సాహితి
సాహిత్య అకాడమి... అసాహిత్య ధోరణులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఈ మధ్య నేను గడిచిన మూడుసార్లు సాహిత్య అకాడమి గురించి రాశాను. తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రతిభావంతమైన రచనగా పరిగణించి సాహిత్య అకాడమి వారు పురస్కారం ప్రదానం చేసిన గ్రహీతలను, పురస్కార నిర్ణాయకులను (జూరీ సభ్యులు) అధిక్షేపించానా అని నాకు భ్రమ కలుగుతోంది. అలాంటి ఒక రచనను ఆంధ్రభూమి (సాహితి) దినపత్రికలో చూసినవారు, చదివినవారు, అందులో కనీసం కొందరు కోపం తెచ్చుకునే అవకాశం లేకపోలేదని నాకు తెలియకపోలేదు. అటువంటి దురభిప్రాయం నాకు లేదనీ, ఆపాదించవద్దనీ నా మనవి. నాకు సాహిత్య అకాడమీ పట్ల కృతజ్ఞతా భావమే కానీ ఇంకొక భావం ఎట్లా ఉంటుంది? సాహిత్య అకాడమీ వారు నా రచనలు చాలా ప్రచురించారు. ఇకముందు ప్రకటించబోతున్నారు!
అయితే గత మూడు సంవత్సరాలు తెలుగు పురస్కారాల గూర్చి ఏమిటయ్యా!? నీ ఆక్షేపణ, నీ అసహనం (దేశంలో అసహనం పెరిగి పెరిగి త్రివిక్రమమవుతున్నది కదా!) అంటే ఈ అభాగ్యుడు సమాధానించాలి కదా!
ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తిగారు అసామాన్య ప్రతిభావంతుడు. అంతర్జాతీయ గుర్తింపు ఉన్న విఖ్యాతుడు. గొప్ప భాషా శాస్తవ్రేత్త. ఆయన 15 సంవత్సరాలు వివిధ స్థాయిలలో సాహిత్య అకాడమితో సంబంధం ఉన్నవారు. ఆయన - ‘వారికి రాలేదు, వీరికి రాలేదు అని దుగ్ధ నీకెందుకు? వచ్చినవారు ఇందుకు అర్హులా కారా? ముందు చెప్పు’ అనేవారు. (దీన్ని నియోగం లేదా కరణీకం అంటారు) ఇప్పుడీ విషయాలెవరికీ తెలియవు. అసలు తెలుగే ఉంటుందా? ఉండదా? అనుకుంటూ ఉంటే జాతీయాలు, పలుకుబళ్లు, నుడికారాలు ఎవరికి కావాలి? ఇప్పుడంతా కారాలు, మిరియాలు నూరినవాడు, నోరున్నవాడు ఘనుడూ! ఇప్పుడు కులాభిమానాలు కావాలి. కమ్యూనిజం రావాలి!
ఇక, సాహిత్య అకాడమి వారు ఈ పురస్కార నిర్ణయం ఎట్లా చేస్తారో కాస్త మనవి చేస్తాను. మన జాతీయ ప్రభుత్వం (రాజ్యాంగం) గుర్తింపు పొందిన ప్రతి భాషకు ఒక సలహా సంఘం ఉంటుంది. ఇందులో ముగ్గురిని ముందుగా సంస్థ (సాహిత్య అకాడమి) ఎంపిక చేస్తుంది. ఈ ముగ్గురి ఎంపిక అంతకు ముందు తమ పదవీ బాధ్యతలనుంచి విరమించుకున్న వారి సలహా సంప్రదింపులతో చేస్తారనుకుంటాను. ఇక ఈ ముగ్గురు మరొక ఆరుగురిని ఎంపిక చేయాలి. సంప్ర‘దింపులు’, ఎత్తులు తప్పవు. ఈ తొమ్మిది మంది కాక ఇంకొకరిని భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖవారు (తమ ప్రతినిధిగానేమో!) ఎన్నిక చేస్తారు. అంటే ప్రతి భాషకు సలహా సంఘ సభ్యులు పదిమంది అన్నమాట. అయితే సంస్థ నేరుగా ఎంపిక చేసిన వారిని సాహిత్య అకాడమి చేపట్టే ముఖ్యమైన కార్యకలాపాలలో, నిర్ణయాలలో భాగస్వామ్యం పొందుతారు. ఈ ముగ్గురు కలిసి తమలో ఒకరిని సమావేశ కర్త (కన్వీనర్)గా ఏర్పాటు చేసుకుంటారు. ఈ కన్వీనరు సాహిత్య అకాడమి నిర్వహణను పర్యవేక్షించే కార్యనిర్వాహక వర్గం (ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్) సభ్యుడవుతాడు. అంటే అతడు భాషా కార్యక్రమ నిర్ణాయకుడు. వీళ్లంతా పాతిక మందికి లోపే ఉంటారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, ప్రభుత్వ ఉన్నతాధికారులు షరా మామూలే!
అనంతర కథాక్రమం బెట్టిదన! కార్యదర్శికుడు శక్తివంతుడు. ఆయన ప్రజ్ఞా ప్రాభవాలను బట్టి సమస్త భారతీయ భాషలు వర్ధిల్లుతాయి ఈ పుణ్య లేదా పణ్య భారతి భారతిలో. అంటే ఏమన్న మాట! కన్వీనరు గారు, కార్యదర్శిగారూ ద్వంద్వ సమాస దురంధరులైతే ప్రతివర్ష (సాహిత్య వసంతోత్సవ) అత్యున్నత సాహితీ పురస్కార నిర్ణాయక సంధాతలు సులభంగా కావచ్చు. సాహిత్య అకాడమి వారు సలహా మండలి సభ్యులను కూడా జ్యూరీ జాబితా నిమిత్తం కొన్ని పేర్లు సూచించవలసిందని అర్థించవచ్చు, అర్థించకపోనూవచ్చు. భారతీయ భాషా సాహిత్యాల కనీస పరిచయం సాహిత్య అకాడమి అధ్యక్షుల వారికి ఉండాలనటం నేరం. ఉండకపోవడం సహజం. కాబట్టి ఆయన కార్యదర్శిపై ఆధారపడాలి. కార్యదర్శి ఏతత్ భాషా కన్వీనర్‌పై ఆధారపడాలి. నిశ్చితార్ధమేమనగా (కార్యదర్శి కన్వీనరూ ఈ సాహిత్య నిపుణుల జాబితానుంచి ముగ్గురిని ఎంపిక చేస్తారు). వారు కొండొక సమావేశం జరిపి ఈ పురస్కార కిరీటాన్ని ఆమోదముద్రితం చేస్తారు. ఇందులో ఇద్దరు ఏకీభవిస్తే చాలు. మూడోవాడి మొర ఎవరూ ఆలకించరు. అందువల్ల లోపాయికారీగా ముగ్గురూ అస్మదీయులైతే మహా భేషు అనుకునే అవకాశం ఉంది కదా! ఇంకొక పితలాటకం ఉంది. ఏ పుస్తకానికి పురస్కారం ఇవ్వాలనుకుంటారో ఆ పుస్తకం అంతకు ముందు వచ్చిన మూడు సంవత్సరాలలో ప్రచురితమై ఉండాలి. ఇంకా నిబంధనలు కొన్ని ఉన్నాయనుకోండి. అవిప్పుడు అసందర్భం. అమాయక చొప్పదంటు ప్రశ్నల స్థానీయం. ఇట్లా ఏ దురదృష్టవంతుడికైనా మూడు సంవత్సరాలు తప్పితే ఏదైతే తన ఉత్తమ రచన అనుకుని ఉవ్విళ్లూరుతున్నాడో దానికి గుండుసున్నా! ఇట్లా సామల సదాశివగారికి జరిగింది. ఆయన చాలా గొప్పరచయిత. హుష్‌కాకి. ఈ సంవత్సరం అదేమిటో కానీ మొదటినుంచి సాహిత్య అకాడమీ వివాదాల వేదిక అయింది. దేశంలో అసహనం, హేతువాద విజ్ఞానుల పట్ల ద్వేషం, బలహీన వర్గాలవారిపై హింస, ఆవుమాంసం తినకూడదన్న కట్టడి, వాక్ స్వాతంత్య్రం, మత స్వేచ్ఛవిరోధం పెరిగిపోతున్నాయనీ తీవ్ర హేతువాద రచయిత(త్రు)లు కొందరు ఇదివరలో సాహిత్య అకాడమి తమకు ఇచ్చిన ఉత్తమ సాహిత్య పురస్కారాలను నిరసన సూచకంగా వెనక్కు ఇచ్చివేసి బాగా ప్రచారంలోకి దూసుకొనిపోయినారు. ఈ పురస్కారాలు వీరికి వచ్చినప్పుడు, వారికి ఇచ్చినప్పుడు, ఇంత ప్రచారం, కీర్తి ప్రతిష్టలు వీరిని పరివేషించాయో లేదో మరి. ఇదంతా వొట్టి వేషమని వీరిని కొందరు విమర్శించారు. దేశంలో ఈ అరాచకత్వానికి, హత్యలకు, అవేశకావేషాలకు, వాక్ స్వాతంత్య్ర, భావ స్వాతంత్య్ర, భోజన స్వాతంత్య్ర హక్కులకూ సాహిత్య అకాడమీ వారికి ఏం సంబంధమో ఒక్కరైనా చెప్పారు కాదు.
తెలుగులో ఇప్పుడు వరసగా మూడేళ్లు మార్క్సిస్టు రచయితలకు పురస్కారాలు వచ్చాయనీ, దీనికి భారత ప్రభుత్వం, సాంస్కృతిక శాఖ, దేశీయ పరిపాలనా మంత్రిత్వ శాఖ ఇంకా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాధ్యత వహించి రాజీనామాలు చేయాలని మార్క్సిస్టేతర రచయితలు తమ పురస్కారాలు వెనక్కు ఇచ్చివేస్తే ఎట్లా పత్రికలు, దృశ్య శ్రవణ మాధ్యమాలు గగ్గోలు సృష్టిస్తాయో చూడాలని వేడుక. అసలటువంటి వాళ్లకెవరికైనా సాహిత్య అకాడమి పురస్కారాలు వచ్చి ఉంటే కదా వాటిని వాళ్లు వెనక్కి తిరిగి ఇచ్చివేసేది అని ఎవరైనా చమత్కరించవచ్చు.
అసలు ముందు తెచ్చుకోవాలి కదా. అవి వాళ్లకు రావాలి కదా-వాళ్లు వెనక్కు ఇచ్చేయటానికి. అయినా విప్లవాభిమాన రచయితలంత బలశక్తి సంపన్నులు కారు ఈ దేశంలో దేశీయ రచయితలు. అంతా బాగానే ఉంది. మడవాలప్ప మల్లేశప్ప కలుబర్గి దారుణ హత్యను సాహిత్య అకాడమి కూడా ఖండించడం, విపరీత విప్లవ రచయితల వెన్నుదన్నుగా మేముంటామనడం అభినందనీయమే. ఆయన దేవాలయ సంస్కృతిని, విగ్రహారాధనను దురుసుగా, అసభ్యంగా, అవాచ్యంగా కించపరచకుండా, కొందరి హృదయాలు గాయపరచకుండా ఉంటే ఎంతో బాగుండేదని అని కూడా ఆయనకు నమస్కరించి రెండు నిముషాలు వౌనం పాటిస్తే బాగుండేది!
(మిగతా వచ్చేవారం)