సాహితి

భావుకత, పరిశోధనల అపురూప సంగమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విత మొక్క కావ్యమయి, చిత్తము తీర్చిన చేష్ట లెల్ల నా
నావిధ రమ్యఘట్టములునాగ రహింపగ, పాత్రధారులై
దేవియు దేవరల్ కథను తీర్తురు బంధురవర్ణ నా రతిన్
భావమనోజ్ఞ తన్ మెరసి భాసుర రీతి జనాళి మెచ్చగన్.
- అంటూ ‘‘మానసలీల’’ను దర్శించే పరమార్ద్రచిత్తురాలు, నిత్య సాహిత్యవ్రతశీలి, ఉత్తమ అధ్యపకురాలు ఆచార్య నాయని కృష్ణకుమారి 30 జనవరి 2016న తమ ఎనభైఆరవ ఏట కాలధర్మం చెందారు. ముప్పై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ బోధన జీవితం ఆమెది. ఆమె కురిపించిన ఆత్మీయత మూడు దశాబ్దాల తర్వాత సైతం మాలాంటి శిష్యుల ఎడదల్లో ఇంకా పచ్చగానే ఉంది. నాయని కృష్ణకుమారిగారు మా మేడం అని గర్వంగా చెప్పుకుంటాం. అరవై రెండేళ్ళనాడు (19 మే 1954) నాయని కృష్ణకుమారి పాణిగ్రహణం చేసిన కనకవల్లి మధుసూదనరావుగారి చేయి నేడు బోసిపోయింది. తొంభై ఏళ్ళ మధుసూదన్‌రావుగారు నిజంగా స్థితప్రజ్ఞుడు. దేవుణ్ణి ద్వేషించని, విశ్వసించని మార్క్సిస్టు. ‘‘నా పుత్రీ విదుషీ యశోవిసర విన్యాసమ్ములం బొంగితిన్’’ అని సగర్వంగా చెప్పుకోగలిగే అవకాశాన్ని తండ్రికి కలిగించిన ఉత్తమ తనయ.
నాయని కృష్ణకుమారి అసలు పేరు మస్తానమ్మ. తల్లిదండ్రులు వేయి పడగల్లోని సారస్వత స్వరూపులైన కిరీటి శశిరేఖలు. సౌభద్రుని ప్రణయ యాత్రలోని వత్సలాభిమన్యులు. లౌకిక జగత్తులో నాయని సుబ్బారావు, హనుమయ్యమ్మలు. దేవులపల్లి కృష్ణశాస్ర్తీ, విశ్వనాథ సత్యనారాయణలు పెదనాన్నలైతే, అడవి బాపిరాజు మామయ్య. అడవి బాపిరాజు ‘‘ఉప్పొంగి పోయింది గోదావరి, తాను తెప్పున్న ఎగిసింది గోదావరి’’ అంటూ పాడుతూ పదేళ్ళ కృష్ణకుమారి చేతులను పట్టుకొని ఆడిస్తే నృత్యకళ జడుసుకొని పారిపోయిందని కృష్ణకుమారిగారు చమత్కరించేవారు. ఆనాటి భావకవులు అందరూ నాయని సుబ్బారావు ఆత్మీయ మిత్రులు కావడంతో కృష్ణకుమారికి ముందు వారితో చనువు, ఆ తర్వాత వారితో కవిత్వ పరిచయం కలిగాయి. 1930 మార్చి 14న జన్మించిన నాయని కృష్ణకుమారి 1951 మార్చిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎం.ఏ. సర్వోత్తమ స్థానంలో ఉత్తీర్ణురాలైంది. 1952లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రభుత్వంలో అంతర్భాగం. కొంతకాలం తర్వాత స్వతంత్ర ప్రతిపత్తి పొందింది. అందువల్ల హైదరాబాదు సర్వీసు కమిషన్ ద్వారా జరిగిన నియామకాల్లో ఉస్మానియా తెలుగుశాఖలో బి.రామరాజు, నాయని కృష్ణకుమారి అధ్యాపకులుగా నియమితులయ్యారు. కాలక్రమంలో రీడర్‌గా, ప్రొఫెసర్‌గా, తెలుగుశాఖ అధ్యక్షులుగా ఎదిగారు. తిరుపతిలో స్థాపించిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి తొలి ప్రిన్సిపల్‌గా నియమితులయ్యారు. ఆ రోజుల్లో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి వైస్ చాన్సలర్‌గా దాదాపు ఖరారైన దశలో చేజారిపోయింది. దాదాపు పదేళ్ళ తర్వాత, లోకం అంతా మరచిపోయిన దశలో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్ పదవి వెతుక్కుంటూ (1996-99) వచ్చింది. కృష్ణకుమారిగారి గొంతులో వణుకు చాలకాలం క్రితమే వచ్చింది. కొనే్నళ్లుగా ఇంచుమించు ఇంటికే పరిమితమైపోయారు.కవయిత్రిగా, జానపద పరిశోధకురాలుగా, భాషాశాస్త్ర కోవిదురాలుగా, ఉత్తమ అధ్యాపకురాలిగా సాహితీలోకంలో సుప్రసిద్ధురాలయ్యారు. అతివాదాలు, దూకుడుతనాలు లేని సౌమ్యురాలిగా, సుకుమార భావుకురాలిగా మన్ననలందుకున్నారు. ‘ఏం చెప్పను నేస్తం’, ‘అగ్నిపుత్రి’ లాంటి కవితా సంకలనాలు ప్రకటించారు. కాశ్మీర దీపకళిక పేరుతో రాసిన యాత్రా చరిత్రలోని సుకుమార కవితాత్మక వచన శైలి ఎందరినో ఆకట్టుకుంది. పాఠ్యపుస్తకాల్లోకెక్కింది.
ప్రతి నీటి కణంలో తోచే / ప్రభాకర ప్రతిఫలనం లాగా / నా కవిత్వమంతటా / నమ్మకం అక్షరమై మెరుస్తుంది - అని చెప్పిన కృష్ణకుమారిగారు కవిత్వం మీద, వివిధ వాదాల మీద తన అభిప్రాయాలను స్పష్టంగానే వ్యక్తీకరించారు. ‘‘ఈనాటి కవులు స్పృశిస్తున్నది నిత్య జీవన సమస్యల్నే అయినా ఆ చెప్పడంలో ఉద్వేగమూ, చిత్తశుద్ధీ, స్పందన కనిపించడం లేదు నాకు. అందువల్లే ఇవి మనసును కదిలించలేకపోతున్నాయి. ఈ వస్తువు ఇలా వుండాలి అనే దృష్టి తప్ప, ఈ వస్తువు నన్ను కదిలిస్తున్నది, కాబట్టి నేను వ్రాస్తున్నాను అనే దృష్టి యువతరంలో చాలా తక్కువగా కనిపిస్తుంది’’ అని ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు.
ఉన్నది బాగుచేసుకోలేని / సోమరిపోతు సోకు మనుషులకు / లేని దాన్ని అమర్చుకొనే / స్తోమత చిక్కించుకోవడం / సులువా - అని సూటిగా ప్రశ్నిస్తారు. అతివాదాలను తిరస్కరించి సమన్వయ ధోరణిని, సౌమనస్యరీతిని కవిత్వం ద్వారా ప్రకటించారు.
నాయని కృష్ణకుమారిగారు అధ్యాపకత్వంలోకి త్వరగానే వచ్చారు. కాని తోటివారితో పోలిస్తే పిహెచ్‌డి చాలా ఆలస్యంగా పూర్తిచేశారు. 1970లో జానపద గేయగాథలను ఆంత్రోపాలజీకి అన్వయించి విశే్లషణ చేసి డాక్టరేటు పొందారు. రామరాజుతో మొదలైన జానపద పరిశోధనలకు విస్తృత సమాచార సేకరణం, పరిచయం, సౌందర్య సంస్మరణం గమ్యమైంది. ఇది మొదటి దశ. కృష్ణకుమారిగారితో భిన్నమైన శాస్త్ర సిద్ధాంతాలను అన్వయించి విశే్లషించి సూత్రీకరించే రెండవ దశలోకి జానపద పరిశోధన ప్రవేశించింది. జానపద కథల్లోని టోటమికాంశాలను, మాత్రారాధనాంశాలను, వీరగాథాంశాలను విశే్లషించారు. అనుముల బ్రహ్మారెడ్డి, బాలనాగమ్మ లాంటి కథల్లోని కార్యకారణ సంబంధాలను, నిర్మాణ వ్యూహాలను, కర్మణి నిర్మాణాలను, కర్తృ నిర్మాణాలను వింగడించి చూపారు. తెలుగువారి సాంఘిక జీవనం, ఆచార వ్యవహారాలు, తెలుగు సంస్కృతి విశిష్ట తెలుగు జానపద భాషలో మార్పులు చేర్పులు, జానపద గాథా పరిశీలనావశ్యకత, గ్రామ నామాల తీరుతెన్నులు లాంటి ఎన్నో ప్రామాణికమైన వ్యాసాలు రచించారు. వాటిలో కొన్నిటిని పరిశీలన, పరిశోధన పేర్లతో రెండు సంపుటాలుగా వెలువరించారు. నేషనల్ బుక్ ట్రస్టు వారి కోసం ఆంధ్రప్రదేశ్‌లో జానపద విజ్ఞానాన్ని అనువదించారు. జానపద గేయాలు సాంఘిక చరిత్ర అనే పేరుతో రచనను బి.రామరాజుతో సహసంపాదకత్వం వహించారు. తెలుగు అకాడమి కోసం తెలుగు భాషా చరిత్రను తమ్మారెడ్డి నిర్మల గారితో కలిసి కృష్ణకుమారి రచించారు. ఈ పుస్తకాన్ని చాలాకాలం బోధించే అవకాశం కూడా నాకు కలిగింది. పిల్లలమర్రి పినవీరన శృంగార శాకుంతలాన్ని విస్తృత పీఠికతో ప్రకటించారు. గృహలక్ష్మి స్వర్ణ కంకణ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి ఉత్తమ మహిళా రచయిత్రి పురస్కారం, సుశీలా నారాయణరెడ్డి పురస్కారాలు కృష్ణకుమారి ప్రతిభకు వనె్న తెచ్చాయ.
‘నేను మార్పుని ఆహ్వానించే మనిషిని. అయితే మార్పు కోసం ఉగ్ర విప్లవాలను ఆహ్వానించే మనస్సు గలదాన్ని కాదు. మార్పు మెల్లగా అయినా సరే నిబ్బరంగా ఇక రాక తప్పదన్నట్లుగా జనజీవితంలోకి చొచ్చుకొని రావాలని నేను కోరుకుంటాను’ అని కృష్ణకుమారిగారు చాలాసార్లు అనేవారు. అదే దృక్కోణంలో జీవించారు. వ్యవహారాలు చేశారు. కృష్ణకుమారిగారితో ఎంతో సన్నిహితంగా మెలిగిన శిష్యుల్లో నేనొకడిని. విశాఖపట్నం, కలకత్తా, ఊటీ, మైసూరు కలిసి వెళ్లాం. ఎంత ఆత్మీయంగా చూసేవారో మాటల్లో చెప్పలేం. రెండు నెలల క్రితం ఇంటికి వెళ్లి పలకరించి వచ్చాను. ఆమె తెలుగు శాఖకు అధ్యక్షురాలిగా ఉన్న కాలం (1983-85)లో ఎంఏ పూర్తిచేశాను. నేను తెలుగు శాఖకు అధ్యక్షత వహిస్తున్న కాలంలో కృష్ణకుమారి లేకపోవడం తీరని లోటు. కాలోహి దురతిక్రమః.

- ఆచార్య వెలుదండ నిత్యానందరావు 9441666881