సాహితి

అంతర్ముఖ విశ్రాంత లోకంలో చిరునామా లేని చరిత్రహీనుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఉదయ సూర్యుడి కిరణజాలాన్ని కప్పివేస్తూ అసంఖ్యాకమైన పక్షి సముదాయం. నాయకత్వం వహిస్తూ ఒక గరుత్మంతుడు దారిచూపుతున్నాడు. అవనినంతా కప్పివేస్తున్నట్లుగా అంచులు లేని నీడ, సూర్యగ్రహణం నాడు ఒక అద్భుత లీలగా కన్పించే నీడ- ఆకాశంనుండి జాలువారింది. ఒక వలయం తిరిగి గరుత్మంతుడు తూర్పు దిశగా మళ్లాడు. గ్రామీణులు చప్పట్లు కొడుతున్నారు. సాధు సమూహం ఊర్థస్వరంతో స్తుతిగానం చేస్తూ తూర్పు దిశగా అడుగులు వేశారు. ఒక క్రోసు దూరంలో పొగలు పైకెగుస్తున్నాయి. అప్పటికే జనం అక్కడ చితి చుట్టూ మూగి ఉన్నారు. ఆ మహాద్భుత దృశ్యం ముందు అచేతనుడై తను నిలిచిపోయాడు.
శ్రీ మునిపల్లె రాజుగారు వ్రాసిన మాజికల్ రియలిజం కథలలో ఒకటి ‘అస్తిత్వనదం ఆవలి తీరాన’ అనే కథలో భాగం ఇది.
రియలిజమ్ అంటే ‘వాస్తవికత’ అని తెలుసుగాని మాజికల్ రియలిజమ్ అంటే ఏమిటి? అని ప్రశ్న వేసుకుంటాడు సామాన్య పాఠకుడు. ‘మాజిక్’ అనేది ఆధ్యాత్మ విద్య అని నిర్వచనం చెప్పి వూరుకుంటే చాలదు కదా! క్రియాత్మక సాహిత్య రచనలలో మెటాఫిక్షన్, ఎపిఫనీలాగానే మాజిక్ రియలిజం అనేది ఓ ప్రత్యేక ప్రక్రియ. అంటే ‘మాయమాటల’ కలయిక కాదు. ప్రకృతిని మనసులో కాకుండా హృదయగతం చేసుకుని ‘బుద్ధి’ మాటలతో రూపకల్పన చేసి చెప్పగలగడం, అస్తిత్వంలో అమృతత్వాన్ని చూపటం ఈ ప్రక్రియ. వస్తువులకు బాహ్య సౌందర్యం కాక ఆంతరిక లావణ్యం ఉన్నదని చదువరికి తెలియ చెప్పడానికి ఈ ప్రక్రియ పనికివస్తుంది. సాంకేతికతకు నిగూఢమయిన శక్తిమంతనం వున్నది. పనికి ఎక్కడ దూరంగా ఫలితం వున్నదని ధీర దృష్టితో చెప్పడం, మనసుకు అవధులు లేవనీ, మృత్యువుతో అంతా అయిపోతుందా అనేది అర్థం లేని ప్రశ్న అనీ, ప్రపంచం పరమాత్మ స్వరూపం అని నిర్ణయించేట్లు చెప్పడం ఈ ప్రక్రియలో జరిగే పని. జీవితానికి అంతర్వాహినిగా వున్న వేదాంత తత్త్వాన్ని మామూలు మాటల్లో పామరులకు (సామాన్యమయిన చదువు మాత్రమే వున్నవాళ్లకు) తెలియజెప్పడం ఇక్కడ జరిగే పని.
‘రఘు’ అనే అతను అనేక కారణాలవల్ల- అవన్నీ మనకు చెప్పి విసిగించడు రచయిత- యిల్లు విడిచి వెళ్లిపోతాడు. అతనికి అంతర్గత ప్రతిధ్వనులు, జ్వాలారాగాల మధ్య తుషార గానాలు వినిపిస్తూ ఉంటాయి. అవేమిటో అతనికి అవగతం కావు. ‘బైరాగి’ అని పేరు సంపాదించుకుని ఒక గృహస్తు ఇంటి వసారా నుంచి తరిమివేయబడి నాగరత్నమ్మగారి ధర్మసత్రం ప్రాంగణానికి చేరుకుంటాడు. ఒకపక్క ఆకలి, మరోపక్క యోగభూమి ప్రవేశం. అక్కడే నిద్రపోతాడు. అక్కడే రకరకాల ప్రాంతాలకు చెందిన సన్యాసులను, భజనపరులను, ఫకీరులను చూస్తాడు. పోతులూరు బ్రహ్మం మొదలుకొని కబీరు ద్విపదల వరకు వింటాడు. ‘బైరాగి’ అనే బీద పదం నుంచి ‘మహరాజ్’ అనే గౌరవ పదం వరకు ఎదుగుదల పొందుతాడు తతిమ్మా మనుషుల దృష్టిలో. ఒక యోగి పుంగవుడి సమాధి నిర్మాణంలో తను కూడా ఒక సమిధ అవుతాడు. రాజస్తానీ వర్తకులు ఆ యోగ సమాధిని దివ్యక్షేత్రంగా అలంకరించడం చూస్తాడు. తనకు జ్వరం. జ్వరం తగ్గిన సూచనల, పెరిగి సంధిగా మారిన వైనం. అపస్మారంలో వున్న రఘును మార్వాడీ వర్తకులు అంబులెన్స్‌లో ఆస్పత్రికి చేరవేస్తారు. ఆ ఆస్పత్రిలో డాక్టర్ సచ్చిదానందం అతడిని తన మిత్రుడు రఘుగా గుర్తించి, ప్రత్యేక పరిశీలన- వైద్యం కోసం లావణ్య అనే తోటి డాక్టర్ దగ్గరకు పంపుతాడు. ఆ తేలిక శరీరం లిఫ్ట్‌లో స్పెషల్ వార్డుకు వెడుతుంది. ‘డాక్టర్ లావణ్య వచ్చి దుప్పటి తొలగించింది. ఆ దుప్పటికింద ఏ రోగీ లేడు ......... లేడు. అదీ కథాంశం. మాయాకల్పితం అయిన అస్తిత్వం నుండి పరమ విశ్రాంత స్థలానికి చేరుకున్నాడు మానవుడు. అది కేవలం అనాత్మకుల క్రీడాక్షేత్రం. అంతరిక్షం దివ్యయోగ ప్రయోగశాల అని కథ మధ్యలోనే సూచనాత్మకంగా చెబుతారు రచయిత.
మామూలు కథలు, మనసును కదిపివేసే కథలు ఎన్నో వ్రాసిన శ్రీ రాజుగారు ‘మాజికల్ రియలిజం’ స్ఫూర్తితో కొన్ని ప్రత్యేక కథలు వ్రాశారు. ‘నైమిశారణ్యంలో సత్రయాగం’, వేరేలోకపు స్వగతాల్లో- వీటిలో ప్రధానమయినవిగా కనిపిస్తాయి. ‘మాజికల్ రియలిజమ్’ అనే ప్రక్రియ పాశ్చాత్య భావబంధంతో వచ్చినది కాదనీ, వ్యాసుడు ఎప్పుడో దీనిని సాహిత్య ప్రక్రియగా రూపకల్పన చేశాడనీ నమ్ముతారు రాజుగారు. వీరి కథల పుస్తకానికి కేంద్ర సాహిత్య ఎకాడమీ పురస్కారం, గుర్తింపు లభించింది. ఆధునిక కథా సాహిత్య నిర్మాతలలో శ్రీ మునిపల్లె రాజుగారు ‘మాణిక్యం’ లాంటివారు అని వీరి కథలన్నీ చెప్పక చెపుతాయి.

- శ్రీవిరించి, 09444963584