సాహితి

స్మృతుల మధ్య ప్రయాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసు కళ్లు తెరవగానే
కిటికీ పక్కన
ఆ పూల మొక్క
ఇప్పటికీ
కొన్ని స్మృతుల పరిమళాన్ని వెదజల్లుతుంది

నిద్రలోనూ మెలకువలోనూ
హృదయ సంభాషణ చేసే
ఆ సున్నిత దృశ్యం,
మహా సుకుమారంగా సౌందర్యవంతంగా
ముగ్ధమనోహరంగా మృదుప్రాయంగా
అమృతఘడియల మధ్య దోబూచులాడుతుంది

ఆ సవ్వడికి
పాట వెంట పాటొకటి
నడచివచ్చి గొంతెత్తి
ఉదయరాగాన్ని ఆలపిస్తుంటే,
వింటున్న చెవులు
శ్రవణానందభరితమవుతాయి
చూస్తున్న కళ్లు
విచ్చుకున్న పూల ఆకాశాలవుతాయి

గుండె లోతుల్లోంచి
ఊహల్ని తడిమినపుడల్లా
గతం వర్తమానంగా చిగురించి
కాల రేఖమీద మొగ్గ తొడుగుతుంది

రోజూ తెల్లారేసరికి
మబ్బులచాటున దాచిన వేకువ సూర్యుణ్ణి
మనసు కిరణాలతో
ఊహల మధ్య ప్రసరిస్తూ
కొత్త సూర్యోదయానికి ఊపిరిపోస్తుంది
స్తబ్దతలోంచి
నిశ్శబ్దంలోకి అడుగుపెట్టినట్టు
కదిపితే ఆలోచనల తెరలు...

లయాత్మకంగా కళాత్మకంగా
సృజనాత్మకంగా క్రియాశీలంగా
చూపుల మధ్య ఊగిసలాడుతూ
కలతలు లేని విస్మయలోకాన్ని నిర్మిస్తుంది

దిగులుతనంతో అప్పటిదాకా
రెప్పలకింద మోస్తున్న
బతుకు తెరల విషాదపు మేఘాలన్నీ
ఎక్కడికో వలసపోతాయి

నిర్మలమైన నిశ్శబ్దాకృతి ఒకటి
కలల విధ్వంసాన్ని బద్దలుకొడుతూ
కంటి రెటీనా తెరమీద
స్మృతిచిత్రంలా మెదులుతుంది

అంతే
ఎక్కడి ఊహలు అక్కడే గప్‌చిప్!
భవిష్యత్తు పటంమీద
ఆ అదృశ్యరేఖలు మళ్లీ ఉదయించవు
పురివిప్పే కళ్ళల్లోంచి
చిరకాల జ్ఞాపకాల ప్రతిబింబాలై
అడుగడుగునా ప్రతిఫలిస్తూనే ఉంటాయి!!

- మానాపురం రాజా చంద్రశేఖర్ సెల్ నెం. 94405 93910