం అక్కడక్కడా కనిపిస్తున్నా - అవి సాహిత్య చరిత్ర నిర్మాణానికి ఉపయోగపడేంత వరకు మాత్రమే పనికొచ్చేవిగా తప్ప - వాటిని సాహిత్య రూపాలుగా అంగీకరించలేము. అయితే భారతాంధ్రీకరణానికి ముందు తెలుగులో సాహిత్యమే లేదని నిర్ణయించడం న్యాయం కాదు. విశాలమైన దేశముంది. సమాజముంది. వివిధ వృత్తులతో బ్రతికే జనానీకముంది. వారి జీవితాలున్నాయి. వారి సంతోషాలున్నాయి. వారి సంబరాలూ ఉండే ఉంటాయి. వారి బాధలూ దుఃఖాలూ ఉంటాయి. సాహిత్యం పుట్టడానికి ఇంతకన్నా సారవంతమైన నేల ఇంకేముంటుంది. ఇవ్వాళలాగే అప్పుడు కూడా మనిషి ఒంటికొమ్ము సొంటికాయ కాదు. అతడు సంఘజీవి. గుంపులు గుంపులుగా కలిసి పనిచేసుకుంటుంటారు. నాట్లు వేసుకోవడానికి గానీ, కోతలు కోసుకోవడానికి గానీ, మార్పిళ్ళు చేసుకోవడానికి గానీ - పదిమంది కలవాలి. వేడుకలకూ, కొలుపులకూ, సంబరాలకూ వందలాదిమంది కలుస్తారు. సమూహ జీవనంలో మనిషి ముచ్చట్లు రాశి పోసుకుంటాడు. పదాలూ పాటలూ పాడుకుంటాడు. ఆ ముచ్చట్లూ, ఆ పాటలూ - అదంతా సాహిత్యమే. వాటిని లొల్లాయి పదాలుగా కొట్టివేయడం దౌర్జన్యం. బ్రతుకుల్లోంచి చించుకొని వచ్చాయి కాబట్టి, వాళ్ల నవ్వుల్లోంచీ, ఏడుపుల్లోంచి ఉబికుబికి వచ్చుంటాయి కాబట్టి - అదే నిజంగా అసలైన సాహిత్యం. దురదృష్టం ఏమిటంటే అవేవీ లిఖితం కాబడి తరువాతి తరాలకు అందకపోవడం.
అప్పటి జనాలకు కాలక్షేపపు వేడుకలుండే ఉంటాయి. పురాణ ప్రవచనాలు జరుగుతూనే ఉంటాయి. హరికథలూ, తోలుబొమ్మలాటలూ, పిచ్చుగుంట్లాదుల కథాగానాలూ, బుర్రకథల్లాంటివీ ఉండే ఉంటాయి. ఇవ్వన్నీ ప్రజా కళారూపాలు. ఏ కళారూపమైనా మాటలు లేకుండా ఉండదు గదా. అందుకని అదంతా వాఙ్మయమే - అలిఖిత వాఙ్మయం. బహుశా లేఖనం కూడా అంత సులభసాధ్యం కాదేమో ఆ రోజుల్లో. భూర్జపత్రాలూ తాటాకులూ లేఖనయోగ్యంగా ఏర్పాటుచేసుకోవడం - గంటం తయారుచేసుకోవడం - ఇదంతా ఇవ్వాళ బాల్‌పెన్నూ కాగితం కుదిరినంత సులువుగా కుదిరేది కాదేమో. అదీగాక అక్షరాస్యత కూడా అంతంతమాత్రమే గదా అప్పుడు. అందుకని జనబాహుళ్య ప్రవాదంలోని ఏ సాహిత్య రూపమూ - సంగ్రధితమయ్యే అవకాశం లేకపొయ్యుండవచ్చు.
కేవల సాధారణ జనంలోంచి జాలువారిన సాహిత్యం ఒకరి నుండి మరొకరికి అందుబాటులోకి వచ్చే అవకాశాలూ తక్కువే. వేదాలూ, పురాణాలూ, శాస్త్రాలూ కావ్యాలూ గురుముఖతా గురుకులాల్లో కూర్చుని శిష్యులు వల్లె వేస్తూనే నేర్చుకునేవారు. అలా నిరంతర మననం ద్వారా వల్లె వేసుకుంటూ ఉన్నందువల్లనే - శిష్ట సాహిత్యం ముఖే ముఖే సరస్వతి ఐ- లోకానికి దక్కుతూ వచ్చింది. జన సామాన్యంలో నలుగుతున్న వాఙ్మయానికి ఆ వెసులుబాటు ఎక్కడుంటుంది. అందుకే - ఎవరు ఎప్పుడు ఎంతవరకు పాడుకుంటే - వింటుంటే - అంతవరకే ఉండి - ఎవరికైనా జ్ఞాపకముంటే మరికొన్ని రోజులుండి ఉక్తంగా, శృతంగా మార్పులు పొంది పొంది - దాని చారిత్రిక కర్తవ్యాన్ని అది నిర్వహించి కనుమరుగైపోయి ఉంటుంది. అంతేగాక, మరొక కారణం కూడా ఉంది. బహుశా అదే ప్రధానమయిన కారణం అయి ఉండవచ్చు కూడా. శిష్టులకు జన భాష యెడల చిన్నచూపూ, సంస్కృత మొక్కటే పాండిత్యపు నికష అనే అభిప్రాయమూ - ఇవి ప్రజాసాహిత్యానికి ప్రోత్సాహం లేకపోవడానికి ప్రధాన పాత్ర పోషించి ఉంటాయి. ఇంకో విషయం కూడా ముచ్చటించుకొని తీరాలి. ఆది కావ్యమైన ఆంధ్ర భారతం ఆవిర్భవించడమే సర్వాంగ సుందరంగా ఆవిర్భవించింది. ఇది చాలా అచ్చెరువు కలిగించే విషయం. ఏ ప్రక్రియ ఐనా, ఏ సాహితీ పరుడైనా ప్రారంభించి, ఒడుదుడుకులు పడి, దిద్దుకొని, లేచి, ప్రసవ వేదన లాంటిది పడి క్రమక్రమంగా రూపాలు మార్చుకుంటూ, ప్రగతి సాధిస్తూ ఒక పరిణతి సాధించడమనేది సహజం. ఆంధ్ర సాహిత్యానికి అలాంటి క్రమ పరిణామ దశ లేవీ ఉన్నట్లు లేదు. అవతరించడమే సంపూర్ణ సౌందర్యంతో అవతరించింది. ఇన్ని శతాబ్దాలు గడిచినా నన్నయ భారత భాగం సాహితీకారులకు నికషోపలంగా ఉండడమూ, మహానుభావుడైనా నన్నయ ప్రథమ గురుస్థానీయుడు గానే ఉండటమూ గమనిస్తూనే ఉన్నాము. తెలుగులోని తొలి కావ్యం గొప్ప సాహిత్య విలువలతో సాహిత్య ప్రియులకు రస భావ తుష్టంగా రూపొంది - శాశ్వతత్వం సంతరించుకోవడం తెలుగువారి అదృష్టం అయితే - నన్నయ్యకు ముందు కాలపు సాహిత్యమేదీ గ్రంథస్థం కాకపోవడమూ, అసలే అభావమై పోవడమూ - తెలుగువారి గొప్ప దురదృష్టమని చెప్పుకోక తప్పదు.
ననె్నచోడ మహాకవి సాహిత్యాన్ని మార్గ - దేశి విభాగాలుగా పేర్కొన్న ప్రకారం మన సారస్వతంలోని మార్గ కవితకు అద్భుతమైన ఆరంభం లభించింది గాని - దేశి సారస్వతం - నన్నయ పూర్వపు దిగ్రధితం కాకపోవడంతో మనం గొప్ప వాఙ్మయ సంపదను కోల్పోయి పేదబడిపోయామనే భావించాలి. అదే లభించి ఉంటే తెలుగు సాహిత్యం మరెంత సంపద్యంతంగా ఉండేదో అనిపిస్తుంది.

- సిహెచ్.వి. బృందావనరావు, 9963399189